ధాన్యం డబ్బులు ఇంకెప్పుడు.. ? | Farmers waiting for Kharif Investments | Sakshi
Sakshi News home page

ధాన్యం డబ్బులు ఇంకెప్పుడు.. ?

Published Thu, Jun 22 2017 2:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ధాన్యం డబ్బులు ఇంకెప్పుడు.. ? - Sakshi

ధాన్యం డబ్బులు ఇంకెప్పుడు.. ?

- ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం ఎదురుచూపులు
- ఖాతాలో డబ్బులున్నా చేతికందని వైనం


సాక్షి, కరీంనగర్‌ : రైతు పరిస్థితి దిక్కుతోచకుంది. ధాన్యం అమ్మిన డబ్బులు  ఇరవై రోజులు గడిచినా చేతికి రాకపోవడంతో  పెట్టుబడుల కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చెక్కుల ద్వారా డబ్బులు చెల్లించిన సివిల్‌ సప్లై విభాగం రెండేళ్లుగా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. అయితే, చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో అదనుపై పెట్టుబడులు లేక రైతులు అప్పుల కోసం తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.  మరో పక్కధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు ఉన్నా.. బ్యాంకు అధికారులు కొర్రీలు పెడుతుండడంతో డబ్బులున్నా.. పెట్టుబడుల కోసం పడిగాపులు తప్పడం లేదు.

ఉన్నా.. లేకున్నా.. అవే తిప్పలు..
ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం ఐకేపీ కేంద్రాలు, సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే జమ చేస్తామని అధికారులు చెబుతుండడంతో తమ ఖాతాలున్న బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొత్త విధానం కావడంతో ఆలస్యమవుతోందని.. డేటా ఎంట్రీ, సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో జాప్యం జరిగిందని కొన్ని బ్యాంకులు రైతులను సముదాయించే పని పెట్టుకున్నాయి. మరోపక్క ధాన్యం డబ్బులు బ్యాం కుల్లో జమైన రైతులు వాటిని తీసుకోలేక పోతున్నారు. రైతులకు సాధార ణంగా గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఖాతా లు ఉండడం.. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ల్లో నగదు నిండుకోవడంతో రైతుల ఖాతాల్లో డబ్బులున్నా కొర్రీలు పెడుతున్నాయి.  ఒక్కో చోట కేవలం రూ. 4 వేలు.. పది వేలు చేతిలో పెట్టి  వారం రోజుల తర్వాత మరోసారి రావాలని సూచిస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు మానుకొని రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.

వడ్లు అమ్మి నెలైతంది..
నాది సిరిసిల్ల. పెద్దూరు దారిలో నాలుగెకరాలుంది. 120 క్వింటాళ్ల వడ్లు అయినయి. సిరిసిల్ల మార్కెట్‌లో అమ్మిన. నెల రోజులు అవుతుంది వడ్లు అమ్మి. వడ్ల పైసలు రూ.లక్షా ఎనబై ఒక్క వేయి వచ్చినయి అన్నారు. కానీ.. బ్యాంకులో ఇరవై వేలన్నా ఇస్తలేరు. పది వేలు ఇచ్చి మళ్లీ వారం దాకా రావద్దు అంటున్నారు. మల్ల ఎవుసం పెట్టుబడికి గోస అవుతుంది.     
    – గోలి లక్ష్మీనారాయణ, రైతు, సిరిసిల్ల

 బ్యాంకు చుట్టూ తిరుగుడు అవుతుంది
నాది సిరిసిల్ల మండలం చంద్రంపేట. నాకు నాలు గెకరాలు భూమి ఉంది. రెండెకరాల పత్తి పెట్టిన, మరో రెండెకరాలు వరి వేసిన. కొంత ఎండిపోయింది. 42 క్వింటాళ్ల వడ్లు అయినయి. రూ.63 వేలు రావాలే. మే 15నాడు వడ్లు జోకిన. వారం రోజులకే డబ్బులు వస్తయి అన్నరు. నెలదాటింది. కేడీసీసీ బ్యాంకు చుట్టూ తిరుగుడు అవుతుంది. ఇప్పుడు మళ్లీ వ్యవసాయానికి పెట్టుబడి కావాలే. చేతిల పైసల్లేక ఇబ్బంది అవుతంది.      
– మంద సత్యం, చంద్రంపేట, రైతు   

ఏడు జిల్లాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు తీరిది
కొనుగోలు చేసిన ధాన్యం( మెట్రిక్‌ టన్నులు ) 10,75,723
రైతులు 1,81,200 మంది...
మొత్తం ధాన్యం విలువ 1,623  కోట్లు
ఇప్పటి వరకు చెల్లించినవి 1,006 కోట్లు
ఇంకా చెల్లించిన బకాయిలు 616.79  కోట్లు
ఒక్క కరీంనగర్‌ జిల్లాలో బకాయిలు 95 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement