న్యాయపోరాట యోచనలో సహకార బ్యాంకులు
అమరావతి: రాష్ట్రంలోని సహకార బ్యాంకు ఉద్యోగులు న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు వేసేందుకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కేరళ ముఖ్యమంత్రి విజయన్ వారం క్రితం రిజర్వు బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. అక్కడి ఉద్యోగ సంఘాల నాయకులు మూడు రోజుల క్రితం కేరళ హైకోర్టును ఆశ్రయిస్తే 28వ తేదీకి కేసు వాయిదా పడింది. తమిళనాడులో ఒక రైతుతో అక్కడి ఉద్యోగ సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేయించాయి. ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగ సంఘాల న్యాయపోరాటాల గురించి తెలుసుకుంటున్న ఏపీ సహకార ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యక్ష పోరాటం చేస్తూనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఆదివారం ఉద్యోగ సంఘాల నాయకులు ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావును ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా రుద్రపాకలో కలిశారు. 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగులు హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ఎదుట ధర్నా చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఆప్కాబ్‌లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్న నేపథ్యంలో ధర్నా తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకటిరెండు రోజుల్లో హైకోర్టులో కేసు వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల సహకార బ్యాంకులపై ఖాతాదారులకు నమ్మకం పోయే పరిస్థితులున్నాయని, సహకార రంగం మనుగడకు వెంటనే నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో కేసు వేయనున్నారు.