DCCB
-
రైతుల ‘వేలం’వర్రీ!
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పెంపకం కోసమో, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, ఇతరత్రా అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ బకాయిలను రాబట్టుకుంటున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు).. నిస్సహాయ పరిస్థితుల్లో రుణాలు చెల్లించని వారి భూములు, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలానా రోజు ఫలానా రైతు భూమిని వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తుండటంతో పరువు పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉన్నా మొత్తం భూమిని డీసీసీబీలు వేలం వేస్తుండటంతో తమకు భూమి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయంలోనే కఠిన వైఖరి? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని పరిధిలో జిల్లా స్థాయిలో డీసీసీబీలు ఉంటాయి. వాటి కింద ప్యాక్స్ పని చేస్తుంటాయి. ఇవి ప్రధానంగా రైతుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీటి చైర్మన్లను, డైరెక్టర్లను రైతులే ఎన్నుకుంటారు. డీసీసీబీల చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ బ్యాంకులు రైతులకు అవసరమైన పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే డీసీసీబీలు ప్రతి ఏటా వేలాది కోట్లు రైతులకు రుణాలు అందిస్తుంటాయి. రైతులతోపాటు ఇతరులకు కూడా గృహ, విద్య రుణాలు కూడా ఇస్తుంటాయి. రైతులకైతే ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనేందుకు, భూములను చదును చేసుకునేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, గొర్రెల పెంపకం తదితరాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంటారు. అయితే పలుకుబడి కలిగి కోట్ల రూపాయలు తీసుకునే వారిపై, రాజకీయ నాయకుల విషయంలో మెతక వైఖరి అవలంభించే డీసీసీబీలు రైతుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల విషయంలో కోట్లు రికవరీ చేయలేక నష్టాలను చవిచూస్తున్న అనేక సహకార సంఘాలు, రైతులను మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎలాగోలా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. భూములను వేలం వేస్తున్నాయి. వేలం పాటలో ఆయా గ్రామాల ఇతర రైతులు ఎవరూ పాల్గొనకపోతే డీసీసీబీలే స్వాదీనం చేసుకుంటున్నాయి. మరోవైపు చెల్లించాల్సిన రుణం కంటే ఎక్కువ విలువున్న భూములను వేలం వేయడంపై రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా వచ్చే డబ్బును రైతులకే ఇస్తున్నామని అధికారులు అంటున్నా, కొద్దిపాటి భూమిని కూడా తమకు ఉంచడం లేదని రైతులు అంటున్నారు. అప్పుకు మించి భూమిని అమ్మే హక్కు సహకార బ్యాంకులకు ఎక్కడ ఉందని నిలదీస్తున్నారు. మరీ విచిత్రంగా కేవలం రూ.50 వేల రుణం ఉన్న రైతుల ఆస్తులను కూడా వేలం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 202 మందికి నోటీసులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో 78 ప్యాక్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 22 డీసీసీబీ బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది (2023–24) పంట రుణాల కింద 62 వేల మంది రైతులకు రూ. 672 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద 1,100 మందికి రూ.70 కోట్లు, గృహ రుణాల కింద 200 మందికి రూ.18 కోట్లు, విద్యా రుణాల కింద 180 మందికి రూ.14 కోట్లు అందజేశాయి. ఇందులో దీర్ఘకాలిక రుణాలు పెండింగ్‌లో ఉన్న 202 మందికి బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు జారీ చేసి రూ.8 కోట్లు రికవరీ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతుల భూములు, ఆస్తులను కూడా వేలం వేయడం గమనార్హం. నిజామాబాద్‌లో 71 మందికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీలో ఇళ్లు, వ్యవసాయ భూములు, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెట్టి కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 71 మందికి డీసీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా అప్పులు చెల్లించని రైతుల ఆస్తులను వేలం వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో డీసీసీబీలు పంట రుణాలు ఇస్తాయి. గడిచిన వానాకాలంలో రూ.469.82 కోట్లు, యాసంగి సీజన్లో రూ.126.68 కోట్లు పంట రుణాలుగా ఇచ్చాయి. అలాగే రూ. 236.38 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. రైతులు రుణాలు చెల్లించకుంటే ఆస్తులను వేలం వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. డీసీసీబీలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయి రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు, పేరుకు పోయిన ఇతరత్రా రుణాలను రికవరీ చేయాల్సిన బాధ్యత డీసీసీబీలపై ఉంటుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం అవి పనిచేయాలి. రైతులు తమ భూములు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులను తనఖా పెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. అయితే ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే క్రమంలో రైతులకు నోటీసులు ఇస్తున్నారు. పలు జిల్లాల్లో భూములు, ఇతర ఆస్తులు వేలం వేస్తున్నారు. నిబంధనల ప్రకారమే డీసీసీబీలు వ్యవహరిస్తున్నాయి. – నేతి మురళీధర్‌రావు, ఎండీ, టెస్కాబ్ – నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గాను గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017 డిసెంబర్లో తనకున్న 2.30 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.7.20 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. మూడు కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9.68 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉండగా.. రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. – జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) పరిధిలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి తండ్రి సంజీవరెడ్డి కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్ కోసం మూడెకరాలు తాకట్టు పెట్టి రూ.1,66,000 రుణం తీసుకున్నాడు. మూడేళ్ల అనంతరం లోన్ సరిగా చెల్లించడంలేదని ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. దీంతో చంద్రకాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా కేసు నడుస్తోంది. ఇలావుండగా పొలం వేస్తున్నామంటూ ఇటీవల ప్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో చంద్రకాంత్ తమ ట్రాక్టర్ సీజ్ చేశారని, పొలం ఎలా వేలం వేస్తారని నిలదీసినా ఫలితం లేకపోయింది. ఎకరం రూ.12.10 లక్షల చొప్పున మరో రైతుకు విక్రయించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లో ఉన్న మొత్తం 4.12 ఎకరాలు రెడ్‌మార్క్‌లో పెట్టడంతో రైతు లబోదిబోమంటున్నారు. -
‘సహకార రంగ’ సంస్కరణల్లో ఏపీదే అగ్రస్థానం
(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి) : ‘సహకార రంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. సహకార రంగం బలోపేతానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు ప్రశంసనీయం. ఈ రంంగంలో అంతర్జాతీయంగా భారత్ ఎంత బలంగా ఉందో.. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతే బలంగా ఉంది. రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్)తో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు) చాలా బాగా పనిచేస్తున్నాయి. రికార్డుస్థాయి వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. 36 ఏళ్ల తర్వాత కర్నూలు, 28 ఏళ్ల తర్వాత కడప డీసీసీబీలు లాభాల బాట పట్టాయంటే ఆషామాషీ కాదు. ప్యాక్స్‌ను కూడా లాభాల్లోకి తేవాలి’ అని జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్స్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ సహకార బ్యాంకింగ్ సమాఖ్య (ఐసీఏ) సభ్యుడు భీమా సుబ్రహ్మణ్యం చెప్పారు. ఐసీఏ సభ్యునిగా ఎన్నికై తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. డీసీసీబీలకూ షెడ్యూల్ హోదా వచ్చేలా కృషి రాష్ట్రాల సహకార బ్యాంకుల (అపెక్స్ బ్యాంకు)ను ఒకే గొడుగు కిందకు తేవాలన్న సంకల్పంతో నాఫ్స్కాబ్ ఏర్పాటైంది. ఇది అపెక్స్ బ్యాంకులకు – ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. రైతులకు అనుకూలంగా పాలసీల రూపకల్పనలో కృషి చేస్తుంది. దేశంలోని 351 డీసీసీబీల్లో 348 డీసీసీబీలకు ఆర్బీఐ లైసెన్సులిచ్చేలా కృషి చేశాం. నాఫ్స్కాబ్ కృషి వల్లే దేశంలోని 34 అపెక్స్ బ్యాంకుల్లో 24 షెడ్యూల్ హోదా పొందాయి. డీసీసీబీలకు కూడా షెడ్యూల్ హోదా కలి్పంచేలా పాలసీ తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. నాఫ్స్కాబ్లో అపెక్స్ బ్యాంకులతో పాటు డీసీసీబీలకు కూడా సభ్యత్వం ఇవ్వాలా లేక అసోసియేట్‌గా గుర్తించాలా అనే విషయంపై సెపె్టంబర్లో నిర్ణయం తీసుకుంటాం. రీ ఫైనాన్స్ 80 శాతానికి పెంచాల్సిందే సహకార స్ఫూర్తితో ఏర్పాటైన బ్యాంకులు లాభాపేక్షతో పనిచేయడం సరికాదు. నాబార్డు 80 శాతం రీఫైనాన్స్ చేస్తేనే అపెక్స్ బ్యాంకులు డీసీసీబీలకు, వాటి పరిధిలోని ప్యాక్స్‌కు ఆ స్థాయిలో రీఫైనాన్స్ చేస్తాయి. నాబార్డు రీఫైనాన్స్‌ను 50 శాతం నుంచి 80 శాతానికి పెంచేలా నాఫ్స్కాబ్ కృషి చేస్తోంది. నష్టాల్లో ఉన్న ప్యాక్స్లకు ఆ ర్థిక సాయం చేయాల్సిన బాధ్యత అపెక్స్ బ్యాంకులదే. ఈ రంగంలో రెండంచెల వ్యవస్థ కంటే మూడంచెల వ్యవస్థ చాలా మంచిది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎ‹ఫ్పీవో)ను ప్రోత్సహించడం మంచిదే కానీ, సహకార చట్టం ప్రకారం వాటికి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేయాలి. భారత్ సహకార వ్యవస్థ బలంగా ఉంది భారత్‌లో సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంది. సుమారు 15 కోట్ల మంది భాగస్వాములైన వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. అయితే, దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారు. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధం. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన పాలక మండళ్ల ద్వారా పాలన సాగిస్తే సహకార వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆర్బీకేలతో అనుసంధానం మంచి ఆలోచనే దేశంలో ఏపీ, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయి. మంచి వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. ఏపీలో మంచి పురోగతి కన్పిస్తోంది. దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్న బ్యాంకులు లాభాల బాట పట్టాయంటే దాని వెనుక ఎంతో కృషి ఉంది. ఆర్బీకేలతో పీఏసీఎస్‌లను అనుసంధానించడం మంచి ఆలోచనే. దీనివల్ల గ్రామ స్థాయిలో రైతులకు మరింత మంచి జరుగుతుంది. -
డీసీసీబీల్లో కామన్ క్యాడర్ బదిలీలు
సాక్షి, అమరావతి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న జనరల్ మేనేజర్(జీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్(డీజీఎం) స్థాయి అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఎక్కడి బ్యాంకులో విధుల్లో చేరితే ఆ బ్యాంకులోనే పదోన్నతులు పొందడమే కాదు.. పదవీ విరమణ వరకు కొనసాగేవారు. దశాబ్దాలుగా ఒకే బ్యాంకులో పాతుకుపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఘటనలున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ డీసీసీబీల్లో కామన్ క్యాడర్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సహకార చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసింది. 2, 3 స్థాయిల్లో పనిచేసే అధికారుల(జీఎం, డీజీఏం)ను కామన్ క్యాడర్ కిందకు తీసుకొచ్చారు. జోనల్ పరిధిలో సీనియారిటీ ప్రాతిపదికన ప్రతి మూడేళ్లకోసారి బదిలీ చేయబోతున్నారు. నైపుణ్యం, పనితీరు ఆధారంగా ఈ బదిలీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 డీసీసీబీ బ్యాంకుల పరిధిలో జీఏం పోస్టులు 24, డీజీఏం పోస్టులు 47 ఉండగా.. ప్రస్తుతం 22 మంది జీఎం, 43 మంది డీజీఏంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరికి తొలుత బదిలీలు ఆ తర్వాత పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం మార్గదర్శకాల రూపకల్పన బాధ్యతను ఆప్కాబ్‌కు అప్పగించారు. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలు రూపొందించి ఆ వెంటనే బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉగాదికల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. సహకార బ్యాంకుల ప్రక్షాళనే లక్ష్యం సహకార బ్యాంకులను ప్రక్షాళన చేయడం.. వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఏళ్ల తరబడి ఒకేచోట ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి స్థానచలనం కల్పించాలని నిర్ణయించాం. ఇందుకు అనుగుణంగానే చట్టాన్ని సవరించాం. కోర్టుల్లో అడ్డంకులు తొలిగిపోగానే హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేస్తాం. – కాకాణి గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
కోట్ల కుంభకోణం: టీడీపీ నేత వరుపుల పరారీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ/ప్రత్తిపాడు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ను కొల్లగొట్టిన అప్పటి డీసీసీబీ చైర్మన్, ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్తిపాడులో రాజా ఇంటివద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకపక్క పోలీసులు, మరోపక్క టీడీపీ శ్రేణులు మోహరించారు. అయితే, రాత్రి 8.30 గంటల సమయంలో తాము రాజా ఇంటిలోకి ప్రవేశించే ముందు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అదే సమయంలో రాజా పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. రాజా చైర్మన్‌గా ఉన్న సమయంలో బినామీ పేర్లతో డీసీసీబీ బ్రాంచిలు, పలు సహకార సంఘాల నుంచి కోట్లు రుణాలు స్వాహా చేశారని సహకార చట్టం 51 ప్రకారం జరిపిన విచారణలో ప్రాథమికంగా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఈ కుంభకోణం నిగ్గు తేల్చేందుకు కేసును సీఐడీకి అప్పగించింది. మరోపక్క ప్రత్తిపాడు డీసీసీబీ బ్రాంచి పరిధిలోని ధర్మవరం సొసైటీలో రైతుల క్రాప్ ఇన్సూ్యరెన్స్ నిధులు సుమారు రూ.45 లక్షలు గోల్మాల్ అయ్యాయంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో కొంతకాలంగా రాజా తప్పించుకు తిరుగుతున్నారు. రాజా ఇంటిలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో శుక్రవారం సీఐడీ ఏఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు ప్రత్తిపాడులోని రాజా ఇంటికి వెళ్లారు. ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు రాజా ఇంటి వద్దకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ, తుని టీడీపీ ఇన్చార్జి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు రాజా తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ వాదించారు. గతంలో ఉన్న డీసీసీబీ పెండింగ్ కేసుల్లో నోటీసు ఇచ్చినా తప్పించుకు తిరుగుతుండటం వల్లే నేరుగా అరెస్టుకు వచ్చామని సీఐడీ పోలీసులు చెప్పినా వినలేదు. అరెస్టు చేయడానికి వీల్లేదంటూ గొడవ చేశారు. తలుపులు వేసుకుని ఇంటిలో ఉన్న రాజాను బయటకు తీసుకువచ్చేందుకు సీఐడీ డీఎస్పీలు రామకృష్ణ, జి.రమేష్‌బాబు, సీఐలు ప్రయత్నించారు. లొంగిపోవాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇంతలో టీడీపీ నేతలు బయట పోలీసులతో సంప్రదింపులంటూ హైడ్రామా నిర్వహించారు. 8.30 గంటల సమయంలో రాజా ఇంటిలోకి సీఐడీ పోలీసులు ప్రవేశించారు. మహిళా పోలీసులు ఇంటిలో ఉన్న రాజా తల్లి వరుపుల సత్యవతి, మేనకోడలు కొమ్ముల వాణిని ప్రశ్నించారు. గదులు అన్నింటినీ వెతికి ఇంటిలో రాజా లేకపోవడంతో పోలీసులు బయటకు వచ్చేశారు. అంతకంటే ముందుగా మూడు నిమిషాలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఇంటి బయట టీడీపీ నేతలు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలోనే రాజా తమ కళ్లుగప్పి పరారైనట్టుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. రాజా పరారైన విషయాన్ని సీఐడీ రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ గోపాలకృష్ణ ధృవీకరించారు. -
సహకార రంగం పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ మేరకు సహకార రంగాన్ని అవినీతికి తావులేకుండా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కొత్తగా తెచ్చిన హెచ్ఆర్ పాలసీకి అనుగుణంగా ఐదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరినీ త్వరలో బదిలీ చేయనున్నట్లు తెలిపారు. క్యాడర్ వారీగా ఉద్యోగుల జీతభత్యాలను సరిచేస్తున్నట్లు వివరించారు. మండలానికో సహకార బ్యాంక్ ఏర్పాటు చేసి రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆర్బీకేల స్థాయిలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలను వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. రికార్డుల ట్యాంపరింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు పీఏసీఎస్ స్థాయిలో కంప్యూటరైజేషన్ చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని ఓ çహోటల్లో బుధవారం డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల పునశ్చరణ సదస్సుకు కన్నబాబు హాజరై మాట్లాడారు. గత పాలకులు సహకార చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పీఏసీఎస్‌లు, సహకార బ్యాంకులను జేబు సంస్థలుగా మార్చుకొని అడ్డగోలుగా దోచుకు తిన్నారని చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లతో కాజేసిందంతా కక్కిస్తామని, ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. హోదా రాజకీయ పదవి కాదు బ్యాంకులకు నష్టం చేకూర్చేవారిని ఉపేక్షించొద్దని ఇటీవల ఎస్ఎల్బీసీ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. కొత్తగా నియమితులైన చైర్మన్లు తమ హోదాను రాజకీయ పదవిగా భావించవద్దని సూచించారు. ఆడిటింగ్ వ్యవస్థను పటిష్టం చేసి అక్రమాలు వెలుగు చూసిన బ్యాంకుల పరిధిలో ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. ఈసారి పాలక మండళ్లల్లో సహకార రంగ నిపుణులను డైరెక్టర్లుగా నియమించేలా చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. డీసీసీబీ–డీసీఎంఎస్‌ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ డీసీసీబీలు, డీసీఎంఎస్‌లపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా ప్రక్షాళనకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. నాడు–నేడు పథకం కింద వీటి అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా పంట రుణాలివ్వాలని సూచించారు. సదస్సులో ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి, మార్క్‌ఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, ఆర్సీఎస్ కమిషనర్ అహ్మద్‌బాబు, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
'సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది'
సాక్షి, అమరావతి: సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం డీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో చేపట్టిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సహకార వ్యవస్థని పూర్తిగా అవినీతిమయం చేసిందని విమర్శించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల తప్పుడు పత్రాలతో కోట్లాది రూపాయిలు దిగమింగేశారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు చోట్లా కుంభకోణాలని వెలికి తీసామన్నారు. బ్యాంకులని నష్టపరిచే చర్యలని ఏ మాత్రం ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులని రాజకీయ పదవులగా చూడొద్దని, బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్ల పాత్ర కీలకమని తెలిపారు. రైతుకి అప్పుకావాలంటే కోఆపరేటివ్ బ్యాంకులే గుర్తుకు వచ్చేలా పనితీరు ఉండాలని అధికారులకు సూచించారు. అయిదేళ్లుగా ఒకే బ్రాంచ్‌లో పనిచేస్తున్న మేనేజర్లని తప్పనిసరిగా బదిలీ చేయాలని, రుణాల మంజూరులో చేతివాటానికి పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సొసైటీ బైఫరికేషన్ త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. చదవండి: వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు ఇప్పుడు రైతులు గుర్తుకు వచ్చారా? -
సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తాం: మంత్రి కన్నబాబు
సాక్షి, తూర్పుగోదావరి: సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా100 డీసీసీబీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులతో పాటుగా డ్వాక్రా సంఘాలకు సహకార రంగం ద్వారా ఋణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారని, ఆయన వారసునిగా పోలవరం పూర్తి చేయడానికి సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వచ్చినా రాకపోయిన పర్వాలేదు.. కాంట్రాక్టులు తమకు వస్తే చాలన్న విధంగా ఆప్పుడు చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. -
మరో 332 మండలాల్లో డీసీసీబీ శాఖల ఏర్పాటు
సాక్షి, అమరావతి: మారుమూల గ్రామాలకు చెందిన రైతులకు సైతం ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో మండలానికో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖమంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం 343 మండలాల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచ్‌లున్నాయని, మరో 332 మండలాల్లో బ్రాంచ్‌ల్లేవని, ఆయా మండలాల్లో రానున్న మూడేళ్లలో కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మండలాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. డీసీసీబీ శాఖల విస్తరణ, ఇతర అంశాలపై ఆప్కాబ్‌ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో సమీక్ష జరిపారు. డీసీసీబీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలతో పాటు కౌలు రైతులకు అధికంగా రుణాలు ఇచ్చే విషయంలో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. దీని వల్ల ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో 675 మండలాలుండగా, వాటి పరిధిలో 416 బ్రాంచ్‌లున్నాయని తెలిపారు. వాటిలో 73 బ్రాంచ్‌లు పట్టణాలు, నగరాల్లో ఉన్నాయన్నారు. గడచిన మూడేళ్లలో 21 బ్రాంచ్‌లు కొత్తగా ఏర్పాటు చేయగా, ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 20,చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 4బ్రాంచ్‌లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆప్కాబ్ ద్వారా నాబార్డుకు పంపినట్టు అధికారులు వివరించగా, సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని మంత్రి సూచించారు. -
పీఏసీఎస్‌లకు 'ఆర్థిక' దన్ను
సాక్షి, అమరావతి: సాగులోనే కాదు వ్యక్తిగత అవసరాల్లో కూడా అన్నదాతలకు బాసటగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్, సొసైటీ)ను బహుళ సేవా కేంద్రాలు (మల్టీ సర్వీసెస్ సెంటర్స్)గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. వాటిలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి సొసైటీని ‘వన్ స్టాప్ షాపు’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నాబార్డు చేయూతతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో పనిచేసే 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ల పరిధిలో 1,992 పీఏసీఎస్‌లు అన్నదాతలకు సేవలందిస్తున్నాయి. వీటిని వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.1,584.61 కోట్లతో.. వ్యవసాయ సదుపాయాల నిధి కింద రూ.1,584.61 కోట్ల నాబార్డు రుణంతో పీఏసీఎస్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రతి సొసైటీకి కనీసం రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు నాబార్డు నుంచి రుణంగా అందించేలా చర్యలు చేపట్టింది. ఈ రుణంలో 10 శాతం పీఏసీఎస్‌లు భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని 4 శాతం వడ్డీపై నాబార్డు అందిస్తుంది. గడువులోగా రుణాల్ని చెల్లిస్తే ఇంట్రస్ట్ సబ్వెన్షన్ కింద వడ్డీలో 3 శాతం సబ్సిడీ రూపంలో సొసైటీలకు తిరిగి ఇస్తారు. ఈ లెక్కన ఒక్క శాతం వడ్డీకే పీఏసీఎస్‌లకు రుణాలు అందుతాయి. తొలి దశలో రూ.659.48 కోట్లతో 1,282 పీఏసీఎస్‌ల్లోను, రెండో దశలో రూ.925.13 కోట్లతో 710 పీఏసీఎస్‌ల్లోను మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తొలివిడత పనులను 2021–22 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సొసైటీల్లో కల్పించే మౌలిక సదుపాయాలివే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల కింద ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు, గిడ్డంగులు, ప్యాకింగ్ హౌస్‌లు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్స్, లాజిస్టిక్ సౌకర్యాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, రైపెనింగ్ (మగ్గించే) చాంబర్స్, కమ్యూనిటీ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కింద సేంద్రియ ఉత్పత్తులు, బయో స్టిమ్యులెంట్ ప్రొడక్షన్ యూనిట్లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇక సభ్యుల అవసరాలను బట్టి అద్దె ప్రాతిపదికన అందించే లక్ష్యంతో అధునాతన వ్యవసాయ పరికరాలతో వ్యవసాయ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల అంచనా వ్యయంతో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, రూ.కోటి నుంచి రూ.2.50 కోట్ల వరకు హైటెక్, హై వేల్యూ ఫార్మ్ పరికరాలతో హబ్‌లు ఏర్పాటు చేస్తారు. వీటి కోసం ఇచ్చే రుణాలపై 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ద్వారా నాబార్డుకు పంపించామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. -
వేట మొదలైంది... వేటు పడింది..
అన్నదాతలకు మేలు చేసే సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను.. సకుటుంబ సపరి‘వాటం’గా దోచుకున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు డీసీసీబీ పాలకవర్గం కొరడా ఝళిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సొసైటీలకు అణువణువునా పట్టిన అవినీతి చీడను వదిలిస్తోంది. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణంలో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: గత టీడీపీ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(సొసైటీలు) నిధులను కొంతమంది అక్రమార్కులు పీల్చి పిప్పి చేశారు. బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు కొట్టేసి, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి, రైతులను నిలువునా ముంచేశారు. డీసీసీబీతో పాటు సొసైటీల్లో కూడా ‘పచ్చ’నేతలు సొసైటీ ప్రెసిడెంట్ల ముసుగులో తిష్ట వేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ అవినీతి బాగోతాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పాలకవర్గం ఆ అవినీతిపరుల భరతం పడుతోంది. రైతులకు చెందాల్సిన సొమ్మును యథేచ్ఛగా దోచుకున్న వారితో కుమ్మక్కయిన అధికారులపై వేటు మీద వేటు వేస్తోంది. టీడీపీ హయాంలో గండేపల్లి సొసైటీలో అప్పటి ప్రెసిడెంట్ తన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు తయారు చేసి రూ.23 కోట్లు కాజేసిన విషయాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో బయట పెట్టింది. గత సెప్టెంబర్ 24న ‘‘ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లు పైమాటే’’, అక్టోబరు 6న ‘‘సకుటుంబ సపరి‘వాట’ంగా’’, నవంబరు 3న ‘‘రాబంధువుల లెక్కల చప్పుడు’’ శీర్షికలతో గండేపల్లి సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని బట్టబయలు చేసింది. వీటిపై స్పందించిన డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ డీసీ సీబీ డీజీఎంలు కె.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీధర్‌చౌదరి ఆధ్వర్యాన రెండు నెలల పాటు విచారణ చేసి, జరిగిన అవినీ తి నిగ్గు తేల్చారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తున కు సహకార రంగంలో కీలక మైన 51 విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంలో ప్రాథమికంగా బాధ్యులుగా తేలిన గండేపల్లి సొసై టీ ప్రస్తుత మేనేజర్ ఆర్.శ్యామల, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం కొత్తపేటలో పని చేస్తున్న మేనేజర్ హెచ్ ఎస్ గణపతిలపై అనంతబాబు ఆదేశాల మేరకు డీసీసీ బీ సీఈఓ ప్రవీణ్‌కుమార్ స స్పెన్షన్ వేటు వేశారు. వీరితో పాటు విచారణలో బాధ్యులు గా గుర్తించిన డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ డీవీ సూర్యం, లీగల్ అధికారులు త్రినాథ్, ఎ.శ్రీనివాసరావుతో పాటు రిటైరైన మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ఆ సొసైటీతో పాటు, డీసీసీబీ బ్రాంచిలో పని చేస్తున్న వారి పాత్ర ఏమేరకు ఉందో నిగ్గు తేల్చే పనిలో డీసీసీబీ వర్గాలున్నాయి. చదవండి: (దేవుళ్లకే శఠగోపం!) రికవరీ సవాలే.. ఈ అవినీతి బాగోతానికి తెర వెనుక సహకరించిన వారిపై వేటు వేసిన డీసీసీబీ.. చంద్రబాబు హయాంలో రూ.23 కోట్లు దారి మళ్లించిన సొసైటీ అధ్యక్షుడు పరిమి బాబు సహా ఇతరుల నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంది. ఈ పని డీసీసీబీకి పెద్ద సవాల్ కానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గండేపల్లి సొసైటీలో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఇచ్చిన రుణాల్లో సుమారు రూ.23 కోట్లను అధ్యక్షుడు, తన బంధువర్గం పేరిట మంజూరు చేసుకుని దారి మళ్లించేశారు. సొసైటీలో 155 మంది పేర్లతో రూ.22.83 కోట్ల రుణాలు మంజూరైతే సింహభాగం అప్పటి సంఘం అధ్యక్షుడి కుటుంబ సభ్యులు, సంఘం సీఈఓ, సిబ్బంది ఖాతాలకు జమ అవడాన్ని ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ అనంతబాబు తీవ్రంగా పరిగణించారు. విచారణను నీరుగార్చి, అవినీతిపరులను కాపాడేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను కూడా చైర్మన్ తిప్పికొట్టారు. చదవండి: (టీడీపీ హయాంలో విచ్చలవిడి అవినీతి) చంద్రబాబు హయాంలో నొక్కేసిన కోట్లాది రూపాయలు తిరిగి రాబట్టేందుకు డీసీసీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అప్పట్లో సొసైటీ అధ్యక్షుడిగా పని చేసిన పరిమి సత్యనారాయణ (బాబు) రూ.7.13 కోట్లు, ఆయన భార్య వెంకట సత్య మంగతాయారు రూ.1.08 కోట్లు, ఆయన బంధువు పి.కృష్ణ శ్రీనివాస్ రూ.6.76 కోట్లు, సీఈ ఓ పి.సత్యనారాయణ రూ.53.92 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ జి.సత్యనారాయణ రూ.7.85 లక్షలు, సబ్ స్టాఫ్ వెంకటలక్ష్మి రూ.2 లక్షలు, పరిమి బాబు కారు డ్రైవర్ సత్యనారాయణ రూ.4 లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీహరి రూ.4 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ కనకరాజు రూ.5.90 లక్షలు, డ్రైవర్ భార్య పేరిట రూ.2 లక్షలు బదిలీ చేసినట్టు ఈ కుంభకోణంపై విచారణ చేస్తున్న అధికారులు లెక్క తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా సోమన కిశోర్‌బాబుకు రూ.44.54 లక్షలు, చల్లాప్రగడ సత్య నాగ భాస్కర్ శ్రీనివాసరావుకు రూ.43 లక్షలు, మదడ శ్రీనివాసుకు రూ.42.09 లక్షలు ఇచ్చినట్టు తేల్చారు. వారి నుంచి ఈ సొమ్మును ఎలాగైనా రికవరీ చేయాలని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనిపై డీసీసీబీ కసరత్తు చేస్తోంది. ఒక కుటుంబం స్వార్థంతో అవినీతికి పాల్పడి గండేపల్లి సొసైటీని నష్టాల్లోకి నెట్టేసింది. దీంతో ఆ సొసైటీ పరిధిలోని రైతులకు రుణాలు అందకుండా పోయాయి. ఇప్పుడు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నా సొసైటీలో అవకాశం లేకుండా చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎప్పటికి రాబడతారోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరినీ విడిచిపెట్టేది లేదు సహకార వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు ఎంతటి వారై నా విడిచిపెట్టేది లేదు. వారు ఏ పార్టీలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే లేదు. గండేపల్లి సొసైటీలో బినామీ పేర్లతో కోట్ల రూపాయలు స్వాహా చేసి, రైతులను తీవ్రంగా దెబ్బ తీసిన ప్రెసిడెంట్ పరిమి బాబు నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టేందుకు ఉన్న ఏ మార్గాన్నీ డీసీసీబీ విడిచిపెట్టదు. టీడీపీ హయాంలోని సొసైటీ పాలకవర్గాల్లో వ్యక్తిగత స్వార్థం కోసం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసిన వారందరి జాతకాలూ బయట పెడతాం. గండేపల్లి సొసైటీలో బయటపడిన రూ.23 కోట్ల కుంభకోణంతో పాటు మిగిలిన సొసైటీల అవినీతి వ్యవహారాలను కూడా సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను. ఈ అవినీతి బాగోతంతో గండేపల్లి సొసైటీ పూర్తిగా నష్టాల్లోకి పోయింది. సొసైటీ పరిధిలోని గండేపల్లి, ఎన్టీ రాజాపురం, రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాల్లోని 934 మంది సభ్యులకు రుణాలివ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. కొత్త సభ్యులను చేర్చుకున్నా వారికి కూడా రుణాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. – అనంత ఉదయభాస్కర్, డీసీసీబీ చైర్మన్ -
జాతీయ స్థాయిలో ‘ఆప్కాబ్’కు ప్రథమ స్థానం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రుణాల మంజూరు, వసూళ్లతోపాటు వివిధ అంశాల్లో మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతోందని, రైతులు, వివిధ వర్గాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్కాబ్) పేర్కొంది. 2018–19 సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాల పనితీరును నాఫ్కాబ్ పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటి వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూనే రుణాల రికవరీ, మంజూరు విషయంలో ఆప్కాబ్ గత రెండేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని, గతేడాది (2017–18) కూడా రెండోస్థానాన్ని దక్కించుకుందని వివరించింది. సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పని చేయడం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా డీసీసీబీ స్థాయిలోనూ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కు ఉత్తమ పనితీరులో ద్వితీయ స్థానం లభించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ పరిధిలోని కొమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సుభాష్ యాదవ్ అవార్డును పొందినట్టు చెప్పారు. ఈ అవార్డులను నాఫ్కాబ్ డిసెంబర్లో ప్రదానం చేస్తుందని చెప్పారు. -
అక్రమాలు చేసి.. ముఖం చాటేశారు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గండేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అవినీతి, అక్రమాలపై విచారణకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార అధికారులు కదిలారు. అక్రమాలకు సంబంధించిన రికార్డులు తారుమారు కాకుండా చూసేందుకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం వారు ప్రయత్నించారు. సొసైటీ సిబ్బంది సహకరించకపోవడంతో చివరకు సొసైటీ భవనాన్ని, అందులో కీలకమైన రికార్డులు ఉన్న బీరువాలను సీజ్ చేశారు. బినామీ పేర్లు, నకిలీ డాక్యుమెంట్లతో గండేపల్లి సొసైటీలో కొంతమంది ప్రబుద్ధులు రూ.23 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంపై.. డీసీసీబీలోని ఇద్దరు డిప్యూటీ జనరల్ మేనేజర్లతో చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీని నుంచి ఏదో ఒకలా బయట పడదామనుకుంటున్న సూత్రధారులు విచారణ ముందుకు సాగకుండా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రికార్డులను మాయం చేసే ప్రయత్నాలకు బుధవారమే తెర తీశారు. తొలిగా సొసైటీలో సిబ్బందిని అందుబాటులో లేకుండా చేశారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ సొసైటీలో 156 మంది బినామీ పేర్లు, నకిలీ బాండ్లతో విడుదల చేసిన రుణాల రికార్డుల కోసం విచారణాధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. విచారణ కోసం సొసైటీ కార్యాలయానికి వెళ్లేసరికి సిబ్బంది ముఖం చాటేయడంతో వారు అవాక్కయ్యారు. శుక్రవారం సొసైటీ వద్దకు వెళ్లగా రికార్డులు, కార్యాలయంలోని బీరువాల తాళాలు కూడా అందుబాటులో లేవనే సమాధానం వారికి ఎదురైంది. తద్వారా విచారణను అడ్డుకునేందుకు అక్రమార్కులు ఎత్తు వేశారు. సొసైటీలోని బీరువాల్లో ఉన్న రికార్డులను మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోందని స్థానికులు డీసీసీబీ అధికారులకు ఉప్పందించారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన డీసీసీబీ అధికారులు అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. విచారణ ముందుకు సాగాలంటే రికార్డులు తారుమారు కాకుండా చూడాలని, ప్రధాన ఆధారాలుగా భావిస్తున్న 156 మంది రైతుల పేర్లతో నమోదై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసే వరకూ సొసైటీలోని రికార్డులను భద్రంగా ఉంచాల ని జిల్లా సహకార అధికారి పాండురంగారావును డీసీసీబీ చైర్మన్ అనంతబా బు కోరారు. జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు పెద్దాపురం, ప్రత్తిపా డు సబ్ డివిజన్ల సహకార అధికారులు బీఎన్ శివకుమార్, శివకామేశ్వరరావు లు గండేపల్లి సొసైటీకి వెళ్లారు. సిబ్బందిని రికార్డుల గురించి అడగగా వారు ఇవ్వలేదు. అటెండర్‌కు కరోనా వచ్చినందు వల్ల తాళాలు లేవని చెప్పారు. వారి మాటలను విశ్వసించని అధికారు లు రికార్డులు ఉన్న మూడు బీరువాల తో పాటు, గండేపల్లి సొసైటీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. డీసీసీబీ జారీ చేసిన నోటీసులను సొసైటీ ప్రధాన ద్వారం తలుపులపై అతికించారు. ఈ అక్రమాలపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని డివిజనల్ సహకార ఆఫీసర్ రాధాకృష్ణ తెలిపారు. అక్రమార్కుల నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టే వరకూ విశ్రమించేది లేదన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై సహకార చట్టం ప్ర కారం చర్యలు తప్పవన్నారు. విచారణ ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసుల సాయం కూడా తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లపై మాటే
ఓ సారి అధికారం ఇస్తే పది కాలాలపాటు ప్రజల సేవలో తరించాలనుకోవాలి...ప్రజల మన్ననలు పొందుతూ వారి మదిలో పదిలంగా స్థానం సంపాదించాలని ప్రజాప్రతినిధి తపన పడాలి. కానీ టీడీపీ హయాంలో ప్రజాప్రతినిధులంటే నిధుల స్వాహాకే వచ్చినట్టుగా...అందుకే పదవిని చేపట్టినట్టుగా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఐదేళ్లే కాకుండా రానున్న ఐదేళ్లలో కూడా దోపిడీకి స్కెచ్ వేసుకొని మరీ స్వాహాకు ఉపక్రమించడం మరీ విడ్డూరం. అదృష్టవశాత్తూ వారు అధికారానికి దూరమయ్యారు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే నిలువు దోపిడీ జరిగేది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పచ్చ నేతల ముందు చూపుతో సహకార సంఘాల్లో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. జిల్లాలోని ఏ సహకార సంఘాన్ని కదిలించినా గత టీడీపీ ఏలుబడిలో ఎటు చూసినా అవినీతి కుంభకోణాలు బట్టబయలవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అండాదండా చూసుకుని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమనే ధీమాతో టీడీపీ నేతలు సహకార సంఘాల్లో దొంగలు పడ్డట్టుగా చొరబడి దొరికినంత దోచుకున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు, పంట రుణాలు మాఫీ చేస్తారని ఆ పార్టీ ఏలుబడిలోని సహకార సంఘాల పాలక వర్గాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు గట్టి నమ్మకంతో ఉన్నారు. అతి విశ్వాసంతోనే బినామీ పేర్లతో కోట్లు రుణాలు లాగేశారు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని రుచి చూపించారు. ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు రుణ మాఫీ అమలవుతుందనే గుడ్డి నమ్మకంతో జిల్లాలోని పలు సహకార సంఘాల ప్రతినిధులు నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో రూ.కోట్లకు పడగలెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక ఈ కుంభకోణాలను ఒకటొకటిగా ఛేదిస్తున్నారు. గతం దొంగల దోబూచులాట కొన్ని సంఘాలు, బ్రాంచీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలు బయటకు రాకుండా సంఘాల్లో పనిచేస్తున్న అధికారులు దాచిపెడుతున్నారు. గత పాలకవర్గాల్లో సంఘాలపై పడి నిలువునా దోచుకున్న వారే కావడం గమనార్హం. గత టీడీపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, సీఈఓల హయాంలో డీసీసీబీ, సహకార సంఘాలు కుంభకోణాలమయంగా మారిపోయాయి. ఈ కుంభకోణాల గుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో రట్టు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఇలా ఏజెన్సీలోని మొల్లేరు, మెట్ట ప్రాంతంలో లంపకలోవ, కోనసీమలో వద్దిపర్రు...తదితర సొసైటీలపై పడి రూ.కోట్లు కొట్టేసిన వైనాన్ని సాక్షి’ వెలుగులోకి తేవడం, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటున్నారు. గండేపల్లిలో తాజాగా... ఈ వరుసలోనే తాజాగా మెట్ట ప్రాంతంలోని గండేపల్లి సహకార సంఘం, గండేపల్లి డీసీసీ బ్రాంచీలో రూ.కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 2017 నవంబరు నెల నుంచి గండేపల్లి బ్రాంచి పరిధిలోని గండేపల్లి పీఏసీఎస్‌లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్లు, బినామీ రైతుల పేరుతో స్వాహా బాగోతమిదీ. గండేపల్లి డీసీసీబీ బ్రాంచి సూపర్వైజర్గా నేదూరి వాసుదేవరెడ్డి గతేడాది అక్టోబరు 28న జాయినయ్యారు. 2020 జనవరి 30న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చైర్మన్ ఆదేశాల మేరకు గండేపల్లి సొసైటీ రికార్డులను బ్యాంకులో పరిశీలించేందుకు సూపర్వైజర్ ప్రయత్నించారు. అందుకు సొసైటీ, బ్రాంచిల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ క్రమంలో 2017 నవంబరు 28 నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి రికార్డులు బ్యాంక్‌కు ఇవ్వలేదనే విషయం గుర్తించారు. గండేపల్లి బ్రాంచిలో సైతం రికార్డులను దాచిపెట్టారు. లోతుగా పరిశీలించే క్రమంలో బ్యాంకులో ఉన్న షాడో రిజిస్టర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా కొంత సమాచారాన్ని సూపర్వైజర్ సేకరించడంతో విషయం డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. సూపర్వైజర్ సంతకం లేకుండానే.. సూపర్వైజర్ సంతకం లేకుండా పది మంది సభ్యుల రుణాలు రెన్యువల్ చేసిన వైనం ఆ సందర్భంలోనే బయటపడింది. తన ప్రమేయం లేకుండా రుణాలు రెన్యువల్ చేయడంతో ఇందులో పెద్ద కుంభకోణమే దాగి ఉందనే అనుమానం, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం వెరసి సూపర్వైజర్ డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే రికార్డులు పరిశీలించే సరికి తీగ లాగితే డొంక కదిలినట్టు గండేపల్లి సొసైటీలో కోటి రూపాయల బినామీ రుణాల బాగోతం బయటకు వచ్చిందంటున్నారు. 10 మంది సభ్యుల రుణాలకు సంబంధించి అడ్వాన్సు స్టేట్మెంట్, రికవరీ స్టేట్మెంట్పై సొసైటీ సూపర్వైజర్ సంతకాలు లేకపోవడం గమనార్హం. మేనేజర్ ఒక్క కలం పోటుతో రూ.99,93,000 లక్షలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలను 2020, ఫిబ్రవరి 17న రెన్యువల్ చేయడం విశేషం. మొదట గుర్తించిన పది మంది సభ్యుల బినామీ రుణాలు రెన్యువల్ చేయడంతో మరిన్ని రుణాలు ఇదే రీతిన రెన్యువల్ చేశారని తెలియవచ్చింది. అలా గండేపల్లి సొసైటీలో మొత్తం 156 మంది సభ్యుల పేరుతో బినామీ పాస్‌పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్ పేపర్లతో సుమారు రూ.23 కోట్లు రుణాలు అప్పటి పాలకవర్గం హయాంలో విడుదలయ్యాయి. ఈ 156లో మొత్తం 50 మంది సభ్యుల(బినామీలు) రుణాలను రెన్యువల్ చేయగా, మిగిలిన 106 మంది రెన్యువల్ చేసే క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో బ్రేక్ పడిందంటున్నారు. ఈ నకిలీ పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మెషీన్‌ను గండేపల్లిలో ఏర్పాటు చేశారని, చివరకు బాండు పేపర్లను సబ్ రిజిస్ట్రార్ సీల్‌ను కూడా టేంపరింగ్ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ బినామీ రుణాలకు సంబంధించిన మొత్తం జాబితా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు కూడా చేరినట్టు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా డీసీసీబీ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే కుంభకోణం వెలుగులోకి రానుంది. ఇంకా మా దృష్టికి రాలేదు గండేపల్లి బ్రాంచ్ పరిధిలో రుణాల అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. జిల్లాలో ఏ సొసైటీ, బ్రాంచ్‌లో అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చినా వెంటనే చైర్మన్ అనంతబాబు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ కూడా చేస్తున్నాం. గండేపల్లి సొసైటీ విషయం చైర్మన్‌తో మాట్లాడతాను. – ప్రవీణ్‌కుమార్, డిసీసీబీ ఇన్చార్జ్ సీఈవో -
సాక్షి ఎఫెక్ట్: నిగ్గు తేలిన నిజాలు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్రమార్కులపై వేటు పడింది. సెంటు భూమి లేకపోయినా కమీషన్లకు కక్కుర్తి పడి, నకిలీ డాక్యుమెంట్లతో భూములు సృష్టించి, ఎడాపెడా రుణాల పేరుతో దోచేసిన వారిని ఎట్టకేలకు ఇంటికి సాగనంపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఆత్రేయపురం బ్రాంచి వద్దిపర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో అక్రమ రుణాల బాగోతంపై విచారణ పూర్తయింది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా నిగ్గు తేల్చిన డీసీసీబీ, సహకార ఉద్యోగు లు నలుగురిపై డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ శుక్రవారం వేటు వేశారు. ఉద్యోగంలో ఉన్న వారిని సస్పెండ్ చేయాలని, రిటైరైన సూపర్వైజర్, డీజీఎంల బెనిఫిట్లు నిలుపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో రూ.కోటిన్నర రుణాలు అక్రమ మార్గంలో విడుదల చేసినట్టు నిర్ధారణయింది. ఇందులో బాధ్యుల నుంచి 90 శాతం రికవరీ చేయడం డీసీసీబీకి కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం) ‘అవినీతిలో సహకారం.. రూ.కోటిన్నర మాయం’ శీర్షికన ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనంపై డీసీసీబీ చైర్మన్ స్పందించి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వద్దిపర్రు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గత తెలుగుదేశం ఏలుబడిలో నేతలు, సహకార అధికారులు కుమ్మక్కై బినామీ రైతుల పేర్లతో రూ.కోటిన్నర నొక్కేసిన వైనాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపించాలని డీసీసీబీ సీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు.. ఆగమేఘాల మీద డీసీసీబీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. వెంకటేశ్వరరావు విచారణ ముగించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్ క్రాంతికృష్ణ, వద్దిపర్రు సొసైటీ రిటైర్ సూపర్వైజర్ ఎం.మహాలక్ష్మిరాజు, రిటైర్డ్ డీజీఎం పి.పట్టాభి రామయ్య, మేనేజర్/లీగల్ ఆఫీసర్ పి.సత్తయ్యలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. సీఈఓ మునేశ్వరరావును ఇదివరకే విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. (చదవండి: ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..) నిగ్గు తేల్చిన అక్రమాలివే... ►వద్దిపర్రు సొసైటీ సభ్యుడు కొండ్రు నాంచారావు పేరున భూమి లేకపోయినా నకిలీ డాక్యుమెంట్లతో రూ.17.21 లక్షలు స్వాహా. ►మరో సభ్యుడు వాకలపూడి హరిబాబు ఎకరం భూమికి రూ.2.50 లక్షలకు అర్హత ఉండగా..రూ.5 లక్షలు. ఎల్టీ రుణంగా ఎకరం భూమి ఉంటే రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉండగా..రూ.6.28 లక్షలు ఇచ్చారు. టైటిల్ డీడ్ లేకుండానే ఇతని సోదరుడు విశ్వేశ్వరరావుకు రుణం మంజూరు. ►మూడెకరాలున్న మల్లాది వెంకటరామారావుకు రూ.7.65 లక్షలు రుణం ఇచ్చే అవకాశం ఉండగా.. రూ.14.65 లక్షలు ఇచ్చారు. ►కరుటూరి శ్రీనివాసరావుకు ఒక రుణంగా రూ.20 లక్షల వరకు ఇవ్వవచ్చు..కానీ అడ్డగోలుగా రూ.33 లక్షల రుణం మంజూరు చేశారు. ►భూమి తక్కువగా ఉన్నా..అర్హతకు మించి ఆచంట మంగాదేవి, ఆచంట పద్మావతి, కరుటూరి వెంకటలక్షి్మలకు బాండ్లు లేకపోయినా క్రెడిట్ లిమిట్ లేకుండా రుణాలివ్వడం. ►క్రెడిట్ లిమిట్ మంజూరు లేకుండా 40 మందికి ఏకంగా రూ.62.79 లక్షలు రుణాలు మంజూరు చేశారు. ఈ మంజూరులన్నీ బ్రాంచ్ మేనేజర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగాయని విచారణలో నిగ్గుతేల్చారు. ►రిటైరైన సూపర్వైజర్ ఎం.మహాలక్ష్మిరాజు బ్రాంచ్ మేనేజర్‌కు తెలియకుండా డీ నమూనా పట్టాలపై 21 మందికి రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడైంది. ►నిబంధనలకు విరుద్ధంగా సీఈఓ మునేశ్వరావుతోపాటు మహాలక్ష్మిరాజు వాయిదా మీరిన రుణాలపై న్యాయ పరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ►ఎల్ఈసీ కార్డులు రెన్యూవల్ చేయకుండా రుణాలు రెన్యూవల్ చేయడంలో సీఈఓతోపాటు సూపర్ వైజర్ బాధ్యులు. ►సంఘంలో క్రెడిట్ లిమిట్ మంజూరు ఉందా? లేదా? అని పరిశీలించకుండా 40 మంది సభ్యులకు రూ.62.79 లక్షలు లోన్లు మంజూరు చేశారు. ►31.03.2019 నాటికి రూ.31.68.150 మొండిబకాయిలుండగా.. ఇందులో మూడేళ్లు దాటిన రూ.24 లక్షలు ఉండగా..వాటి వసూళ్లకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ►భూములను పరిశీలించకుండా..డాక్యుమెంట్లు లేనప్పటికీ కొండ్రు నాంచారావుకు రుణం మంజూరు చేయడం. ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించకుండా రుణాలు ఇచ్చిన సూపర్వైజర్, మేనేజర్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన ప్పటి డీజీఎం పి.పట్టాభి రామయ్య బాధ్యునిగా తేల్చారు. ►వాకలపూడి హరిబాబు, సోదరుడు విశ్వేశ్వరావు, రాంబాబులకు రాజవరం సిండికేట్ బ్యాంకులో రుణాలున్నాయి. వీరికి డీసీసీబీ వెబ్‌ల్యాండ్ చూడకుండా అదనంగా రుణాలు మంజూరు చేయడం, వెబ్ ల్యాండ్ చూసి ఉంటే రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బ్రాంచ్ మేనేజర్, సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్ల బ్యాంక్ నష్టపోయింది. లీగర్ ఆఫీసర్ సత్తయ్య ఒక రుణం అవుట్ స్టాండింగ్ ఉండగా...మరో రుణానికి సిఫార్సు చేస్తూ వద్దిపర్రు సొసైటీ చేసిన తప్పును గుర్తించలేకపోవడం బాధ్యతారాహిత్యంగా గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. ‘బాధ్యతగా లేకుంటే ఇంటికే’ సొసైటీ, బ్రాంచి, చివరకు డీసీసీబీలో సైతం అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా లేకుంటే ఇంటికి పంపించేస్తా. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఏ దశలో అయినా నిర్లక్ష్యం, అవినీతి, కమీషన్లకు కక్కుర్తి పడితే కఠిన చర్యలు తప్పవు. డీసీసీబీ సీఈఓ స్థాయి నుంచి డీజీఎంలు, ఏజీఎంలు, లీగల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ వరకూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తించాలి. లేకుంటే ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి సిఫారసులతో వచ్చినా రైతులను మోసం చేసిన వారిని, బ్యాంకుకు నష్టం కలిగించిన వారిని ఉపేక్షించేది లేదు. – అనంతబాబు, చైర్మన్, డీసీసీబీ -
‘పచ్చ’నేతలు దొరికారు!
గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ అవినీతి తమ హక్కు అన్నట్టుగా ఆ నేతలు చలాయించడంతో కోట్ల రూపాయలకు కాళ్లు వచ్చాయి. రానున్న ఐదేళ్లూ కూడా తమవే అన్న రీతిలో రెచ్చిపోవడంతో మృతులు కూడా వీరికి ఆదాయ వనరులుగా మారిపోయారు. సహకార వ్యవస్థకు తూట్లు పొడిచిన ‘పచ్చ’ నేతలు రైతులను మోసం చేశారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాలో సహకార రంగాన్ని భ్రష్టు పట్టించి కోట్లు కొట్టేసిన ప్రబుద్ధుల బండారాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పచ్చ నేతలు పచ్చని పొలాలను పావులుగా వాడుకుని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, మృతుల పేర్లతో పాస్‌పుస్తకాలు, బినామీ ఆస్తులను కుదువ పెట్ట డం ద్వారా సహకార వ్యవస్థను అధఃపాతాళంలోకి నెట్టేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ను లూటీ చేసేశారు. ఈ కుంభకోణాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీసీసీబీ సీఈఓ మంచాల ధర్మారావు సహా పలు బ్రాంచీల మేనేజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులపై డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ సస్పెన్షన్ వేటు వేశారు. గత పాలకవర్గంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విచారణ కు ఆదేశించి, అవినీతి కుంభకోణాల మూలాలను తవ్వి తీస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెట్ట ప్రాంతంలో అప్పటి డీసీసీబీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రస్తుత ఇన్చార్జి వరుపుల రాజా అధ్యక్షుడిగా వ్యవహరించిన లంపకలోవ సొసైటీలో కోట్ల రూపాయల అవినీతి గుట్టును 51 విచారణ రట్టు చేసింది. ఇప్పుడైతే లంపకలోవలో అవినీతి కుంభకోణం బయట పడింది కానీ ఆ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లాలో ఏ సహకార సంఘాన్ని కదలించినా భారీగానే అక్రమాలు బయటపడుతున్నాయి. గత నెలలో ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు సొసైటీలో అంతా కుమ్మక్కై వ్యవసాయ కూలీలను రైతులుగా చూపించి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి ‘సాక్షి’ బయటపట్టిన నేపథ్యంలో పలువురిపై చర్యలు తీసుకున్నారు. పలు కేసుల నమోదు దాదాపు ఇదే రీతిన ప్రత్తిపాడు మండలం లంపకలోవ పీఏసీఎస్‌లో ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.16 కోట్లు పైనే నొక్కేసినట్టు నిర్థారణ కావడం జిల్లా సహకారశాఖను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఈ సొసైటీలో రూ.16,47,59,023 దుర్వినియోగానికి పాల్పడ్డ అప్పటి సొసైటీ అధ్యక్షుడు, నాటి డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం తీవ్ర సంచలనమైంది. రాజాతో పాటు ఇద్దరు మాజీ సీఈఓలు, మాజీ బ్రాంచి మేనేజర్లపై పెద్దాపురం డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణారావు పోలీసుల కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. డొంక కదిలింది ఇలా... లంపకలోవ సొసైటీలో 2018 మే 11 నుంచి 2019 జూలై 30 మధ్య కాలంలో నిధులు అడ్డంగా దోచేశారంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ అవినీతి డొంక కదిలింది. ఎమ్మెల్యే పర్వత శాసనసభలో ప్రస్తావించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో నిధు ల దుర్వినియోగం రుజువుకావడంతో ప్రత్తిపాడు డీసీసీబీ మేనేజర్ ఎం.నరసింహమూర్తిని సస్పెండ్ చేశారు. ఈ చర్య ఎంత మాత్రం సరిపోదని, లోతైన విచారణ జరిపి ప్రతిపైసా తిరిగి సొసైటీకి జమవ్వాలని ఎమ్మెల్యే పర్వత, ఇటు డీసీసీబీ చైర్మన్ అనంతబాబు పట్టుబట్టి మరీ ఏపీ సహకార చట్టం 1964 ప్రకా రం 51 విచారణ జరిపించారు. ఈ అవినీతిని వెలుగులోకి తీసుకురావడానికి జిల్లా సహకార అధికారి డి.పాండురంగారావు సొసైటీ పరిధిలో 5050 మంది సభ్యులలో రుణాలు పొందిన సుమారు 4000 మంది సభ్యులను సుమారు రెండు నెలల పాటు విచారించిన మీదట నిధుల దుర్వినియోగాన్ని నిర్థారించారు. అడ్డగోలుగా రుణాలు మంజూరు ఒకరి పేరునే రెండు, మూడు రుణాలు తీసుకోవడం, మృతుల పేర్ల మీద, నకిలీ పాస్ పుస్తకాలపైన అడ్డగోలుగా రుణాలు మంజూరు చేయడం వంటి అనేక అవకతవకలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. గత నవంబర్ నెలలో రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలను తనిఖీ చేసి, అధిక శాతం నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్టు నిర్ధారించారు. ఇదే లంపకలోవ సొసైటీలో అవకతవకలపై గత అక్టోబర్ నెలలో కుంభకోణంలో క్రియాశీలక పాత్ర పోషించిన డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు సొసైటీ డైరెక్టర్లు, మాజీ సీఈఓ చాగంటి వెంకట్రావుల ఆస్థులపై జప్తు నోటీసులను కూడా జారీ చేశారు. ఇప్పుడు రాజాతోపాటు ఈ కుంభకోణ బాధ్యులుపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వరుపుల రాజాతో పాటు నలుగురిపై కేసులు ప్రత్తిపాడు: మండలంలోని లంపకలోవ వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో నిధుల అవకతవకలపై అప్పటి సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక పోలీసుల కథనం మేరకు లంపకలోవ సొసైటీలో 2018 మే 11–2019 జూలై 30 మధ్య కాలంలో తప్పుడు లెక్కలు నమోదు చేయడం, అవకతవకలకు పాల్పడి రూ.16,47,59,023 నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్దాపురం డివిజన్ కోఆపరేటివ్ అధికారి ఎ. రాధాకృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అప్పటి లంపకలోవ సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల జోగిరాజు అనే రాజా, సొసైటీ మాజీ సీఈఓ సీహెచ్ వెంకట్రావు, సీఈఓ కె.అప్పారావు, ప్రత్తిపాడు డీసీసీబీ మాజీ బ్రాంచ్ మేనేజర్లు ఎం.నరసింహమూర్తి, పి.మురళీకృష్ణలపై 409, 419, 420, 468, 471, 477(ఎ), 109 రెడ్‌విత్ 34 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు ఆధ్వర్యంలో ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం లంపకలోవ సొసైటీలో విచారణ చేపట్టారు. ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు వై.రాంబాబు, సురేష్, సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మందగమనం ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల సంఘటిత శక్తిని వారి సంక్షేమానికి ఉపయోగపడేలా కొత్తగా ఎన్నికైన సహకార సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన జిల్లా కేంద్ర సహకార సంఘాలు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల (డీసీఎంఎస్) చైర్మన్లు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌తో భేటీ అ య్యారు. సహకార ఎన్నికలను సవాల్‌గా తీసుకుని టీఆర్ఎస్కు భారీ విజయాన్ని అందించిన మంత్రులను కేటీఆర్ అభినందించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 48 శాతం మేర ప్రాతినిథ్యం కల్పించామని చెప్పారు. ఆదిలాబాద్‌లో ఎస్సీ, మహబూబ్‌నగర్‌లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని చైర్మన్లుగా ఎంపిక చేసిట్లు గుర్తు చేశారు. సహకార ఎన్నికల్లో రిజర్వేషన్లు లేకున్నా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బలహీన, బడుగు వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ఖరారు చేశారన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రైతు సంక్షేమం: ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నందునే రాష్ట్రంలోని 906 సహకార సంఘాల్లో 94 శాతానికి పైగా తమ పార్టీ మద్దతుదారులే గెలుపొందారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రైతు బీమా, రైతుబం ధు లాంటి ప్రత్యేక పథకాలను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కేంద్ర అసంబద్ధ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొందని ఆరోపించారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే
-
సహకార పీఠాలన్నీ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార సంఘాల మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శనివారం ముగిసింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులన్నీ ఏకగ్రీవం కాగా అధికార టీఆర్ఎస్ మద్దతుదారులే జిల్లా సహకార పీఠాలను కైవసం చేసుకున్నారు. సహకార ఎన్నికలకు తొలిమెట్టుగా పేర్కొనే పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాలు మొదలుకొని ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల వరకు పార్టీ మద్దతుదారులే గెలుపొందేలా టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వచ్చింది. పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్లు మొదలుకొని డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల ఎంపిక వరకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు క్రియాశీల పాత్రపోషించారు. అయితే డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు పార్టీలోనే అంతర్గత పోటీ నెలకొనడంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. తొమ్మిది డీసీసీబీలకుగాను ఆరు జిల్లాల్లో ఓసీలు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో బీసీ, ఆదిలాబాద్‌లో ఎస్సీ కేటగిరీకి చైర్మన్ పదవి దక్కింది. డీసీఎంఎస్‌లలోనూ ఆరుగురు ఓసీలతోపాటు నల్లగొండ, నిజామాబాద్‌లో బీసీ, వరంగల్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతను చైర్మన్ పదవి వరించింది. పరిశీలకుల సమక్షంలో అభ్యర్థుల ప్రకటన... డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు శనివారం ఉదయం 9 గంటలకు నోటిఫికేషన్ వెలువడగా క్యాంపుల్లో ఉన్న టీఆర్ఎస్ మద్దతుదారులు అంతకు రెండు గంటల ముందే ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం సీల్డ్ కవర్లు అందుకున్న పార్టీ పరిశీలకులు శనివారం ఉదయం డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లతో భేటీ అయ్యారు. సంబంధిత జిల్లా మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత సీల్డ్ కవర్లలో ఉన్న పేర్లను పార్టీ పరిశీలకులు వెల్లడించి నామినేషన్ల ప్రక్రియను సమన్వయం చేశారు. అయితే ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లో డీసీసీబీ చైర్మన్ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో అవకాశం దక్కని ఆశావహులను మంత్రులు బుజ్జగించారు. కొందరికి వైస్ చైర్మన్ పదవి దక్కగా అవకాశం దక్కని నేతలకు ఇతరత్రా అవకాశం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని డీసీసీబీ చైర్మన్ పదవులకు ఆదిలాబాద్‌లో నామ్‌దేవ్ (ఎస్సీ), మహబూబ్‌నగర్‌లో నిజాంపాషా (బీసీ) పేర్లు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. మెదక్ డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డికి అవకాశం లభించలేదు. టెస్కాబ్ చైర్మన్‌గా కొండూరు ఎన్నిక లాంఛనమే డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మ న్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ముగియడం తో అందరి దృష్టి రాష్ట్రస్థాయిలో తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్ ఎన్నికపై పడింది. ఈ ఎ న్నికకు సంబంధించి ఈ నెల 2 లేదా 3 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా 5న ఎన్నిక జరగనుంది. టెస్కాబ్ తాజా మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో రవీందర్రావు ఎన్నిక లాంఛనప్రాయంగా కనిపిస్తోంది. -
పార్టీ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ఘట్టం ముగింపు దశకు చేరుకోగా పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పార్టీ మద్దతుదారులకే దక్కేలా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. శనివారం డీసీసీబీ, డీఎస్ఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లా పరిశీలకులతో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో శుక్రవారం సాయంత్రం కేటీఆర్ గంటన్నర పాటు భేటీ అయ్యారు. శనివారం జరిగే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన మద్దతుదారులే విజయం సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ ఎన్నికల పరిశీలకులకు దిశా నిర్దేశం చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో వారి ఎంపిక సాఫీగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలకు పరిశీలకులు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు శుక్రవారం రాత్రే జిల్లాలకు బయ ల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, క్యాం పుల్లో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు శనివారం ఉదయం 7 గంటలకల్లా ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. వీరితో ఉదయం 7 గంటలకు పార్టీ పరిశీలకులు సమావేశమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించిన వారికి మద్దతు పలకాలని కోరతారు. సీల్డ్ కవర్లను తెరిచి పార్టీ నిర్ణయించిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగి న తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. సంఖ్యా బలం పరంగా టీఆర్ఎస్కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల కోణంలో.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవులకు సంబంధించి పార్టీ సమీకరణాలు, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను సామాజిక సమీకరణాలను దృష్టి లో పెట్టుకుని పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరా రుచేసినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొండూరు రవీందర్రావును కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా ఖరారు చేశారు. వీరితోపాటు పోచారం భాస్కర్‌రెడ్డి (నిజామాబాద్), మార్నేని రవీందర్రావు (వరంగల్), అడ్డి బోజారెడ్డి లేదా శరత్చంద్రారావు (ఆదిలాబాద్), మనోహర్‌రెడ్డి (రంగారెడ్డి), గొంగిడి మహేందర్‌రెడ్డి(నల్లగొండ), ఎం.దేవేందర్‌రెడ్డి లేదా చిట్టి దేవేందర్‌రెడ్డి (మెదక్), మనోహర్ (మహబూబ్‌నగర్), కూరాకుల నాగభూషణం లేదా తూళ్లూరు బ్రహ్మయ్య (ఖమ్మం) పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. డీసీఎంఎస్‌కు సంబంధించి మల్కాపు రం శివకుమార్ (మెదక్), శ్రీనివాస్‌గౌడ్ (నిజామాబాద్), పి.క్రిష్ణారెడ్డి (రంగారెడ్డి) పేర్లున్నట్లు సమా చారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టు కుని డీసీసీబీ వైస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో శనివారం ఉదయం జాబితాపై స్పష్టత రానున్నది. -
టీఆర్ఎస్ ‘సహకార’ శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: పాత ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ముగియడంతో ఈ నెల 29న జరిగే చైర్మన్ ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. పూర్వపు 9 జిల్లాల పరిధిలోని డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ స్థానాలకు మంగళవారం నామినేషన్లు స్వీకరించగా టీఆర్ఎస్ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ మినహా ఇతర జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ స్థానాలను పలువురు టీఆర్ఎస్ నేతలు ఆశిస్తుండటంతో పదవులకు బహుముఖ పోటీ నెలకొంది. జిల్లాల వారీగా డైరెక్టర్ల స్థానాలకు పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన టీఆర్ఎస్.. చైర్మన్ పదవులకు కూడా పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు దాదాపు అందరూ పార్టీ మద్దతుదారులే కావడంతో చైర్మన్ పదవులు అన్ని టీఆర్ఎస్ ఖాతాలో చేరనున్నాయి. జిల్లాల వారీగా చైర్మన్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితాను పార్టీ ఎమ్మెల్యేలతో సంబంధిత జిల్లా మంత్రులు చర్చించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించారు. ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక జరగనుండగా, అదేరోజు ఉదయం జాబితాను ప్రకటించే అవకాశముంది. క్యాంపులకు తరలిన డైరెక్టర్లు డీసీసీబీ, డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీలకు ఎన్నికైన డైరెక్టర్లను మంగళవారం రాత్రి పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. గోవా, బెంగళూరుతో పాటు తిరుపతి తదితర పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం ఈ నెల 29న ఉదయం పూర్వ ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. చైర్మన్ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆశావహుల జాబితాను రూపొందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ మేరకు తాము సహకార ఎన్నికల బరిలోకి దిగినట్లు కొందరు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన వారినే చైర్మన్లుగా ఎన్నుకునేలా జిల్లాల వారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి చర్చల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ, తుది జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
డీసీసీబీ, డీసీఎంఎస్‌లన్నీ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల మేనేజింగ్ కమిటీ సభ్యుల (డైరెక్టర్ల) పదవులు మంగళవారం ఎన్నికలు జరగకుండానే అన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవన్నీ ఏకగ్రీవమైనట్లు తెలంగాణ సహకార శాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఆర్ఎస్కు చెందిన వారే ఎక్కువ కైవసం చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో పాత జిల్లాల ప్రకారం 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లకు ఎన్నికల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయని ఆమె తెలిపారు. దీని కోసం ఆ రోజు నామినేషన్లు స్వీకరిస్తామని, పరిశీలన అనంతరం రహస్య విధానంలో ఓటింగ్ జరిపి ఎన్నుకుంటామన్నారు. కాగా డీసీసీబీలకు 20 మంది చొప్పున గ్రూప్ ఏలో 16, గ్రూప్ బీలో నలుగురు, అలాగే డీసీఎంఎస్‌లకు 10 మంది చొప్పున గ్రూప్ ఏలో ఆరుగురు, గ్రూప్ బీలో నలుగురు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు డైరెక్టర్ల పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు దాఖలుకాలేదు. 9 డీసీసీబీల్లో 180 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడ్ డైరెక్టర్ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. అలాగే 9 డీసీఎంఎస్‌లలో 90 డైరెక్టర్ పదవులకు నామినేషన్లు వేయాల్సి ఉండగా, 16 డైరెక్టర్ పదవులకు రిజర్వుడ్ సభ్యులు లేక నామినేషన్లు దాఖలుకాలేదు. మిగిలిన వాటికి ఇద్దరు లేదా ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన నామినేషన్ల ఉపసంహరణతో అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌లు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రిజర్వుడ్ స్థానాలకు కొన్నిచోట్ల సభ్యులు లేకపోవడంతో అన్ని డీసీసీబీల్లోని 180 డైరెక్టర్ పదవులకుగాను, 147 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇక అన్ని డీసీఎంఎస్‌లకు 90 మంది డైరెక్టర్ పదవులకుగాను, 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇదిలావుండగా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నిక జరగని 33 డీసీసీబీ డైరెక్టర్, 16 డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులకు ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించే అవకాశముంది. సంబంధిత చైర్మన్లు, వైస్ చైర్మన్లు కోరితే వాటికి ఎన్నిక జరుగుతుందని సహకారశాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర తెలిపారు. 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక.. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మూడో తేదీన జారీ చేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 904 ప్యాక్స్లకు ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న అనంతరం, వారు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకున్నారు. -
పదవులు 8.. ఓట్లు 3!
సాక్షి, ఆదిలాబాద్: డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నికలకు సంబంధించి శనివారం కోఆపరేటివ్ ఎన్నికల అధికారులు ఓటరు జాబితా విడుదల చేశారు. అందులో పీఏసీఎస్ అధ్యక్షులను ఏ–క్లాస్ ఓటర్లుగా, ప్రభుత్వ సంబంధిత సొసైటీల అధ్యక్షులను బీ–క్లాస్ ఓటర్లుగా లెక్క తేల్చారు. అయితే విచిత్రమేమిటంటే.. ఏ–క్లాస్ నుంచి ఈ రెండు పాలకవర్గాలకు కలిపి 22 డైరెక్టర్ పదవులు ఉంటే ఇందులో ఓటర్లుగా 77 మంది ఉన్నారు. ఇక బీ–క్లాస్ నుంచి ఈ పాలకవర్గాలకు 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఓటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం చోద్యంగా కనిపిస్తోంది. దీంతో ఐదు డైరెక్టర్ పదవులు ఎన్నిక కాకుండా మిగిలిపోనున్నాయి. క్రియాశీలకంగా లేవు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వరంగ సొసైటీలు 272 ఉండగా, ప్రస్తుతం ఇవి క్రియాశీలకంగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. కుల, ఉద్యోగ, చేనేత ఇలా పలు సొసైటీలను ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఓ కమిటీ పర్యవేక్షిస్తుంది. పర్సన్ ఇన్చార్జి నిరంతరంగా సొసైటీల ఎన్నికలు జరిగి అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకం జరిగేలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అయితే ఉమ్మడి జిల్లాలో వందలాది ఇలాంటి సొసైటీలు ఉండగా, సరైన పర్యవేక్షణ లేనికారణంగా కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉండటం గమనార్హం. వాటిలో టెలికం ఎంప్లాయీస్ కోఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆదిలాబాద్, మహరాణా ప్రతాప్‌సింగ్ బీసీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్, ఆదిలాబాద్‌తోపాటు మమతా సూపర్‌బజార్ మంచిర్యాల సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. మిగతా సొసైటీలు ఉండీ లేనట్టుగా తయారయ్యాయి. ముగ్గురే మహిళలు.. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నిక కోసం శనివారం ఓటరు జాబితా విడుదల చేయగా ఏ–క్లాస్‌లోని 77 మంది ఓటర్లలో కేవలం ముగ్గురే మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో వివిధ సొసైటీల నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మిర్జాపూర్ సొసైటీ నుంచి దీపారెడ్డి, పాండ్వపూర్ సొసైటీ నుంచి ఆర్.శైలజ, ధర్మరావుపేట్ సొసైటీ నుంచి బడావత్ నీల ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ–క్లాస్‌లోని 22 డైరెక్టర్ పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభి స్తుందా? అనేది ఆసక్తికరం. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం కొంతమంది నేతలు రాజధానిలో జిల్లా ముఖ్యనేతలతో కలిసి పైరవీ చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాల్సిందే. ఈనెల 25న డైరెక్టర్ పదవుల ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఐదు పదవులు మిగిలిపోనున్నాయి బీ–క్లాస్ నుంచి కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఈ ముగ్గురు పోను మిగతా ఐదు డైరెక్టర్ పదవులు ఖాళీగా మిగలనున్నాయి. ప్రభుత్వరంగ సొసైటీలు ఎన్నికలు చేపట్టి అధ్యక్షులను నియమించుకొని క్రియాశీలకంగా ఉంటే దీంట్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండేది. ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. – మోహన్, డీసీవో, ఆదిలాబాద్ -
'ఢీ'సీసీబీ
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక మండళ్లకు శనివారం ఎన్నిక జరిగి ఫలితాలు వెలువడగా, కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు ఆదివారం సొసైటీలకు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. పీఏసీఎస్ స్థాయిలో ఎన్నికలు ముగియడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలక మండలి ఎన్నిక నిర్వహణకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. సహకార శాఖ కమిషనర్ అధ్యక్షతన సోమవారం జరిగే సమావేశంలో డీసీసీబీ పాలక మండలి ఎన్నిక షెడ్యూలు విడుదల కానుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి ఎన్నికలో ఏ క్లాస్ (పీఏసీఎస్ చైర్మన్లు), బీ క్లాస్ (గొర్రెల కాపరులు, మత్స్య తదితర సహకార సంఘాలు) సొసైటీల చైర్మన్లకు ఓటు హక్కు అవకాశం ఉంటుంది. దీంతో పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన హైదరాబాద్‌ను మినహాయించి మిగతా తొమ్మిది జిల్లాల్లోనూ ఏ, బీ క్లాస్ సొసైటీ చైర్మన్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ చైర్మన్లుగా గెలిచి డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ తదితర పాలక మండలి పోస్టులను ఆశిస్తున్న టీఆర్ఎస్ ఆశావహ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే? సహకార ఎన్నికల్లో 90%కు పైగా పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే గెలుపొందారు. దీంతో ఆదివారం జరిగిన పీఏసీఎస్ చైర్మన్ పదవులు కూడా 90% మేర టీఆర్ఎస్ మద్దతుదారులకే దక్కాయి. దీంతో పూర్వపు ఉమ్మడి జిల్లా పరిధిలో మెజారిటీ సొసైటీ పీఠాలు టీఆర్ఎస్ మద్దతుదారులకు దక్కడంతో తొమ్మిది డీసీసీబీలు టీఆర్ఎస్ మద్దుతుదారులకే దక్కుతాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో డీసీసీబీ పీఠాలను ఆశిస్తున్న టీఆర్ఎస్ ఆశావహ నేతలు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్లుగా ఎంపికై ఉమ్మడి జిల్లా స్థాయి పదవిపై కన్నేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పీఏసీఎస్ డైరెక్టర్, చైర్మన్ అభ్యర్థులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు ఖరారు చేయగా, డీసీసీబీ చైర్మన్ అభ్యర్థుల పేర్లను మాత్రం సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పూర్వపు ఉమ్మడి జిల్లాల వారీగా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతల జాబితాను ఇవ్వాల్సిందిగా సంబంధిత జిల్లా మంత్రులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించి ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. డీసీసీబీ అధ్యక్ష పదవి దక్కని నేతలు కొందరికి జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా సంతృప్తి పరచాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. కరీంనగర్లో కొండూరుకు! టెస్కాబ్ తాజా మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ అధ్యక్ష పదవికి దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా, రమేశ్‌రెడ్డి, గిర్దావర్ గంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డితో పాటు డీసీసీబీ తాజా మాజీ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ డీసీసీబీ పీఠాన్ని మార్నేని రవీందర్‌రావుతో పాటు గుండేటి రాజేశ్వర్‌రెడ్డి, చల్లా రాంరెడ్డి, మోటపోతుల జీవన్ ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తుళ్లూరు బ్రహ్మయ్య, సత్వాల శ్రీనివాస్‌రావు (ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు మేనల్లుడు), తాజా మాజీ డీసీసీబీ అధ్యక్షులు మువ్వా విజయ్‌బాబు, కూరాకుల నాగభూషణం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించి సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని డీసీసీబీ అధ్యక్షుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. టెస్కాబ్ బరిలో.. రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య (టెస్కాబ్) చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొందరు నేతలు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల జాబితాలో ప్రధానంగా కొండూరు రవీందర్రావు (కరీంనగర్), పోచారం భాస్కర్‌రెడ్డి (నిజామాబాద్), పల్లా ప్రవీణ్‌రెడ్డి (నల్లగొండ) ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ పీఠాల విషయానికి వస్తే నల్లగొండ నుంచి పల్లా ప్రవీణ్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి (ఆలేరు ఎమ్మెల్యే సునీత భర్త), మల్లేశ్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి గురునాథ్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జూపల్లి భాస్కర్‌రావు పేర్లను పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. డీసీసీబీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ పాత జిల్లాల ప్రాతిపదికనే ఎన్నికలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుల ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీ కానుందని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు వెల్లడించాయి. డీసీసీబీ అధ్యక్షుల ఎన్నిక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్) ఎన్నికైన చైర్మన్లు డీసీసీబీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఒక్కో వ్యవస్థకు 20 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను ఈ నెల 24వ తేదీకల్లా పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. -
15న సహకార ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం ప్రకటించింది. ఈ మేరకు వచ్చే నెల 15న రాష్ట్రంలోని 906 ప్యాక్స్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా వచ్చే నెల 3న నోటిఫికేషన్లు జారీ చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎన్నికల అధికారులను నియమించాల్సి ఉంటుంది. అన్ని ప్యాక్స్‌లలో మొత్తంగా 18,42,412 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన పూర్వ తొమ్మిది జిల్లాల్లో (కొత్తగా 32) మొత్తం 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం 906 ప్యాక్స్‌లకే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క సహకార సంఘానికి ఎన్నికలు జరగడం లేదు. వీటిలో వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఉన్న ఒక్కొక్క సహకార సంఘానికి ఆగస్టు చివరి వరకు పాలక వర్గానికి కాలపరిమితి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి పనితీరు సక్రమంగా లేకపోవడంతో దాన్ని రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సహకారశాఖ తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవంగా కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కచ్చితంగా రెండు ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్) ఉండాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రక్రియలో సహకార శాఖ నిమగ్నమైంది. ఆ ప్రకారం కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 1,343 ప్యాక్స్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. ప్రస్తుతం మొత్తం 584 మండలాలకు 909 సహకార సంఘాలున్నాయి. 81 మండలాల్లో ఒక్క ప్యాక్స్ కూడా లేదు. మరికొన్ని మండలాల్లో 2 నుంచి 3 వరకు ఉన్నాయి. ప్రస్తుతమున్న 584లో 272 మండలాల్లో ఒక్కో ప్యాక్స్ మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వీటన్నింటిలో అదనంగా మరొక ప్యాక్స్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. 81 మండలాల్లోనూ రెండు చొప్పున మొత్తం 162 ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. దీంతో కొత్తగా 434 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే జూన్ వరకు సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం తక్షణమే నియమించాలని కోరడంతో ప్రస్తుతమున్న ప్యాక్స్‌కు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. డీసీసీబీలకు మాత్రమే.. ఉమ్మడి జిల్లాల ప్రకారం ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకే (డీసీసీబీ) ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్యాక్స్‌కు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు. 2018లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వరుస ఎన్నికలతో వాయిదా పడుతూ వస్తోంది. ప్యాక్స్లకు ఎన్నికలు పూర్తయ్యాక తదుపరి డీసీసీబీలకు, టెస్కాబ్‌కు ఎన్నికలు నిర్వహిస్తారు. వాటి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆ ఎన్నికల్లో డీసీసీబీ, టెస్కాబ్‌లకు చైర్మన్లను ఎన్నుకుంటారు. -
ఎమ్మెల్యే ఫిర్యాదుతో అవినీతి డొంక కదిలింది!
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు బాధ్యులను గుర్తించడంలో ప్రభుత్వం వేగం పెంచింది. రైతుల రెక్కల కష్టంతో లాభాల బాటలో నడుస్తున్న బ్యాంకు సొమ్మును అడ్డగోలుగా దుబారా చేసిన తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గడచిన ఐదేళ్ల డీసీసీబీ పాలనతోపాటు పొడిగించిన రెండేళ్ల ప్రత్యేక పాలనలో అవకతవకలు భారీగా జరిగినట్టు ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికలో స్పష్టమైంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఫిర్యాదుతో డీసీసీబీలో కదిలిన అవినీతి డొంక చాంతాడును మించిపోతోంది. ఎమ్మెల్యే పది అంశాలపై చేసిన ఫిర్యాదులపై పరిశీలన ప్రారంభిస్తే అవి చివరకు 33 అంశాలకు చేరుకున్నాయి. డీసీసీబీలో జరిగిన ఆర్థిక అవకతవకలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు విభాగాల్లో అవసరానికి మించి అదనంగా లక్షలు ఖర్చు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. రైతుల సొమ్మును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేశారన్నది ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదిక సారాంశంగా ఉంది. సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పాండురంగారావు, కాకినాడ డివిజనల్ సహకార అధికారి కె.పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అధికారుల బృందం శాఖాపరమైన విచారణ నిర్వహించింది. ఏడేళ్ల పాలనపై ప్రాథమిక నివేదిక డీసీసీబీ పాలకవర్గం గడువు 2018 ఫిబ్రవరి 17తో ముగిసిపోయింది. కానీ అప్పటి పాలకుల ఆదేశాల మేరకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ పాలకవర్గ పదవీ కాలాన్ని రిఫరెన్స్ నంబర్ 1447/2018–సీ ద్వారా 2018 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఒకసారి, అదే ఏడాది ఆగస్టు 12 వరకూ రెండోసారి, 2019 ఫిబ్రవరి 12 వరకూ మూడోసారి పొడిగించారు. పొడిగింపుతో కలిపి డీసీసీబీ పాలకవర్గం మొత్తం పాలనా కాలంలో 45 పాలకవర్గ సమావేశాలు నిర్వహించి 881 తీర్మానాలను ఆమోదించింది. మొత్తం పాలనాకాలంలో ఆమోదించిన తీర్మానాలపై విచారణాధికారుల బృందం డీసీసీబీలో రేండమ్‌గా (మచ్చుకు) కొన్ని విభాగాలు, కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పరిశీలించగా గుర్తించిన ఆర్థిక అవకతవకలను ప్రభుత్వానికి నివేదించారు. చైర్మన్ వరుపుల రాజా రుణాల కోసం ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ, హెచ్ఆర్డీ, ఆడిట్ ఇలా మొత్తంగా ఆరు కమిటీలను అధికార, అనధికారులతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత విడుదలైన రుణాలు, ఉద్యోగులకు 40 రోజుల ఎక్స్‌గ్రేషియా తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయని ప్రాథమిక విచారణ నిగ్గు తేల్చింది. ఈ క్రమంలో గడచిన ఐదేళ్ల పూర్తి కాలంతోపాటు పొడిగించిన రెండు సంవత్సరాల కాలంలో డీసీసీబీలో ఆర్థిక అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతుల రెక్కల కష్టాన్ని ఇష్టారాజ్యంగా దుబారా చేసిన వ్యవహారాలపై ప్రాథమిక విచారణ నివేదిక చేతికొచ్చాకనే 51 విచారణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విచారణ షురూ అమలాపురం డివిజనల్ సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్ విచారణాధికారిగా బాధ్యతలు తీసుకొని పక్షం రోజులైంది. గత పాలనాకాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును సోదాహరణంగా విచారణ జరుగుతోంది. గుర్తించిన అవకతవకలను ఎప్పటికప్పుడు సహకారశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఓ పక్క 51 విచారణ చురుగ్గా జరుగుతుండగా మరోవంక ఇవే అంశాలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను స్టేట్ ఇంటెలిజెన్స్ తెలుసుకుంటోంది. ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఒక బృందం రెండు రోజుల కిందటే రంగంలోకి దిగింది. ఆ బృందం ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తోంది. అవకతవకలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన పీఏసీఎస్‌లు, డీసీసీబీలో పలు సెక్షన్ల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమైందని విశ్వసనీయ సమాచారం. అవకతవకలపై సహకార అధికారులు తయారుచేసిన ప్రాథమిక నివేదికపై కూడా ఇంటెలిజెన్స్ కూపీ లాగుతోంది. ఇతర విచారణలతో మాకు సంబంధం లేదు సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుతున్న 51 విచారణకు మిగిలిన విభాగాలు చేసే విచారణలతో సంబంధం లేదు. మా దృష్టికి వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రతి అంశంపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఇంటిలిజెన్స్ వంటి ఇతర విచారణలు మా పరిధిలోకి రావు. వాటితో సంబంధం లేకుండా మా విచారణ స్వతంత్రంగా జరుగుతుంది. – బి.దుర్గాప్రసాద్, డివిజినల్ కో ఆపరేటివ్ అధికారి, అమలాపురం