
డీసీసీబీల్లో పాత నోట్లు తీసుకోవాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రద్దు చేసిన రూ.1,000, రూ.500 నోట్లను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో మార్చుకోడానికి వీలు కల్పించాలని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ విజ్ఞప్తి చేసింది. ఈ నెల 8 నుంచి 14 వరకు సహకార బ్యాంకుల్లో పాత నోట్ల మార్పితో పాటు ఇతర లావాదేవీలు జరిగినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆకస్మికంగా లావాదేవీలు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చిందని, దీంతో లావాదేవీలు నిలిచి ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
పెట్రోల్ బంకులు, అర్బన్ బ్యాంక్, పోస్టాఫీసులకు వెసులుబాటు కల్పించి సహకార బ్యాంక్‌ల్లో లావాదేవీలు రద్దు చేయడం సహకార వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. సహకార బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తూ రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా రైతులకు రుణాలిస్తున్నా యని.. సేవింగ్, కరెంట్ ఖాతాల లావాదేవీలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు.