నొక్కేశారు! | Improprieties in pension | Sakshi
Sakshi News home page

నొక్కేశారు!

Published Sun, Nov 17 2013 12:09 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

Improprieties in pension

 మొయినాబాద్, న్యూస్‌లైన్:   మండలంలోని పెద్దమంగళారంలో ఒకే రేషన్ కార్డుపై ఇద్దరికి పింఛన్లు.. 45 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లకు సైతం పింఛన్ల పంపిణీ.. కుత్బుద్దీన్‌గూడలో భర్త ఉన్నా ఓ మహిళ వితంతువు పింఛను తీసుకుంటోంది. పింఛన్ లబ్ధిదారు మరణించినా ప్రతి నెల పింఛన్ తీసుకుంటున్నట్లు రికార్డులో ఉంది. ఇవన్నీ సామాజిక తనిఖీలో వెలుగుచూసిన అవినీతి అక్రమాలు. ఒకటి కాదు రెండు కాదు కేవలం పింఛన్లలోనే రూ.5.24 లక్షల అవినీతి జరిగింది. విద్యార్థులకిచ్చే ఉపకార వేతనాల్లో సైతం రూ.73 వేలు పక్కదారి పట్టాయి. పోర్జరీ సంతకాలతో లబ్ధిదారులకు అందించాల్సిన పింఛన్ డబ్బులను మెక్కేశారు.

మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సామాజిక భద్రత పింఛన్‌లు- విద్యార్థుల ఉపకార వేతనాల’ పంపిణీపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఒక్కో గ్రామం గురించి తనిఖీ నిర్వహిస్తుండగా అనేక అక్రమాలు వెలుగు చూశాయి. మొయినాబాద్ మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 5,376 మందికి ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీటిలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, అభయహస్తం పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్ల పంపిణీలో చాలా వరకు భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడయ్యింది. అభయహస్తం పింఛన్ పొందుతున్న వారికి వృద్ధాప్య, వితంతువు, వికలాంగ పింఛన్ పంపిణీ చేయడానికి వీలు ఉండదు.

కానీ ఇక్కడ అభయహస్తం పింఛన్ పొందుతున్న వారిలో కొందరికి  వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్‌లలో ఏదో ఒకటి అందుతున్నట్లు రికార్డులో రాసి ఆ డబ్బులను పంపిణీ చేసేవారు కాజేసినట్లు తేలింది. 21 పంచాయతీల్లో పింఛన్ పంపిణీలోనే రూ.5.24 లక్షలు నొక్కేశారు. ఇక అభయహస్తం, ఆమ్‌ఆద్మీ పథకాల ద్వారా మండలంలో 872 విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందాల్సి ఉండగా అందులోనూ రూ. 73,600 అవినీతి జరిగింది. ఇందులో గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేసిన సిబ్బందితోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసిన మహిళా సంఘాల గ్రామ కమిటీ అధ్యక్షరాళ్లు, పంచాయతీ కార్యదర్శుల చేతివాటం ఉన్నట్లు తేలింది.
 సర్పంచ్‌ల మండిపాటు
 అర్హులైన లబ్ధిదారులకు పింఛన్‌లు ఇవ్వకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్దమంగళారం సర్పంచ్ గీతావనజాక్షి, మేడిపల్లి సర్పంచ్ నవీన్‌లు ఆరోపించారు. సామాజిక తనిఖీ ప్రజావేదికకు హాజరైన సర్పంచ్‌లు వెలుగుచూసిన అక్రమాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్హులైన ఎంతో మంది పింఛన్లకోసం దరఖాస్తు చేసుకునేందుకు వస్తే వారి వయసు రేషన్ కార్డుల్లో దొర్లిన తప్పిదం వల్ల వయసు తక్కువగా ఉందంటూ తిప్పిపంపే అధికారులు ఇంత అవినీతి జరుగుతున్నా ఎలా చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నించారు. మేడిపల్లిలో చాలా మందికి రేషన్‌కార్డులో వయసు తక్కువగా ఉండి పింఛన్ రాకపోవడంతో తహసీల్దార్‌ను కలిసి వివరించినా ఫలితం లేకపోయిందని సర్పంచ్ నవీన్ తెలిపారు. దీంతో డీఆర్‌డీఏ ఏపీడీ ఉమారాణి స్పందిస్తూ.. ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డులో వయసు తక్కువగా ఉంటే వారి వయసు నిర్ధారిస్తూ ఒక లెటర్ తీసుకొస్తే తాము పరిశీలిస్తామని చెప్పారు.
 అన్నీ ఫోర్జరీ సంతకాలతోనే
 పింఛన్, స్కాలర్‌షిప్‌లలో జరిగిన అవినీతి అంతా ఫోర్జరీ సంతకాలతోనే జరిగింది. గ్రామాల్లో కొంత మంది మరణించినా, కొంత మందికి అభయహస్తం పింఛన్ వస్తున్నా వారి పేర్లతో వచ్చిన పింఛన్‌ను పోర్జరీ సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు వారికి ఇవ్వకుండా ఫోర్జరీ సంతకాలు పెట్టి వీఓలే కాజేసినట్లు తేలింది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే తరహా అవినీతి చోటు చేసుకుంది.
 అవినీతికి పాల్పడిన సిబ్బందిని తొలగిస్తాం:  డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉమారాణి
 పింఛన్ల పంపిణీ, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లో అవినీతికి పాల్పడిన సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉమారాణి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఆమె మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన సిబ్బంది నుంచి డబ్బులు రికవరీ చేస్తామని,  వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామన్నారు. ఒకే పేరుతో రెండు పింఛన్లు వచ్చినా, లబ్ధిదారులు మరణించినా వెంటనే ఎంపీడీఓకుగాని, తమకు గాని తెలియజేయాలని చెప్పారు. స్కాలర్‌షిప్ డబ్బులు వీఓల అకౌంట్లలో పెట్టవద్దని, విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారాగాని, చెక్కుల రూపంలోగాని వెంటనే అందజేయాలని చెప్పారు.
 పింఛన్లు, స్కాలర్‌షిప్‌లు, బీమా పథకాలకు సంబందించి సర్పంచ్‌లకు, ఇతరులకు ఏమైనా సందేహాలు ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడీఓ సునంద, డీర్‌డీఏ బీమా విభాగం డీపీఎం సునీల్‌రెడ్డి, ఏసీ పద్మావతి, ఏపీఎం నర్సింలు, సర్పంచ్‌లు మంగ, లక్ష్మి, సంధ్య, గీతావనజాక్షి, యాదమ్మ, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్ యాదవ్, అమర్‌నాథ్‌రెడ్డి, సత్యనారాయణ, నవీన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement