Grain money
-
ధాన్యం.. ‘ధనం’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో దశలవారీగా జమ అవుతున్నాయి. రబీ సీజన్‌కు సంబంధించి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు నగదు చెల్లింపు చర్యలు చేపట్టారు. వాస్తవానికి ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతులకు నగదు ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల సకాలంలో చెల్లించలేదు. దీంతో రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రజాప్రతినిధులు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమస్యపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జేసీ అనురాగ్ జయంతి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 3,500 మంది రైతులకు ఇంకా నగదు రావాల్సి ఉండగా.. వారిలో ఇప్పటివరకు చాలా మంది ఖాతాల్లో నగదు జమ చేశారు. రబీ సీజన్లో రైతులు జిల్లాలో 25వేల హెక్టార్లలో ధాన్యం సాగు చేశారు. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, ఐకేపీ ఆధ్వర్యంలో 18, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఏ–ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4,116 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 24,500.240 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 1,752.200 మెట్రిక్ టన్నులు.. మొత్తం 26,252.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 12,868 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 99,709.560 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 4,125.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,03,835.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అంటే మొత్తం 90 కొనుగోలు కేంద్రాల ద్వారా 16,984 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 1,24,209.800 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 5,877.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,30,087.440 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశారు. నగదు రాకపోవడంతో ఆందోళన.. సాధారణంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సంబంధిత రైతులకు 48 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈసారి చాలా మంది రైతులకు నెలలు గడుస్తున్నా నగదు మాత్రం వారి ఖాతాల్లో జమ కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల నుంచి వివరాలను అప్లోడ్ చేసిన అనంతరం సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అయితే రైతులకు సకాలంలో నగదు రాకపోవడంతో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రైతుల ఖాతాల్లో నగదు జమ కాని విషయంపై అధికారులను ప్రశ్నించారు. కొనుగోళ్లు జరిగి ఇంత కాలమైనా ఇంకా నగదు రాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. దాదాపు 3,500 మందికి ఇంకా నగదు రాలేదని, వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు త్వరలోనే రైతులకు నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు చెల్లింపులు.. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు నగదు చెల్లింపులు చేపట్టారు. గతంలో రైతులకు నగదు అందకపోవడంతో ఇబ్బందులు పడిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం దశలవారీగా అందరు రైతులకు ధాన్యానికి సంబంధించిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 16,984 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వీరిలో అనేక మందికి నగదు చెల్లింపులు ఇప్పటికే చేయగా.. మిగిలిన వారికి కూడా వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాతాల్లో నగదు జమ కావడంతో రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ఖాతాల్లో జమ చేస్తున్నాం.. పెండింగ్‌లో ఉన్న రైతులందరి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. మరో వారం రోజుల్లో రైతులందరికీ నగదు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ -
ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి
సాక్షి, టవర్‌సర్కిల్ : ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మొదట సర్కస్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు 2014 నాటి స్థాయిలోనే ఉన్నా.. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను భారం కారణంగా ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రవీణ్, నాయకులు వెంకటేశ్వర్లుగౌడ్, కళ్యాడపు ఆగయ్య, ఎడ్ల వెంకటయ్య, జాడి బాల్‌రెడ్డి, కొరటాల శివరామకృష్ణ, ఆడెపు కమలాకర్, దామెర సత్యం, దూలం రాధిక, అనసూర్యనాయక్, కరుణాకర్‌రెడ్డి, తీట్ల ఈశ్వరి, ఆనందరావు, కిశోర్, గట్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రొడ్డ శ్రీనివాస్, తీగుట్ల రమేశ్, నూజెట్టి వాణి, రవీందర్, ఇందు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం డబ్బులు ఇంకెప్పుడు.. ?
- ఖరీఫ్ పెట్టుబడుల కోసం ఎదురుచూపులు - ఖాతాలో డబ్బులున్నా చేతికందని వైనం సాక్షి, కరీంనగర్ : రైతు పరిస్థితి దిక్కుతోచకుంది. ధాన్యం అమ్మిన డబ్బులు ఇరవై రోజులు గడిచినా చేతికి రాకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చెక్కుల ద్వారా డబ్బులు చెల్లించిన సివిల్ సప్లై విభాగం రెండేళ్లుగా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. అయితే, చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో అదనుపై పెట్టుబడులు లేక రైతులు అప్పుల కోసం తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరో పక్కధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు ఉన్నా.. బ్యాంకు అధికారులు కొర్రీలు పెడుతుండడంతో డబ్బులున్నా.. పెట్టుబడుల కోసం పడిగాపులు తప్పడం లేదు. ఉన్నా.. లేకున్నా.. అవే తిప్పలు.. ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం ఐకేపీ కేంద్రాలు, సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్లైన్లోనే జమ చేస్తామని అధికారులు చెబుతుండడంతో తమ ఖాతాలున్న బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొత్త విధానం కావడంతో ఆలస్యమవుతోందని.. డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ సమస్యలతో జాప్యం జరిగిందని కొన్ని బ్యాంకులు రైతులను సముదాయించే పని పెట్టుకున్నాయి. మరోపక్క ధాన్యం డబ్బులు బ్యాం కుల్లో జమైన రైతులు వాటిని తీసుకోలేక పోతున్నారు. రైతులకు సాధార ణంగా గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఖాతా లు ఉండడం.. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ల్లో నగదు నిండుకోవడంతో రైతుల ఖాతాల్లో డబ్బులున్నా కొర్రీలు పెడుతున్నాయి. ఒక్కో చోట కేవలం రూ. 4 వేలు.. పది వేలు చేతిలో పెట్టి వారం రోజుల తర్వాత మరోసారి రావాలని సూచిస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు మానుకొని రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. వడ్లు అమ్మి నెలైతంది.. నాది సిరిసిల్ల. పెద్దూరు దారిలో నాలుగెకరాలుంది. 120 క్వింటాళ్ల వడ్లు అయినయి. సిరిసిల్ల మార్కెట్లో అమ్మిన. నెల రోజులు అవుతుంది వడ్లు అమ్మి. వడ్ల పైసలు రూ.లక్షా ఎనబై ఒక్క వేయి వచ్చినయి అన్నారు. కానీ.. బ్యాంకులో ఇరవై వేలన్నా ఇస్తలేరు. పది వేలు ఇచ్చి మళ్లీ వారం దాకా రావద్దు అంటున్నారు. మల్ల ఎవుసం పెట్టుబడికి గోస అవుతుంది. – గోలి లక్ష్మీనారాయణ, రైతు, సిరిసిల్ల బ్యాంకు చుట్టూ తిరుగుడు అవుతుంది నాది సిరిసిల్ల మండలం చంద్రంపేట. నాకు నాలు గెకరాలు భూమి ఉంది. రెండెకరాల పత్తి పెట్టిన, మరో రెండెకరాలు వరి వేసిన. కొంత ఎండిపోయింది. 42 క్వింటాళ్ల వడ్లు అయినయి. రూ.63 వేలు రావాలే. మే 15నాడు వడ్లు జోకిన. వారం రోజులకే డబ్బులు వస్తయి అన్నరు. నెలదాటింది. కేడీసీసీ బ్యాంకు చుట్టూ తిరుగుడు అవుతుంది. ఇప్పుడు మళ్లీ వ్యవసాయానికి పెట్టుబడి కావాలే. చేతిల పైసల్లేక ఇబ్బంది అవుతంది. – మంద సత్యం, చంద్రంపేట, రైతు ఏడు జిల్లాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు తీరిది కొనుగోలు చేసిన ధాన్యం( మెట్రిక్ టన్నులు ) 10,75,723 రైతులు 1,81,200 మంది... మొత్తం ధాన్యం విలువ 1,623 కోట్లు ఇప్పటి వరకు చెల్లించినవి 1,006 కోట్లు ఇంకా చెల్లించిన బకాయిలు 616.79 కోట్లు ఒక్క కరీంనగర్ జిల్లాలో బకాయిలు 95 కోట్లు -
మిల్లు గల్లా ఎక్కి... ఆత్మహత్యాయత్నం
దొంగ ట్రిప్షీట్లు ఇచ్చి మోసం చేసిన మిల్లు యజమాని ధాన్యం డబ్బులు పోతాయన్న భయంతో ఆత్మహ త్య చేసుకోవడానికి గల్లా ఎక్కిన అన్నదాత ఎట్టకేలకు కిందికి దించిన పోలీసులు జరిగిన అక్రమాలపై తహశీల్దార్ విచారణ రూ.50 లక్షల వరకూ వెలుగుచూసిన వైనం ఇంటిల్లిపాదీ రాత్రీ పగలు కష్టపడితే చేతికి అందిన పంట అది. రక్తాన్ని చెమటగా మార్చి ఒళ్లు హూనమయ్యేలా శ్రమిస్తే ఇంటికి చేరిన ధాన్యలక్ష్మి అది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే, దాన్ని దొంగదారిలో దోచుకోవడానికి ప్రయత్నించాడు ఆ పెద్ద మనిషి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ రైతు మిల్లు గల్లా ఎక్కాడు. ఎంతమంది ప్రాధేయపడినా కిందకు రాలేదు. తన డబ్బు ఎవరిస్తారని ప్రశ్నించాడు. తన కష్టాన్ని తనకివ్వకుంటే చనిపోతానని బెదిరించాడు. ఈ లోగా మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకుని తమ పరిస్థితి ఏంటని రోదించారు. అధికారులు, పోలీ సులు కలిసి నచ్చజెప్పడంతో గల్లామీద నుంచి రైతు కిందికి దిగాడు. గంట్యాడ మండలం కోటారుబిల్లిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. గంట్యాడ: నమ్మకంతో ధాన్యం వేస్తే దానికి దొంగ బిల్లులు ఇచ్చి మిల్లు యజమాని మోసం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురైన నీలావతి గ్రామానికి చెందిన వర్రి సత్యనారాయణ అనే రైతు బుధవారం కొటారుబిల్లిలోని సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్స మిల్లు గల్లాపైకి ఎక్కి ఆత్యహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఇలా మోసపోయిన మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిల్లిపాదీ కష్టపడి పండించిన పంటను నమ్మకంతో సాయివరల క్ష్మి ఆగ్రోఫుడ్స్కు వేయగా, మిల్లు యజమాని దొంగబిల్లు ఇచ్చారని రైతులు వాపోయారు. సత్యనారాయణ అనే రైతు మిల్లు గల్లా ఎక్కాడని తెలుసుకున్న తహశీల్దార్ బాపిరాజు, గంట్యాడ ఎస్ఐ షేక్‌షరీఫ్ అక్కడకు చేరుకుని రైతుతో మాట్లాడారు. న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో మిల్లుపై నుంచి ఆయన కిందకు దిగాడు. అనంతరం సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్ యజమాని బద్రీనారాయణ చేసిన అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కొటారుబిల్లి సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్స్ రైస్‌మిల్లుకు రైతులు ధాన్యం వేయగా తన రైస్‌మిల్ స్టాంపునకు బదులు వేరే మిల్లుల స్టాంపులు వేసి అక్రమాలకు పాల్పడ్డాడని తెలిసింది. చంద్రంపేట అయ్యప్ప ట్రేడర్స్ యజమాని పూసర్ల కృష్ణారావు ఇదివరకు జేసీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహశీల్దార్ బాపిరాజు విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు చేపట్టిన విచారణలో నీలావతికి చెందిన రైతులు వర్రి సతీష్ 340 బస్తాలు, గులిపల్లి శ్రీను 442, అల్లు పైడితల్లి 340, పంచాది సూర్యనారాయణ 370, వేమలి ఆదినారాయణ 325, పెంట లక్ష్మి 310, వర్రి అప్పారావు 126, సిరికి వెంకటరావు 585 బస్తాల ధాన్యానికి సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్ స్టాంపునకు బదులు అయ్యప్ప ట్రేడర్స స్టాంపులు వేసినట్లు తెలిసింది. అలాగే అల్లు శ్రీను 580, వర్రి సత్యనారాయణ 390, అల్లు ఆదినారాయన 155, సిరికి వెంకటరావు 510 బస్తాల ధాన్యానికి గంట్యాడ శ్రీస్వామి అయ్యప్ప బోయిల్డ్ ఎండ్ రైస్‌మిల్లు స్టాంపులు వేసిన ట్లు గుర్తించారు. మరికొంతమంది రైతులకు స్టాంపులు లేకుండా, తేదీ వేయకుండా మోసం చేశారని తెలిసింది. ఇప్పటికి రూ.50 లక్షల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. కొనుగోలు కోంద్రంలోని సిబ్బంది సంతకాల్లో వ్యత్యాసం రావడాన్ని గమనించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బుధవారం చేపట్టిన విచారణలో *50లక్షలకు పైగా అక్రమాలు జరిగాయని తేలిందని తహశీల్దార్ బాపిరాజు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. పరారీలో మిల్లు యజమాని రైస్‌మిల్‌లో నిల్వలు పరిశీలించడానికి ఆర్ఐ రంగారావు, డీఎం సివిల్ సప్లై టెక్నికల్ మేనేజర్ వి.వలసయ్య, వీఆర్ఓ రవిలు వెళ్లగా మిల్లు యజమాని బద్రీనారాయణ అందుబాటులో లేరని, ఉన్న నిల్వలను పరిశీలించి రికార్డు చేశామని అధికారులు తెలిపారు. మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతో తహశీల్దార్ ఆదేశాల మేరకు రాత్రి సిబ్బంది కాపలా ఉంచామన్నారు. అయితే వెలుగు ఆధ్వర్యంలో ఇవ్వాల్సిన ట్రక్షీట్లు మిల్లు యజమానికి ఎలా వెళ్లాయనేది చర్చనీయాంశమైంది. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమాలు? బద్రీనారాయణ గతంలో జిల్లా మిల్లర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా పనిచేయడంతో ఆయనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాల కారణంగా మిగతా మండలాల్లో కూడా అక్రమాలకు పాల్పడి ఉండవచ్చని ఆందోళన చెందుతున్నారు.