Co-operative banks
-
రైతుల ‘వేలం’వర్రీ!
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పెంపకం కోసమో, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, ఇతరత్రా అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ బకాయిలను రాబట్టుకుంటున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు).. నిస్సహాయ పరిస్థితుల్లో రుణాలు చెల్లించని వారి భూములు, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలానా రోజు ఫలానా రైతు భూమిని వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తుండటంతో పరువు పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉన్నా మొత్తం భూమిని డీసీసీబీలు వేలం వేస్తుండటంతో తమకు భూమి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయంలోనే కఠిన వైఖరి? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని పరిధిలో జిల్లా స్థాయిలో డీసీసీబీలు ఉంటాయి. వాటి కింద ప్యాక్స్ పని చేస్తుంటాయి. ఇవి ప్రధానంగా రైతుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీటి చైర్మన్లను, డైరెక్టర్లను రైతులే ఎన్నుకుంటారు. డీసీసీబీల చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ బ్యాంకులు రైతులకు అవసరమైన పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే డీసీసీబీలు ప్రతి ఏటా వేలాది కోట్లు రైతులకు రుణాలు అందిస్తుంటాయి. రైతులతోపాటు ఇతరులకు కూడా గృహ, విద్య రుణాలు కూడా ఇస్తుంటాయి. రైతులకైతే ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనేందుకు, భూములను చదును చేసుకునేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, గొర్రెల పెంపకం తదితరాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంటారు. అయితే పలుకుబడి కలిగి కోట్ల రూపాయలు తీసుకునే వారిపై, రాజకీయ నాయకుల విషయంలో మెతక వైఖరి అవలంభించే డీసీసీబీలు రైతుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల విషయంలో కోట్లు రికవరీ చేయలేక నష్టాలను చవిచూస్తున్న అనేక సహకార సంఘాలు, రైతులను మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎలాగోలా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. భూములను వేలం వేస్తున్నాయి. వేలం పాటలో ఆయా గ్రామాల ఇతర రైతులు ఎవరూ పాల్గొనకపోతే డీసీసీబీలే స్వాదీనం చేసుకుంటున్నాయి. మరోవైపు చెల్లించాల్సిన రుణం కంటే ఎక్కువ విలువున్న భూములను వేలం వేయడంపై రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా వచ్చే డబ్బును రైతులకే ఇస్తున్నామని అధికారులు అంటున్నా, కొద్దిపాటి భూమిని కూడా తమకు ఉంచడం లేదని రైతులు అంటున్నారు. అప్పుకు మించి భూమిని అమ్మే హక్కు సహకార బ్యాంకులకు ఎక్కడ ఉందని నిలదీస్తున్నారు. మరీ విచిత్రంగా కేవలం రూ.50 వేల రుణం ఉన్న రైతుల ఆస్తులను కూడా వేలం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 202 మందికి నోటీసులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో 78 ప్యాక్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 22 డీసీసీబీ బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది (2023–24) పంట రుణాల కింద 62 వేల మంది రైతులకు రూ. 672 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద 1,100 మందికి రూ.70 కోట్లు, గృహ రుణాల కింద 200 మందికి రూ.18 కోట్లు, విద్యా రుణాల కింద 180 మందికి రూ.14 కోట్లు అందజేశాయి. ఇందులో దీర్ఘకాలిక రుణాలు పెండింగ్‌లో ఉన్న 202 మందికి బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు జారీ చేసి రూ.8 కోట్లు రికవరీ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతుల భూములు, ఆస్తులను కూడా వేలం వేయడం గమనార్హం. నిజామాబాద్‌లో 71 మందికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీలో ఇళ్లు, వ్యవసాయ భూములు, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెట్టి కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 71 మందికి డీసీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా అప్పులు చెల్లించని రైతుల ఆస్తులను వేలం వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో డీసీసీబీలు పంట రుణాలు ఇస్తాయి. గడిచిన వానాకాలంలో రూ.469.82 కోట్లు, యాసంగి సీజన్లో రూ.126.68 కోట్లు పంట రుణాలుగా ఇచ్చాయి. అలాగే రూ. 236.38 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. రైతులు రుణాలు చెల్లించకుంటే ఆస్తులను వేలం వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. డీసీసీబీలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయి రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు, పేరుకు పోయిన ఇతరత్రా రుణాలను రికవరీ చేయాల్సిన బాధ్యత డీసీసీబీలపై ఉంటుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం అవి పనిచేయాలి. రైతులు తమ భూములు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులను తనఖా పెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. అయితే ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే క్రమంలో రైతులకు నోటీసులు ఇస్తున్నారు. పలు జిల్లాల్లో భూములు, ఇతర ఆస్తులు వేలం వేస్తున్నారు. నిబంధనల ప్రకారమే డీసీసీబీలు వ్యవహరిస్తున్నాయి. – నేతి మురళీధర్‌రావు, ఎండీ, టెస్కాబ్ – నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గాను గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017 డిసెంబర్లో తనకున్న 2.30 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.7.20 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. మూడు కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9.68 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉండగా.. రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. – జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) పరిధిలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి తండ్రి సంజీవరెడ్డి కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్ కోసం మూడెకరాలు తాకట్టు పెట్టి రూ.1,66,000 రుణం తీసుకున్నాడు. మూడేళ్ల అనంతరం లోన్ సరిగా చెల్లించడంలేదని ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. దీంతో చంద్రకాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా కేసు నడుస్తోంది. ఇలావుండగా పొలం వేస్తున్నామంటూ ఇటీవల ప్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో చంద్రకాంత్ తమ ట్రాక్టర్ సీజ్ చేశారని, పొలం ఎలా వేలం వేస్తారని నిలదీసినా ఫలితం లేకపోయింది. ఎకరం రూ.12.10 లక్షల చొప్పున మరో రైతుకు విక్రయించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లో ఉన్న మొత్తం 4.12 ఎకరాలు రెడ్‌మార్క్‌లో పెట్టడంతో రైతు లబోదిబోమంటున్నారు. -
డీసీసీబీల్లో కామన్ క్యాడర్ బదిలీలు
సాక్షి, అమరావతి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న జనరల్ మేనేజర్(జీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్(డీజీఎం) స్థాయి అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఎక్కడి బ్యాంకులో విధుల్లో చేరితే ఆ బ్యాంకులోనే పదోన్నతులు పొందడమే కాదు.. పదవీ విరమణ వరకు కొనసాగేవారు. దశాబ్దాలుగా ఒకే బ్యాంకులో పాతుకుపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఘటనలున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ డీసీసీబీల్లో కామన్ క్యాడర్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సహకార చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసింది. 2, 3 స్థాయిల్లో పనిచేసే అధికారుల(జీఎం, డీజీఏం)ను కామన్ క్యాడర్ కిందకు తీసుకొచ్చారు. జోనల్ పరిధిలో సీనియారిటీ ప్రాతిపదికన ప్రతి మూడేళ్లకోసారి బదిలీ చేయబోతున్నారు. నైపుణ్యం, పనితీరు ఆధారంగా ఈ బదిలీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 డీసీసీబీ బ్యాంకుల పరిధిలో జీఏం పోస్టులు 24, డీజీఏం పోస్టులు 47 ఉండగా.. ప్రస్తుతం 22 మంది జీఎం, 43 మంది డీజీఏంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరికి తొలుత బదిలీలు ఆ తర్వాత పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం మార్గదర్శకాల రూపకల్పన బాధ్యతను ఆప్కాబ్‌కు అప్పగించారు. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలు రూపొందించి ఆ వెంటనే బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉగాదికల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. సహకార బ్యాంకుల ప్రక్షాళనే లక్ష్యం సహకార బ్యాంకులను ప్రక్షాళన చేయడం.. వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఏళ్ల తరబడి ఒకేచోట ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి స్థానచలనం కల్పించాలని నిర్ణయించాం. ఇందుకు అనుగుణంగానే చట్టాన్ని సవరించాం. కోర్టుల్లో అడ్డంకులు తొలిగిపోగానే హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేస్తాం. – కాకాణి గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
8 సహకార బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా
ముంబై: నియంత్రణా పరమైన నిబంధనలు పాటించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది సహకార బ్యాంకులపై జరిమానాలు విధించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు బ్యాంకులు ఉండగా, తెలంగాణా, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఆర్బీఐ జరిమానాకు గురైన బ్యాంకులు ఉన్నాయి. ఈ మేరకు వెలువడిన ప్రకటనల ప్రకారం... ► ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సహకార బ్యాంకుపై రూ.55 లక్షల జరిమానా. ► నెల్లూరు కో–ఆపరేటివ్ అర్బన్‌బ్యాంక్‌పై రూ.10 లక్షలు. ► కాకినాడ కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌పై రూ.10 లక్షలు. ► తెలంగాణ, హైదరాబాద్ దారుసల్లాం సహకార అర్బన్ బ్యాంక్‌పై రూ.10 లక్షలు. ► తమిళనాడు, తిరుచిరాపల్లి, కైలాసపురంలో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.10 లక్షల జరిమానా. ► కేరళ, పాలక్కాడ్ జిల్లా, ది ఒట్టపాలెం కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 5 లక్షలు. ► ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.5 లక్షలు. ► ఒడిస్సాలోని కేంద్రపారా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రూ. లక్ష. -
తక్కువ వడ్డీకే రుణాలు అందేలా చూడండి: సీఎం వైఎస్ జగన్
-
మూడు సహకార బ్యాంకులకు గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నేడు(ఫిబ్రవరి 21) మూడు సహకార బ్యాంకుల(రెండు తమిళనాడు, ఒకటి జమ్మూ కాశ్మీర్)పై భారీ జరిమానా విధించింది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘన నేపథ్యంలో కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్-కాంచీపురం, చెన్నై-సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బారాముల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మీద క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అందులో భాగంగన్ చెన్నై సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ పై ₹1 లక్షల జరిమానా, మిగిలిన రెండు బ్యాంకులపై ₹2 లక్షల జరిమానా ఆర్బీఐ విధించినట్లు తెలిపింది. బారాముల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ విషయంలో నాబార్డ్ నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలలో కొన్ని విభాగాల పనితీరు చట్ట విరుద్ధంగా ఉందని ఆర్బీఐ తెలిపింది నిర్దిష్ట ఆర్బీఐ ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు డిపాజిట్లను సేకరించినట్లు తేలడంతో జరిమానా ఎందుకు విధించకూడదో కారణం తెలపాలని బ్యాంకుకు సలహా ఇస్తూ నోటీసు జారీ చేసింది. బ్యాంకు సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిబందనలు ఉల్లంఘన అభియోగాలు రుజువు కావడంతో జరిమానా విధించినట్లు తెలిపింది. మరో కేసులో, బిగ్ కాంచీపురం కో-ఆపరేటివ్ బ్యాంకును తనిఖీ చేసినప్పుడు ఆర్బీఐ నిబందనలను ఉల్లగించడంతో బ్యాంకుకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. (చదవండి: అదిరిపోయిన హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్?) -
సహకార రంగం.. బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను పునర్ వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (నాబ్కాన్స్) చేసిన సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు అంగీకరించారు. పీఏసీఎస్‌లలో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్ చేయించాలని, రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కార్యాచరణ ఉండాలని చెప్పారు. మూడవ పార్టీతో (థర్డ్ పార్టీ) స్వతంత్రంగా విచారణ చేయించాలని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి సంబంధించిన యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఎన్ఏబీసీఓఎన్ఎస్ – నాబ్కాన్స్) సిఫార్సులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు గురించి అధికారులు సీఎంకు వివరించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని నివేదించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని, 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని చెప్పారు. రుణాలు తక్కువగా ఇవ్వడంతోపాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంట రుణాలకే పరిమితం అవుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. డీసీసీబీల పనితీరు మెరుగవ్వాలి డీసీసీబీల్లో మెరుగైన పనితీరు ఉండాలని, వీటి నుంచి చక్కగా రుణాలు అందాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రుణాలు ఎవరికి ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలి అనే దానిపై నిర్దిష్ట విధివిధానాలు ఉండాలని, ఈ విధివిధానాలకు లోబడే అందరి పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు డీసీసీబీలు దన్నుగా నిలిచేలా పలు సిఫార్సులకు ఆమోదం తెలిపారు. కోఆపరేటివ్ బ్యాంకుల మార్కెట్ షేర్ 20 శాతం వరకు పెంచాలని నిర్ణయించారు. ఆర్బీకేల కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా డీసీసీబీల రుణ ప్రణాళికలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఎంఎస్ఎంఈలకు దన్నుగా ఉండేలా రుణ కార్యక్రమాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. డీసీసీబీ బ్యాంకుల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల భావం పోవడంతో పాటు విశ్వాసం, నమ్మకం కలిగించాలని సూచించారు. నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రుణాలు ఇవ్వడంలో మంచి ప్రమాణాలు పాటించాలని, ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా అవినీతి ఉండకూడదన్నారు. డీసీసీబీ బ్యాంకుల సమర్థత పెరగడంతో పాటు మంచి యాజమాన్య పద్ధతులు రావాలని పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని, దీనివల్ల ఆ కర్మాగారాలకు ఊరట లభిస్తుందని సూచించారు. ఏప్రిల్ 15 నాటికి గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు వ్యవసాయం అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం చేపడుతున్న మల్టీ పర్పస్ సెంటర్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గోడౌన్ల నిర్మాణానికి ఏప్రిల్ 15 కల్లా టెండర్ల ఖరారు చేసి, ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు వెల్లడించారు. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ మల్టీపర్పస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్లు, డ్రైయింగ్ యార్డులు, కోల్డు రూమ్‌లు, పంటల సేకరణ కేంద్రాలు ఇతర వ్యవసాయ పరికరాలు, సామగ్రి మొత్తం వీటన్నింటి కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సహకార శాఖ స్పెషల్ సెక్రటరీ వై మధుసూదనరెడ్డి, కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ బాబు ఏ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాల వెల్లువతో రైతులకు మంచి రేటు పాల వెల్లువ కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రైతులకు మంచి రేటు దొరుకుతోందని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాలకూ ప్రాజెక్టును విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. పాల వెల్లువతో మార్పు ఇదీ.. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఫార్సులపై చర్చ సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసిన సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి. ► సమగ్ర బ్యాంకు సేవల కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలి. ► పీఏసీఎస్‌లు క్రెడిట్ సేవలతో పాటు నాన్ క్రెడిట్ సేవలు కూడా అందించాలి. ► పీఏసీఎస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలి. ఇందులో భాగంగా ప్రతి 3 ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలి. ► ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలి. వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలి. ► బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలి. బోర్డులో సగం మంది ప్రతి రెండున్నరేళ్లకు విరమించేలా ఏపీసీఎస్ యాక్ట్‌కు సవరణ తీసుకురావాలి. పీఏసీఎస్‌లోనూ మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాలి. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్ సభ్యులుగా తీసుకురావాలి. -
రైతులకు మరో రూ.1,300 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నేపథ్యంలో సహకార బ్యాంకులు, సంఘాలు రైతులకు స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ (వినిమయ) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వు బ్యాంకు ఈ సౌకర్యాన్ని కల్పించిన విషయం విదితమే. విపత్కర పరిస్థితుల్లో ఉత్పాదకత, క్రయవిక్రయాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులు, పరిశ్రమలకు ఈ సౌకర్యాన్ని ఆరునెలల కిందటే అందుబాటులోకి తీసుకువచ్చింది. రిజర్వు బ్యాంకు ఈ సౌకర్యాన్ని సహకార బ్యాంకులకు విస్తరించడంతో సహకార సంఘాలు రైతులకు స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో రైతులకు మొత్తం సాగు ఖర్చులకు వారు ఇచ్చిన పొలం పత్రాల ఆధారంగా రుణాలు మంజూరు చేశారు. కోవిడ్–19 నేపథ్యంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో గతంలో ఇచ్చిన రుణం కాకుండా అదనంగా మరికొంత రుణవసతి కల్పిస్తున్నాయి. సకాలంలో రుణాలు చెల్లించిన ట్రాక్ రికార్డు కలిగిన రైతులు, బ్యాంకులో రుణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. 8 శాతం వడ్డీ రేటుతో ఏడాదికాలంలో రుణం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వరి కోతకు వచ్చిన సమయం కావడంతో రైతుకు ఖర్చులకు, ఇతర పంటల రైతులకు వాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చారు. ఈ తరహా రుణం గతంలో ఎప్పుడూ ఇవ్వకపోవడంతో రైతులకు అవగాహన కలిగించేందుకు సహకార బ్యాంకులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రుణాలు ఇవ్వడానికి రాష్ట్రంలో 2,030 ప్రాథమిక సహకార సంఘాలు, బ్యాంకులకు ఆప్కాబ్ రూ.1,300 కోట్లు కేటాయించింది. సంఘాలు తమ పరిధిలోని రైతుల అవసరాలు, వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ రుణాలను ఇస్తున్నాయని ఆప్కాబ్ అధికారులు తెలిపారు. -
ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
న్యూఢిల్లీ: సహకార బ్యాంకుల్లో పాలన మెరుగుపడనుంది. డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు రక్షణ లభించనుంది. ఇందుకుగాను అన్ని పట్టణ, బహుళ రాష్ట్రాల్లో పనిచేసే సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) వైఫల్యం తరహా సంక్షోభాలకు చోటివ్వకుండా ఈ నిర్ణయానికి వచ్చింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ భేటీ అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా వాణిజ్య బ్యాంకుల మాదిరే ఇకమీదట ఆర్బీఐ పర్యవేక్షణ కిందకు 1,540 పట్టణ కోపరేటివ్, మల్టీ స్టేట్ కోపరేటివ్ (ఒకటికి మించి రాష్ట్రాల్లో పనిచేసేవి) బ్యాంకులు రానున్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 1,482 అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీస్టేట్ కోపరేటివ్ బ్యాంకులు పనిచేస్తుండగా.. వీటి పరిధిలో 8.6 కోట్ల డిపాజిటర్లకు సంబంధించి రూ. 4.85 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎంసీ బ్యాంకులో రుణాల స్కామ్ వెలుగు చూడడంతో ఆర్బీఐ 2019 సెప్టెంబర్ 23న నిషేధం విధించడం తెలిసిందే. దీంతో డిపాజిట్ల ఉపసంహరణపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అదే విధంగా కాన్పూర్‌కు చెందిన పీపుల్స్ కోపరేటివ్ బ్యాంకు డిపాజిట్ల ఉపసంహరణపైనా ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ ఈ నెల మొదట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చిన్న రుణాలపై తగ్గనున్న వడ్డీ భారం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం (పీఎంఎంవై) కింద శిశు రుణ ఖాతాలపై 2% వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది . లాక్‌డౌన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారస్తులకు ఈ నిర్ణయం మేలు చేయనుంది. ముద్రా యోజన పథకం కింద శిశు రుణాల విభాగంలో ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను రూ.50,000 వరకు బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. ఈ రుణాలు తీసుకున్న వారికి వడ్డీలో 2% మేర ఏడాది వరకు రాయితీ లభించనుందని.. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.1,542 కోట్ల భారం పడుతుందని జవదేకర్ తెలిపారు. 2020 మార్చి నాటికి బకాయిలు చెల్లించాల్సి, నిరర్థక ఆస్తుల(ఎన్పీఏలు) జాబితాలో లేని రుణ ఖాతాలకు ఇది అమలుకానుంది. ఈ పథకం ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు అమల్లో ఉంటుంది. ఆర్బీఐ మారటోరియం (రుణ చెల్లింపుల విరామం) కింద ఉన్న ఖాతాలకు.. మారటోరియం నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి 12 నెలల పాటు (2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఆగస్ట్ 31 వరకు) వడ్డీ రాయితీ లభిస్తుంది. 2020 మార్చి నాటికి పీఎంఎంవై çపరిధిలోని శిశు విభాగంలో రూ.9.37 కోట్ల రుణ ఖాతాలున్నాయి. దీని కింద విడుదల చేసిన రుణాల మొత్తం రూ.1.62 లక్షల కోట్లుగా ఉంది. రూ. 15 వేల కోట్లతో ‘పశుసంవర్ధక మౌలిక’ నిధి సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీని అనుసరించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ. 15,000 కోట్లతో పశుసంవర్థక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఏహెచ్ఐడీఎఫ్)కి బుధవారం ఆమోదం తెలిపింది. పాడి, మాంసం ప్రాసెసింగ్, విలువ పెంచే మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేటు రంగంలో పశుగ్రాస కర్మాగారాల స్థాపన వంటి మౌలిక సదుపాయాల స్థాపనలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఏహెచ్ఐడీఎఫ్ వీలు కల్పిస్తుంది. ఈ పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లు, ఎంఎస్ఎంఈలు, సెక్షన్ 8 కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు కనీసం 10% మార్జిన్ మనీతో పెట్టుబడి పెడితే మిగిలిన 90% షెడ్యూల్డ్ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అర్హతగల లబ్ధిదారులకు భారత ప్రభుత్వం 3% వడ్డీ రాయితీని కల్పిస్తుంది. ప్రధాన రుణ మొత్తానికి 2 సంవత్సరాల మారటోరియం ఉంటుంది. నాబార్డ్ నిర్వహించేలా రూ. 750 కోట్లతో మరొక క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎంఎస్ఎంఈ పరిధిలో మంజూరైన ప్రాజెక్టులకు క్రెడిట్ గ్యారంటీ కోసం ఈ నిధిని ఉపయోగిస్తారు. -
ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. దేశంలో అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. అన్ని కో ఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో 1,482 కో ఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నట్టు చెప్పారు. ఆర్బీఐ పరిధిలోకి తేవడం వల్ల ఆ బ్యాంకుల్లోని 8.6 కోట్ల మంది ఖాతాదారులకు సొమ్ముకు భద్రత కల్పించినట్టు అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మరోవైపు పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ మరింత సులభతరం కానుందని మంత్రి చెప్పారు. ధ్రువీకరణ పత్రాల జాబితాను కుదించినట్టు తెలిపారు. పాస్‌పోర్ట్ జారీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువు మరో 6 నెలలు పొడిగింపు జనవరి 31, 2021 కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశం పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు ఆమోదం -
ఓటు కొనుగోలు: గుట్టుగా ఖాతాల్లోకి నిధులు
సాక్షి, అమరావతి: ఎన్నికల రాజకీయ చట్రంలో సహకార బ్యాంకులు ఇరుక్కుపోయాయి. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి తమకు అనుకూలంగా మార్చుకోవడం అలవాటుగా చేసుకున్న టీడీపీ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలోనే గ్రామీణ సహకార బ్యాంకులను ఫుల్‌గా వాడేసుకుంది. కొన్ని గ్రామీణ బ్యాంకుల్లో ఎన్నికలు మూడు నెలలకు ముందుగానే తమకు అనుకూలమైన వ్యక్తుల పేరున పెద్ద మొత్తంలో నిధులు డిపాజిట్ చేసింది. ఎన్నికలకు పది రోజులకు ముందుగా ఆ మొత్తాలను ఇతర ప్రాంతాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వ్యక్తులకు బదిలీ చేసి, అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థుల అనుచరులకు నగదు అందేలా ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు ఇలా వ్యక్తుల పేరు మీద రూ.3 నుంచి రూ.5 కోట్లు డిపాజిట్ కావడం, ఒకటి రెండు నెలల్లోనే ఇతర ప్రాంతాల్లోని గ్రామీణ బ్యాంకులకు బదిలీ కావడం ఉద్యోగ వర్గాల్లో అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ గ్రామీణ బ్యాంకుల పాలకవర్గాలు టీడీపీ నేతల పరిధిలోనే ఉండటంతో ఉద్యోగ వర్గాలు మాట్లాడలేకపోయాయి. గ్రామీణ బ్యాంకుల పాలకవర్గ సభ్యులు ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులకు గుట్టుచప్పుడు కాకుండా నగదు అందే ఏర్పాటు చేసి పార్టీ గెలిచేందుకు తమ వంతు సహకారాన్ని అందించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులనూ వదలని ప్రభుత్వం అప్పటి స్కెచ్‌ను గ్రామీణ సహకార బ్యాంకులకు పరిమితం కాకుండా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల వరకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఎన్నికలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలనూ ప్రభుత్వం వాడుకునే ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు అనువుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాల పదవీ కాలాన్ని ఫిబ్రవరిలో రెండోసారి కూడా పొడిగించింది. వాస్తవంగా ఒకసారి ఆరు నెలలపాటు పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించిన తరువాత రెండోసారి పదవీ కాలాన్ని పొడిగించడానికి బలమైన కారణం ఉండాలి. లేకుంటే ప్రత్యేక అధికారి పాలనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈసారి ప్రత్యేక కారణాలు లేకపోయినా, ఐదారు నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ వీటి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మొత్తం 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించినా, అందులో మూడు కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల పాలనలో ఉన్నాయి. ఈ మూడింటి పదవీ కాలం పొడిగించకుండా మిగిలిన ఆరు పాలకవర్గాల పదవీ కాలం పొడిగిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం తొమ్మిది పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించింది. కొద్ది మొత్తాలుగా బదిలీ ఆర్థిక పరిస్ధితులు ఆశాజనకంగా లేని కొందరు రైతులు, వ్యక్తుల ఖాతాల్లో నిధులు పెద్ద మొత్తంలో డిపాజిట్ అతున్నాయని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కొందరి ఖాతాల్లో జమ అయిన మొత్తాలు ఇతర ప్రాంతాల్లోని రైతులు, వ్యక్తుల పేరున ఆర్టీజీఎస్, నెఫ్ట్ విధానాల ద్వారా కొద్ది మొత్తాలుగా బదిలీ అవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ నగదు బదిలీ కేవలం టీడీపీ అభ్యర్థులు, వారి అనుచరులకు అందచేయడానికేనని చెబుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లావాదేవీలపై ఎన్నికల సంఘం నిఘా ఉంచాలని పలువురు కోరుతున్నారు. రూ.4 వేల కోట్ల టర్నోవర్ రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలో 2,808 ప్రాథమిక çవ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఈ సంఘాల్లోని రైతులందరికీ దాదాపుగా సేవింగ్స్ ఖాతాలుంటాయి. 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో సాలీనా రూ.4 వేల కోట్ల వరకు టర్నోవర్ జరుగుతోంది. రైతులకు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలకు ఈ బ్యాంకులు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను అందిస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బు అందచేయాలనే ఆలోచనలో టీడీపీ ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీజీఎస్, నెఫ్ట్ విధానాలతో గుట్టుచప్పుడు కాకుండా నిధులను బదిలీ చేసి టీడీపీ అభ్యర్థులు, వారి అనుచరులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఇందుకు అనువుగా ఇటీవల శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటితోపాటు ఆప్కాబ్ పదవీ కాలాన్ని పొడిగించింది. -
పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్ ఛాన్స్
న్యూఢిల్లీ : బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ఇండియా, కేంద్ర ప్రభుత్వం మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రద్దయిన పెద్దనోట్లను డిపాజిట్ చేసేందుకు అవకాశమిచ్చింది. పాత రూ.500, రూ.1000 నోట్లను కొత్తనోట్లతో మార్చుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. డీమానిటైజేషన్ కాలంలో పోస్ట్ ఆఫీసులు, సహకార బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత నోట్లను నిర్ణీత గడువు లోపల మార్చుకోవచ్చని వివరించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన అధికారిక నోటిఫికేషన్లో నోట్ల మార్పిడి అంశాన్ని ప్రకటించింది. బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు తమ దగ్గర ఉన్న పాతనోట్లను రిజర్వ్ బ్యాంక్ ఏ కార్యాలయంలో అయినా మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. దీనికి 30 రోజుల వ్యవధిని ఇచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ బ్యాంకుల ఖాతా క్రెడిట్ ద్వారా నోట్ల మార్పిడి విలువను పొందవచ్చని తెలిపింది. సహకార బ్యాంకుల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్న పాత నోట్ల నిల్వలు, రైతులకు రుణాలందించేందుకు అనేక జిల్లాల కో-ఆపరేటివ్ బ్యాంకుల దగ్గర తగిన నిధులు లేవన్ననివేదికల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న సహకార బ్యాంకులకు, ముఖ్యంగా మహారాష్ట్ర సహకార బ్యాంకులకు భారీ ఉపశమనం లభించనుంది. సహకార బ్యాంకులలో కూడా పాత 500, 1000 రూపాయల నోట్లను జమ చేసుకునే అవకాశం కల్పించడంతో కుప్పలు తెప్పలుగా డిపాజిట్ లు వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో డిపాజిట్లకు గడుపుపెంచాలని ఇవి కోరాయి. నాసిక్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో రద్దయిన పాత నోట్ల విలువ రూ.340 కోట్లు అని, ఈ డబ్బు మార్పడి చేయకపోతే చెల్లింపులు చేయటం కష్టమవుతుందని నాసిక్ డిసిసిబి ఛైర్మన్ నరేంద్ర దరాడే పేర్కొన్నారు. అయితే డిమానిటైజేషన్ తరువాత దాదాపు ఆరు నెలల తర్వాత, తమ దగ్గర పాత కరెన్సీ నిల్వలు భారీగా ఉన్నాయని, మార్పిడికి అవకాశం ఇవ్వాలన్న వీటి ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించిన సంగతి తెలిసిందే. -
నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సహకార బ్యాంకులపై ఆధారపడి గ్రామీణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కో-ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రైతుల నగదు అవసరాలు తీర్చేందుకు సహకార బ్యాంకులకు సాయం చేయాలని బ్యాంకులకు అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ఈ విషయమై ఆర్బీఐ, నాబార్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో చర్చించామని పేర్కొన్నారు. చేనేత, చేతివృత్తుల సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. -
సహకార బ్యాంకులకు నగదు సాయం
బ్యాంకులకు కేంద్రం సూచన న్యూఢిల్లీ: రైతుల నగదు అవసరాలు తీర్చేందుకు సహకార బ్యాంకులకు సాయం చేయాలని బ్యాంకులకు కేంద్రం సూచించింది. ఈ విషయమై ఆర్బీఐ, నాబార్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో చర్చించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులకు వారానికి కావాల్సిన నగదు మొత్తంపై నాబార్డ్ నివేదిక సమర్పించిందని, అనుబంధంగా ఉన్న సహకార బ్యాంకుకు బ్యాంకులు తగిన వనరులు సమకూర్చాలని నిర్ణరుుంచామన్నారు. రూ. 10 నాణేలు చెల్లుబాటు అవుతాయి పాత, కొత్త 10 రూపారుుల నాణేలు చెల్లుబాటు అవుతాయనీ, వదంతులను నమ్మవద్దని ఆర్బీఐ సోమవారం వెల్లడించింది. ఏ కొనుగోలుకై నా రూ. 10 నాణేన్ని వాడుకోవచ్చంటూ స్పష్టం చేసింది. చేనేత, చేతివృత్తుల సొసైటీల్లో మైక్రో ఏటీఎంలు చేనేత, చేతివృత్తుల సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. బ్యాంకు అధికారులతో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ. 4.8 లక్షల నకిలీ 2 వేల నోట్ల పట్టివేత ఒడిశాలో రూ. 4.8 లక్షల మేర 2 వేల నకిలీ నోట్లు మారుస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్ బంకులో నకిలీ కరెన్సీ మారుస్తుండగా ఝార్సుగూడకు చెందిన మధుసూదన్ మెహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 2 వేల నోటుకు కలర్ జిరాక్స్ తీసి వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
న్యాయపోరాట యోచనలో సహకార బ్యాంకులు
అమరావతి: రాష్ట్రంలోని సహకార బ్యాంకు ఉద్యోగులు న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు వేసేందుకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ వారం క్రితం రిజర్వు బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. అక్కడి ఉద్యోగ సంఘాల నాయకులు మూడు రోజుల క్రితం కేరళ హైకోర్టును ఆశ్రయిస్తే 28వ తేదీకి కేసు వాయిదా పడింది. తమిళనాడులో ఒక రైతుతో అక్కడి ఉద్యోగ సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేయించాయి. ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగ సంఘాల న్యాయపోరాటాల గురించి తెలుసుకుంటున్న ఏపీ సహకార ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యక్ష పోరాటం చేస్తూనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం ఉద్యోగ సంఘాల నాయకులు ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావును ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా రుద్రపాకలో కలిశారు. 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగులు హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ఎదుట ధర్నా చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఆప్కాబ్‌లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్న నేపథ్యంలో ధర్నా తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకటిరెండు రోజుల్లో హైకోర్టులో కేసు వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల సహకార బ్యాంకులపై ఖాతాదారులకు నమ్మకం పోయే పరిస్థితులున్నాయని, సహకార రంగం మనుగడకు వెంటనే నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో కేసు వేయనున్నారు. -
కమర్షియల్ కు దీటుగా కో-ఆపరేటివ్ సేవలు
ఖాతాదారులకు ఏటీఎంల పంపిణీ దోమకొండ: కమర్షియల్ బ్యాంకులకు దీటు గా కో ఆపరేటివ్ బ్యాంకులు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయని డీసీసీబీ ఉపాధ్యక్షుడు పరికి ప్రేంకుమార్ అన్నారు. మండల కేం ద్రంలోని కో ఆపరేటీవ్ బ్యాంకులో శుక్రవా రం ఖాతాదారులకు ఏటీఎం కార్డులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి జిల్లాలోని కో ఆపరేటీవ్ ఖాతాదారులందరికీ ఏటీఎంలు పంపిణీ చేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రైతులకు రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకు నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో దోమకొండ సిం గిల్‌విండో చైర్మన్ నర్సారెడ్డి, ముత్యంపేట సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, కో ఆపరేటీవ్ బ్యాంకు మేనేజర్ శాంతాదేవి, సొసైటీ సీఈవోలు బాల్‌రెడ్డి, రాంచంద్రం, నర్సాగౌడ్, బ్యాంకు సిబ్బంది శ్రీపాల్‌రెడ్డి, సాయికృష్ణ, సునీత, రాకేశ్, శ్రావణ్‌రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
డిపాజిట్లు గల్లంతైతే..
పాలక వర్గాల కనుసన్నల్లో కోఆపరేటివ్ బ్యాంకులు ఏపీఎంపీసీఎస్–1995 చట్టంలోకి మార్చేందుకు బోర్డుల యత్నాలు ఈ చట్టపరిధిలోకి వెళితే ప్రభుత్వ నియంత్రణ శూన్యం ఎజెండాలో చేర్చిన ది ఇన్నీసుపేట ఆర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అదే దారిలో ది ఆర్యాపురం, ది జాంపేట బ్యాంకులు సహకార బ్యాంకుల్లో డిపాజిట్లకు ఇక సర్కారీ రక్షణ కరువవనుంది. చాలా బ్యాంకుల పాలకవర్గాలు 1995లో చేసిన ఏపీఎంపీసీఎస్ చట్ట పరిధిలోకి మారాలనుకుంటుండడమే దీనికి కారణం. దీనివల్ల సహకరా బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ కరువై పాలకమండళ్ల ఇష్టారాజ్యం మెుదలవుతుంది. అప్పుడు బ్యాంకుల్లో yì పాజిట్లు గల్లంతైతే బాధ్యులెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాక్షి, రాజమహేంద్రవరం : పేద, మధ్య తరగతి వర్గాల అభ్యున్నతికి, చిన్న వర్తకుల అభివృద్ధికి పరస్పర సహకార స్ఫూర్తితో స్థాపించిన సహకార బ్యాంకులపై పెద్దల కన్ను పడింది. వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్న బ్యాంకులను తమ కనుసన్నల్లో ఉంచుకునేందుకు పాలక మండళ్లు పావులు కదుపుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో చిన్న, మధ్యతరగతి వర్తకుల ఆర్థిక అవసరాలు తీర్చాలన్న మహోన్నత ఆశయంతో స్వాతంత్య్రానికి పూర్వమే సహకార బ్యాంకులు వెలిశాయి. ప్రారంభంలో తమంతట తామే నిధులు సమకూర్చుకున్న ఈ బ్యాంకులకు అనంతరం కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహకార సంస్థల చట్టం (ఏపీసీఎస్–1964) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంకులపై నియంత్రణ కలిగిఉంది. ఈ చట్టంలో పొందుపరిచిన విధివిధానాల ఆధారంగా సహకార బ్యాంకులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ చట్టం ఉండగానే ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం(ఏపీఎంపీసీఎస్–1995)ను ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం వల్ల పాలక మండళ్లకు బ్యాంకుల వ్యవహారాలపై పూర్తి అధికారం ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి 1964 చట్టంలో ఉన్న పలు బ్యాంకులను ఆయా పాలక వర్గాలు ఇప్పుడు 1995 చట్టం పరిధిలోకి మార్చాలని యత్నిస్తున్నాయి. ప్రభుత్వ అజమాయిషీ సున్నా... ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి సహకార బ్యాంకులు వెళ్లడం వల్ల బ్యాంకు ఆర్థిక వ్యవహారాలు, ఇతర కార్యకలాపాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. పాలక మండళ్లే స్వేచ్ఛగా విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో డిపాజిటర్ల నగదుకు రక్షణ కరువవుతుంది. ప్రభుత్వం నుంచి నిధులు బ్యాంకులకు అందవు. పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో అంశాలపై నిబంధనలు రూపొందించే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. 1964 చట్టం ప్రకారం ప్రతి ఆరునెలలకోసారి సహకార విభాగంలోని ఆడిట్‌శాఖ బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేస్తుంది. అయితే 1995 చట్టం ప్రకారం ఆడిట్ వ్యవహారం పూర్తిగా పాలకమండళ్ల చేతిలో ఉంటుంది. పాలక మండలి నియమించిన ప్రైవేటు వ్యక్తి చేసే ఆడిట్లో మండలి కలుగజేసుకునే అవకాశం ఉంటుంది. 1964 చట్టం ప్రకారం బ్యాంకుల విస్తరణ, వ్యాపారాభివృద్ధికి నిధులు వినియోగించాలంటే సహకార సంస్థల రిజిస్ట్రార్ అనుమతి తప్పనిసరి. 1995 చట్టం పరిధిలోకి వస్తే ఎంతమొత్తంలోనైనా నిధులు వినియోగించవచ్చు. ఉద్యోగుల నియామకం.. పాలక మండలి ఎన్నికలు... 1964 చట్టం పాలక మండలి ఎన్నికలు ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొంటోంది. అయితే 1995 చట్టం ప్రకారం అధికారంలో ఉన్న బోర్డు ఎన్నికలు నిర్వహించాలని తెలుపుతోంది. సభ్యత్వం మంజూరులో కూడా పాలక మండలిదే నిర్ణయం. ఉద్యోగులను కూడా పాలక మండలి నియమించుకునే అధికారం ఉండడంతో నియామకాల్లో అక్రమాలు జరిVó అవకాశం ఉంటుంది. అర్హులైన, సమర్థత కలిగిన ఉద్యోగులు వచ్చే అవకాశం ఉండదు. రుణాల మంజూరులోనూ పాలక మండలికి పూర్తి స్వేచ్ఛ ఉండడంతో అనర్హులకు రుణాలు మంజూరయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల డిపాజిటర్ల నగదుకు రక్షణ ఉందదు. పాలక మండలి నిజాయితీగా లేకపోతే కృషి బ్యాంక్ తరహాలో ఈ బ్యాంకులు దివాళా తీసే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో నగదు దాచుకున్న వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు రోడ్డునపడే ప్రమాదం ఉంది. ఉవ్విళ్లూరుతున్న పాలక మండళ్లు... జిల్లా వ్యాపారకేంద్రమైన రాజమహేంద్రవరంలో ది ఆర్యాపురం, ది జాంపేట, ది ఇన్నీసుపేట అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఏపీసీఎస్–1964 చట్టం ప్రకారం ఇవి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో పలు శాఖలు ఉన్న ఈ బ్యాంకులు వందల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం పాలక మండళ్లు ఈ బ్యాంకులను నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాంకులను ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి మార్చాలని పాలక మండలి సభ్యులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈనెల 28న(ఆదివారం) ది ఇన్నీసుపేట అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్న సాధారణ మహాజనసభ సమావేశంలో బ్యాంకును 1995 చట్ట పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని అజెండాలో పొందుపరిచారు. త్వరలో జాంపేట, ది ఆర్యాపురం బ్యాంకులను కూడా ఆయా పాలకమండళ్లు ఈ చట్ట పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పాలక మండళ్లదే అధికారం బ్యాంకులు ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి వెళితే ఆర్థిక, పాలన వ్యవహారాల్లో పాలక మండళ్లదే తుది నిర్ణయం. ఉద్యోగుల నియామకం కూడా మండలే చేపడుతుంది. ఒక ఏడాదిలో బ్యాంకుకు నష్టం వస్తే మరుసటి ఏడాదికి బదలాయించడానికి వీలుండదు. దాని కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రుణాలు ఇవ్వడంలో పాలక మండలిదే తుది నిర్ణయం. ప్రభుత్వ తనిఖీలు ఉండవు. పాలక మండలి నిజాయితీగా లేకపోతే బ్యాంకు కుప్పకూలుతుంది. – సింగరాజు రవిప్రసాద్, సెక్రటరీ, ది జాంపేట కోఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ -
ఆ సవరణలు సహకార బ్యాంకులకు శాపాలు
పట్టణ సహకార బ్యాంకుల సమాఖ్య విమర్శ సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల చట్ట సవరణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహకార బ్యాంకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారుల తీరు సహకార బ్యాంకుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీ సహకార సంఘాల చట్టాన్ని తెలంగాణకు అన్వయిస్తూ తయారు చేసిన చట్టంలో అనేక మార్పులు, చేర్పులూ చేశారని, అవి పట్టణ సహకార బ్యాంకులకు శాపంగా మారాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బహుళ రాష్ట్ర సహకార పట్టణ బ్యాంకుల సమాఖ్య విమర్శించింది. శుక్రవారం ఇక్కడ ‘తెలంగాణ సహకార సంఘాల చట్టం’పై జరిగిన సదస్సులో సమాఖ్య అధ్యక్షుడు జి.రామమూర్తి మాట్లాడుతూ ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాలని సవరణ తీసుకొచ్చారని, లెసైన్స్ రెన్యువల్ ఉంటుందే కానీ, రిజిస్ట్రేషన్‌కు రెన్యువల్ చేసుకోవాలని పేర్కొనడం అర్థరహితమని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి వివరించగా ఆయన కూడా విస్మయం వ్యక్తం చేశారన్నారు. అధికారులను తాము నిలదీయగా ఈ నిబంధన నుంచి పట్టణ సహకార బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఎన్నికల అధికారిని నియమించే అధికారాన్ని సహకారశాఖకు కట్టబెట్టి అధికారుల జోక్యాన్ని మరింత పెంచారన్నారు. జనరల్ బాడీ మీటింగ్‌లకు సహకార సంఘాల రిజిస్ట్రార్ హాజరవుతారని పేర్కొన్నారని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సమావేశంలో సమాఖ్య చైర్మన్ వేమిరెడ్డి నర్సింహారెడ్డి, డెరైక్టర్ జి.మదన గోపాలస్వామి, సుధా సహకార పట్టణ బ్యాంకు సీఈవో పెద్దిరెడ్డి గణేష్, సమాఖ్య సీఈవో గంగాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతు వ్యతిరేకి.. టీఆర్ఎస్ ప్రభుత్వం
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సహకార బ్యాంకులు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షులు ఎల్. రమణలు మండిపడ్డారు. మంగళవారం అబిడ్స్ రోడ్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో రైతు రుణాల మంజూరులో సహకార బ్యాంకుల నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 1,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలే అని అన్నారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. 25 శాతం రుణమాఫీ చేసి మిగతాది దశలవారీగా చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. రైతులకు విడతలవారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ... రైతులకు సకాలంలో రుణమాఫీ చేసి రబీ సీజన్లో కొత్త రుణాలందించాలన్నారు. రైతులకు రూ.17వేల కోట్ల రుణాలు అందిస్తామని, కనీసం రూ.5వేల కోట్లు కూడా అందించలేకపోవడం విచారకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచేందుకు ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మాజీమంత్రి పెద్దిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్ డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఎ.గాంధీ, చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ధర్నా చేసిన వారిని పోలీసులు అరెస్ట్‌చేసి అబిడ్స్ పీఎస్‌కు తరలించారు. -
రైతులకు మొండి చెయ్యి
కందుకూరు, న్యూస్‌లైన్: సహకార బ్యాంకులు రైతులకు మొండి చేయి చూపుతున్నాయి. రుణాల పేరిట రైతుల నుంచి డిపాజిట్లు కట్టించి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నాయి. దీంతో ప్రాథమిక సహకార సంఘాల్లోని సభ్యులు రుణాల కోసం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 173 ప్రాథమిక సహకార పర పతి సంఘాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 168 సంఘాలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. మిగిలిన ఐదు సంఘాల నుంచి రుణాల చెల్లింపు సక్రమంగా లేదని కార్యకలాపాలను నిలిపేశారు. ఈ సంఘాల సభ్యులుగా ఉండే రైతులకు ప్రతి ఏడాది వ్యవసాయ రుణాలు సహకార బ్యాంకులు మంజూరు చేస్తాయి. అయితే రెండేళ్లుగా ప్రాథమిక సహకార సంఘాల రైతులకు రుణాలు మంజూరు కావడం లేదు. వీటిలో కందుకూరు కో ఆపరేటివ్ డివిజన్లో అధిక శాతం మంది రైతులున్నారు. డివిజన్లో కందుకూరు, కొండపి, కనిగిరి, దర్శి సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 24 మండలాలుండగా 54 ప్రాథమిక పరపతి సహకార సంఘాలున్నాయి. వీటిలో సభ్యులకు రెండేళ్ల నుంచి ఒక్కపైసా రుణం మంజూరు కావడం లేదు.జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు కందుకూరు డివిజన్లోని లింగసముద్రం మండలంలో నాలుగు సహకార సంఘాలున్నాయి. వీటిలో మొగిలిచర్ల సొసైటీ తర ఫున దాదాపు 120 మంది, యర్రారెడ్డిపాలెం 90 మంది, తూనుగుంట 110 మంది, చినపవని 100 మంది వరకు రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 168 సంఘాల నుంచి వేల సంఖ్యలో రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ రెండేళ్ల నుంచి ఒక్కపైసా రుణం కూడా వీరికి దక్కలేదు. ప్రధానంగా 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రుణాలు మంజూరు కాలేదని రైతులు వాపోతున్నారు. అయితే ఇప్పటికే వీరి నుంచి డిపాజిట్ల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1200ల నుంచి రూ.2 వేల వరకు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు వసూలు చేశారు. 2011-12 సీజన్ లో దరఖాస్తు చేసుకున్న కొందరికి రుణాలు మంజూరైనట్లు సమాచారం వచ్చింది. కానీ ఆ తరువాత సహకార సంఘాల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంఘాలకు రుణాల పంపిణీని నిలిపేశారు. దీంతో ఎన్నికలు పూర్తై తరువాత ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికలు ముగిసిన తరువాత చైర్మన్ ఎన్నిక పెండింగ్‌లో ఉందని, అది పూర్తయిన తరువాత ఇస్తామని మరికొంత కాలం కాలయాపన చేశారు. ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక జరిగి ఏడెనిమిది నెలలు గడిచినా ఒక్కపైసా రుణం కూడా రైతులకు దక్కలేదు. దీనిపై కందుకూరు కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు మాత్రం తమ వద్ద రైతులకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు పెండింగ్ లేవని చెప్తున్నారు. మరోపక్క రబీ సీజన్‌కు సంబంధించి ఒంగోలు కేంద్ర సహకార బ్యాంక్ నుంచి తమకు ఒక్కపైసా కేటాయించలేదంటున్నారు. కేంద్ర బ్యాంకు నుంచి నిధులు కేటాయించకపోవడం వల్లే రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీనిబట్టే రైతులకు రుణాలు దక్కడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో రెండేళ్ల నుంచి డిపాజిట్ కట్టి రుణాల కోసం ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరికొందరికి మాత్రం ఎల్టీ లోన్స్ (పశువులు, గొర్రెల వంటి రుణాలు) ఇచ్చి సరిపెట్టారు. కేవలం కేంద్ర బ్యాంకు చైర్మన్ నిర్లక్ష్యం కారణంగానే రుణాలు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రుణాల పేరిట వసూళ్లు సాధారణంగా పొలం విస్తీర్ణం బట్టి లక్ష నుంచి రెండు, మూడు లక్షలు ఆపైన రుణాలు రైతులకు ఇస్తారు. రైతుల అసహాయతను ఆసరాగా చేసుకుంటున్న కొందరు సంఘాల కార్యదర్శులు, బ్యాంకుల సిబ్బంది రుణాలు ఇప్పిస్తామని చెప్పి రైతుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. జిల్లాలో రబీ సీజన్లో అధికంగా పంటలు సాగు చేస్తుండడంతో రుణాల కోసం ఎక్కువగా ఈ సీజన్లో రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తారు. ప్రస్తుతం పొగాకు, వరి వంటి పంటలు సాగు చేసిన రైతులు ఖర్చుల కోసం రుణాలకు దరఖాస్తు చేసుకున్నా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో డబ్బులు వసూలు చేసిన వారి నుంచి సమాధానం కరువవుతోంది. ఈ వ్యవహారంలో కొందరు రైతులు ఫిర్యాదు చేయడంతో గతంలో కందుకూరు సహకార బ్యాంకులో కాకి రాజారత్నం అనే స్పెషల్ క్యాటగిరీ అసిస్టెంట్‌ని సస్పెండ్ చేశారు. అయినా ఈ వసూళ్ల వ్యవహారం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంలో మరికొందరు బ్యాంకు సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం తమకు నిధుల కేటాయింపు లేకపోవడం వల్లే రుణాలు ఇవ్వడం లేదని చెప్తున్నారు. బయటవారు డబ్బులు వసూలు చేస్తే మాకు సంబంధం లేదంటున్నారు. కక్షతో కొందరికి రుణాల నిలుపుదల సహకార సంఘాల రుణాల కేటాయింపులో రాజకీయాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. అర్హుైలైన రైతులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన సంఘం కార్యదర్శులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో సహకరించని, ఇతర పార్టీల వైపు ఉన్న రైతుల రుణాలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మరికొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బ్యాంకు సిబ్బంది కూడా నాయకులకే వత్తాసు పలుకుతూ నానా అవస్థలు పెడుతున్నారని చెప్పారు. నాకేమీ తెలియదు -జమీల్బాష, మేనేజర్, కో ఆపరేటివ్ బ్యాంక్ నేను ఈ మధ్యేబ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏమీ నాకు తెలియదు. రైతుల దరఖాస్తులు మా వద్ద పెండింగ్‌లో లేవు. బయట వారు ఎవరైనా డబ్బులు వసూలు చేసి ఉంటే నాకేం సంబంధం.