* ఏ క్షణంలోనైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉందంటున్న సహకార వర్గాలు
* అక్రమాలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువ
* వాటికి తోడైన సొసైటీల్లో బినామీ రుణాల వ్యవహారం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో దాదాపు 23 సొసైటీల్లో విచారణలు జరిగాయి. వాటిలో జరిగిన అక్రమాలు వెలుగు చూశాయి. మిగతా సొసైటీలు కూడా చాలావరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. కాకపోతే గతంలో జిల్లాలో ఓ కీలక నేత అండగా ఉండడంతో వాస్తవాలు బయటకు రాలేదు. ఆ నేత ఇప్పుడు మాజీ అయ్యారు. దీంతో లొసుగులు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇంతలా అవినీతి జరిగిందంటే సొసైటీలకు ఫైనాన్స్ బ్యాంకింగ్‌గా ఉన్న డీసీసీబీ ప్రమేయం కూడా ఉండొచ్చనే వాదన విన్పిస్తోంది.
డీసీసీబీలో కూడా అదే తరహా అక్రమాలు జరిగాయని, ఇష్టమొచ్చినట్టు రుణాలు మంజూరు చేశారని, బినామీల పేరుతో రుణాలు కాజేశారని, పీఏసీఎస్‌లకు అదనంగా ఫైనాన్స్ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పర్సంటేజీలు చేతులు మారాయని, స్టేషనరీ, ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకాలు చేపట్టారని, దినసరి వేతన కార్మికుల నియామకాల్లో చేతివాటం ప్రదర్శించారని, ఇవ్వకుండానే రికార్డుల్లో కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు ఇచ్చినట్టు నమోదు చేశారని, అంచనాలకు మించి పార్వతీపురం, చీపురుపల్లి జిల్లా కేంద్ర సహకార బ్రాంచ్‌ల భవన నిర్మాణాలకు ఖర్చు పెట్టారన్న ఆరోపణలొచ్చాయి.
వీటిపై అప్పట్లో హైదరాబాద్‌కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఇద్దరు ఆప్కాబ్ అధికారులు, నాబార్డు నుంచి ఒక ప్రతినిధి సంయుక్తంగా ఇక్కడికొచ్చి విచారణ చేశారు. వీరితో పాటు సమాంతరంగా విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదిక కూడా ఇచ్చారు. కాకపోతే, దానిపై చర్యలు తీసుకోకుండా అప్పట్లో ఓ నేత అడ్డుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆదాయ పన్ను ఆడిట్ చేసేందుకు గాను చార్టెడ్ అకౌంటెంట్‌కు రూ.55లక్షలను డీసీసీబీ అడ్డగోలుగా చెల్లించింది. దీనివెనుక కుతంత్రం ఉందని, చార్టెడ్ అకౌంటెంట్‌కు ఆ మొత్తం పూర్తిగా అందలేదని, డీసీసీబీకి చెందిన పలువురు పెద్దలకు అందులో కొంత సొమ్ము చేరిందని ఆరోపణలొచ్చాయి. నాబార్డ్, ఆప్కాబ్ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై విచారణ జరిపిన నాబార్డు, ఆప్కాబ్ అధికారులు జరిగిన తప్పును గుర్తించారు. అనవసరంగా చార్టెడ్ అకౌంటెంట్‌కు రూ.55లక్షలు చెల్లించారని, ఘోర తప్పిదమని తేల్చారు. సత్వరమే రికవరీ చేయాలని ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక చార్టెడ్ అకౌంటెంట్ నుంచి ఆ మొత్తాన్ని డీసీసీబీ అధికారులు రికవరీ చేశారు. కానీ, బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలొచ్చాయి.
నాటి కీలక నేత లక్ష్యంగా ఫిర్యాదులు: ఈ వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు కొందరు తవ్వుతున్నారు. ఆ ఆరోపణలనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు రూపంలో పంపిస్తున్నారు. ప్రత్యక్షంగా డీసీసీబీపై ఉన్న ఆరోపణలు, మరోవైపు సొసైటీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు దృష్ట్యా లోతుగా విచారణ చేపడితే వాస్తవాలు బయటికొస్తాయని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. ఆ దిశగా ఉన్నత స్థాయి వర్గాలు కూడా దృష్టి సారిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే నాటి కీలక నేతను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు పావులు కదుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా సొసైటీలతో పాటు డీసీసీబీపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉందని భోగట్టా.
డీసీసీబీపై విచారణ తప్పదా ?
Published Sat, Dec 13 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement