ప్రతీకాత్మక చిత్రం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పంట రుణాల రూపంలో రైతాంగానికి ఏటా రూ.200 కోట్ల సాయం అందించే సంస్థ ఇప్పుడు నిరుపయోగంగా మారింది. స్వల్ప, దీర్ఘకాలిక, గోల్డ్ లోన్స్ కలిసి మొత్తంగా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల మేర రుణాలు అందించాల్సిందిపోయి.. పాత రుణాల రెన్యువల్స్, రికవరీలకే పరిమితం అవుతోంది. ఖరీఫ్ అదును ముంచుకు రావడంతో రుణాలు ఎలా పొందాలో తెలియక రైతాంగం సతమతమవుతోంది. దీనికంతటికీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో చోటు చేసుకున్న రాజకీయాలే కారణం. డీసీసీబీ చైర్మన్ సీటు కోసం అధికార టీఆర్‌ఎస్ నేతల మధ్య జరుగుతున్న దోబూచులాట రైతుల పాలిట శాపంగా మారింది.
పాలకవర్గం సమావేశం కాకుండా, బోర్డు నిర్ణయం తీసుకోకుండా ఏమీ చేయలేని అశక్తతలో డీసీసీబీ అధికారులు ఉన్నారు. గడిచిన మూడేళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం నానుతున్నా, దీనికో పరిష్కారం చూపెట్టే ప్రయత్నాన్ని అధికార పార్టీ నేతలు చేయడం లేదు. వ్యవసాయ సీజన్‌లో రైతులకు సేవలు అందించాల్సిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలపై (పీఏసీఎస్) డీసీసీబీ రాజకీయాల ప్రభావం పడింది. దీంతో ఈ సంఘాల్లోనూ రైతులకు ఎలాంటి రుణాలూ లభించడం లేదు. ఫలితంగా సహకార సంఘాలు, సహకార బ్యాంకులను వదిలేసి పూర్తిగా ఇతర బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది.
అసలేం జరిగింది...?
ఐదేళ్ల కిందట జరిగిన సహకార ఎన్నికల్లో అత్యధిక సింగిల్ విండోలను గెలుచుకున్న కాంగ్రెస్ సహజంగానే డీసీసీబీని కూడా దక్కించుకుంది. యడవెల్లి విజయేందర్‌రెడ్డి చైర్మన్‌గా కొలువు దీరిన డీసీసీబీ పాలకవర్గం రెండున్నరేళ్లపాటు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలతో చైర్మన్‌గా రెండున్నరేళ్లు పనిచేసిన విజయేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటిదాకా వైస్ చైర్మన్‌గా ఉండిన పాండురంగారావును చైర్మన్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ, డీసీసీబీ పాలకవర్గంలో డైరెక్టర్‌గా ఉన్న పిల్లలమర్రి శ్రీనివాస్ పోటీ చేయడంతో తిరిగి ఎన్నిక అనివార్యమై రెండు ఓట్ల తేడాతో పాండురంగారావు చైర్మన్‌గా ఎన్నిక కావడం, కాంగ్రెస్ నుంచి గెలిచిన డైరెక్టర్లంతా టీఆర్‌ఎస్‌లో చేరడం చకచకా జరిగిపోయాయి.
ఈలోగా పాండురంగారవు సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న కాపుగల్లు సొసైటీలో అక్రమాలు జరిగాయని రుజువు కావడంతో ఆ పాలక మండలిని రద్దు చేశారు. దీంతో డీసీసీబీ చైర్మన్‌గా కూడా ఆయన అర్హత కోల్పోయారు. ఆ సమయానికి వైస్ చైర్మన్‌గా ఎవరూ లేకపోవడం, పాండురంగారవు సహకార కమిషన్ నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని చైర్మన్‌గా కొనసాగారు. కానీ, హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టి వేసింది. ఈలోగా ఈ ఏడాది మార్చిలో సహకార సంఘాల కాలపరిమితి ముగిసిపోయింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరునెలల పాటు సంఘాల కాలపరమితిని పొడిగించింది. అయితే.. కోర్టు ఉత్తర్వులతో పాండురంగారావు చైర్మన్‌గా కొనసాగే పరిస్థితి లేకపోవడం, కాలపరిమితిని పొడిగించిన కారణంగా స్పెషల్ ఆఫీసర్‌ను నియమించే అవకాశం లేకపోవడంతో నల్లగొండ డీసీసీబీ వ్యవహారాలు కుంటుపడ్డాయి.
కొత్త చైర్మన్‌కు అవకాశమే లేదు !
మరోవైపు ఉన్న డైరెక్టర్లలోనే ఒకరిని చైర్మన్‌గా నియమించాలన్న డిమాండ్ ఉంది. రెండు ఓట్లతో ఓడిపోయిన తనకు అవకాశం ఇవ్వాలని పిల్లలమర్రి శ్రీనివాస్ అధికార టీఆర్‌ఎస్ నేతలను కోరారు. కానీ, పదవీకాలం పూర్తయి, పొడిగింపు కాలంలో ఉన్న సంస్థకు కొత్త వారిని నియమించే అవకాశం లేదన్నది సహకారశాఖ అధికారుల వివరణ. మరోవైపు చైర్మన్‌పై అనర్హత వేటు పడినందున, బోర్డు మీటింగులూ లేవు. ఈ కారణంగా ఎలాంటి తీర్మానాలూ లేవు. ఫలితంగా ఇప్పటిదాకా ఎలాంటి రుణ ప్రణాళికను ఖరారు చేయలేదు.
చేతులెత్తేసిన సొసైటీలు, బ్రాంచ్‌లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 121 సహకార సొసైటీలు, 21 డీసీసీబీ బ్రాంచులు రైతులకు సేవలు అందించడంలో పూర్తిగా చేతులు ఎత్తేశాయి. ప్రభుత్వం ప్రస్తుతం 6నెలలపాటు సొసైటీ పదవీ కాలాన్ని పొడిగించినా, మరో ఏడాదిపాటు ఇదే పొడిగింపు పరంపర కొనసాగే అవకాశం ఉందని, ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాల్లేవని అంటున్నారు. దీంతో నల్లగొండ డీసీసీబీ పేరుకే మినహా రైతులకు ఏమాత్రం ఉపయోగ పడేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment