(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి) : ‘సహకార రంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. సహకార రంగం బలోపేతానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు ప్రశంసనీయం. ఈ రంంగంలో అంతర్జాతీయంగా భారత్ ఎంత బలంగా ఉందో.. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతే బలంగా ఉంది. రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్)తో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు) చాలా బాగా పనిచేస్తున్నాయి.
రికార్డుస్థాయి వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. 36 ఏళ్ల తర్వాత కర్నూలు, 28 ఏళ్ల తర్వాత కడప డీసీసీబీలు లాభాల బాట పట్టాయంటే ఆషామాషీ కాదు. ప్యాక్స్‌ను కూడా లాభాల్లోకి తేవాలి’ అని జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్‌స్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ సహకార బ్యాంకింగ్ సమాఖ్య (ఐసీఏ) సభ్యుడు భీమా సుబ్రహ్మణ్యం చెప్పారు. ఐసీఏ సభ్యునిగా ఎన్నికై తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
డీసీసీబీలకూ షెడ్యూల్ హోదా వచ్చేలా కృషి
రాష్ట్రాల సహకార బ్యాంకుల (అపెక్స్ బ్యాంకు)ను ఒకే గొడుగు కిందకు తేవాలన్న సంకల్పంతో నాఫ్‌స్కాబ్ ఏర్పాటైంది. ఇది అపెక్స్ బ్యాంకులకు – ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. రైతులకు అనుకూలంగా పాలసీల రూపకల్పనలో కృషి చేస్తుంది. దేశంలోని 351 డీసీసీబీల్లో 348 డీసీసీబీలకు ఆర్‌బీఐ లైసెన్సులిచ్చేలా కృషి చేశాం.
నాఫ్‌స్కాబ్ కృషి వల్లే దేశంలోని 34 అపెక్స్ బ్యాంకుల్లో 24 షెడ్యూల్ హోదా పొందాయి. డీసీసీబీలకు కూడా షెడ్యూల్ హోదా కలి్పంచేలా పాలసీ తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. నాఫ్‌స్కాబ్‌లో అపెక్స్ బ్యాంకులతో పాటు డీసీసీబీలకు కూడా సభ్యత్వం ఇవ్వాలా లేక అసోసియేట్‌గా గుర్తించాలా అనే విషయంపై సెపె్టంబర్‌లో నిర్ణయం తీసుకుంటాం.
రీ ఫైనాన్స్ 80 శాతానికి పెంచాల్సిందే
సహకార స్ఫూర్తితో ఏర్పాటైన బ్యాంకులు లాభాపేక్షతో పనిచేయడం సరికాదు. నాబార్డు 80 శాతం రీఫైనాన్స్ చేస్తేనే అపెక్స్ బ్యాంకులు డీసీసీబీలకు, వాటి పరిధిలోని ప్యాక్స్‌కు ఆ స్థాయిలో రీఫైనాన్స్ చేస్తాయి. నాబార్డు రీఫైనాన్స్‌ను 50 శాతం నుంచి 80 శాతానికి పెంచేలా నాఫ్‌స్కాబ్ కృషి చేస్తోంది. నష్టాల్లో ఉన్న ప్యాక్స్‌లకు ఆ ర్థిక సాయం చేయాల్సిన బాధ్యత అపెక్స్ బ్యాంకులదే. ఈ రంగంలో రెండంచెల వ్యవస్థ కంటే మూడంచెల వ్యవస్థ చాలా మంచిది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎ‹ఫ్‌పీవో)ను ప్రోత్సహించడం మంచిదే కానీ, సహకార చట్టం ప్రకారం వాటికి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేయాలి.
భారత్ సహకార వ్యవస్థ బలంగా ఉంది
భారత్‌లో సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంది. సుమారు 15 కోట్ల మంది భాగస్వాములైన వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. అయితే, దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారు. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధం. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన పాలక మండళ్ల ద్వారా పాలన సాగిస్తే సహకార వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది.
ఆర్బీకేలతో అనుసంధానం మంచి ఆలోచనే
దేశంలో ఏపీ, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయి. మంచి వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. ఏపీలో మంచి పురోగతి కన్పిస్తోంది. దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్న బ్యాంకులు లాభాల బాట పట్టాయంటే దాని వెనుక ఎంతో కృషి ఉంది. ఆర్బీకేలతో పీఏసీఎస్‌లను అనుసంధానించడం మంచి ఆలోచనే. దీనివల్ల గ్రామ స్థాయిలో రైతులకు మరింత మంచి జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment