Improprieties
-
నామినేషన్‌పై మందుల కొను‘గోల్మాల్’
సాక్షి, అమరావతి : కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) పరిధిలోని ఆస్పత్రుల్లో మరో భారీ కుంభకోణానికి అధికారులు తెరతీశారు. గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయని తేలడంతో ఓ వైపు విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తుంటే మరోవైపు ఈఎస్ఐ పరిధిలోని ఆస్పత్రుల్లో కనీస మందులు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ఏమీ పట్టని అధికారులు తాము అనుకున్నదే రూలు అన్నట్టు వందల కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా మందుల కొనుగోలు జరగాలంటే ఇ–ప్రొక్యూర్మెంట్ పద్ధతి సరైనదని భావించిన అధికారులు కొత్త సర్కారు రాగానే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి కార్మిక శాఖ అధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి మాధవీలత ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే కొద్ది రోజులకే ఆమె కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత లావణ్యవేణి అనే మరో అధికారి ఈ శాఖకు వచ్చారు. ఈమె ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి, ఎల్1గా నిలిచిన కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తీరా ఎల్1గా నిలిచిన కంపెనీలపై ఫిర్యాదులున్నాయని, మామూలు ధరల కంటే ఎక్కువ రేటు ఉందని ఇ–ప్రొక్యూర్మెంట్ విధానాన్ని నిలిపివేశారు. నామినేషన్ కింద మందుల సరఫరాకు అనుమతి ఇచ్చేందుకు ఈఎస్ఐ డైరెక్టరే కొన్ని కంపెనీలను ఎంపిక చేశారు. నామినేషన్ కింద అయితే భారీగా డబ్బులొస్తాయని భావించిన అధికార వర్గాలు ఈ విధానానికి తెరలేపాయని సమాచారం. ఇదే సమయంలో తక్కువ ధరకు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎందుకు ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పాల్గొన లేదన్నదానికి అధికారుల నుంచి జవాబు లేదు. దీంతో రెండు మాసాల పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కసరత్తు చేసిన ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల విధానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ధరలు మామూలుగా ఉన్నాయన్న కమిటీ ఇ–ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యాక రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రాగానే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసే మందుల ధరకూ, ఈఎస్ఐ ఇప్రొక్యూర్మెంట్లో కోట్ చేసిన ధరలకూ బేరీజు వేయాలని ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. చంద్రశేఖర్, రామకృష్ణ, గాంధి అనే ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ సుమారు 265 రకాల మందుల ధరలను పరిశీలించింది. ఈఎస్ఐ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు వేసిన ధరలకూ, ఏపీఎంఎస్ఐడీసీ ధరలకూ తేడా లేదని తేల్చింది. ఇలాంటప్పుడు ఇ–ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నామినేషన్ ద్వారా కొనుగోళ్లవైపే మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలో కూడా నిర్ణయించి వారికి జిల్లాల వారీగా మందుల ఇండెంట్ ఇచ్చారు. తొలి దశలో సుమారు రూ.40 కోట్లతో మందులు కొనుగోలు చేయనున్నారు. ధరలు ఎక్కువని ఇస్తున్నాం ఇ–ప్రొక్యూర్మెంట్ టెండరులో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే నామినేషన్ కింద ఇస్తున్నాం. ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేసే మందులు అదే ధరకు వచ్చినా వాటినెవరైనా తింటారా? మా రోగులు అలాంటి మాత్రలు తినరు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేని విషయం వాస్తవమే. అందుకే నామినేషన్ కింద ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నాం. పైగా ఈఎస్ఐ మందుల టెండర్లలో పాల్గొన్న కంపెనీల ద్వారా మందులు కొంటే రూ.230 కోట్లు నష్టం వస్తుంది. – సామ్రాజ్యం, ఈఎస్ఐ డైరెక్టర్ -
ఇక ‘మదింపు’లో అక్రమాలకు చెక్
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మున్సిపాలిటీల్లో ఈనెల 20వ తేదీ నుంచి ఇంటింటి సర్వే చేయడానికి మున్సిపల్ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఏఎస్) తో శాటిలైట్ ద్వారా మున్సిపల్ పట్టణాల మ్యాప్ తీస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఆస్తి పన్ను మదింపు చేపడితే ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా ఎంత ఉండాలో అంతే ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూ విభాగం అధికారులు, బిల్ కలెక్టర్లు ఇష్టారాజ్యంగా ఆస్తి పన్ను వసూలు చేసి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు పాల్పడి మున్సిపల్ ఖజానాకు భారీగానే గండి కొట్టారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వార్డుల చొప్పున జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా సర్వే చేపట్టారు. దాంతో అక్కడ దాదాపు 80 శాతం ఆస్తిపన్ను తక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో ప్రభుత్వం రాష్ట్రంలోని పాత మున్సిపాలిటీ పట్టణాల్లో ఈ తరహా సర్వే చేపట్టి అక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 20 వరకు.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, భునగిరి, సూర్యాపేట మున్సిపల్ పట్టణాల్లో కొత్తగా ఆస్తి పన్ను మదింపు చేపట్టనున్నారు. ఈనెల 20 నుంచి ఈ నాలుగు పట్టణాల్లో సర్వే ప్రారంభించడానికి మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 20 వరకు సర్వే చేసి అదే నెల 30వ తేదీన స్పెషల్ నోటీసులు జారీ చేస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. సర్వే ఇలా.. మున్సిపల్ పట్టణాల్లో ఆస్తి పన్ను మదింపులో అక్రమాలను అరికట్టేందుకు సర్వే పకడ్బందీగా నిర్వహించనున్నారు. మదింపు కోసం చేపట్టాల్సిన వివరాలతో పట్టిక పత్రాలను తయారు చేసి ఇళ్లు, వాణిజ్య భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. ఈ సర్వే కో సం విద్యార్థులను పెట్టుకోవాలని నిర్ణయించారు. అధికారులు ఇచ్చిన పత్రాల లో వివరాలు సేకరించిన వాటిని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో పొందుపరుస్తారు. శాటిలైట్ ద్వారా తీసే మ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థుల ద్వారా చేపట్టే ఈ సర్వేకు బిల్ కలెక్టర్లు సూపర్వైజర్లుగా వ్యవహరిస్తారు. ఎంత పన్ను ఉంటే అంతే.. పట్టణాల్లో ఆస్తిపన్ను మదింపులో అనేక అక్రమాలు జరిగాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించి తక్కువ ఆస్తి పన్ను విధించి మున్సిపాలిటీ ఖజానాకు నష్టం జరిగే విధంగా వ్యవహరించారు. ఇక నుంచి ఇలాంటివి జరుగకుండా ఎంత ఆస్తి పన్ను ఉందో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా కచ్చితంగా అంతే రానుంది. ఎక్కడ వాణిజ్య భవనం ఉంటే దానికి తగ్గ పన్ను విధిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ము న్సిపాలిటీలకు ఆదాయం సమగ్రంగా సమకూరనుంది. జిల్లాలో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. -
డీసీసీబీపై విచారణ తప్పదా ?
* ఏ క్షణంలోనైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉందంటున్న సహకార వర్గాలు * అక్రమాలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువ * వాటికి తోడైన సొసైటీల్లో బినామీ రుణాల వ్యవహారం సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో దాదాపు 23 సొసైటీల్లో విచారణలు జరిగాయి. వాటిలో జరిగిన అక్రమాలు వెలుగు చూశాయి. మిగతా సొసైటీలు కూడా చాలావరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. కాకపోతే గతంలో జిల్లాలో ఓ కీలక నేత అండగా ఉండడంతో వాస్తవాలు బయటకు రాలేదు. ఆ నేత ఇప్పుడు మాజీ అయ్యారు. దీంతో లొసుగులు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇంతలా అవినీతి జరిగిందంటే సొసైటీలకు ఫైనాన్స్ బ్యాంకింగ్‌గా ఉన్న డీసీసీబీ ప్రమేయం కూడా ఉండొచ్చనే వాదన విన్పిస్తోంది. డీసీసీబీలో కూడా అదే తరహా అక్రమాలు జరిగాయని, ఇష్టమొచ్చినట్టు రుణాలు మంజూరు చేశారని, బినామీల పేరుతో రుణాలు కాజేశారని, పీఏసీఎస్‌లకు అదనంగా ఫైనాన్స్ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పర్సంటేజీలు చేతులు మారాయని, స్టేషనరీ, ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకాలు చేపట్టారని, దినసరి వేతన కార్మికుల నియామకాల్లో చేతివాటం ప్రదర్శించారని, ఇవ్వకుండానే రికార్డుల్లో కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు ఇచ్చినట్టు నమోదు చేశారని, అంచనాలకు మించి పార్వతీపురం, చీపురుపల్లి జిల్లా కేంద్ర సహకార బ్రాంచ్‌ల భవన నిర్మాణాలకు ఖర్చు పెట్టారన్న ఆరోపణలొచ్చాయి. వీటిపై అప్పట్లో హైదరాబాద్‌కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఇద్దరు ఆప్కాబ్ అధికారులు, నాబార్డు నుంచి ఒక ప్రతినిధి సంయుక్తంగా ఇక్కడికొచ్చి విచారణ చేశారు. వీరితో పాటు సమాంతరంగా విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదిక కూడా ఇచ్చారు. కాకపోతే, దానిపై చర్యలు తీసుకోకుండా అప్పట్లో ఓ నేత అడ్డుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆదాయ పన్ను ఆడిట్ చేసేందుకు గాను చార్టెడ్ అకౌంటెంట్‌కు రూ.55లక్షలను డీసీసీబీ అడ్డగోలుగా చెల్లించింది. దీనివెనుక కుతంత్రం ఉందని, చార్టెడ్ అకౌంటెంట్‌కు ఆ మొత్తం పూర్తిగా అందలేదని, డీసీసీబీకి చెందిన పలువురు పెద్దలకు అందులో కొంత సొమ్ము చేరిందని ఆరోపణలొచ్చాయి. నాబార్డ్, ఆప్కాబ్ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై విచారణ జరిపిన నాబార్డు, ఆప్కాబ్ అధికారులు జరిగిన తప్పును గుర్తించారు. అనవసరంగా చార్టెడ్ అకౌంటెంట్‌కు రూ.55లక్షలు చెల్లించారని, ఘోర తప్పిదమని తేల్చారు. సత్వరమే రికవరీ చేయాలని ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక చార్టెడ్ అకౌంటెంట్ నుంచి ఆ మొత్తాన్ని డీసీసీబీ అధికారులు రికవరీ చేశారు. కానీ, బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలొచ్చాయి. నాటి కీలక నేత లక్ష్యంగా ఫిర్యాదులు: ఈ వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు కొందరు తవ్వుతున్నారు. ఆ ఆరోపణలనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు రూపంలో పంపిస్తున్నారు. ప్రత్యక్షంగా డీసీసీబీపై ఉన్న ఆరోపణలు, మరోవైపు సొసైటీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు దృష్ట్యా లోతుగా విచారణ చేపడితే వాస్తవాలు బయటికొస్తాయని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. ఆ దిశగా ఉన్నత స్థాయి వర్గాలు కూడా దృష్టి సారిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే నాటి కీలక నేతను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు పావులు కదుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా సొసైటీలతో పాటు డీసీసీబీపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉందని భోగట్టా. -
నిబంధనలకు పాతర!
సాక్షి, కర్నూలు: అభివృద్ధి పనుల ముసుగులో కర్నూలు నగర పాలక సంస్థ(కేఎంసీ) ఇంజినీరింగ్ విభాగం అధికారులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‘బాక్స్ టెండర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. తమ అనుయాయులకు పనులు కట్టబెట్టేస్తున్నారు. తక్కువ ధరకు టెండరు కోట్ చేసి పనులు చేపట్టేందుకు కొందరు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా.. తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికారులు అప్పగిస్తుండటం చర్చనీయాంశమైంది. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 51 డివిజన్లు ఉండగా సుమారు 5 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థదే. ఇందులో పారిశుద్ధ్యం, రోడ్లు, నీరు ముఖ్యమైనవి. ఆయా విభాగాల్లో మరమ్మతులకు, కొత్త వాటి ఏర్పాటుకు టెండరు ప్రక్రియ ద్వారా పనులు చేపట్టాలి. బహిరంగ టెండరు ద్వారా తక్కువకు కోట్ చేసిన వారికి పనులను అప్పగించాలి. కానీ ఇక్కడా పద్ధతిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం లేదు. గతంలో నామినేషన్ పద్ధతిన పనులను కమీషన్లు తీసుకొని కాంట్రాక్టర్లను అప్పగించేవారు. పీవీవీఎస్ మూర్తి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక నామినేషన్ పనులకు బ్రేక్ పడింది. దీంతో ఇంజినీర్లు నామినేషన్ ముసుగులో ‘బాక్స్ టెండర్ల’కు తెరలేపారు. ఎంత పెద్ద పనైనా ముక్కలు ముక్కలుగా విభజిస్తున్నారు. ఉదాహరణకు రూ. 5 లక్షలు విలుజేసే పనిని రూ. లక్ష లోపు ఆరు పనులుగా విభజించి ‘బాక్స్ టెండర్’ పేరిట తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ అవినీతికి తెరతీస్తున్నారు. బాక్స్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అవి పూర్తయ్యాకే షెడ్యూలు దాఖలు చేస్తారు. ఇవీ అప్పగించిన పనులు.. ►పాతబస్తీలోని నాల్గో వార్డులో గుంతల పూడిక, బీటీ ప్యాచ్ వర్క్‌లకు సంబంధించి రూ. 1.58 లక్షల పనిని అంచనాలు తగ్గించి రెండుగా విభజించారు. ఒక దాన్ని రూ. 98 వేలు, మరొక దాన్ని రూ. 60 వేలు చొప్పున రెండు పనులుగా అప్పగించారు. ►కల్లూరు మండల పరిధిలోని శ్రీరామ్ నగర్లో(25వ వార్డు) బీటీ ప్యాచ్ వర్క్‌కు సంబంధించిన రూ. 94 వేలు విలువైన పనిని నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. అదే కాలనీలో రూ. 99 వేల విలువైన బీటీ ప్యాచ్ వర్క్ పనిని బాక్స్ టెండర్ ద్వారా కేటాయించారు. ►కర్నూలులోని ఐదురోడ్ల కూడలి నుంచి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రహారీ గోడపై చిత్రాల పెయింటింగ్ పనులను కూడా రెండుగా విభజించి బాక్స్ టెండర్ కింద ఒక పనిని రూ. 95 వేలు, మరొక పనిని రూ. 65 వేలు చొప్పున కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ►నగర పాలక సంస్థ పరిధిలోని పార్కుల్లో ఆర్ సీసీ బెంచ్‌లను ఏర్పాటు చేసేందుకు గానూ రూ. 99 వేల చొప్పున రెండు పనులను విభజించి అప్పగించారు. .. ఇలా సుమారు రూ. 2 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టరుకు అప్పగించిన వైనంపై పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు తప్పుపడుతున్నారు. అంచనా కన్నా తక్కువ ధరను కోట్ చేసి పనులు చేపట్టే కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు లక్షలాది రూపాయలు విలువైన పనులను విభజించి(రూ. లక్ష లోపు) బాక్స్ టెండర్ల పేరిట అప్పగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై కేఎంసీ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘బాక్స్ టెండర్ అనే ప్రక్రియ రహస్యమేమి కాదు... నామినేషన్ పద్ధతి అంతకంటే కాదు. పనులను దక్కించుకోవాలనుకున్న వారు టెండర్ ద్వారా పోటీ పడవచ్చు’ అని తెలిపారు. అక్కడ ఆ ఇంజినీరుదే హవా..! నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో టెండర్ల ప్రక్రియ పర్యవేక్షిస్తున్న ఓ అధికారి హవా నడుపుతున్నారు. రాష్ట్ర స్థాయి ‘ముఖ్య’ ఇంజినీరు ఈయన స్నేహితుడు. దీంతో ఆయన దాదాపు ఐదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. కల్లూరు పరిధిలో ఇంజినీరుగా పనిచేస్తే ఈయన తన రెగ్యులర్పోస్టుతోపాటు డ్రా యింగ్ బ్రాంచ్, నీటి సరఫరా విభాగానికి ఇన్చార్జిగా ఉన్నారు. నగర పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు సం బంధించి కాంట్రాక్టర్లతో భారీగా కమీషన్లు వసూలు చేసి ఉన్నత స్థాయి అధికారులకు ముడుపులు అందజేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. కేఎంసీలో దాదాపు నాలుగేళ్ల పాటు ప్రత్యేకాధికారి పాలన నడిచింది. ఈ కాలంలో దాదాపు రూ.40 కోట్ల పైబడి పనులు జరిగాయి. గత రెండేళ్లుగా ఏకంగా రూ. 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ‘బాక్స్ టెండర్’ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానించకుండా బీటీ, ఇతరత్రా రోడ్ల ప్యాచ్‌వర్క్ వంటి పనులను ముక్కలుగా చేసి ఆయనకు అనుకూలంగా ఉన్న ఓ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. -
నొక్కేశారు!
మొయినాబాద్, న్యూస్‌లైన్: మండలంలోని పెద్దమంగళారంలో ఒకే రేషన్ కార్డుపై ఇద్దరికి పింఛన్లు.. 45 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లకు సైతం పింఛన్ల పంపిణీ.. కుత్బుద్దీన్‌గూడలో భర్త ఉన్నా ఓ మహిళ వితంతువు పింఛను తీసుకుంటోంది. పింఛన్ లబ్ధిదారు మరణించినా ప్రతి నెల పింఛన్ తీసుకుంటున్నట్లు రికార్డులో ఉంది. ఇవన్నీ సామాజిక తనిఖీలో వెలుగుచూసిన అవినీతి అక్రమాలు. ఒకటి కాదు రెండు కాదు కేవలం పింఛన్లలోనే రూ.5.24 లక్షల అవినీతి జరిగింది. విద్యార్థులకిచ్చే ఉపకార వేతనాల్లో సైతం రూ.73 వేలు పక్కదారి పట్టాయి. పోర్జరీ సంతకాలతో లబ్ధిదారులకు అందించాల్సిన పింఛన్ డబ్బులను మెక్కేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సామాజిక భద్రత పింఛన్లు- విద్యార్థుల ఉపకార వేతనాల’ పంపిణీపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఒక్కో గ్రామం గురించి తనిఖీ నిర్వహిస్తుండగా అనేక అక్రమాలు వెలుగు చూశాయి. మొయినాబాద్ మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 5,376 మందికి ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీటిలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, అభయహస్తం పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్ల పంపిణీలో చాలా వరకు భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడయ్యింది. అభయహస్తం పింఛన్ పొందుతున్న వారికి వృద్ధాప్య, వితంతువు, వికలాంగ పింఛన్ పంపిణీ చేయడానికి వీలు ఉండదు. కానీ ఇక్కడ అభయహస్తం పింఛన్ పొందుతున్న వారిలో కొందరికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లలో ఏదో ఒకటి అందుతున్నట్లు రికార్డులో రాసి ఆ డబ్బులను పంపిణీ చేసేవారు కాజేసినట్లు తేలింది. 21 పంచాయతీల్లో పింఛన్ పంపిణీలోనే రూ.5.24 లక్షలు నొక్కేశారు. ఇక అభయహస్తం, ఆమ్ఆద్మీ పథకాల ద్వారా మండలంలో 872 విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందాల్సి ఉండగా అందులోనూ రూ. 73,600 అవినీతి జరిగింది. ఇందులో గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేసిన సిబ్బందితోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసిన మహిళా సంఘాల గ్రామ కమిటీ అధ్యక్షరాళ్లు, పంచాయతీ కార్యదర్శుల చేతివాటం ఉన్నట్లు తేలింది. సర్పంచ్ల మండిపాటు అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్దమంగళారం సర్పంచ్ గీతావనజాక్షి, మేడిపల్లి సర్పంచ్ నవీన్‌లు ఆరోపించారు. సామాజిక తనిఖీ ప్రజావేదికకు హాజరైన సర్పంచ్‌లు వెలుగుచూసిన అక్రమాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్హులైన ఎంతో మంది పింఛన్లకోసం దరఖాస్తు చేసుకునేందుకు వస్తే వారి వయసు రేషన్ కార్డుల్లో దొర్లిన తప్పిదం వల్ల వయసు తక్కువగా ఉందంటూ తిప్పిపంపే అధికారులు ఇంత అవినీతి జరుగుతున్నా ఎలా చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నించారు. మేడిపల్లిలో చాలా మందికి రేషన్‌కార్డులో వయసు తక్కువగా ఉండి పింఛన్ రాకపోవడంతో తహసీల్దార్‌ను కలిసి వివరించినా ఫలితం లేకపోయిందని సర్పంచ్ నవీన్ తెలిపారు. దీంతో డీఆర్డీఏ ఏపీడీ ఉమారాణి స్పందిస్తూ.. ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డులో వయసు తక్కువగా ఉంటే వారి వయసు నిర్ధారిస్తూ ఒక లెటర్ తీసుకొస్తే తాము పరిశీలిస్తామని చెప్పారు. అన్నీ ఫోర్జరీ సంతకాలతోనే పింఛన్, స్కాలర్‌షిప్‌లలో జరిగిన అవినీతి అంతా ఫోర్జరీ సంతకాలతోనే జరిగింది. గ్రామాల్లో కొంత మంది మరణించినా, కొంత మందికి అభయహస్తం పింఛన్ వస్తున్నా వారి పేర్లతో వచ్చిన పింఛన్‌ను పోర్జరీ సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు వారికి ఇవ్వకుండా ఫోర్జరీ సంతకాలు పెట్టి వీఓలే కాజేసినట్లు తేలింది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే తరహా అవినీతి చోటు చేసుకుంది. అవినీతికి పాల్పడిన సిబ్బందిని తొలగిస్తాం: డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉమారాణి పింఛన్ల పంపిణీ, విద్యార్థుల స్కాలర్షిప్లో అవినీతికి పాల్పడిన సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉమారాణి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఆమె మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన సిబ్బంది నుంచి డబ్బులు రికవరీ చేస్తామని, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామన్నారు. ఒకే పేరుతో రెండు పింఛన్లు వచ్చినా, లబ్ధిదారులు మరణించినా వెంటనే ఎంపీడీఓకుగాని, తమకు గాని తెలియజేయాలని చెప్పారు. స్కాలర్షిప్ డబ్బులు వీఓల అకౌంట్లలో పెట్టవద్దని, విద్యార్థులకు ఆన్లైన్ ద్వారాగాని, చెక్కుల రూపంలోగాని వెంటనే అందజేయాలని చెప్పారు. పింఛన్లు, స్కాలర్షిప్లు, బీమా పథకాలకు సంబందించి సర్పంచ్‌లకు, ఇతరులకు ఏమైనా సందేహాలు ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడీఓ సునంద, డీర్‌డీఏ బీమా విభాగం డీపీఎం సునీల్‌రెడ్డి, ఏసీ పద్మావతి, ఏపీఎం నర్సింలు, సర్పంచ్‌లు మంగ, లక్ష్మి, సంధ్య, గీతావనజాక్షి, యాదమ్మ, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్ యాదవ్, అమర్నాథ్రెడ్డి, సత్యనారాయణ, నవీన్ పాల్గొన్నారు.