సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమలు చేయడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా నాలుగేళ్లుగా అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. మన స్వయం సహాయక సంఘాలు పొదుపు విషయంలో, క్రెడిట్ లింకేజీలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, పొదుపు సంఘాల పనితీరుపై నాబార్డు 2022 – 23 వార్షిక నివేదికను శుక్రవారం విడుదల చేసింది.
దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల పొదుపు నమోదైందని, ఈ విషయంలో రాష్ట్ర పొదుపు సంఘాలు అగ్రగామిగా నిలిచాయని నివేదిక వెల్లడించింది. అంతకు ముందు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు కూడా ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
గాడిన పడ్డ సంఘాలు
చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో గత నాలుగేళ్లుగా ఆర్థికంగా గాడిన పడటమే కాకుండా దేశంలోనే ఉత్తమ పనితీరును కనపరుస్తున్నాయి. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొమ్ము (2022 – 23 మార్చి నాటికి) రూ.58,892.68 కోట్లుగా ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా పొదుపు సంఘాల పొదుపు రూ.28,968.44 కోట్లు కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల పొదుపు రూ.18,606.18 కోట్లు ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో అన్ని రాష్ట్రాల సంఘాల పొదుపులో ఏపీ స్వయం సహాయక సంఘాల పొదుపే 31 శాతం కావడం విశేషం. 2021–22తో పోలిస్తే 2022–23లో ఏపీ పొదుపు సంఘాల పొదుపు రూ.6,938 కోట్లు పెరగడం గమనార్హం. 2021–22 నాటికి రాష్ట్ర పొదుపు సంఘాల పొదుపు రూ.11,668 కోట్లు కాగా ఇప్పుడు రూ.18,606 కోట్లకు పెరిగింది.
పరపతి పెరిగింది
చంద్రబాబు పాలనలో రుణమాఫీ దగాతో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరపతి క్షీణించింది. స్వయం సహాయక సంఘాల అప్పులు పెరిగిపోవడంతో రుణాల మంజూరుకు బ్యాంకులు వెనకాడాయి. దీంతో సంఘాలు సి, డి గ్రేడ్‌లకు పడిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల తేదీ నాటికి పొదుపు సంఘాలకు ఉన్న అప్పులను నాలుగు విడతల్లో తిరిగి ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లు చెల్లించారు.
అంతేకాకుండా చంద్రబాబు ఎగనామం పెట్టిన సున్నా వడ్డీని కూడా పునరుద్ధరించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి పెరిగింది. ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగి ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ గల పొదుపు సంఘాలుగా నిలిచాయి. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ 43.6 శాతం ఉండగా ఇప్పుడు 89 శాతం సాధించడం గమనార్హం.
వరుసగా నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు పెరుగుతూనే ఉంది. 2022–23లో వాణిజ్య, రీజనల్ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కలిపి ఏపీ పొదుపు సంఘాలకు దేశంలోనే అత్యధికంగా రూ.40,230.63 కోట్ల రుణాలను మంజూరు చేశాయి.
సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం
2022–23లో దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సగటు పొదుపులో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో సంఘం సగటు పొదుపు అత్యధికంగా రూ.1,72,124 కాగా తెలంగాణలో రూ.85 వేలుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022–23లో ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.43,940 నుంచి రూ.30 వేలకు పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది.
భారీగా తగ్గిన నిరర్థక ఆస్తులు
నాడు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసగించడంతో స్వయం సహాయక సంఘాలు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా వాటి నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగిపోయాయి. ఇప్పుడు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. పొదుపు సంఘాలకు సంబంధించి చంద్రబాబు హయాంలో 5.86 శాతం నిరర్థక ఆస్తులుండగా 2022 – 23 నాటికి ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకుల రుణాల్లో నిరర్ధక ఆస్తులు 0.41 శాతానికి, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల్లో 0.25 శాతానికే పరిమితమైనట్లు నివేదిక తెలిపింది.
సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం
సకాలంలో రుణాలను చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ (వడ్డీ లేని రుణాలు) రుణాలను అమలు చేస్తోందని నాబార్డు నివేదిక తెలిపింది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీని రీయింబర్స్‌మెంట్ చేయడంతో పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాకుండా గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని పేర్కొంది.
పొదుపు మహిళల జీవనోపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ప్రస్తావించింది. ఆసరా ద్వారా అందిస్తున్న డబ్బులతో వ్యాపారాలు నిర్వహిస్తూ పొదుపు సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలను చేసుకుని బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment