ధాన్యం.. ‘ధనం’ | Farmers Happy To Grain Money Transfer Accounts | Sakshi
Sakshi News home page

ధాన్యం.. ‘ధనం’

Published Thu, Jun 20 2019 6:59 AM | Last Updated on Thu, Jun 20 2019 6:59 AM

Farmers Happy To Grain Money Transfer Accounts - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో దశలవారీగా జమ అవుతున్నాయి. రబీ సీజన్‌కు సంబంధించి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు నగదు చెల్లింపు చర్యలు చేపట్టారు. వాస్తవానికి ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతులకు నగదు ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల సకాలంలో చెల్లించలేదు. దీంతో రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రజాప్రతినిధులు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సమస్యపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జేసీ అనురాగ్‌ జయంతి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 3,500 మంది రైతులకు ఇంకా నగదు రావాల్సి ఉండగా.. వారిలో ఇప్పటివరకు చాలా మంది ఖాతాల్లో నగదు జమ చేశారు.  రబీ సీజన్‌లో రైతులు జిల్లాలో 25వేల హెక్టార్లలో ధాన్యం సాగు చేశారు.

ఈ సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ 1.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఏ, ఐకేపీ ఆధ్వర్యంలో 18, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్‌డీఏ–ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4,116 మంది రైతుల నుంచి గ్రేడ్‌–‘ఏ’ రకం 24,500.240 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం 1,752.200 మెట్రిక్‌ టన్నులు.. మొత్తం 26,252.440 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 12,868 మంది రైతుల నుంచి గ్రేడ్‌–‘ఏ’ రకం 99,709.560 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం 4,125.440 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,03,835.000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అంటే మొత్తం 90 కొనుగోలు కేంద్రాల ద్వారా 16,984 మంది రైతుల నుంచి గ్రేడ్‌–‘ఏ’ రకం 1,24,209.800 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం 5,877.640 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,30,087.440 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశారు.
 
నగదు రాకపోవడంతో ఆందోళన.. 
సాధారణంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సంబంధిత రైతులకు 48 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈసారి చాలా మంది రైతులకు నెలలు గడుస్తున్నా నగదు మాత్రం వారి ఖాతాల్లో జమ కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల నుంచి వివరాలను అప్‌లోడ్‌ చేసిన అనంతరం సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అయితే రైతులకు సకాలంలో నగదు రాకపోవడంతో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సాధారణ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రైతుల ఖాతాల్లో నగదు జమ కాని విషయంపై అధికారులను ప్రశ్నించారు. కొనుగోళ్లు జరిగి ఇంత కాలమైనా ఇంకా నగదు రాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. దాదాపు 3,500 మందికి ఇంకా నగదు రాలేదని, వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు త్వరలోనే రైతులకు నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. 

రైతులకు చెల్లింపులు.. 
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు నగదు చెల్లింపులు చేపట్టారు. గతంలో రైతులకు నగదు అందకపోవడంతో ఇబ్బందులు పడిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం దశలవారీగా అందరు రైతులకు ధాన్యానికి సంబంధించిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 16,984 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వీరిలో అనేక మందికి నగదు చెల్లింపులు ఇప్పటికే చేయగా.. మిగిలిన వారికి కూడా వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాతాల్లో నగదు జమ కావడంతో రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది.  
ఖాతాల్లో జమ చేస్తున్నాం.. 
పెండింగ్‌లో ఉన్న రైతులందరి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. మరో వారం రోజుల్లో రైతులందరికీ నగదు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement