రుణమాఫీకి ప్రభుత్వం సమాయత్తం | Telangana Budget: TRS Government waived Crop Loans | Sakshi
Sakshi News home page

కరుణ కలిగింది..

Published Mon, Mar 9 2020 10:29 AM | Last Updated on Mon, Mar 9 2020 11:02 AM

Telangana Budget: TRS Government waived Crop Loans - Sakshi

సాక్షి, ఖమ్మం : పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.లక్ష పంట రుణాన్ని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష పంట రుణాలను నాలుగు విడతలుగా 2017 నాటికి ప్రభుత్వం మాఫీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూడా పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. (ఇది ప్రగతిశీల బడ్జెట్‌ )

గత రుణమాఫీ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత రుణమాఫీని పటిష్టంగా అమలు చేసేందుకు విధి విధానాలను, మార్గ దర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రక్రియలో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత ఉంటుందనే అంచనాలను కూడా పరిశీలిస్తున్నారు. అందుకోసం ప్రాథమికంగా జిల్లాలవారీగా రైతులు 2018, డిసెంబర్‌ 1వ తేదీ నాటికి తీసుకున్న పంట రుణాల బకాయిల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్లకు వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బ్యాంకు కంట్రోల్‌ కార్యాలయాలు జిల్లా బ్యాంకులకు పంట రుణ బకాయిల సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. (తెలంగాణ రైతులకు శుభవార్త)

ఇదే అంశాన్ని ఖమ్మం జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రావు కూడా జిల్లాలోని బ్యాంక్‌లను రైతుల పంట రుణ బకాయిల వివరాల నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో పంట రుణాలు అందించిన బ్యాంకుల్లో ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ)తో పాటు ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఆంధ్రాబ్యాంక్‌(ఏబీ)తో పాటు పలు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి రూ.లక్ష లోపు పంట రుణ బకాయిలు కలిగిన వివరాలను సేకరిస్తున్నారు. (లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్‌)

రుణం పొందిన రైతులు 2.63 లక్షలు
జిల్లాలో మొత్తం రైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. అయితే, వారిలో 2,63,434 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరంతా ప్రభుత్వం నిర్ణయించిన 2018 డిసెంబర్‌ నాటికి రూ.2,324 కోట్ల వరకు పంట రుణాలు తీసుకున్నారు. 2014లో ప్రకటించిన రుణమాఫీ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.59 లక్షల మంది రైతులు రుణ మాఫీకి అర్హత సాధించారు. ఈ మొత్తం రైతులకు రూ.1,636 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగేళ్లలో మాఫీ చేసింది. ఈ లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 2.28 లక్షల మంది రైతులుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.31 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. గత రుణమాఫీలో ఒక రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే, గత రుణమాఫీ ప్రక్రియలో జిల్లాలో దాదాపు 17 వేల మంది అర్హులైన రైతులకు సుమారు రూ.84 కోట్లు మాఫీ వర్తించలేదు. గత రుణమాఫీ ప్రక్రియను మండల స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు, బ్యాంకర్లు ఓ బృందంగా ఏర్పడి జాబితాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న తప్పిందంతో అర్హులైన రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి పలుసార్లు వెళ్లింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా రుణమాఫీ ప్రక్రియ జరగాలని రైతులు కోరుకుంటున్నారు. 

మార్గదర్శకాలు వెలువడితే జాబితా సిద్ధం
ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను తయారు చేసి వెలువరిస్తే అర్హులైన రైతుల జాబితాలను తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్గదర్శకాల ఆధారంగా రూపొందించిన రైతుల రుణమాఫీ మొత్తాలను ఆయా రైతుల ఖాతాల ఆధారంగా ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసే అవకాశం ఉంది. 

వివరాలు సేకరించే పనిలో ఉన్నాం 
2018 డిసెంబర్‌ 1వ తేదీ నాటికి పంట రుణాల బకాయిల వివరాలను బ్యాంకుల వారీగా సేకరించే ప్రక్రియను ప్రారంభించాం. మూడు, నాలుగు రోజుల్లో పంట రుణ బకాయిల వివరాలు బ్యాంకుల నుంచి అందే అవకాశం ఉంది. ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తాం. 
చింతా చంద్రశేఖర్‌రావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఖమ్మం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement