నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అనిశ్ఛితి నెలకొంది. కాపుగల్లు సొసైటీ రద్దు వ్యవహారం డీసీసీబీ పాలకమండలిలో దుమారం లేపుతోంది. సొసైటీ రద్దు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు 24 రోజులు బ్యాంకులో పరిపాలన పరమైన నిర్ణయాలను తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. రూ. వందల కోట్ల టర్నోవర్‌తో ఉన్న బ్యాంకుకు పూర్తి స్థాయి పాలకవర్గం లేకపోతే పరిస్థితి ఏమిటని పలువురు డైరెక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సొసైటీని రద్దు చేసినందున చైర్మన్ పాండురంగారావుపై అనర్హత వేటుపడుందని, చైర్మన్ పదవి ఖాళీ అయినట్లేనని మెజార్టీ డైరెక్టర్లు వాదిస్తున్నారు.
చైర్మన్‌పై వేటు తప్పదా..?
గతంలో కాపుగల్లు సొసైటీలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, రూ.86 లక్షలను కాజేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కాపుగల్లు సహకార సంఘం పాలకవర్గాన్ని రద్దు చేస్తూ డిసెంబర్ 8న సూర్యాపేట జిల్లా జిల్లా సహకార అధికారి ఉత్తర్వులను జారీ చేసింది . అయితే కాపుగల్లు సొసైటీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు డీసీసీబీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా, సహకర చట్టాల ప్రకారం ఆయనపై అనర్హత వేటు పడుతుందని మెజార్టీ బ్యాంకు డైరెక్టర్లు పేర్కొంటున్నారు.
సీఈఓపై డైరెక్టర్ల గుర్రు
సహకార బ్యాంకుకు వైస్ చైర్మన్ లేనందున 32బి సహకార చట్టం ప్రకారం సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న పీరునాయక్‌కు తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలను అప్పగించాలని సీఈఓ కె.మదన్‌మోహన్‌కు పలువురు డైరెక్టర్లు వినతిపత్రం అందజేశారు. సీఈఓ డిసెంబర్ 13న జిల్లా సహకార అధికారికి బ్యాంకు పరిస్థితిపై నివేదికను అందజేశారు. అయితే జిల్లా సహకార అధికారి డిసెంబర్ 17న 32 బి ప్రకారం సీనియర్ డైరెక్టర్ పీరునాయక్‌కు ఇన్‌చార్జి చైర్మన్ బాధ్యతలను అప్పగించాలని ఆదేశాలను కూడా జారీ చేశారు. కానీ బ్యాంకు సీఈఓ పీరునాయక్‌కు బాధ్యతలను అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని డైరెక్టర్లు గుర్రుగా ఉన్నారు. వెంటనే తక్షణమే పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి సహకార యాక్ట్ ప్రకారం పీరునాయక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాలని డిమాం డ్ చేస్తున్నారు. గతంలో దేవరకొండ సహకార బ్యాంకు బ్రాంచీలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణాలతో అప్రతిష్టను మూటగట్టుకున్న డీసీసీబీ ఇటీవల జరుగుతున్న పరిణామాలతో చర్చనీయంశంగా మారింది.
ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన చైర్మన్
అయితే కాపుగల్లు సొసైటీ రద్దుపై చైర్మన్ పాండురంగారావు తొలుత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సొసైటీ రద్దుపై స్టేటస్ కో విధిస్తూ సహకార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించింది. కాగా, చైర్మన్ స్టే కోసం సహకార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
సీఈఓపై చర్య తీసుకోవాలి : డైరెక్టర్లు
జిల్లా సహకార అధికారి ఇచ్చిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్న బ్యాంకు సీఈఓ కె.మదన్‌మోహన్‌పై తక్షణమే చర్య తీసుకోవాలని డైరెక్టర్లు పీరునాయక్, పిల్లలమర్రి శ్రీనివాస్, చాపల లింగయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 32బి ప్రకారం పీరునాయక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. విధులకు హాజరుకాకుండా, ఎవరికి ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించకుండా, పాలకవర్గం అనుమతి లేకుండా ఇష్టానుసారంగా సెలవులు పెడుతున్నారని ఆరోపించారు. పాలకమండలి తీర్మానం లేకుండానే అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సహకార చట్టాన్ని అమలు చేసి పీరునాయక్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
‘ఢీ’సీసీబీ..!
Published Tue, Jan 3 2017 1:49 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement