farmers happy
-
విజయవాడలో దంచికొట్టిన వాన.. అన్నదాతల్లో హర్షం
సాక్షి, కృష్ణా: విజయవాడలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లాతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వాన పడింది. విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, పెనమలూరు తదితర ప్రాంతాలలో భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులగా పెరిగిన ఉష్ణోగ్రతలతో నాట్లు ఎండిపోయే సమయంలో వర్షాలు పడుతుండటం రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రోడ్లు సైతం జలమయమయ్యాయి. రోడ్లపై రెండు అడుగుల పైన ప్రవహిస్తున్న వరద నీటిలోనే వాహనదారులు ప్రయాణిస్తూ ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలుప్రధాన రహదారులు చెరువులని తలపించాయి. ఎంజీ రోడ్, ఏలూరు రోడ్, లబ్బీ పేట, మొగల్రాజపురం, రెవెన్యూ కాలనీ, కృష్ణలంక, రాణిగారితోట, సింగ్ నగర్, తదితర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రెవెన్యూ కాలనీలోని రోడ్లు ఈ భారీవర్షానికి పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలోని సెల్లార్లోకి వర్షపు నీరు చేరిపోయి వాహనాలు సైతం మునిగిపోయాయి. -
మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం: కన్నబాబు
సాక్షి, అమరావతి: నూజివీడును ఉద్యానవన పంటల హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సోమవారం నూజివీడులో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.250 కోట్లతో జామ, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.2600 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఒక హార్టీ కల్చర్ హబ్, ఆయిల్ ఫామ్ రైతులకు ఓఈఆర్ ధర చెల్లిస్తున్నామని చెప్పారు. టన్ను రూ.7 వేల నుంచి రూ.19 వేలు దాటేలా చర్యలు తీసుకున్నామని, మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం అందించునున్నట్లు భరోసా ఇచ్చారు. చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే -
‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకూ ఇక నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకం వర్తించనుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం తూర్పు గోదావరి జిల్లాకు మధ్యలో ఉంటుంది. అక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు వారికి కూడా వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్ రైతు భరోసా లబ్ధి అందనుంది. యానాంకు చెందిన 865 మంది రైతులకు ఏపీలో వ్యవసాయ భూములున్నాయి. ఒక్కొక్కరికీ రైతు భరోసా కింద రెండు విడతల్లో రూ.7,500 జమ చేయనున్నారు. మొదటి విడతగా మే 13న ఆంధ్ర ప్రాంత రైతులతో పాటు రూ.5,500 వేల చొప్పున ఆ రైతులకూ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందంగా ఉంది నాకు యానాంలో ఐదెకరాలుంది. ఆంధ్రా పరిధిలో రెండెకరాలుంది. వైఎస్సార్ రైతు భరోసాకు గతంలో దరఖాస్తు చేశా. ఆధార్ కార్డు యానాం అడ్రస్‌తో ఉండడంతో నాన్ రెసిడెంట్ అంటూ రైతు భరోసా వర్తింప చేయలేదు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా వర్తింప చేయాలని నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది. – కోన సత్తియ్య, రైతు, యానాం సీఎం కీలక నిర్ణయంతో.. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం రైతులకు ఏపీలో పలుచోట్ల భూములున్నాయి. స్థానికంగా నివసించని కారణంగా వారికి వైఎస్సార్ రైతు భరోసా వర్తించదు. అయినప్పటికీ వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చెందిన 865 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ చదవండి: ఏపీ: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి -
పోటెత్తిన మిర్చి.. రైతుల్లో ఆనందం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న గుంటూరు మిర్చి యార్డుకు భారీ ఎత్తున కొత్త సరుకు వస్తోంది. దీనికి తగ్గట్టుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చికి అధిక ధర పలుకుతోంది. ముఖ్యంగా బాడిగ, తేజ రకం మిర్చికి మంచి రేటు లభిస్తోంది. ఇతర రకాలకూ చెప్పుకోదగిన ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచేగాక కర్ణాటక నుంచీ రైతులు పెద్దఎత్తున మిర్చిని యార్డుకు తీసుకొస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారితోపాటు కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల నుంచి గుంటూరు మిర్చి యార్డుకు భారీగా కొత్త సరుకు వస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచీ రైతులు యార్డుకు మిర్చిని తీసుకొస్తున్నారు. రోజుకు సరాసరిన 1.20 లక్షల నుంచి 1.25 లక్షల టిక్కీల మిర్చి యార్డుకు వస్తోంది. 2020–21లో ఇప్పటికే యార్డుకు 43,27,820 బస్తాల సరుకు వచ్చింది. ఈ మార్కెట్ యార్డులో ఏడాదికి రూ.6 వేల కోట్లకుపైగా టర్నోవర్ ఉంటుంది. సెస్సు ద్వారా రూ.60 కోట్లకుపైగా ఆదాయం లభిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి దిగుబడులు బాగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఎకరాకు 35 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు. అలాగే మిర్చిని ప్రధానంగా సాగు చేసే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. బాడిగ, తేజ రకాలకు మంచి ధరలు.. మిర్చిలో నాణ్యమైన బాడిగ, తేజ రకాలకు ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నాయి. 2019 డిసెంబర్, 2020 జనవరిలో ఉన్న ధరల కన్నా ప్రస్తుతం క్వింటాకు రూ.2 వేల ధర అదనంగా లభిస్తోంది. బాడిగ రకాలు క్వింటాలు రూ.17 వేల నుంచి 21 వేలు, తేజ రకం రూ.15,500, మిగిలిన అన్నిరకాలు రూ.13 వేలకు పైగా ధర పలుకుతున్నాయి. గతేడాది కరోనా వల్ల యార్డు మూతపడటంతో అమ్ముకునే వీల్లేక ఎక్కువమంది రైతులు సరుకును కోల్డ్ స్టోరేజీల్లో ఉంచారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో యార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. గత డిసెంబర్ 22న మార్కెట్ యార్డులో డబ్బి బాడిగ మిర్చి క్వింటా రూ.36 వేల వరకు పలకడం విశేషం. ధరలు ఆశాజనకం నేను ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాను. దిగుబడి 25 క్వింటాళ్లకుపైగా వస్తుందని భావిస్తున్నాను. గతేడాది క్వింటా రూ.11 వేలే. ప్రస్తుతం యార్డుకు 100 బస్తాలు తీసుకొచ్చా. క్వింటా రూ13,500 చొప్పున విక్రయించా. –జయశంకరరావు, గుంటూరు జిల్లా సరుకు బాగా వస్తోంది యార్డుకు సరుకు భారీగా వస్తోంది. రోజుకు 1.20 లక్షల నుంచి 1.25 లక్షల టిక్కీల సరుకు యార్డుకొస్తోంది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ధరలు అధికంగానే ఉన్నాయి. డబ్బి బాడిగ రకం ధర క్వింటా రూ.20 వేలకుపైగా పలుకుతోంది. బాడిగ రకాలతోపాటు అన్ని రకాల మిర్చి ధరలు కూడా బాగానే ఉన్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ చదవండి: శభాష్ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
సీఎం ఆదేశం: వారిపై కేసులు ఎత్తివేత
సాక్షి, నెల్లూరు: ధాన్యం మద్దతు ధర కోసం ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు ఎత్తివేశారు. కేసుల విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి.. కేసులు ఉపసంహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు... ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులపై పెట్టిన కేసులను కూడా వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఎత్తివేశారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులపై పెట్టిన కేసుల విషయంలో ఈ విధంగా స్పందించలేదన్నారు. సీఎం చర్యలతో విపక్షాలకు వాయిస్ లేకుండా పోయిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉన్న అడ్డంకులు తొలగించడంతో పాటు రైతులపై కేసులు ఎత్తివేసిన సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల విషయంలో సంయమనం పాటించాలని, సమస్య జఠిలం చేయడం సరైనది కాదని ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు సూచించారు. -
పంటల బీమా.. రైతుకు ధీమా
గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల బక్కచిక్కిన రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కర్షకులు నష్టపోకూడదని.. గత ఏడాది రూపాయి ప్రీమియానికే బీమా వర్తింపజేసిన ఆయన ఈ ఏడాదీ అదీ కట్టనవసరం లేదని, ప్రభుత్వమే పూర్తిమొత్తం చెల్లిస్తుందని అభయం ఇచ్చారు. ఫలితంగా హలధారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. ఆకివీడు: గత ఏడాది వైఎస్సార్ పంటల బీమా పథకంలో భాగంగా రూపాయి బీమా ప్రీమియంతో రైతులకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వం ఈ ఏడాది మరో అడుగు ముందుకు వేసింది. ఈ ఏడాది రైతులు రూపాయి కూడా కట్టనవసరం లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్ పంటల ఉచిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది రూపాయి ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని జిల్లాలో 2,36,912 మంది వినియోగించుకున్నారు. వీరిలో వరి, చెరుకు రైతులు ఉన్నారు. వీరు 1,19,717.5 హెక్టార్లలో సేద్యం చేశారు. అయితే ఈ ఏడాది ప్రీమియం సొమ్ము మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. ఈ–క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకూ బీమా సదుపాయం వర్తింపజేసింది. అంతేకాదు. వరి, చెరుకుతోపాటు ఉద్యానాల సాగు, మత్స్య పెంపకం రైతులకూ బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ ఆధారంగా జిల్లాలోసాగు చేపట్టిన వరి, చెరకు, ఉద్యాన పంటలు, మత్స్యపెంపకానికి ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. ఫలితంగా జిల్లాలో సుమారు 2.25 లక్షల హెక్టార్లలో వరి సాగుతోపాటు మరో 2 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేస్తున్న సుమారు 6.11 లక్షల మందికి ఉచిత బీమా వర్తిస్తోంది. గతంలో బీమా ప్రీమియం అధికం గత ప్రభుత్వాల హయాంలో పంటల బీమా సౌకర్యం కోసం రైతుల వద్ద నుంచి అత్యధిక ప్రీమియం వసూలు చేసేవారు. 2017–18లో ఎకరాకు రూ.560, 2018–19లో ఎకరాకు రూ.480 చొప్పున ప్రీమియం వసూలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఖరీఫ్ సాగులో పంటల బీమాకు ఎకరాకు రూపాయి మాత్రమే ప్రీమియం వసూలు చేశారు. చాలామంది రైతులు అదీ కట్టకపోవడంతో ఈ ఏడాది ఉచిత ప్రీమియం అమలు చేసి రైతును బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. గతంలో క్లెయిమ్‌ల సొమ్ము ఇవ్వలేదు : గత ప్రభుత్వ హయాంలో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు గురైతే పంటల బీమా అమలులో ఉన్నా.. రైతులకు క్లెయిమ్ సొమ్మును అందించలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎం జగన్ ఇటీవల గత ప్రభుత్వంలో రావాల్సిన క్లెయిమ్ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తుపాన్లు, అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేయలేదు. అభినందనీయం గత ప్రభుత్వాల హయాంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా తుపా న్లు, భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత బీమా ప్రక టించడం అభినందనీయం. గత ప్రభుత్వాలు బకాయి పెట్టిన ఇన్పుట్ సబ్సిడీని ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. – మల్లారెడ్డి శేషమోహనరంగారావు, కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రతినిధి, అప్పారావుపేట ఇక ధీమాగా.. ఉచిత బీమా ఇవ్వడం రైతులకు నిజంగా ధీమా కలి్పంచినట్లే. వరి రైతులతోపాటు చేపల పెంపకందారులకు, ఇతర పంటలకు ఉచిత బీమా కలి్పంచడం నిజంగా అభినందనీయం. రైతులందరికీ ఇది శుభవార్త. సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – కట్రెడ్డి కుసుమేశ్వరరావు, చేపల రైతు, పెదకాపవరం, ఆకివీడు మండలం ఈ–క్రాప్ విధానంతో ఉచిత బీమా ఈ–క్రాప్ విధానం ద్వారా ఉచిత బీమా సౌకర్యం కలి్పంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు, ఇతర వివరాలు అందాల్సి ఉంది. గత ఏడాది ఖరీఫ్‌లో రూపాయి ప్రీమియంతో రూ.51.97 కోట్లను 2,36,912 మంది రైతులు చెల్లించారు. – ఎం.డీ.గౌసియా బేగం, వ్యవసాయ సంచాలకులు, ఏలూరు -
ఖరీఫ్ సాగుపై చిగురించిన ఆశలు
సాక్షి, అమరావతి బ్యూరో: సకాలంలో వర్షాలు కురవడంతో రైతుల పంటల సాగులో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పల్నాడు వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. పల్నాడు ప్రాంతంలో రైతులు పత్తి విత్తనాలు ముమ్మరంగా నాటుతున్నారు. పశి్చమ డెల్టా ప్రాంతంలో వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో వెద పద్ధతిలో వరి సాగుచేస్తున్నారు. రెంటచింతల, పిడుగురాళ్ల, క్రోసూరు ప్రాంతాల్లో ఓపెన్ నర్సరీలు, షేడ్‌నెట్‌లో మిరప నారు పోస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముందస్తు ఖరీఫ్ కింద, పెసర, మినుము, నూగు పంట సాగుచేశారు. పచ్చిరొట్టె ఎరువులకు సంబంధించి 6,140 ఎకరాల్లో పంట సాగు అయింది. గత ఏడాది పత్తి, పసుపు పంటలకు ఆశించిన మేర ధర లేదు. దీనికి తోడు పత్తి పంటకు గులాబీ రంగు పురుగు కొన్ని ప్రాంతాల్లో సోకవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో మిరప పంటకు సంబంధించి ధరలు ఆశాజనకంగా ఉండటం, దిగుబడులు సైతం బాగానే వచ్చాయి. దీంతో ఈ ఏడాది రైతులు మిరప పంట సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పత్తి పంట సాగు కొంత మేర తగ్గి, మిరప పంట సాగు పెరుతోందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట సాగు లక్ష్యం 12,68,970 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పత్తి పంటకు సంబంధించి సాగు లక్ష్యం 4,50,000 ఎకరాలు, మిరప పంట సాగు లక్ష్యం 1,89,265 ఎకరాలుగా నిర్ణయించారు. జిల్లాలో పంటల సాగు ఇలా జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 83.4 మిల్లీమీటరు. 114.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 32 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పదునైంది. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, దుర్గి, రెంట చింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం, ఫిరంగిపురం, క్రోసూరు, యడ్లపాడు మండలాల్లో 26,142.5 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. పశి్చమ డెల్టా పరిధిలోని వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో 255 ఎకరాల్లో వెద పద్ధతిలో వరి పంటను సాగు చేశారు. ఇవి కాకుండా ముందస్తు ఖరీఫ్ కింద పెసర పంట 1032.5 ఎకరాలు, మినుము పంట 3422.5 ఎకరాలు, నువ్వులు 1740 ఎకరాల్లో మొత్తం 6,195 ఎకరాల్లో పంట సాగు చేశారు. పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన పంటలు 6,485 ఎకరాల్లో సాగు అయ్యాయి. మిరప నారు 187.5 ఎకరాల్లో పోశారు. చిరు ధాన్యాల పంటలు 357.5 ఎకరాలు, పసుపు పంట 1505 ఎకరాల్లో సాగు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 46,557.5 ఎకరాల్లో సాగయ్యాయి. ఉత్సాహంగా పంటల సాగు... ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా రైతులు పంటల సాగు చేస్తున్నారు. జూన్ నెల చివరి నాటికి పట్టిసీమ నీరు రావడంతో పశి్చమ డెల్టా రైతులు వెద పద్ధతితోపాటు, వరి నారు పోసుకునేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు త్వరగానే నిండుతాయని రైతులు ఆశిస్తున్నారు. దీని ద్వారా ఈ ఏడాది పంటలకు సంబంధించి సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తున్నారు. పంట రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు. రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ప్రొత్సహిస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో అన్నదాతలు పంటలు సాగు చేస్తూ ముందుకు వెళుతున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో 14వేల క్వింటాళ్ల వరి, 1540 క్వింటాళ్ల మిరప, 12.84 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు, రైతులకు అందుబాటులో ఉంచాం. ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కలి్పస్తూ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాం. – విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు -
నేడు ఏరువాక పౌర్ణమి
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి వచ్చేసింది.. తొలకరి పలకరిస్తున్న వేళ.. నేల తల్లి పులకిస్తున్న వేళ.. రైతన్నలు కాడీమేడీ పట్టి.. కుడి, ఎడమల కోడె దూడలు కట్టి.. నాగలి పట్టి పొలాలు దున్నేందుకు సిద్ధమయ్యే రోజిది. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు మొదలవుతాయి. రైతులు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, పసుపు–కుంకుమతో పశువులను అలంకరించి పొలం పనులు ప్రారంభిస్తుంటారు. ప్రకృతి కూడా సహకరించడంతో అన్నదాతలు శుక్రవారం ఏరువాకకు సిద్ధమయ్యారు. (మరో ఐదు ‘శ్రీసిటీ’లు) ముందుచూపుతోనే ప్రభుత్వ ప్రోత్సాహం ► రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభానికి ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ► వర్షాకాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసింది. ఎరువులు, పురుగు మందులను రైతు ముంగిట్లోకి తెచ్చేందుకు సంసిద్ధమై రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. పంట రుణాలు మంజూరు చేయించింది. ► గతేడాది 36,15,526 హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈ సారి 39,58,906 హెక్టార్లలో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ► తొలకరి పలకరింపుతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఖరీఫ్ ప్రధాన పంటగా సాగు చేసే వేరుశనగను విత్తేందుకు దుక్కుల్ని సిద్ధం చేస్తున్నారు. ► ఈ నెల 10 నుంచి గోదావరి కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నార్లు పోసేందుకు రైతులు సన్నాహాలు ప్రారంభించారు. ► కృష్ణా డెల్టాలో చెరువులు, బావులు కింద నారుమళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ మంచి శకునాలే 4 ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆకాంక్షించారు. 4 కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతంలో మంచి వర్షపాతం నమోదైందని.. మహాబలేశ్వర్‌లో గురువారం ఉదయానికి 212 మి.మీ వర్షం కురిసిందని, ఇది శుభారంభమని తెలిపారు. – అగ్రి మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి రైతులకు మంత్రి కన్నబాబు శుభాకాంక్షలు ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్ అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. -
క్యారెట్ రైతులకు ప్రభుత్వం భరోసా
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోంది. లాక్డౌన్ సమయంలోనూ రైతులకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తోంది. జిల్లాలో క్యారెట్ పండిస్తున్న రైతులకు మార్కెట్ సౌకర్యం కలి్పంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే ప్రక్రియకు పూనుకుంది. గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు : జిల్లాలోని పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, ములకలచెరువు మండలాల్లోని రైతులు దాదాపు 100 ఎకరాల్లో క్యారెట్ సాగు చేస్తున్నారు. అయితే లాక్డౌన్ ఉన్నందున దిగుబడి అయిన క్యారెట్‌ను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని రైతులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవ తీసుకుని అధికారులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఉద్యాన, మార్కెటింగ్ శాఖాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంట పరిస్థితులను పరిశీలించారు. మార్కెట్ సౌకర్యం క్యారెట్ రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం వారం రోజులుగా వాటి విక్రయానికి చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో క్యారెట్‌ను అధికారులు కొనుగోలు చేసి, రైతు బజార్లకు తరలించే విధంగా మార్కెట్ సౌకర్యం కలి్పంచింది. కిలో క్యారెట్‌ను రూ.13 చొప్పున రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుబజార్లకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతిరోజూ ఐదు టన్నులకు పైగా ఎగుమతి చేస్తూ ఇప్పటికీ 33 టన్నుల క్యారెట్‌ను ఎగుమతి చేశారు. మొత్తం 700 టన్నుల మేరకు దిగుబడి అయ్యే అవకాశమున్నందున నిత్యం క్యారెట్ తరలించే విధంగా అధికారులు చర్యలు తీసు కున్నారు. దీంతో కష్టకాలంలోనూ తమకు గిట్టుబాటుధర కలి్పంచడమే కాకుండా నేరుగా పొలం వద్దనే క్యారెట్‌ను కొనుగోలు చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఆదుకున్నారు లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి క్యారెట్‌ను కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉంది. రోజూ అధికారులే పొలం వద్దకు వచ్చి కిలో రూ.13 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – శ్రీనాథ్, రైతు, పీటీఎం మండలం కలత చెందాల్సిన అవసరం లేదు రైతులు పండించిన ఏ పంట దిగుబడికైనా కలత చెందాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ అమలులో ఉన్నా మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే సత్వర చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం క్యారెట్‌ను విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసులు, ఉద్యాన శాఖ డీడీ -
రుణమాఫీకి ప్రభుత్వం సమాయత్తం
సాక్షి, ఖమ్మం : పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.లక్ష పంట రుణాన్ని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష పంట రుణాలను నాలుగు విడతలుగా 2017 నాటికి ప్రభుత్వం మాఫీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూడా పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. (ఇది ప్రగతిశీల బడ్జెట్ ) గత రుణమాఫీ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత రుణమాఫీని పటిష్టంగా అమలు చేసేందుకు విధి విధానాలను, మార్గ దర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రక్రియలో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత ఉంటుందనే అంచనాలను కూడా పరిశీలిస్తున్నారు. అందుకోసం ప్రాథమికంగా జిల్లాలవారీగా రైతులు 2018, డిసెంబర్ 1వ తేదీ నాటికి తీసుకున్న పంట రుణాల బకాయిల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లకు వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బ్యాంకు కంట్రోల్ కార్యాలయాలు జిల్లా బ్యాంకులకు పంట రుణ బకాయిల సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. (తెలంగాణ రైతులకు శుభవార్త) ఇదే అంశాన్ని ఖమ్మం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రావు కూడా జిల్లాలోని బ్యాంక్‌లను రైతుల పంట రుణ బకాయిల వివరాల నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో పంట రుణాలు అందించిన బ్యాంకుల్లో ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)తో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఆంధ్రాబ్యాంక్(ఏబీ)తో పాటు పలు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి రూ.లక్ష లోపు పంట రుణ బకాయిలు కలిగిన వివరాలను సేకరిస్తున్నారు. (లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్) రుణం పొందిన రైతులు 2.63 లక్షలు జిల్లాలో మొత్తం రైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. అయితే, వారిలో 2,63,434 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరంతా ప్రభుత్వం నిర్ణయించిన 2018 డిసెంబర్ నాటికి రూ.2,324 కోట్ల వరకు పంట రుణాలు తీసుకున్నారు. 2014లో ప్రకటించిన రుణమాఫీ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.59 లక్షల మంది రైతులు రుణ మాఫీకి అర్హత సాధించారు. ఈ మొత్తం రైతులకు రూ.1,636 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగేళ్లలో మాఫీ చేసింది. ఈ లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 2.28 లక్షల మంది రైతులుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.31 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. గత రుణమాఫీలో ఒక రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే, గత రుణమాఫీ ప్రక్రియలో జిల్లాలో దాదాపు 17 వేల మంది అర్హులైన రైతులకు సుమారు రూ.84 కోట్లు మాఫీ వర్తించలేదు. గత రుణమాఫీ ప్రక్రియను మండల స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు, బ్యాంకర్లు ఓ బృందంగా ఏర్పడి జాబితాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న తప్పిందంతో అర్హులైన రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి పలుసార్లు వెళ్లింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా రుణమాఫీ ప్రక్రియ జరగాలని రైతులు కోరుకుంటున్నారు. మార్గదర్శకాలు వెలువడితే జాబితా సిద్ధం ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను తయారు చేసి వెలువరిస్తే అర్హులైన రైతుల జాబితాలను తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్గదర్శకాల ఆధారంగా రూపొందించిన రైతుల రుణమాఫీ మొత్తాలను ఆయా రైతుల ఖాతాల ఆధారంగా ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసే అవకాశం ఉంది. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం 2018 డిసెంబర్ 1వ తేదీ నాటికి పంట రుణాల బకాయిల వివరాలను బ్యాంకుల వారీగా సేకరించే ప్రక్రియను ప్రారంభించాం. మూడు, నాలుగు రోజుల్లో పంట రుణ బకాయిల వివరాలు బ్యాంకుల నుంచి అందే అవకాశం ఉంది. ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తాం. చింతా చంద్రశేఖర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఖమ్మం -
రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి..
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తలపెట్టిన డాక్టర్ వైఎస్సార్ రైతుభరోసా పథకంలో తుది విడత (సంక్రాంతి) చెల్లింపుల ప్రక్రియ మొదలైంది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తద్వారా జిల్లాలో 3,35,218 మంది రైతు కుటుంబాలకు మేలు జరగనుంది. లబ్ధిదారుల జాబితాను బుధవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. శనివారం నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున నేరుగా జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లాలో 5,72,674 భూమి ఖాతాలు ఉన్నాయి. వీటిలో కొంతమంది రైతులకు రెండు మూడు ఖాతాలు ఉన్నాయి. అలాగాకుండా ప్రతి రైతు కుటుంబంలో ఒక ఖాతా చొప్పున పీఎం కిసాన్–డాక్టర్ వైఎస్సార్ రైతుభరోసా పథకానికి వ్యవసాయ శాఖ ఎంపిక చేసింది. తుదకు 3,55,478 ఖాతాలను ఎంపిక చేశారు. కొన్ని ఖాతాల్లో సాంకేతిక కారణాల వల్ల జమ ఆగిపోయిన నేపథ్యంలో పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ తొలి రెండు విడతల్లో 3,33,953 ఖాతాలకు సంబంధించి రైతులకు రూ.270 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇక సంక్రాంతి కానుకగా తుది విడత రూ.2 వేలు చొప్పున ప్రభుత్వం జమచేయనుంది. సాంకేతిక కారణాలతో ఆగిన ఖాతాలను పరిష్కరించిన తర్వాత తుదకు 3,35,218 రైతు కుటుంబాలకు ఈసారి లబ్ధి కలగనుంది. ఈ సీజన్లో తుదివిడత.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల్లో వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రధానమైంది. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో 50 వేల రూపాయలు ప్రతి రైతుకూ సాయం చేస్తానని ఆయన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ కన్నా రూ.వెయ్యి అదనంగా పెంచి పీఎం కిసాన్–డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు దఫాల్లో రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.67,500 మేర భరోసా అందనుంది. ఈ సీజన్లో తుదివిడత అర్హుల జాబితాలను బుధవారం ఆయా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆయా రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖలను అధికారులు అందించనున్నారు. -
2020 కూడా రైతు నామ సంవత్సరమే: నాగిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రైతులకు సంక్రాంతి కానుకగా ‘రైతు భరోసా’ అందచేస్తామని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, గత సంవత్సరం తరహాలో 2020ని కూడా రైతు నామ సంవత్సరంగా కొనసాగిస్తామన్నారు. సీఎం జగన్ ఉన్నారనే ధీమా రైతుల్లో నెలకొందని ఆయన అన్నారు. ఎంవీఎస్ నాగిరెడ్డి బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ .... ‘ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అందించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా కౌలు రైతులకు రైతు భరోసా అందచేశారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన పీఎం కిసాన్ రైతు భరోసా ఒక ఏడాది ముందు నుంచే ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.2వేలు త్వరలో పడుతుంది. సీఎం జగన్ మొత్తం బడ్జెట్లో 12.66 శాతం నిధులు వ్యవసాయానికే కేటాయించారు. పగటిపూట రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నాం’ అని తెలిపారు. రైతులకు ఉచితంగా పంటల బీమా చెల్లించారు. పశువులకు ఉచితంగా పశుబీమా అందించారు. చంద్రబాబు రుణమాఫీ, ఉచిత విద్యుత్ హామీలను నిలబెట్టుకోలేదు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నాం. చనిపోయిన రైతులను చంద్రబాబు పట్టించుకోలేదు. రైతుల కోసం ముఖ్యమంత్రి జగన్ ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయించారు. ఇన్పుట్ సబ్సిడీని 15 శాతం పెంచారు. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధర రూ.1.50 పైసలకే అందిస్తున్నారు. వరదలు మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. పంటలకు సున్నా వడ్డీకే రుణాలు, పప్పు, చిరు ధాన్యాలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాము. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను రైతులకు... ఆయన తనయుడు వైఎస్ జగన్ అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 90 శాతం ఎన్నికల హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు’ అని తెలిపారు. -
కలుపు తీసే కొత్త యంత్రం
వ్యవసాయంలో రైతు పెట్టే పెట్టుబడుల్లో కలుపుతీత కూడా ఒకటి. అయితే ఈ కాలంలో కలుపు తీసే వ్యవసాయ కూలీలకు కొరత ఉన్న నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన స్మాల్ రోబోట్ కంపెనీ ఓ సరికొత్త యంత్రాన్ని అభివృద్ధి చేసింది. ఇది పంట చేలలో మొలిచే పిచ్చిమొక్కలను మాత్రమే ఎంచుకుని మరీ కరెంటు షాకిచ్చి చంపేస్తుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇదే కంపెనీ గత ఏడాది వ్యవసాయ పనులను స్వతంత్రంగా చక్కబెట్టే టాం, హ్యారీ పేర్లతో రెండు రోబోలను సిద్ధం చేయడం. టాం తన కెమెరా కన్నులతో కలుపు మొక్కలను గుర్తించేదికాగా.. హ్యారి అత్యంత కచ్చితత్వంతో విత్తనాలు నాటుతుంది. స్మాల్ రోబో కంపెనీ తాజాగా అభివృద్ధి చేసిన రోబోట్ డిక్.. విద్యుత్తు షాక్‌లతో కలుపు మొక్కలను నాశనం చేస్తుంది. ఇంకోలా చెప్పాలంటే హానికారక రసాయన మందుల వాడకం అస్సలు అవసరం లేదన్నమాట. అంతేకాకుండా.. పొలంలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ నేల సారాన్ని పరిరక్షించుకునేందుకు ఈ రోబో అవకాశం కల్పిస్తుంది. ఈ మూడు రోబోలను కలిపి ఉపయోగించడం ద్వారా పొలం పనులు చాలా వేగంగా పూర్తి చేయవచ్చునని కంపెనీ చెబుతోంది. పొలంలోని ఒక్కో మొక్కను పరిశీలించి.. మిల్లీమీటర్ సైజులో ఉన్న కలుపు మొక్కలను సైతం గుర్తించగలగడం ఈ రోబోల ప్రత్యేకత అని స్మాల్ రోబోట్ కంపెనీ వ్యవస్థాపకుడు సామ్ వాట్సన్ జోన్స్ అంటున్నారు. 2020లో సుమారు 20 చోట్ల వీటిని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తామని, ఆ తరువాతి సంవత్సరం అందరికీ అందుబాటులోకి తెస్తామని కంపెనీ వివరించింది. -
పాలకంకి నవ్వింది..
ధాన్యాగారంగా పేరొందిన జిల్లాలో 2019 ఖరీఫ్ కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రకృతిపరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. గతంలో ఎప్పుడూలేని విధంగా మూడుసార్లు భారీ వర్షాలు ఆటంకం కలిగించాయి. ముందస్తు సాగు చేపట్టిన భూముల్లో కోతలు సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో వరి దిగుబడులు లభిస్తున్నట్లు పంటకోత ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత జిల్లాలో ఈసారి వరి పంట రైతులకు కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. నిడమర్రు: గతంలో వచ్చిన దిగుబడులు మించి ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం జిల్లాలో 30 శాతం కోతలు పూర్తయినట్లు తాడేపల్లిగుడెం ఏడీఏ తెలిపారు. అప్‌లాండ్‌లో 70 శాతం పైగా కోతలు పూర్తయ్యాయన్నారు. దిగుబడి బాగున్నట్లే.. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన పంట కోత ప్రయోగాలు చూస్తే వరిపంట దిగుబడి ఆశించిన దానికంటే బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల ప్రకారం ఒక ప్రయోజన ప్రాంతంలో సగటున 18 కేజీల దిగుబడి వస్తోంది. ఇంతవరకు చేపట్టిన ఆరంభం దశ ప్రయోగాల్లో 16 నుంచి 20 కేజీలు వచ్చిన ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత లెక్కన చూస్తే ఎకరాకు సుమారు 26–30 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రయోగాలు 80 శాతం డెల్టాలోనూ మిగిలిన 20 శాతం మెట్టప్రాంతంలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశించిన మొత్తం ప్రయోగాలు పూర్తయ్యేసరికి జిల్లాలో సగటు దిగుబడి 34 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కంటే తగ్గిన సాగు.. గత ఏడాది 2,27,925 హెక్టార్లులో ఖరీఫ్ వరి సాగు జరిగింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,21,284 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 5వేల ఎకరాలకు పైగా వరి సాగు తగ్గింది. ప్రస్తుతం వచ్చిన ఫలితాల ప్రకారం చూస్తే గతేడాది కంటే పంట దిగుబడి బాగా ఉన్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది పంటకోత ప్రయోగాల ఆరంభంలో సగటున 14 కేజీలు మాత్రమే రావడంతో ఎకరాకు 2,268 కేజీలు దిగుబడి కనిపించింది. ప్రయోగాలు పూర్తయ్యే సరికి ఎకరాకు 32 బస్తాలు (75 కేజీలు) దిగుబడి లభించింది. ఈ ఖరీఫ్‌లో పంట పరిస్థితి, గణాంకశాఖ లెక్కలు చూస్తుంటే తక్కువలో తక్కువ 32 బస్తాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్నదాతల కష్టానికి ఫలితం రానుంది. ఒక ప్రయోగానికి 25 చదరపు మీటర్లు.. ఎంపిక చేసిన గ్రామంలో తీసుకునే యూనిట్లో రెండు నుంచి నాలుగు చోట్ల ఈ పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాలు ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన కింద నిర్వహిస్తారు. ఐదు మీటర్లు పొడవు, ఐదు మీటర్లు వెడల్పు గల 25 చదరపు మీటర్లు విస్తీర్ణంలో పండే పంట దిగుబడిని కొలవటాన్ని ఒక ప్రయోగం అంటారు. ఇలా 162 ప్రయోగాల విస్తీర్ణం ఒక ఎకరా అవుతుంది. 400 ప్రయోగాల విస్తీర్ణం ఒక హెక్టారు అవుతుందని అధికారులు తెలిపారు ఏలూరు డివిజన్లో 40 బస్తాల వరకూ.. ఏలూరు డివిజన్ 16 మండలాల్లో 254 యూనిట్లలో 1016 ప్రయోగాలు చేయాల్సి ఉంది. నేటికి 350 వరకూ ప్రయోగాలు పూర్తయ్యాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమడోలు, పెంటపాడు మండలాల్లో జరిగిన ప్రయోగాల్లో 38 నుంచి 40 బస్తాల వరకూ, మెట్ట ప్రాంతాల్లో 30 బస్తాల వరకూ దిగుబడి లభించింది. – ఎ. మోహన్‌రావు, డీవైఎస్ఓ, అర్ధగణాంక శాఖ ఆశించిన స్థాయిలో దిగుబడి.. జిల్లాలో ఇప్పటి వరకూ చేపట్టిన ప్రయోగాల ద్వారా ఈ ఏడాది వరిపంట ఆశించిన స్థాయిలో లభిస్తోంది. కొవ్వూరు, నరసాపురం డివిజన్లలో ఈ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై మరో 10 రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. ప్రారంభంలో వర్షాలు ఆలస్యం, పంట మధ్యలో భారీ వర్షాలతో పంటకు కొద్దిమేర ఇబ్బంది ఉన్నా గత ఏడాది కంటే ఈ ఖరీఫ్‌లో మంచి దిగుబడులు వస్తున్నాయి. – వి.సుబ్బారావు, ఏడీ, అర్ధగణాంక శాఖ -
‘మద్దతు’కు భరోసా
ప్రకృతి వైపరీత్యాలు..చీడపీడల నుంచి పైర్లను కాపాడుకొని..రేయింబవళ్లు కష్టించి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే రైతుకు మద్దతు ధర లభించించేది కాదు. ఆరుగాలం శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేది కాదు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కర్షకులు తీవ్ర వేదనకు గురయ్యేవారు. తమను ఆదుకునే వారు రాకపోతారా అని ఎదురు చూసేవారు.. ఇదంతా గతం. నేడు పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. మద్దతు ధర కోసం రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. పక్షం రోజులకోసారి మార్కెట్లో ధరల వివరాలు సైతం సేకరిస్తోంది. అన్నదాతకు ‘మద్దతు’పై భరోసా ఇచ్చేందుకు అక్టోబరు 15 నాటికి కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు చేస్తోంది. సాక్షి, కర్నూలు : జిల్లాలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు భారీగా కురిసి..ఖరీఫ్ పంటలు కళకళలాడుతున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణం 6.27 లక్షల హెక్టార్లు ఉండగా..5.83 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది పత్తి 2,65,639 హెక్టార్లలో సాగైంది. కాల్వలకు నీళ్లు రావడం, చెరువులు నిండడంతో జిల్లాలో వరి సాగు ఆశాజనకంగా ఉంది. సాధారణ వరి సాగు 73,120 హెక్టార్లు ఉండగా... ఇప్పటి వరకు 57,549 హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో దిగుబడులు కూడా సాధారణం కంటే పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 91,190 హెక్టార్లు ఉండగా 79,407 హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న, కంది, మినుము, పెసర, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, వాము, ఉల్లి, మిరప ఇలా అన్ని రకాల పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. రైతుకు ‘స్థిరీకరణ’ ఊరట రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో రైతులకు ఊరట లభించింది. గతంలో మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వాలు స్పందించేవి కాదు. దీంతో ఇబ్బందులు పడేవారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో గత ప్రభుత్వం మొక్కుబడిగా మొక్కజొన్న రైతులకు క్వింటాల్‌కు రూ.200 మద్దతును ప్రకటించి ఆచరణలో నీరుకార్చింది. ప్రస్తుత ప్రభుత్వం..పకడ్బందీగా ‘మద్దతు’ను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు ధర లేక అల్లాడుతున్న శనగ రైతులకు గరిష్టంగా రూ.45వేలు ప్రకారం బ్యాంకు ఖాతాలకు జమ చేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పదివేల మందికిపైగా రైతులకు దాదాపు రూ.35 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఎకరాకు 6 క్వింటాళ్ల ప్రకారం ఒక రైతుకు 5 ఎకరాల వరకు గరిష్టంగా 30 క్వింటాళ్లకు రూ.1500 ప్రకారం రూ.45వేలు రైతులకు ధరల స్ధిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం జమ చేసింది. ప్రతి 15 రోజులకు ధరల వివరాల సేకరణ.. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది. గతేడాది అనావృష్టి పరిస్థితులతో దిగుబడులు 75 శాతం పడిపోయాయి. ఏ పంటకూ గిట్టబాటు ధర లభించ లేదు. ఈ సారి వర్షాలు విస్తారంగా పడుతుండటంతో పంటల సాగు పెరిగింది. దిగుబడులు పెరిగే అవకాశం ఏర్పడింది. జూన్‌లో వేసిన పంటలు మరికొద్ది రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి రైతుకూ మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో అక్టోబరు 15 నాటికి కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్కెట్లో వివిధ పంటలకు లభిస్తున్న ధరల వివరాలను ప్రతి 15 రోజులకు ఒక్కసారి ప్రభుత్వం సేకరిస్తోంది. ధరల వివరాలు పంపుతున్నాం ఎప్పటికప్పుడు అన్ని పంటలకు లభిస్తున్న ధరల వివరాలను ప్రభుత్వానికి పంపుతున్నాం. అక్టోబరు 15నాటికి రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – సత్యనారాయణచౌదరి, ఏడీఎం, కర్నూలు శుభ పరిణామం రైతుల అభ్యన్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం శుభ పరిణామం. రైతులకు ఇది ఆనందాన్ని ఇస్తోంది. మాకు 12 ఎకరాల భూమి ఉంది. ఇందులో పత్తి, మొక్కజొన్న, కంది పంటలు సాగుచేస్తున్నాం. ఈ సారి మద్దతు ధరలు లభిస్తాయనే భరోసా ఏర్పడుతోంది. –సోమన్న యాదవ్, తడకనపల్లి -
అన్నదాతకు వెన్నుదన్ను
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామనే భరోసా కల్పిం చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించడం లక్ష్యంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ అమలుకి రంగం సిద్ధమవుతోంది. లబ్ధిదారుల గుర్తింపు కోసం బుధవారం నుంచి సర్వే ప్రారంభించారు. కేవలం భూమి ఉన్న రైతులు మాత్రమే వర్తిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎంకేఎస్‌ఎన్‌ఎస్) లోని రైతుల వివరాలను పరిశీలించిడంతో పాటు పెద్ద కౌలు రైతులు గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25న అర్హులు జాబితాను ప్రకటించనున్నారు. కిసాన్ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు కేంద్రం మూడు విడతలుగా మొత్తం రూ.6వేలు సాయం ఇస్తుండగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 సాయం అందించనుంది. పెద్ద కౌలు రైతులకు రూ.12500 పూర్తి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఒకే విడతగా పెట్టుబడి సా యం రైతులందరికీ అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం సాయం కేవలం భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే అందుతోంది. ఏటా మూడు విడతల్లో రూ.6వేలు మొత్తాన్ని కేంద్రం జమ చేస్తోంది. కాగా ప్రతి రైతు కుటుంబానికి రూ.12500 చొప్పున ముందుగానే పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలుకి చర్యలకు చేపట్టారు. అక్టోబర్ 15 నుంచి అమలుకానున్న అమలుకా నున్న ‘వైఎస్సార్ రైతుభరోసా’ పథకం కోసం లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు అందించనున్న రూ. 6వేలుకి రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 జమచేసి మొత్తం రూ.12500 చెల్లించనుంది. కౌలు, పెద్ద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రూ. 12500 చొప్పున ఒకే విడతలో అందజేయనుంది. రైతు భరోసాకు కౌలు రైతులు అర్హులే గ్రామ వలంటీర్ల ద్వారా కౌలు రైతుల గుర్తింపునకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక సర్వేలో భాగంగా సొంత వ్యవసాయ భూమిలేని సాగుదారులను వలం టీర్ల గుర్తిస్తారు. కౌలుదారులకు చెందిన ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్‌ఖాతా వివరాలు సేకరించి నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేసి వ్యవసాయ రెవెన్యూ అధికారులకు అందజేస్తారు. పరిశీలన అనంతరం లబ్ధిదారుల జాబితాలను అధికారులు, గ్రామ సభల్లో ప్రకటించి ఏమైనా మార్పులు, చేర్పులుంటే చేస్తారు. ఈ జాబితాలో మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, ఏడీఏలు, పరిశీలిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది జాబితాను ఖరారు చేసి ఈ నెల 25న ప్రకటించనున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 2.55 లక్షల హెక్టార్లు కాగా అందులో సుమారు 5లక్షల మందికి పైగా రైతులున్నారు. వీరితో పాటు కౌలు రైతులు లక్ష మంది వరకు ఉంటారు. ఈ ఏడాది వరి సాగు 2.13లక్షల హెక్టార్లు లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాకుండా 36వేల హెక్టార్ల అపరాలు, మొక్కజొన్న, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. మిగిలిన భూమిలో 6వేల హెక్టార్లలో కూరగాయల పంట సాగు చేస్తున్నారు. దీనిలో 3,11,590 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులను గుర్తించారు. పక్కాగా అనర్హులు ఏరివేతకు బుధవారం ఈ నెల 25వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు. పీఎం కిసాన్ జాబితాలో అధిక సం ఖ్యలో అనర్హులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రైతుల అందరికీ తెలిసే విధంగా పంచాయతీ కార్యాలయాల్లో వద్ద ప్రదర్శించనున్నారు. 2019 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు వెబ్‌ల్యాండ్‌లో జరిగిన మార్పులు, చేర్పులు, మ్యుటేషన్లలో గుర్తించిన రైతులు జాబితా ఆధారంగా గ్రామస్థాయిలో, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు జాబితాలో స్పష్టమైన కారాణాలు పేర్కొంటూ జాబితా నుంచి తొలగిస్తారు. వెబ్‌ల్యాండ్‌లో ఇటీవల జరిగిన మార్పులు చేర్పులు వలన గుర్తించిన అనర్హత కలిగిన రైతులు ఇప్పటివరకు ఏ జాబితాలో నమోదు కానిరూతులు ఉంటే జాబితాలో చేరుస్తారు. రైతు భరోసాకు ఉండాల్సిన అర్హతలివే.. -ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందిన రైతులు కూడా వైఎస్సార్ రైతు భరోసాకు అర్హులే. -సొంతంగా భూమి ఉంటే 10సెంట్లు నుంచి 5ఎకరాలు ఉన్న ప్రతి రైతుకి ఈ పథకం వర్తిస్తుంది. -భూ యజమాని మరణిస్తే వారి వారసులు, భార్య ఉంటే వారి పేరున ఉన్న భూములు వివరాలను వెబ్‌ల్యాండ్‌లో మార్చుకోవాలి. ఒకే రేషన్‌కార్డులో గల కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. వ్యవసాయ ఉద్యానవన, పట్టు పరిశ్రమ నడిపే రైతులు, భూమిలేక కౌలుదారుగా సాగుచేస్తున్న రైతులు అర్హులే. -తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో మాత్రమే కౌలుకి చేసినట్లు అవుతుంది. -కౌలురైతుకి 50 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ సాగు చేస్తూ అతని పేరున భూమి లేకుంటే ఈ పథకం వర్తిస్తుంది. -భూ యజమాని అంగీకారంతో కౌలు రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -భూయజమాని తన భూమిని ముగ్గురు లేదా నలుగురికి కౌలుకిస్తే భూ యజమానితో పాటు ఆ కౌలు రైతుల్లో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. -డీ పట్టా భూముల్లో సాగు చేస్తున్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -ఆన్లైన్లో భూమి నమోదు కాని రైతుకి కూడా ఈ పథకం వర్తిస్తుంది. -ఉద్యానవన పంటలు పట్టుపరిశ్రమ చేస్తున్న రైతులకి వర్తిస్తుంది. -స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుమస్తాలు, క్లాస్–4 సిబ్బంది, గ్రూప్ డి ఉన్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -ఆధార్ నంబర్లు రిజిస్టర్ కాకుంటే వెంటనే నమోదు చేసుకోవాలి. అర్హులకు పథకం అందజేస్తాం.. వైఎస్సార్ రైతు భరోసాలో జిల్లాలో రైతులంతా వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం. బుధవారం నుంచి గ్రామగ్రామాన రైతులకి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. మూడు రకాల జాబితాల్లో ఉండే వివరాలు పరిశీలిస్తారు. అర్హులందరికి పధకం వర్తించేందుకు కృషి చేస్తున్నాం. రైతులతో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నాం. దీన్ని వినియోగించుకుంటే రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో ఎంతోమంది రైతులకు ఊరటనిస్తుంది. ఈ నెల 25వరకు సర్వే చేయనున్నాం. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – బి.జి.వి ప్రసాద్, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్, శ్రీకాకుళం -
ఎరువు ధర తగ్గిందోచ్!
ఎట్టకేలకు ఎరువుల ధరలు తగ్గాయి. రైతుకు పెద్ద భారం తగ్గింది. ఏటా పెరుగుతున్న ధరలతో రైతు దిగాలుపడినా... తప్పనిసరి పరిస్థితుల్లో భారం భరించేవాడు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. రైతు మోములో చిరునవ్వు కనిపించింది. బొండపల్లి(గజపతినగరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆసరాగా నిలవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం పెరిగిన ఎరువుల ధరలను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడుల కారణంగా రైతులకు వ్యవసాయం పెనుభారంగా పరిణమించిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గతంలో ఉన్న పాలకులు ఎరువుల ధరలను భారీగా పెంచడంతో రైతులపై పెనుభారం పడింది. కేవలం రూ. 950లున్న డీఏపీ బస్తా ధర గడచిన ఐదేళ్లలో రూ. 1430ల వరకు పెరిగింది. అంతే గాకుం డా అన్ని రకాల ఎరువుల ధరలు గత ఐదేళ్లలో రూ. 200 లు నుంచి రూ. 400 ల వరకు పెరి గింది. ఈ తరుణంలో రైతులపై పడిన భారాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సముచితమని రైతాం గం అభిప్రాయపడుతోంది. తగ్గించిన ధరలు ఈ నెల మొదటివారంనుంచి అమలులోకి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డీలర్లు, సహకార సంఘాల వద్ద ఇప్పటికే నిల్వ ఉన్న సరకు తాజాగా నిర్థారించిన ధరలకే విక్రయిం చాలని ప్రభుత్వం అందరు డీలర్లు, సహకార సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. అలా కాదని పాత ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రైతులకు ఉపశమనం.. ఎరువుల ధరలు తగ్గించడం వల్ల రైతులపై భా రం తగ్గనుంది. ప్రతి బస్తా పైనా రెండు నెలల క్రితం రూ. 125 ల నుంచి రూ. 150ల వరకు కంపెనీని బట్టి ధరలు పెంచగా, ప్రభుత్వం దా నిని సవరిస్తూ ఒక్కో బస్తాపై రూ. 50ల వరకు తగ్గించింది. డీఏపీతోపాటు కొన్ని రకాల కాంపె ్లక్స్ ఎరువుల ధరలు తగ్గించడంతో రైతులకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు దొరకనుంది. రైతుకు ఆసరా.. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎరువుల ధరలు తగ్గడం వల్ల రైతులకు కొంత వరకు ఆసరాగా ఉంటుంది. ఇప్పటికే రైతులకు పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం భారంగా మారింది. ఈ తరుణంలో ధరలు తగ్గిస్తూ మంచి నిర్ణయం తీసుకోవడం ముదావహం. – గెద్ద సత్యనారాయణ రైతు, బొండపల్లి కొత్త ధరలకే విక్రయించాలి.. ప్రభుత్వం డీఏపీ, పొటాష్‌తో సహా కొన్ని రకాలైన ఎరువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఒక్కో బస్తాపై రూ. 50లు తగ్గించింది. డీలర్లు, సహకార సంఘాల్లో ఎరువులు విక్రయించేవారు కొత్త ధరలకే ఎరువులు విక్రయించాలి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – కె,మహరాజన్, ఏడీఏ, గజపతినగరం రైతులకు కొంతవరకు మేలు.. ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కొంత వరకు రైతులకు ఉపశమనం కలగనుంది. ఇప్పటిప్పుడే మండలం లో కురుస్తున్న వర్షాలకు నాట్లు పడుతున్నా యి. ఇప్పుడు డీఏపీ, పొటాష్ వంటి ఎరువుల అవసరం ఉంటుంది. ధరలు తగ్గడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది తొలగనుంది. – కర్రోతు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, వేండ్రాం, బొండపల్లి మండలం -
ముసురు మేఘం.. ఆశల రాగం..
అంతా కోలాహలం.. ఎటుచూసినా సాగు సంబరం.. మబ్బుల మాటున నీటి కుండ చిరుజల్లులై జాలు వారుతుంటే అన్నదాతల గుండె ఆశల సవ్వడి చేస్తోంది. ముసురేసిన మేఘమాల ముత్యాల వాన కురిపిస్తుంటే పుడమి తల్లి నుదుటిన నీటి బొట్టు పచ్చని బొట్టై మెరుస్తోంది. ముడుచుకున్న మొగ్గ చినుకు స్పర్శ తాకగానే ఒళ్లు విరుచుకుని వయ్యారాలు ఒలకబోస్తోంది. ఎదురింటి కృష్ణన్న, పక్కింటి రామన్న.. వెనకింటి సుబ్బన్న తలపాగా చుట్టి, పంచె ఎగ్గట్టి కదులుతుంటే.. పొలాల దారుల్లో పూల వాన స్వాగతం పలుకుతోంది. పంట చేలల్లో పల్లె పడుచు కూనిరాగాల్లో నండూరి ఎంకి పాటకు.. జాలువారిన చినుకు చిటపటల దరువేస్తోంది. ఇప్పటికే గలగలమంటూ పరుగులు పెడుతున్న కృష్ణమ్మ, గోదావరి నదుల అలలపై చిరుజల్లుల నాట్యం చేస్తోంది. ఈ ఏడాది వాన వెల్లువై కర్షకుడి కంట కష్టాల కన్నీటిని కడిగేస్తానంటూ వాతావరణ శాఖ ద్వారా మేఘ సందేశం పంపిందియ సాక్షి, గుంటూరు: వర్షాలకు పుడమికి పచ్చని రంగు అందినట్లు పొలాలు కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత పదిహేను రోజుల నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటిదాకా డీలా పడిన రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. అన్ని రకాల పొలాలు పదునెక్కాయి. ఉందిలే మంచి కాలం ముందుముందునా అంటూ అన్నదాతలు నాగలి చేతపట్టి పొలంలోకి రెట్టింపు ఉత్సాహంతో అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు కొందరు వెద పద్ధతిలో నాట్లకు శ్రీకారం చుట్టగా...మరి కొందరు రైతులు విత్తనాలు చల్లుకునే పనిల్లో నిమగ్నమయ్యారు. తీర ప్రాంతాల్లోని రైతులు పొలాల్లో ఎరువులు చిమ్ముకోవడం, పొలాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై ఎరువులు తొలుకోవడం, వాటిని చిమ్ముకునే పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా కురిసిన వర్షాలకు నార్లు పోసుకున్న రైతులు నారుమడులను జాగ్రత్త చేసుకుంటున్నారు.జిల్లాలో గురువారం రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరం, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పెదకూరపాడు, తాడికొండ, వేమూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. మాచర్ల, రేపల్లె, బాపట్ల, గురజాల, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో జల్లులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పంటలకు మేలు ఖరీఫ్ సీజన్లో వేసిన మెట్ట పంటలకు వర్షం మరింత మేలు చేకూర్చనుంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో రైతులు పత్తి, మిరప పంటలు వేశారు. పంటలు వర్షాభావ పరిస్థితులను అధిగమించడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. వాణిజ్య పంటలు సకాలంలో వేయడం అందుకు అనుగుణంగా వర్షం కురుస్తుంటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం గుంటూరు నగరంలోని శివారు కాలనీ, ఎక్స్టెన్షన్ ఏరియాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై నీరు ప్రవహించింది. డ్రెయిన్లు, మురుగు కాలువలు పొంగి పొర్లాయి. దీంతో ట్రాఫిక్‌కు పలు ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివారు కాలనీలో రహదారులు చిత్తడిమయంగా మారాయి. యూజీడీ పనులు జరిగిన ఏరియాల్లో గుంతల్లో నీరు భారీగా చేరింది. -
అన్నదాతలో ఆనందం
-
చినుకు తడికి.. చిగురు తొడిగి
సాక్షి, హైదరాబాద్ : మొలకలు వాడిపోతున్నాయని, స్వల్పకాలిక రకాల పంటలు విత్తుకునేందుకు కూడా అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్న దశలో నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పంటలకు మళ్లీ ప్రాణమొచ్చినట్లయింది. ఈ వర్షాలు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ వంటి పంటలకు ప్రాణం పోశాయని అన్నదాతలు పేర్కొంటున్నారు. అంతేగాక వరి నాట్లు కూడా ఊపందుకుంటాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. ఆ తర్వాతైనా సరిగా వర్షాలు పడ్డాయా అంటే అదీ లేదు. దీంతో చాలాచోట్ల భూమిలో వేసిన విత్తనాలు వేసినట్లే లోపలే ఉండి పోయాయి. చాలాచోట్ల మొలకలు రాలేదు. వచ్చినచోట్ల మొలకలు వాడిపోయే దశలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. చాలాచోట్ల రైతులు పంటలు వేసేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో సాధారణంగా సాగు విస్తీర్ణం కంటే ఇప్పటి వరకు వాస్తవంగా సాగైన విస్తీర్ణం తగ్గినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎంతో ఉపయోగకరంగామారాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటి వరకు 4.02 లక్షల ఎకరాల్లో సాగు చేసిన సోయాబీన్ ప్రస్తుత వర్షాలతో గట్టెక్కుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే పత్తి పంట దాదాపు అన్ని జిల్లాలో సాగు చేస్తున్నారు. రైతులు ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల ఎకరాలలో చేశారు. ఈ పంట కాస్త ఎదిగి, వానలు లేకపోవడంతో వాడిపోయింది. మరో వారం, పది రోజుల్లో పూత దశ రావాల్సి ఉంది. ఈ సమయంలో చినుకుల సవ్వడితో అన్నదాతలో ఆశలు రేగాయి. వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కూడా అధికంగా 7లక్షల ఎకరాల్లో సాగవుతుంది. దీంతో పాటు పప్పు దినసుల పంటలు కూడా పర్వాలేదన్నట్లుగానే ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు ఆయా పంటలన్నింటికీ ఊపిరిలూదాయి. వాడి ఎండిపోయే దశలో ఉన్న పత్తి, వరి, మొక్కజొన్న వంటి పంటలు ప్రస్తుత వర్షాలతో గట్టెక్కనున్నాయి. మరిన్ని రోజుల పాటు స్థిరంగా వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం ప్రకటన రైతన్నల్లో ఆనందాన్ని నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. సాధారణ స్థితికి రుతుపవన ద్రోణి రాజస్తాన్‌లోని గంగానగర్ నుంచి అలహాబాద్ మీదుగా ఉత్తర బంగాళాఖాతం వరకు దక్షిణాది వైపు రావాల్సిన రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటివరకు వర్షాల జాడలేదు. ఇప్పుడా రుతుపవన ద్రోణి హిమాలయాల నుంచి సాధారణ స్థితికి చేరింది. దాని ప్రభావం మూలంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒరిస్సా దాన్ని ఆనుకుని ఉన్న జార్ఖండ్, పశ్చిమబెంగాల్, గాంగ్టక్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్ళేకొద్ది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. అలాగే దక్షిణ రాజస్తాన్ నుంచి ఒరిస్సా వరకు మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల రాగల 3రోజులపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఒకట్రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌ల్లో 7సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షం కురిసింది. జైనూరు, కొత్తగూడ, సారంగాపూర్, మణుగూరుల్లో 6సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ధాన్యం.. ‘ధనం’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో దశలవారీగా జమ అవుతున్నాయి. రబీ సీజన్‌కు సంబంధించి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు నగదు చెల్లింపు చర్యలు చేపట్టారు. వాస్తవానికి ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతులకు నగదు ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల సకాలంలో చెల్లించలేదు. దీంతో రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రజాప్రతినిధులు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమస్యపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జేసీ అనురాగ్ జయంతి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 3,500 మంది రైతులకు ఇంకా నగదు రావాల్సి ఉండగా.. వారిలో ఇప్పటివరకు చాలా మంది ఖాతాల్లో నగదు జమ చేశారు. రబీ సీజన్లో రైతులు జిల్లాలో 25వేల హెక్టార్లలో ధాన్యం సాగు చేశారు. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, ఐకేపీ ఆధ్వర్యంలో 18, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఏ–ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4,116 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 24,500.240 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 1,752.200 మెట్రిక్ టన్నులు.. మొత్తం 26,252.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 12,868 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 99,709.560 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 4,125.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,03,835.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అంటే మొత్తం 90 కొనుగోలు కేంద్రాల ద్వారా 16,984 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 1,24,209.800 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 5,877.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,30,087.440 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశారు. నగదు రాకపోవడంతో ఆందోళన.. సాధారణంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సంబంధిత రైతులకు 48 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈసారి చాలా మంది రైతులకు నెలలు గడుస్తున్నా నగదు మాత్రం వారి ఖాతాల్లో జమ కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల నుంచి వివరాలను అప్లోడ్ చేసిన అనంతరం సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అయితే రైతులకు సకాలంలో నగదు రాకపోవడంతో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రైతుల ఖాతాల్లో నగదు జమ కాని విషయంపై అధికారులను ప్రశ్నించారు. కొనుగోళ్లు జరిగి ఇంత కాలమైనా ఇంకా నగదు రాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. దాదాపు 3,500 మందికి ఇంకా నగదు రాలేదని, వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు త్వరలోనే రైతులకు నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు చెల్లింపులు.. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు నగదు చెల్లింపులు చేపట్టారు. గతంలో రైతులకు నగదు అందకపోవడంతో ఇబ్బందులు పడిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం దశలవారీగా అందరు రైతులకు ధాన్యానికి సంబంధించిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 16,984 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వీరిలో అనేక మందికి నగదు చెల్లింపులు ఇప్పటికే చేయగా.. మిగిలిన వారికి కూడా వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాతాల్లో నగదు జమ కావడంతో రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ఖాతాల్లో జమ చేస్తున్నాం.. పెండింగ్‌లో ఉన్న రైతులందరి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. మరో వారం రోజుల్లో రైతులందరికీ నగదు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ -
రైతులకు ఊరట
అమరచింత: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 17 తాగునీటి పథకాలకు గాను 16 రక్షిత పథకాలకు తాగునీటి కష్టాలు తప్పనున్నాయి. ఆల్మట్టి నుంచి జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీరు వచ్చిచేరుతుండటంతో దీనిపై ఆధారపడిన రక్షిత పథకాలకు ఊరట కలిగింది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వ నుంచి 150 క్యూసెక్కుల నీటిని రామన్‌పాడు రిజర్వాయర్‌కు పీజేపీ అధికారులు వదిలారు. ఇది వారంరోజుల పాటు కొనసాగుతుందని వారు తెలిపారు. జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు అనుసంధానంగా ఉన్న పస్పుల, పారేవుల, జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న సత్యసాయి రక్షిత పథకాలకు నెలరోజుల క్రితం ఇంటేక్ వెల్‌కు అందకపోవడంతో మోటార్లు బిగించి ఆయా గ్రామాలకు తాగునీరు అందించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో ఉన్న ఆల్మట్టి డ్యాం నుంచి 15రోజుల క్రితం 2.5 టీఎంసీల నీరు వదలడంతో నారాయణ్‌పూర్ డ్యాంకు చేరింది. అక్కడి నుంచి నాలుగు రోజులుగా ప్రియదన్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తోంది. ముఖ్యమంత్రి చొరవతో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక సీఎం కుమారస్వామితో జరిపిన చర్చల కారణంగా ఆల్మట్టి నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీరు వచ్చి చేరుకుంటోంది. వాస్తవానికి సుమారు 400 గ్రామాలు రామన్‌పాడు, సత్యసాయి వాటర్ స్కీంలతో దాహార్తిని తీర్చుకుంటున్నాయి. వేసవిలో జూరాల డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంతో సత్యసాయి రక్షిత పథకం కొన్నిరోజులు నిల్చిపోయింది. చివరకు జూరాలలో మోటార్లను దింపి సత్యసాయి రక్షిత పథకాలకు తాగునీటిని అధికారులు అందించగలుగుతున్నారు. పరిస్థితి ఇలాఉంటే వేసవిలో ప్రజలకు తాగునీరు అందించలేకపోతామని ఆర్డబ్ల్యూఎస్, పీజేపీ అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతీసుకోవడంతో జూరాలపై ఆధారపడిన రక్షిత పథకాలకు తాగునీటి కష్టాలు తీరినట్టేనని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు జూరాల బ్యాక్‌వాటర్‌లో నీటిమట్టం అడుగంటగా.. నేడు ఆల్మట్టి నుంచి వచ్చి చేరుతున్న నీటితో జలాశయం కళకళలాడుతోంది. మోటార్ల తొలగింపు ఆత్మకూర్: జూరాల ప్రధాన ఎడమకాల్వ పరిధిలో 17కిలోమీటర్ల వరకు రైతులు ఏర్పాటుచేసుకున్న మోటార్లు, స్టాటర్లు, ఫ్యూజులను శుక్రవారం పీజేపీ ఏఈ వసంత, వర్క్ఇన్స్పెక్టర్లు లక్ష్మయ్యగౌడ్, వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తొలగించారు. తాగునీటి అవసరాల నిమిత్తం రామన్‌పాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తున్నందున రైతులు సంపూర్ణంగా సహకరించాలని వారు కోరారు. -
కేసీఆర్ వచ్చాకే రైతుకు భరోసా
సాక్షి, రాయపర్తి: కేసీఆర్ వచ్చాకే రైతుకు భరోసా వచ్చిందని, 70యేళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీలేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి రాయపర్తి మండలకేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి ప్రక్క రాష్ట్రాల్లో ఎందుకు చేయడంలేదని ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ వచ్చే పరిస్థితిలేదన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ ఏ పార్టీ కల్పించలేదని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన 24గంటల కరెంట్, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, భూప్రక్షాళన, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ఉపాధి హామీని వ్యవసాయ పనులకు అనుసంధానం చేసే పనిలో ఉన్నామన్నారు. దేశప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. 35యేళ్ల నుంచి నన్ను ఆశీర్వదించారని ఇన్నేళ్ల నుంచి గెలిపించింది ఒకెత్తయితే మొన్నటి ఎన్నికలు ఒకెత్తని, మీరు నన్ను ఆశీర్వదించినందుకు ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు. ఉద్యమకారుడు మంచి పేరున్న వ్యక్తి మన ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పసునూరి దయాకర్ మాట్లాడు తూ ఉద్యమకారుడిగా నన్ను గుర్తించి నాకు సీఎం కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారని, మళ్లీ అవకాశం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరంజ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జినుగు అనిమిరెడ్డి, గోపాల్‌రావు, నర్సింహానాయక్, ఎంపీపీ యాకనారాయణ, సురేందర్‌రావు, రంగు కుమార్, గారె నర్స య్య, ఉస్మాన్, నయీం, వనజారాణి పాల్గొన్నారు. -
‘ఉపాధి’కి ఊతం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు చెల్లిస్తున్న రోజు వారీ కూలి రూ.205కు మరో రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16,67,339 మంది కూలీలకు కొంతమేర ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. సాక్షి, వరంగల్ రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు చెల్లిస్తున్న రోజు వారీ కూలి రూ.205కు మరో రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16,67,339 మంది కూలీలకు కొంతమేర ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయ ఆధారమే అధికం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారే ఎక్కువ. రెండో పంట లేకపోవడంతో కూలీలు ఇతర పనులు చేస్తూ ఏడాది పాటు కుటుంబాలను పోషించుకుంటారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగియడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు ఊపందుకున్నాయి. రోజురోజుకూ పనులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే చేపట్టాల్సిన పనులను గుర్తించిన అధికారులు అడిగిన వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,31,280 జాబ్ కార్డులు ఉండగా 16,67,339 మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారు. పేదలకు వరం.. పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లా వాసులకు వరంగా మారిందని చెప్పవచ్చు. పనిదినాలు సైతం ఎక్కువగా ఉండటంతో నిధులు అధిక మొత్తంలో వస్తున్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత అభివృద్ధికి తగిన పనులను ఎంపిక చేసి కూలీలకు పని కల్పించాల్సి ఉంటుంది. తద్వారా కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం. ఏటా కూలీల బడ్జెట్ తయారు చేసి వాటికి సరిపడా పనులు, జీవనోపాధుల బలోపేతానికి, గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన, ఉమ్మడి వనరుల అభివృద్ధికి అంచనాలను తయారు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో ప్రధానంగా బావులు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం, కందకాలు, ఊట కుంటలు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి తొట్లు, పండ్ల తోటల పెంపకం, నీటి నిల్వలకు సంబంధించిన పనులు, ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల నిర్మాణాలు చేపడుతున్నారు. కనీసం 40 పనిదినాలు.. ఉపాధి పనుల్లో జాబ్ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం వంద పని దినాలు కల్పిస్తారు. ఒకరిద్దరు సభ్యులున్న కుటుంబాలే అధికంగా ఉన్నాయి వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం కోసం గ్రామపంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. వీటిలో పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని, వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. కూలి రేట్లు పెరగడం సంతోషకరం.. ఉపాధి హామీ పథకంలో కూలి రేట్లు పెరగడం సంతోషంగా ఉంది. ఎండాకాలంలో వ్యవసాయ పనులు లేక ఇంటి వద్దనే ఉండే వారికి ఉపాధి హామీ పథకం చాలా దోహదపడుతోంది. ఉపాధి దొరక్క వలస వెళ్లే వారికి స్థానికంగానే కొంత మెరుగైన ఆదాయం సమకూరనుంది. కూలి పెంచడం వల్ల చాలా మందికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. – కొన్కటి మోహన్, ధర్మరావుపేట, ఖానాపురం ఏప్రిల్ 1 నుంచి అమలు ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు పెరిగిన కూలి డబ్బులతో కలిపి రోజుకు రూ.211 చొప్పున ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో రూ.6 పెంచారు. గతంలో రూ.205 కూలీ అందేది. అడిగిన కూలీందరికి ఉపాధి పథకం ద్వారా పనులు చూపిస్తున్నాం. ఎండాకాలంలో 30శాతం అధికంగా కూలి కట్టిస్తున్నాం. – సంపత్‌రావు, డీఆర్డీఓ -
రైతు చేతిలో వ్యవసాయ సమాచారం
సాక్షి, అలంపూర్: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. సమాచార వ్యవస్థ సామాన్యులకు మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే రైతుల ముంగిట్లోకి వ్యవసాయ వెబ్సైట్లు వచ్చాయి. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంభిస్తూ పంటల్లో మంచి దిగుబడి సాధిస్తున్నారు. నూతన పద్ధతుల్లో రాణిస్తున్న రైతులకు మరింత మెరుగైన సమాచారం అందించడానికి ప్రభుత్వాలు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయి. రైతులు వ్యవసాయంలో వస్తున్న మార్పులు, పంట సాగు, ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో జరిగే చర్చలు, వ్యవసాయ సూచనలు, సలహాలు ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ వెబ్ సైట్ వ్యవసాయానికి సంబందించిన సమాచారం పొందడానికి భారత ప్రభుత్వం www.farmer.gov.in అనే వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో లాగిన్ అయి మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుంటే సమాచారం పొందే అవకాశం ఉంటుంది. www.vikar pedia.in ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయగానే మొదట పైన బాక్స్‌లో వివిధ భాషలతో కూడిన సమాచారం ఉంటుంది. అందులో తెలుగును ఎంచుకోగానే మొట్టమొదగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం అనే సమాచారం ఉంటుంది. రైతులకు కావాల్సిన సమచారాన్ని ఎంచుకోవాలి. వెంటనే అందుకు సంబందించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయ సమచారాన్ని ఎంచుకోగానే పంట ఉత్పత్తి, వ్యవసాయ ఉత్తమ పద్ధతులు, బీమా పథకాలు, వ్యవసాయ పంచాంగం, పశు సంపద, మత్స్య సంపద వంటి సమాచారం రైతులు పొందే అవకాశం ఉంటుంది. వెబ్ రిజిస్ట్రేషన్ రైతులు ఇంటర్నెట్ ద్వారా సమాచారం పొందే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్లో లాగిన్ అయి తమ పేరు, రాష్ట్రం, జిల్లా, మండలం పేరును ఆసక్తి ఉన్న వ్యవసాయ శాఖల్లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాతనే వ్యవసాయ సలహాలు, సూచనలు, ఎస్ఎంఎస్ ద్వారా చేరుతాయి. www.afrirnettfnic.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయగానే వివిధ అంశాలు ఎడమవైపులో వస్తాయి. అందులో కావాల్సిన అంశాలను క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సమగ్ర సమచారం అందుబాటులోకి వస్తోంది. టోల్ ఫ్రీ నంబర్ రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1800–180–1551 ద్వారా కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చు. దేశంలో ఎక్కడైనా వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన సాంకేతిక సూచనలు, సలహాలు పొందవచ్చు. రైతులు కిసాన్ కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి ఎస్ఎంఎస్ సేవలు పొందేందుకు సెల్ నంబర్ నమోదు చేసుకోవాలి.