
వరంగల్ డీసీసీబీ పాలకవర్గం రద్దు
పూర్తిస్థాయి విచారణ తర్వాత సహకార శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గాన్ని రద్దు చేస్తూ సహకార శాఖ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సహకార సొసైటీల చట్టం, 1964లోని సెక్షన్ 34 ప్రకారం సహకార శాఖ రిజిస్ట్రార్ ఎం. వీరభద్రయ్య గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు వ్యవహారాల్లో అవినీతి జరిగిందంటూ వరంగల్‌కు సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగ నియామకాలు, లోన్లు, నోట్ల రద్దు సమయంలో అక్రమాలు జరిగినట్టు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి కార్యదర్శి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సహకార శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది.
ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన తర్వాత పాలకవర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 18న సహకార శాఖ ఆరునెలల పాటు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు సహకార శాఖ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత సహకార శాఖ పాలకవర్గానికి నోటీసులిచ్చి సమగ్ర విచారణ జరిపింది. ఈ విచారణలో పలు అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్న తర్వాత, నివేదిక ఆధారంగా పాలకవర్గాన్ని రద్దు చేస్తున్నట్టు సహకార శాఖ రిజిస్ట్రార్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సొసైటీ ప్రత్యేక పాలనాధికారిగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. డీసీసీబీ చైర్మన్‌తో పాటు 16 మంది పాలకమండలి సభ్యులు నిధుల దుర్వినియోగం, బంగారం లేకుండానే రుణాలివ్వడం, పదోన్నతుల్లో అక్రమాలు, చైర్మన్‌కు నిబంధనలకు విరుద్ధంగా వాహన రుణం ఇవ్వడం లాంటి 20 అంశాల్లో పాలకవర్గం సహకార చట్టాలకు అనుగుణంగా నడుచుకోలేదని విచారణ నివేదికలో పేర్కొన్నారు. ఈ విచారణ నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా సమర్పించారు. ఆర్బీఐతోపాటు నాబార్డు, టీఎస్‌క్యాబ్‌లు కూడా విచారణ జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.