డీసీసీబీల్లో కామన్‌ క్యాడర్‌ బదిలీలు  | Ceanse The Co Operative Banks Minister Kakani says | Sakshi
Sakshi News home page

డీసీసీబీల్లో కామన్‌ క్యాడర్‌ బదిలీలు 

Published Thu, Jan 19 2023 7:59 AM | Last Updated on Thu, Jan 19 2023 8:22 AM

Ceanse The Co Operative Banks Minister Kakani says - Sakshi

సాక్షి, అమరావతి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న జనరల్‌ మేనేజర్‌(జీఎం), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(డీజీఎం) స్థాయి అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఎక్కడి బ్యాంకులో విధుల్లో చేరితే ఆ బ్యాంకులోనే పదోన్నతు­లు పొందడమే కాదు.. పదవీ విరమణ వరకు కొ­నసాగేవారు. దశాబ్దాలుగా ఒకే బ్యాంకులో పాతుకుపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఘటనలున్నాయి. వీటన్నింటికీ చెక్‌ పెడుతూ డీసీసీబీల్లో కామన్‌ క్యాడర్‌ అమలు చే­యాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

ఇందుకోసం సహకార చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో ప్ర­త్యేక చట్టం చేసింది. 2, 3 స్థాయిల్లో పనిచేసే అధికారుల(జీఎం, డీజీఏం)ను కామన్‌ క్యాడర్‌ కిందకు తీసుకొచ్చారు. జోనల్‌ పరిధిలో సీనియారిటీ ప్రాతిపదికన ప్రతి మూడేళ్లకోసారి బదిలీ చేయబోతున్నారు. నైపుణ్యం, పనితీరు ఆధారంగా ఈ బ­ది­లీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 డీసీసీబీ బ్యాం­కుల పరిధిలో జీఏం పోస్టులు 24, డీజీఏం పోస్టులు 47 ఉండగా.. ప్రస్తుతం 22 మంది జీఎం, 43 మంది డీజీఏంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తు­న్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరికి తొలుత బదిలీలు ఆ తర్వాత పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం మార్గదర్శకాల రూపకల్ప­న బాధ్యతను ఆప్కాబ్‌కు అప్పగించారు. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలు రూపొందించి ఆ వెంటనే బదిలీలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఉగాదికల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.  

సహకార బ్యాంకుల ప్రక్షాళనే లక్ష్యం 
సహకార బ్యాంకులను ప్రక్షాళన చేయడం.. వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్‌ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఏళ్ల తరబడి ఒకేచోట ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి స్థానచలనం కల్పించాలని నిర్ణయించాం. ఇందుకు అనుగుణంగానే చట్టాన్ని సవరించాం. కోర్టుల్లో అడ్డంకులు తొలిగిపోగానే హెచ్‌ఆర్‌ పాలసీని కూడా అమలు చేస్తాం.  
– కాకాణి గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement