రైతు నోట్లో మట్టి...! | Rabi season IKP centers Buying Grain Millers accounting Farmers | Sakshi
Sakshi News home page

రైతు నోట్లో మట్టి...!

Published Thu, Jul 3 2014 2:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రైతు నోట్లో మట్టి...! - Sakshi

రైతు నోట్లో మట్టి...!

 నల్లగొండ : ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి పంటను పండించిన అన్నదాత నోట్లో మట్టి కొడుతున్నారు. పండించిన పంటకు మద్ధతు ధర లభించకపోగా.. అమ్మిన ధాన్యంలో కత్తెరపెడుతుండడంతో తీవ్రంగానష్టపోవాల్సి వచ్చింది. రబీ సీజన్‌లో ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి.. మిల్లర్ల లెక్కకు పొంతలేకుండా పోయింది. తాలు, దుమ్ము ఉందన్న సాకుతో మిల్లర్లు ధాన్యంలో భారీగా కోత విధిస్తుండగా సంఘాలు మాత్రం రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బుల్లో కోత పెడుతున్నాయి. దీంతో పలు చోట్ల సంఘాలకు, రైతులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
 
 జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 250 ఐకేపీ కేంద్రాల ద్వారా 2 లక్షల 29 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ సారి పంట దిగుబడి గణనీయంగా పెరగడంతో ఐకేపీ కేంద్రాలకు రికార్డు స్థాయిలో ధాన్యం తరలివచ్చింది. పండించిన పంటకు కనీస మద్ధతు ధర లభిస్తుందన్న ఆశతో రైతులు మిల్లర్లను ఆశ్రయించకుండా ఐకేపీ కేంద్రాలలోనే ధాన్యం అమ్మారు. కానీ మిల్లర్లు మాత్రం సంఘాలను నట్టేటముంచాయి. కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో  వందల క్వింటాళ్లు కోత పెట్టారు. దీంతో ఈ నష్టాన్ని తాము భరిచంలేమని సంఘాలు లబోదిబోమంటున్నాయి. రైతులు కూడా అమ్మిన ధా న్యానికి డబ్బులు చెల్లించాల్సిందేనని నష్టాన్ని తమపై రుద్ధితే మాత్రం సహించేది లేదని చెబుతున్నారు.
 
 తాలుపేరుతో దోపిడీ..
 ఐకేపీ మహిళల అవగాహన లేమిని అడ్డంపెట్టుకుని మిల్లర్లు రైతుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకున్నారు. వాస్తవానికి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడే సంఘాలు ధాన్యం నాణ్యతను తేమ యంత్రాల ద్వారా పరిశీలిస్తారు. దీంతో పాటు తాలు, మట్టిపెడ్డలు, పొట్టు, గింజలు వంటివి ఉన్నట్లయితే ఆ మేరకు వారికున్న లెక్కల ప్రకారం సరిచూసి రైతులకు రశీదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల ద్వారా మిల్లర్లకు చేరుతుంది. ఇక్కడ మిల్లర్లు మళ్లీ తేమ, తాలు, వంటివన్నీ పరిశీలించిన తర్వాతే ధాన్యం దింపుకుంటున్నారు. దీంతో ఐకేపీ కేంద్రాల లెక్కలకు, మిల్లర్లు పరిశీలించి నిర్ధారించిన దానికి మధ్య వందల క్వింటాళ్ల ధాన్యం తరుగు పోతోంది.  
 
 క్వింటాళ్ల కొద్దీ కోత..
 ఆత్మకూరు (ఎం) ఐకేపీ కేంద్రం నిర్వాహకులు 7,501.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా మిల్లర్లు 7,374.91 క్వింటాళ్లకు లెక్కకట్టారు. దీంతో 126.69 క్వింటాళ్లను ధాన్యం తాలు, తేమ ఇతర కారణాలతో కోత పెట్టారు. వలిగొండ ఐకేపీ కేంద్రంవారు 16, 350 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. మిల్లర్లు 15,999 క్వింటాళ్లకు తగ్గించారు. దీంతో 350.28 క్వింటాళ్ల ధాన్యం కోత పడింది. కనగల్ మండలం కురంపల్లి ఐకేపీ కేంద్రంవారు 16,700 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. మిల్లర్లు 16,535 క్వింటాళ్లకు తగ్గించారు. దీంతో 165.70 క్వింటాళ్ల ధాన్యం కోత పడింది. మేళ్లచెర్వు ఐకేపీ కేంద్రం నిర్వాహకులు 26,863.20 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. మిల్లర్లు 26,6 86.47 క్వింటాళ్లకు లెక్కకట్టారు. ఇక్కడ 176.73 క్వింటాళ్లు తగ్గింది. నూతనకల్ ఐకేపీ కేంద్రంవారు 29,434 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కానీ మిల్లర్లు 2 9,091 క్వింటాళ్లకే లెక్కకట్టారు. దీంతో 342.32 క్వింటాళ్ల ధాన్యం కోల్పోవాల్సి వచ్చింది.
 
 భారీ వ్యత్యాసం..
 ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి, మిల్లర్లు ఇచ్చిన రశీదులకు ఎంత మేర వ్యత్యాసం ఉందనే దానిపైన ధాన్యం ట్రక్‌షీట్ల ఆధారంగా యంత్రాంగం లెక్కలు కడుతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 64 ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలును సాకుగా చూపి 2,482 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు కోత పెట్టారు. క్వింటాకు రూ.1345 చొప్పున రూ.33 లక్షల 38 వేల 290 నష్టం వాటిల్లింది. అయితే మిగిలిన కేంద్రాల లెక్కలు పూర్తియ్యే సరికి ఈ నష్టం కోటి రూపాయాల వరకు చేరుతుందని అంచనా. క్వింటాకు రూ.32 కమీషన్‌కు పనిచేసే ఐకేపీ కేంద్రాలు ఇంత పెద్ద నష్టాన్ని భరిస్తాయా అన్నది ప్రశ్నార్థకం మారింది.
 
 ధాన్యం డబ్బులు నిలిపివేత..
 ట్రక్ షీట్ల లెక్కలు ఇంకా పూర్తికాకపోవడంతో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం సొమ్ము రూ. 3 కోట్లు నిలిపేశారు. ధాన్యం లెక్కల్లో తేడా వచ్చినట్లు రుజువైన కేంద్రాలకు వారికి చెల్లించాల్సిన సొమ్ములో కోత పెడుతున్నారు. ప్రభుత్వానికి నష్టం కలగకుండా అధికారులు  తీసుకుంటున్న ఈ చర్య బాగానే ఉన్నా.. సంఘాలకు ధాన్యం డబ్బులు తగ్గించి ఇస్తే అప్పుడు అంతిమంగా నష్టపోవాల్సింది రైతాంగమే. మిల్లరు, సంఘాలు చేసిన నష్టాన్ని భరించేందుకు రైతులు సిద్ధంగా లేరు. మరి ఈ సమస్యను ఏ విధంగా గట్టెక్కిస్తారనేది అధికారులకే తెలియాలి.
 
 సంఘాలు, మిల్లర్ల వాదన ఇదీ..
 వరి కోత యంత్రాల ద్వారా పంటను కోస్తున్నారు కాబట్టి మట్టి, రాళ్లు వచ్చే అవకాశమే లేదని మహిళా సంఘాలు, రైతులు పేర్కొంటున్నారు.  వరి కోత యంత్రాల్లో ఉండే గాలిగొట్టాన్ని రైతులు మూసివేస్తుండడంతో  తాలు, దుమ్ము ధాన్యం లోనే కలిసి వస్తోందనేది మిల్లర్ల వాదన.
 
 సంఘాల మీద ఒత్తిడి తీసుకొచ్చాం
 : చిర్రా సుధాకర్, డీఆర్‌డీఏ పీడీ.
 ధాన్యం కొనుగోలు విషయంలో సంఘాల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని, మొలకొత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని వారిపై తీవ్ర ఒత్తిచేశాం. అందువల్ల వారు కొనుగోలు చేశారు.  కాబట్టి ఈ నష్టాన్ని రైతులే భరించాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement