సాక్షి, నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదు’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
‘‘ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, సైనికులుగా నిలవండి అని కోరుతున్నాను. సెల్ఫోన్ నేనే కనిపెట్టా అంటూ బాబులా నేను బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు పెట్టి మార్కులు వేయమని అడుగుతున్నా. మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి పల్లె, పట్టణంలో కనీసం 6 వ్యవస్థలు ఏర్పాటు చేసాం. సచివాలయాలు, వాలంటీర్లు, నాడునేడుతో మారిన బడి, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ ప్రతి ఊరిలో కనిపిస్తాయి. ఇక మీదట కూడా ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి.’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.
‘‘ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్, ఇంటి ముంగిటికే వచ్చే రేషన్... మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సంప్రదాయం. పేదలకు మనం ఇస్తున్న ఈ మర్యాద కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. చంద్రబాబు మార్కు రాజ్యం.. దోపిడీ సామ్రాజ్యం, గ్రామగ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీలు. లంచాలు, వివక్ష లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, ఎవరికి ఓటేసారు అనేది కూడా చూడకుండా అర్హులందరికీ ఇచ్చిన ఈ పథకాలన్నీ వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. 130 బటన్లు నొక్కి రూ.2,70,000 కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా అందించాం’’ అని సీఎం జగన్ చెప్పారు
‘‘మళ్లీ వచ్చే ఐదేళ్లూ ఇది కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కండి అని కోరుతున్నాను. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా.. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే అందిస్తున్న ఆరోగ్య సురక్ష సేవలు... విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అందాలంటే మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని సీఎం జగన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment