మిల్లు గల్లా ఎక్కి... ఆత్మహత్యాయత్నం
దొంగ ట్రిప్‌షీట్లు ఇచ్చి మోసం చేసిన మిల్లు యజమాని
ధాన్యం డబ్బులు పోతాయన్న భయంతో
ఆత్మహ త్య చేసుకోవడానికి గల్లా ఎక్కిన అన్నదాత
ఎట్టకేలకు కిందికి దించిన పోలీసులు
జరిగిన అక్రమాలపై తహశీల్దార్ విచారణ
రూ.50 లక్షల వరకూ వెలుగుచూసిన వైనం
ఇంటిల్లిపాదీ రాత్రీ పగలు కష్టపడితే చేతికి అందిన పంట అది. రక్తాన్ని చెమటగా మార్చి ఒళ్లు హూనమయ్యేలా శ్రమిస్తే ఇంటికి చేరిన ధాన్యలక్ష్మి అది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే, దాన్ని దొంగదారిలో దోచుకోవడానికి ప్రయత్నించాడు ఆ పెద్ద మనిషి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ రైతు మిల్లు గల్లా ఎక్కాడు. ఎంతమంది ప్రాధేయపడినా కిందకు రాలేదు. తన డబ్బు ఎవరిస్తారని ప్రశ్నించాడు. తన కష్టాన్ని తనకివ్వకుంటే చనిపోతానని బెదిరించాడు. ఈ లోగా మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకుని తమ పరిస్థితి ఏంటని రోదించారు. అధికారులు, పోలీ సులు కలిసి నచ్చజెప్పడంతో గల్లామీద నుంచి రైతు కిందికి దిగాడు. గంట్యాడ మండలం కోటారుబిల్లిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
గంట్యాడ: నమ్మకంతో ధాన్యం వేస్తే దానికి దొంగ బిల్లులు ఇచ్చి మిల్లు యజమాని మోసం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురైన నీలావతి గ్రామానికి చెందిన వర్రి సత్యనారాయణ అనే రైతు బుధవారం కొటారుబిల్లిలోని సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్‌స మిల్లు గల్లాపైకి ఎక్కి ఆత్యహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఇలా మోసపోయిన మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిల్లిపాదీ కష్టపడి పండించిన పంటను నమ్మకంతో సాయివరల క్ష్మి ఆగ్రోఫుడ్స్‌కు వేయగా, మిల్లు యజమాని దొంగబిల్లు ఇచ్చారని రైతులు వాపోయారు. సత్యనారాయణ అనే రైతు మిల్లు గల్లా ఎక్కాడని తెలుసుకున్న తహశీల్దార్ బాపిరాజు, గంట్యాడ ఎస్‌ఐ షేక్‌షరీఫ్ అక్కడకు చేరుకుని రైతుతో మాట్లాడారు. న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో మిల్లుపై నుంచి ఆయన కిందకు దిగాడు. అనంతరం సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్ యజమాని బద్రీనారాయణ చేసిన అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కొటారుబిల్లి సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్స్ రైస్‌మిల్లుకు రైతులు ధాన్యం వేయగా తన రైస్‌మిల్ స్టాంపునకు బదులు వేరే మిల్లుల స్టాంపులు వేసి అక్రమాలకు పాల్పడ్డాడని తెలిసింది. చంద్రంపేట అయ్యప్ప ట్రేడర్స్ యజమాని పూసర్ల కృష్ణారావు ఇదివరకు జేసీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహశీల్దార్ బాపిరాజు విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు చేపట్టిన విచారణలో నీలావతికి చెందిన రైతులు వర్రి సతీష్ 340 బస్తాలు, గులిపల్లి శ్రీను 442, అల్లు పైడితల్లి 340, పంచాది సూర్యనారాయణ 370, వేమలి ఆదినారాయణ 325, పెంట లక్ష్మి 310, వర్రి అప్పారావు 126, సిరికి వెంకటరావు 585 బస్తాల ధాన్యానికి సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్ స్టాంపునకు బదులు అయ్యప్ప ట్రేడర్‌స స్టాంపులు వేసినట్లు తెలిసింది.
అలాగే అల్లు శ్రీను 580, వర్రి సత్యనారాయణ 390, అల్లు ఆదినారాయన 155, సిరికి వెంకటరావు 510 బస్తాల ధాన్యానికి గంట్యాడ శ్రీస్వామి అయ్యప్ప బోయిల్డ్ ఎండ్ రైస్‌మిల్లు స్టాంపులు వేసిన ట్లు గుర్తించారు. మరికొంతమంది రైతులకు స్టాంపులు లేకుండా, తేదీ వేయకుండా మోసం చేశారని తెలిసింది. ఇప్పటికి రూ.50 లక్షల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. కొనుగోలు కోంద్రంలోని సిబ్బంది సంతకాల్లో వ్యత్యాసం రావడాన్ని గమనించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బుధవారం చేపట్టిన విచారణలో *50లక్షలకు పైగా అక్రమాలు జరిగాయని తేలిందని తహశీల్దార్ బాపిరాజు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు.
పరారీలో మిల్లు యజమాని
రైస్‌మిల్‌లో నిల్వలు పరిశీలించడానికి ఆర్‌ఐ రంగారావు, డీఎం సివిల్ సప్లై టెక్నికల్ మేనేజర్ వి.వలసయ్య, వీఆర్‌ఓ రవిలు వెళ్లగా మిల్లు యజమాని బద్రీనారాయణ అందుబాటులో లేరని, ఉన్న నిల్వలను పరిశీలించి రికార్డు చేశామని అధికారులు తెలిపారు. మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతో తహశీల్దార్ ఆదేశాల మేరకు రాత్రి సిబ్బంది కాపలా ఉంచామన్నారు. అయితే వెలుగు ఆధ్వర్యంలో ఇవ్వాల్సిన ట్రక్‌షీట్‌లు మిల్లు యజమానికి ఎలా వెళ్లాయనేది చర్చనీయాంశమైంది. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా అక్రమాలు?
బద్రీనారాయణ గతంలో జిల్లా మిల్లర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా పనిచేయడంతో ఆయనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాల కారణంగా మిగతా మండలాల్లో కూడా అక్రమాలకు పాల్పడి ఉండవచ్చని ఆందోళన చెందుతున్నారు.