నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మున్సిపాలిటీల్లో ఈనెల 20వ తేదీ నుంచి ఇంటింటి సర్వే చేయడానికి మున్సిపల్ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. జియో గ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (జీఏఎస్) తో శాటిలైట్ ద్వారా మున్సిపల్ పట్టణాల మ్యాప్ తీస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఆస్తి పన్ను మదింపు చేపడితే ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా ఎంత ఉండాలో అంతే ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూ విభాగం అధికారులు, బిల్ కలెక్టర్లు ఇష్టారాజ్యంగా ఆస్తి పన్ను వసూలు చేసి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు పాల్పడి మున్సిపల్ ఖజానాకు భారీగానే గండి కొట్టారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వార్డుల చొప్పున జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం ద్వారా సర్వే చేపట్టారు. దాంతో అక్కడ దాదాపు 80 శాతం ఆస్తిపన్ను తక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో ప్రభుత్వం రాష్ట్రంలోని పాత మున్సిపాలిటీ పట్టణాల్లో ఈ తరహా సర్వే చేపట్టి అక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 20 వరకు..
జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం ద్వారా జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, భునగిరి, సూర్యాపేట మున్సిపల్ పట్టణాల్లో కొత్తగా ఆస్తి పన్ను మదింపు చేపట్టనున్నారు. ఈనెల 20 నుంచి ఈ నాలుగు పట్టణాల్లో సర్వే ప్రారంభించడానికి మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 20 వరకు సర్వే చేసి అదే నెల 30వ తేదీన స్పెషల్ నోటీసులు జారీ చేస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు.
సర్వే ఇలా..
మున్సిపల్ పట్టణాల్లో ఆస్తి పన్ను మదింపులో అక్రమాలను అరికట్టేందుకు సర్వే పకడ్బందీగా నిర్వహించనున్నారు. మదింపు కోసం చేపట్టాల్సిన వివరాలతో పట్టిక పత్రాలను తయారు చేసి ఇళ్లు, వాణిజ్య భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. ఈ సర్వే కో సం విద్యార్థులను పెట్టుకోవాలని నిర్ణయించారు.
అధికారులు ఇచ్చిన పత్రాల లో వివరాలు సేకరించిన వాటిని జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టంలో పొందుపరుస్తారు. శాటిలైట్ ద్వారా తీసే మ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థుల ద్వారా చేపట్టే ఈ సర్వేకు బిల్ కలెక్టర్లు సూపర్‌వైజర్లుగా వ్యవహరిస్తారు.
ఎంత పన్ను ఉంటే అంతే..
పట్టణాల్లో ఆస్తిపన్ను మదింపులో అనేక అక్రమాలు జరిగాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించి తక్కువ ఆస్తి పన్ను విధించి మున్సిపాలిటీ ఖజానాకు నష్టం జరిగే విధంగా వ్యవహరించారు. ఇక నుంచి ఇలాంటివి జరుగకుండా ఎంత ఆస్తి పన్ను ఉందో జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం ద్వారా కచ్చితంగా అంతే రానుంది. ఎక్కడ వాణిజ్య భవనం ఉంటే దానికి తగ్గ పన్ను విధిస్తుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ము న్సిపాలిటీలకు ఆదాయం సమగ్రంగా సమకూరనుంది. జిల్లాలో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.
ఇక ‘మదింపు’లో అక్రమాలకు చెక్
Published Mon, Jun 20 2016 3:36 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM
Advertisement
Advertisement