సహకార రంగం.. బలోపేతం | CM YS Jagan in a high-level review on co-operative sector | Sakshi
Sakshi News home page

సహకార రంగం.. బలోపేతం

Published Thu, Mar 4 2021 3:37 AM | Last Updated on Thu, Mar 4 2021 4:19 PM

CM YS Jagan in a high-level review on co-operative sector - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌)ను పునర్‌ వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (నాబ్కాన్స్‌) చేసిన సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు అంగీకరించారు. పీఏసీఎస్‌లలో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్‌ చేయించాలని, రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కార్యాచరణ ఉండాలని చెప్పారు. మూడవ పార్టీతో (థర్డ్‌ పార్టీ) స్వతంత్రంగా విచారణ చేయించాలని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి సంబంధించిన యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ఎన్‌ఏబీసీఓఎన్‌ఎస్‌ – నాబ్కాన్స్‌) సిఫార్సులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు గురించి అధికారులు సీఎంకు వివరించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని నివేదించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని, 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని చెప్పారు. రుణాలు తక్కువగా ఇవ్వడంతోపాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంట రుణాలకే పరిమితం అవుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. 


డీసీసీబీల పనితీరు మెరుగవ్వాలి
డీసీసీబీల్లో మెరుగైన పనితీరు ఉండాలని, వీటి నుంచి చక్కగా రుణాలు అందాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. రుణాలు ఎవరికి ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలి అనే దానిపై నిర్దిష్ట విధివిధానాలు ఉండాలని, ఈ విధివిధానాలకు లోబడే అందరి పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు డీసీసీబీలు దన్నుగా నిలిచేలా పలు సిఫార్సులకు ఆమోదం తెలిపారు. కోఆపరేటివ్‌ బ్యాంకుల మార్కెట్‌ షేర్‌ 20 శాతం వరకు పెంచాలని నిర్ణయించారు. ఆర్బీకేల కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా డీసీసీబీల రుణ ప్రణాళికలు, అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసే ఎంఎస్‌ఎంఈలకు దన్నుగా ఉండేలా రుణ కార్యక్రమాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. డీసీసీబీ బ్యాంకుల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల భావం పోవడంతో పాటు విశ్వాసం, నమ్మకం కలిగించాలని సూచించారు. నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రుణాలు ఇవ్వడంలో మంచి ప్రమాణాలు పాటించాలని, ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా అవినీతి ఉండకూడదన్నారు. డీసీసీబీ బ్యాంకుల సమర్థత పెరగడంతో పాటు మంచి యాజమాన్య పద్ధతులు రావాలని పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్‌ ఉత్పత్తిపై దృష్టి సారించాలని, దీనివల్ల ఆ కర్మాగారాలకు ఊరట లభిస్తుందని సూచించారు.

ఏప్రిల్‌ 15 నాటికి గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు
వ్యవసాయం అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం చేపడుతున్న మల్టీ పర్పస్‌ సెంటర్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. గోడౌన్ల నిర్మాణానికి ఏప్రిల్‌ 15 కల్లా టెండర్ల ఖరారు చేసి, ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు వెల్లడించారు. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ మల్టీపర్పస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్లు, డ్రైయింగ్‌ యార్డులు, కోల్డు రూమ్‌లు, పంటల సేకరణ కేంద్రాలు ఇతర వ్యవసాయ పరికరాలు, సామగ్రి మొత్తం వీటన్నింటి కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సహకార శాఖ స్పెషల్‌ సెక్రటరీ వై మధుసూదనరెడ్డి, కమిషనర్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌ బాబు ఏ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

పాల వెల్లువతో రైతులకు మంచి రేటు
పాల వెల్లువ కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రైతులకు మంచి రేటు దొరుకుతోందని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాలకూ ప్రాజెక్టును విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. పాల వెల్లువతో మార్పు ఇదీ..

నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సిఫార్సులపై చర్చ
సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ చేసిన సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి. 
► సమగ్ర బ్యాంకు సేవల కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలి. 
► పీఏసీఎస్‌లు క్రెడిట్‌ సేవలతో పాటు నాన్‌ క్రెడిట్‌ సేవలు కూడా అందించాలి.
► పీఏసీఎస్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలి. ఇందులో భాగంగా ప్రతి 3 ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు ఒక పీఏసీఎస్‌ ఉండేలా చూడాలి.
► ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలి. వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలి.
► బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలి. బోర్డులో సగం మంది ప్రతి రెండున్నరేళ్లకు విరమించేలా ఏపీసీఎస్‌ యాక్ట్‌కు సవరణ తీసుకురావాలి. పీఏసీఎస్‌లోనూ మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాలి. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్‌ సభ్యులుగా తీసుకురావాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement