స్తంభించిన ‘సహకారం’ !
స్తంభించిన ‘సహకారం’ !
Published Sat, Dec 3 2016 11:10 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– డీసీసీబీ బ్రాంచీల్లో నిలిచిన లావాదేవీలు
– కొత్త నోట్లులేక స్తంభించిన సేవలు
- ఆందోళనలో రైతులు
కోడుమూరు: పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్ సహకార వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజుల నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలోని జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్(డీసీసీబీ)లలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు తీసుకోకూడదని జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ నిబంధనలు విధించడంతో ఈపరిస్థితి తలెత్తింది.
కర్నూలు జిల్లాలో 22 డీసీసీబీ బ్రాంచీలు, 95 సహకార సంఘాలున్నాయి. వీటిలో లక్ష ఇరవైవేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వివిధ పథకాల కింద వారికి దాదాపు రూ. 872 కోట్లు అప్పులిచ్చారు. రూ. 475 కోట్లను రైతుల నుంచి డిపాజిట్లు సేకరించారు. దాదాపు రూ.1350 కోట్లు లావాదేవీలతో వాణిజ్య బ్యాంకులతో సమానంగా డీసీసీబీ బ్రాంచీలు పనిచేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్న సహకార సంఘాల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎంతో నమ్మకంగా చేసిన డిపాజిట్లను సహకార బ్యాంకులు తిరిగి ఇవ్వలేని పరిస్థితి. కనీసం తీసుకున్న రుణాలను చెల్లిస్తామని రైతులు ముందుకొచ్చినా పెద్దనోట్ల తీసుకోకూడదు. దీంతో రైతన్నలకు వడ్డీ బారం మరింత పెరిగే అవకాశముంది. సేద్యం ఆధారంగా జీవించే రైతులకు నల్ల కుబేరులకు విధించిన పెద్దనోట్ల ఆంక్షలను వర్తింపజేయడం, అన్నపెట్టే రైతును అవమానించినట్టేనని భూమాత రైతు సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం రూ.2000 కూడా ఇవ్వని పరిస్థితి
డబ్బు అవసర నిమిత్తం ఖాతాదారులు డీసీసీబీ బ్రాంచీలకు వెళ్లితే రూ.2000 కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాణిజ్య బ్యాంకులకు కొత్త కరెన్సీ నోట్లు ఎంతో కొంత సరఫరా అవుతున్నాయి. డీసీసీబీ బ్రాంచీలకు మాత్రం ఆర్‌బీఐ నుంచి కొత్తనోట్లను సరఫరా చేయడంలేదు. ఇప్పటి వరకు కేవలం రూ.3 కోట్లు సహకార బ్యాంకు నుంచి ఖాతాదారులకు అందజేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పుదారులకు ఓవర్ డ్యూ ముప్పు :
డీసీసీబీ బ్రాంచీలల్లో వివిధ పథకాల కింద రైతులు తీసుకున్న అప్పుల వాయిదాలను చెల్లించేందుకు వెళ్తుండగా బ్యాంక్ ఉద్యోగులు పాతనోట్లను తీసుకోవడంలేదు. కొత్త నోట్లు కావాలని ఖాతాదారులకు వెనక్కి పంపుతున్నారు. నెల వాయిదాలు సరిగ్గా చెల్లించకపోతే వడ్డీలు పెరిగిపోతాయని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
రూ. 100 కోట్ల లావాదేవీలకు బ్రేక్ :
ఆర్‌బీఐ ఆంక్షలతో జిల్లాలోని 22 జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచుల్లో రోజుకు రూ. 4 కోట్లు సహకార లావాదేవీలు, వ్యాపారాలు స్థంభించిపోయాయి. పెద్దనోట్లు రద్దయి దాదాపు 25 రోజులు పూర్తవుతుంది. ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు లావాదేవీలను ఆ బ్యాంకు కోల్పోయింది. ఈ ప్రభావం సహకార రంగంపైనే కాకుండా జిల్లా వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడిందని డీసీసీబీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. తమ బ్రాంచ్‌లలో దాదాపు రూ.25 కోట్లు విలువైన బంగారు నగలు తాకట్టు పెట్టి రైతులు రుణాలు తీసుకున్నారు. పెళ్లిళ్ల కోసం వాటిని విడిపించుకునేందుకు వెళ్లిన రైతులకు బంగారు ఆభరణాలు ఇవ్వడంలేదు. కొత్తనోట్లు ఇస్తేనే నగలు ఇస్తామని బ్యాంక్ సిబ్బంది మెలిక పెడుతున్నారు. దీంతో రైతులకు దిక్కుతోచడం లేదు.
అప్పు మంజూరైనా ఇవ్వడంలేదు : సామేల్, రైతు
రెండున్నర ఎకరా మార్టిగేజీ చేసి కోడుమూరు డీసీసీబీలో రూ.2.59 వేలు అప్పు మంజూరు చేయించుకున్నా. వారం రోజుల నుంచి డబ్బుల కోసం తిరుగుతున్నా బ్యాంక్ అధికారులు ఇవ్వడంలేదు. ఈ నెల 9వ తేదీన నా కొడుకు పెళ్లి ఉంది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలా చేయాలో అర్థం కావడం లేదు.
ఆర్‌బీఐ ఆంక్షలను సడలించాలి : సునీల్ కుమార్, కేడీసీసీ డీజీఎం
నోట్ల రద్దుపై ఆంక్షలను సడలించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జిల్లా సహకార కేంద్రాల్లోని లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి. నోట్ల రద్దుతో లావాదేవీలు నిలిచిపోవడంతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. బ్రాంచీలన్నీ ఆర్థికంగా నలిగిపోతాయి.
Advertisement
Advertisement