కందుకూరు, న్యూస్‌లైన్: సహకార బ్యాంకులు రైతులకు మొండి చేయి చూపుతున్నాయి. రుణాల పేరిట రైతుల నుంచి డిపాజిట్‌లు కట్టించి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నాయి. దీంతో ప్రాథమిక సహకార సంఘాల్లోని సభ్యులు రుణాల కోసం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 173 ప్రాథమిక సహకార పర పతి సంఘాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 168 సంఘాలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి.
మిగిలిన ఐదు సంఘాల నుంచి రుణాల చెల్లింపు సక్రమంగా లేదని కార్యకలాపాలను నిలిపేశారు. ఈ సంఘాల సభ్యులుగా ఉండే రైతులకు ప్రతి ఏడాది వ్యవసాయ రుణాలు సహకార బ్యాంకులు మంజూరు చేస్తాయి. అయితే రెండేళ్లుగా ప్రాథమిక సహకార సంఘాల రైతులకు రుణాలు మంజూరు కావడం లేదు. వీటిలో కందుకూరు కో ఆపరేటివ్ డివిజన్‌లో అధిక శాతం మంది రైతులున్నారు.
డివిజన్‌లో కందుకూరు, కొండపి, కనిగిరి, దర్శి సబ్ డివిజన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 24 మండలాలుండగా 54 ప్రాథమిక పరపతి సహకార సంఘాలున్నాయి. వీటిలో సభ్యులకు రెండేళ్ల నుంచి ఒక్కపైసా రుణం మంజూరు కావడం లేదు.జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
ఉదాహరణకు కందుకూరు డివిజన్‌లోని లింగసముద్రం మండలంలో నాలుగు సహకార సంఘాలున్నాయి. వీటిలో మొగిలిచర్ల సొసైటీ తర ఫున దాదాపు 120 మంది, యర్రారెడ్డిపాలెం 90 మంది, తూనుగుంట 110 మంది, చినపవని 100 మంది వరకు రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 168 సంఘాల నుంచి వేల సంఖ్యలో రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కానీ రెండేళ్ల నుంచి ఒక్కపైసా రుణం కూడా వీరికి దక్కలేదు. ప్రధానంగా 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రుణాలు మంజూరు కాలేదని రైతులు వాపోతున్నారు. అయితే ఇప్పటికే వీరి నుంచి డిపాజిట్‌ల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1200ల నుంచి రూ.2 వేల వరకు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు వసూలు చేశారు. 2011-12 సీజన్ లో దరఖాస్తు చేసుకున్న కొందరికి రుణాలు మంజూరైనట్లు సమాచారం వచ్చింది.
కానీ ఆ తరువాత సహకార సంఘాల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంఘాలకు రుణాల పంపిణీని నిలిపేశారు. దీంతో ఎన్నికలు పూర్తై తరువాత ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికలు ముగిసిన తరువాత చైర్మన్ ఎన్నిక పెండింగ్‌లో ఉందని, అది పూర్తయిన తరువాత ఇస్తామని మరికొంత కాలం కాలయాపన చేశారు. ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక జరిగి ఏడెనిమిది నెలలు గడిచినా ఒక్కపైసా రుణం కూడా రైతులకు దక్కలేదు.
దీనిపై కందుకూరు కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు మాత్రం తమ వద్ద రైతులకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు పెండింగ్ లేవని చెప్తున్నారు. మరోపక్క రబీ సీజన్‌కు సంబంధించి ఒంగోలు కేంద్ర సహకార బ్యాంక్ నుంచి తమకు ఒక్కపైసా కేటాయించలేదంటున్నారు. కేంద్ర బ్యాంకు నుంచి నిధులు కేటాయించకపోవడం వల్లే రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీనిబట్టే రైతులకు రుణాలు దక్కడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో రెండేళ్ల నుంచి డిపాజిట్ కట్టి రుణాల కోసం ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరికొందరికి మాత్రం ఎల్‌టీ లోన్స్ (పశువులు, గొర్రెల వంటి రుణాలు) ఇచ్చి సరిపెట్టారు. కేవలం కేంద్ర బ్యాంకు చైర్మన్ నిర్లక్ష్యం కారణంగానే రుణాలు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రుణాల పేరిట వసూళ్లు
సాధారణంగా పొలం విస్తీర్ణం బట్టి లక్ష నుంచి రెండు, మూడు లక్షలు ఆపైన రుణాలు రైతులకు ఇస్తారు. రైతుల అసహాయతను ఆసరాగా చేసుకుంటున్న కొందరు సంఘాల కార్యదర్శులు, బ్యాంకుల సిబ్బంది రుణాలు ఇప్పిస్తామని చెప్పి రైతుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. జిల్లాలో రబీ సీజన్‌లో అధికంగా పంటలు సాగు చేస్తుండడంతో రుణాల కోసం ఎక్కువగా ఈ సీజన్‌లో రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తారు. ప్రస్తుతం పొగాకు, వరి వంటి పంటలు సాగు చేసిన రైతులు ఖర్చుల కోసం రుణాలకు దరఖాస్తు చేసుకున్నా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఆ సమయంలో డబ్బులు వసూలు చేసిన వారి నుంచి సమాధానం కరువవుతోంది. ఈ వ్యవహారంలో కొందరు రైతులు ఫిర్యాదు చేయడంతో గతంలో కందుకూరు సహకార బ్యాంకులో కాకి రాజారత్నం అనే స్పెషల్ క్యాటగిరీ అసిస్టెంట్‌ని సస్పెండ్ చేశారు. అయినా ఈ వసూళ్ల వ్యవహారం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంలో మరికొందరు బ్యాంకు సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బ్యాంకు అధికారులు మాత్రం తమకు నిధుల కేటాయింపు లేకపోవడం వల్లే రుణాలు ఇవ్వడం లేదని చెప్తున్నారు. బయటవారు డబ్బులు వసూలు చేస్తే మాకు సంబంధం లేదంటున్నారు.
కక్షతో కొందరికి రుణాల నిలుపుదల సహకార సంఘాల రుణాల కేటాయింపులో రాజకీయాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. అర్హుైలైన రైతులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన సంఘం కార్యదర్శులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో సహకరించని, ఇతర పార్టీల వైపు ఉన్న రైతుల రుణాలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మరికొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బ్యాంకు సిబ్బంది కూడా నాయకులకే వత్తాసు పలుకుతూ నానా అవస్థలు పెడుతున్నారని చెప్పారు.
నాకేమీ తెలియదు -జమీల్‌బాష, మేనేజర్, కో ఆపరేటివ్ బ్యాంక్
నేను ఈ మధ్యేబ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏమీ నాకు తెలియదు. రైతుల దరఖాస్తులు మా వద్ద పెండింగ్‌లో లేవు. బయట వారు ఎవరైనా డబ్బులు వసూలు చేసి ఉంటే నాకేం సంబంధం.
రైతులకు మొండి చెయ్యి
Published Thu, Feb 6 2014 6:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement