రైతుల రుణ చెల్లింపులెలా?
- సమస్య పరిష్కారానికి ఏం చేస్తారో చెప్పండి
- ఆర్‌బీఐకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు.. డీసీసీబీలపై నోట్ల మార్పిడి, డిపాజిట్ స్వీకరణ నిషేధం... తదితరాల నేపథ్యంలో వ్యవసాయ రుణాల చెల్లింపునకు సంబంధించి ఉభయ రాష్ట్రాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం కొనుగొనాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి స్పష్టం చేసింది. రుణాల విషయం లో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏం చేయబోతున్నారో చెప్పాలని ఆర్‌బీఐని ఆదేశించింది. రైతుల దుస్థితిని అర్థం చేసుకోవాలని సూచిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు (డీసీసీబీ) అనుబంధం గా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నుంచి రుణాలు తీసుకు న్నామని, నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్‌బీఐ సర్క్యూలర్ వల్ల రుణాలు చెల్లించలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లాకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
మీరు చెబితేనే కదా.. కేంద్రం చేసింది...
రైతుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఆర్‌బీఐపై ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించగా, ఈ వ్యవహారంలో ఆర్‌బీఐకి ఎలాంటి పాత్ర లేదని ఆర్‌బీఐ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి సమాధానమిచ్చా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘పాత్ర లేకపోవడం ఏమిటి? మీరు సిఫారసు చేస్తేనే కదా కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పుడు పరిష్కారాన్ని కేంద్రానికి చెప్పండి’ అని స్పష్టం చేసింది. అసలు పీఏసీ ఎస్‌లు బ్యాంకులు కాదని, వాటిపై ఆర్‌బీఐకి ఎటువంటి నియంత్రణ ఉండదని ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పీఏసీఎస్‌లు బ్యాంకులు కానప్పుడు ఆర్‌బీఐ ఎలా జోక్యం చేసుకుంటుందని పిటిషనర్ తరఫు న్యాయ వాదిని ధర్మాసనం ప్రశ్నించింది. డీసీసీబీలకు పీఏసీఎస్‌లు అనుబంధం ఉంటాయని, డీసీసీబీలపై నిషేధం వల్ల దాని ప్రభావం పీఏసీఎస్‌లపై పడిందని ఆయన తెలిపారు.
పరిష్కారం తప్పనిసరి...
‘ఇది దేశవ్యాప్తంగా రైతులందరూ ఎదుర్కొంటున్న సమస్య. నోట్ల మార్పిడి, డిపాజిట్ల స్వీకరణ బ్యాంకుల జాబితాలో గ్రామీణ బ్యాంకులను ఎందుకు చేర్చడం లేదో అడుగుతాం. రైతుల దుస్థితిని ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యకు పరిష్కా రం తప్పనిసరి. రైతుల సమస్యను పరిష్క రించేందుకు ఏం చర్యలు తీసుకుంటు న్నారో వివరించాలి’ అని ఆర్‌బీఐకి ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.