51ఎంక్వయిరీ షురూ..
దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాలు త్వరలో నిగ్గుతేలనున్నాయి. దీనికి సంబంధించిన 51 ఎంక్వయిరీ (సహకార శాఖలో డిపార్ట్‌మెంట్
నల్లగొండ అగ్రికల్చర్ :దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాలు త్వరలో నిగ్గుతేలనున్నాయి. దీనికి సంబంధించిన 51 ఎంక్వయిరీ (సహకార శాఖలో డిపార్ట్‌మెంట్ లోతైన విచారణ)ను జిల్లా సహకార శాఖ మొదలుపెట్టింది. సుమారు రూ.9 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధికారులు ఇప్పటికే బ్రాంచ్ ఏజీఎంతోపాటు సహాయ మేనేజర్, సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేశారు. అదే విధంగా అక్రమాలు వెలుగుచూసిన దేవరకొండ, పీఏపల్లి, తిమ్మాపూర్, చిత్రియాల సహకార సంఘాల సీఈఓలను కూడా సస్పెండ్ చేయడంతోపాటు పోలీసు కేసులు నమోదు చేశారు. పోలీసులు దేవరకొండ బ్రాంచ్‌తోపాటు నాలుగు సొసైటీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేయడంతోపాటు వారి ఆస్తులపై కండీషన్ అటాచ్‌మెంట్‌నూ తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో విచారణలో జాప్యం జరిగింది. డిపార్ట్‌మెంట్‌పరంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని భావించిన పాలకవర్గం 51 ఎంక్వైయిరీని చేపట్టాలని జిల్లా సహకార శాఖను కోరింది. విచారణకు రికార్డులను స్వాధీనం చేయాలని డీసీఓ కోరడంతో పోలీసుల ఆధీనంలో ఉన్న రికార్డులన్నింటినీ జీరాక్స్ తీయించి డీసీఓకు అప్పగించే పనిలో డీసీసీబీ అధికారులు ఉన్నారు. ఇప్పటికే రెండు సొసైటీల రికార్డులను జిల్లా సహకార అధికారి (డీసీఓ)కి అందజేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రికార్డులను అందుకున్న డీసీఓ బృందం క్షేత్రస్థాయిలో తన విచారణను ప్రారంభించినట్లు తెలిసింది.
51 ఎంక్వయిరీ అంటే..
సొసైటీలోని ప్రతి సభ్యుడిని కలిసి వారు తీసుకున్న రుణం, అసలు రుణం ముట్టింది.. లేనిది.. ఎంత రుణం తీసుకున్నది.. సరైన పాసుపుస్తకాలు ఉన్నాయా? లేవా?.. రుణం పొందడానికి అర్హులా.. కాదా, అనే విషయాలను క్షేత్రస్థాయిలో ప్రతి సభ్యుడినుంచి సేకరిస్తారు. దీనిద్వారా అర్హత లేకుండా ఎంతమంది రుణాలను తీసుకున్నది.. తక్కువ రుణం ఇచ్చి ఎక్కువ రుణం ఇచ్చినట్లు రికార్డులలో పొందుపరిచి అక్రమాలకు ఎంత పాల్పడింది తేలే అవకాశం ఉంది. తప్పుడు పాస్‌పుస్తకాలను పెట్టి రుణాలను తీసుకున్న వారి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇలా దేవరకొండ, పీఏపల్లి, తిమ్మాపూర్, చిత్రియాలలో ఉన్న ప్రతి సభ్యుడిని కలిసి వివరాలను సేకరించనున్నారు. ఈ 51ఎంక్వయిరీ పూర్తిచేసి తుది నివేదికను డీసీసీబీకి అందజేస్తారు. అనంతరం ఎంతమేరకు అక్రమాలు జరిగాయి. అసలు బాధ్యులు ఎవరు..ఎంతమంది దోషులు అన్న విషయాలను నిర్ధార రణ చేసుకుని బాధ్యులపై డీసీసీబీ పాలకవర్గం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.