టమాఠా!
దళారీల పంట పండుతోంది
- 30 కిలోల బాక్సు ధర రూ.800
- వారం రోజుల క్రితం రూ.1800
- బహిరంగ మార్కెట్‌లో కిలో మాట రూ.80
- రైతుల జీవితాలతో చెలగాటం
- మార్కెట్ సౌకర్యం లేకనే ఇలా..
కళ్యాణదుర్గం: రైతు కష్టం దళారీల పాలవుతోంది. ఆరుగాలం కష్టించినా ఆశించిన ధర అందుకోలేని పరిస్థితి నెలకొంది. వరుస కరువుతో అల్లాడుతున్న అన్నదాత.. ఈ ఏడాది కాస్త కోలుకోవచ్చని భావించినా నిరాశే మిగులుతోంది. టమాట రైతుల జీవితంతో దళారీలు ఆడుతున్న ఆట కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. ఏడాదిగా ధర లేక చతికిల పడిన రైతులను దళారీల తీరు మరింత కుంగదీస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 30 కిలోల బాక్సు ధర రూ.1800 నుంచి రూ.800లకు పతనమైంది. సామాన్యులు మార్కెట్‌లో టమాట కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్న తరుణంలో.. రైతులకు కనీస ధర కూడా లభించకపోవడం గమనార్హం. జిల్లాలోనే అత్యధికంగా కళ్యాణదుర్గం డివిజన్‌లో టమాట పంట సాగయింది. ప్రస్తుతం 13వేల ఎకరాల్లో టమాట సాగవగా.. 7వేలకు పైగా ఎకరాల్లో పంట చేతికొచ్చింది. ఈ నేపథ్యంలో దళారీలు ధరను అమాంతం తగ్గించడం రైతులను కలవరపరుస్తోంది.
దళారీల దందా
కళ్యాణదుర్గం ప్రాంతంలో వందలాది మంది దళారీలు టమాట రైతులను మోసగిస్తున్నారు. చుట్టుపక్క ప్రాంతాల నుంచి పట్టణానికి రోజూ 100 లారీల టమాట విక్రయానికి వస్తుంది. ఒక్కొ లారీలో 300 నుంచి 500 వరకు టమాట బాక్సులు ఉంటాయి. దళారీలు వ్యాపారుల వద్ద 30 కిలోల బాక్సు ధర రూ.1,100లుగా ఒప్పందం చేసుకుని.. రైతుల నుంచి రూ.800లతో కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా ఒక్కో బాక్సు మీద రూ.30 కమీషన్ కూడా దండుకుంటున్నారు.
మార్కెట్ సౌకర్యం లేకనే..
స్థానిక మార్కెట్ యార్డులో టమాట కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్లే దళారీల ఆగడాలు అధికమయ్యాయి. పాలకులు టమాట రైతుల మోసాలను అరికట్టేందుకు ఏ మాత్రం చొరవ చూపని పరిస్థితి. కొందరు రైతులు కోలార్, అనంతపురం మార్కెట్లకు తీసుకెళ్లి అక్కడ మోసపోతుండగా, మరికొందరు రైతులు ఇక్కడి దళారీల చేతుల్లో దగా పడుతున్నారు.
కష్టాలు తీరుతాయనుకున్నా
వరుసగా ఎనిమిది సార్లు టమాట సాగు చేసి లక్షల్లో నష్టపోయిన. ఇప్పుడు కూడా 1.50 ఎకరాల్లో పంట సాగు చేయగా కోతకు వచ్చింది. ధర బాగుండటంతో కష్టాలు తీరుతాయనుకున్నా. దళారీలు అప్పుడే ధర తగ్గిస్తున్నారు.
– సుధీర్ రైతు, కంబదూరు
బాక్సు రూ.800లకే అడుగుతున్నారు
రెండెకరాల్లో రూ.80వేల పెట్టుబడితో సాగుచేసిన పంట కోతకు వచ్చింది. బాక్సు రూ.800లకే అడుగుతున్నారు. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తే మేలు జరుగుతుంది.
– నారాయణప్ప రైతు, కోనాపురం
మార్కెట్లో టమాట విక్రయాలకు చర్యలు
మార్కెట్ యార్డులో టమాట విక్రయాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వ్యాపారులతో సంప్రదింపులు నిర్వహించాం. త్వరలోనే వ్యాపారాలు ప్రారంభిస్తాం.
– రామాంజనేయులు, మార్కెట్‌యార్డు చైర్మన్