‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే | Garbage Tax In Ap: Implementation In Guntur Municipality During TDP Regime, More Details Inside | Sakshi
Sakshi News home page

‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే

Published Wed, Oct 16 2024 5:17 AM | Last Updated on Wed, Oct 16 2024 9:49 AM

Garbage tax in AP: Implementation in Guntur Municipality during TDP regime

టీడీపీ హయాంలోనే గుంటూరు మున్సిపాలిటీలో అమలు

2018లో జీవీఎంసీలో యూజర్‌ చార్జీలు 

కేంద్ర నిబంధనలను అంగీకరించిన నాటి టీడీపీ సర్కారు

జగన్‌ ప్రభుత్వంలో మెరుగైన పారిశుధ్య విధానాలను ప్రశంసించిన ఎన్‌జీటీ  

ఇంటింటి చెత్త సేకరణే ధ్యేయంగా ‘క్లాప్‌’ కార్యక్రమం 

43 లక్షల ఇళ్లకు 1.20 కోట్ల చెత్త డబ్బాల పంపిణీ

సేకరణకు 4 వేలకు పైగా వాహనాల వినియోగం

చెత్త నుంచి విద్యుత్‌ తయారీకి 2 ప్లాంట్ల ఏర్పాటు 

సాక్షి, అమరావతి: నిజం చెబితే తల వెయ్యి ముక్కలైపోతుందని చంద్రబాబుకు ముని శాపం ఉందంటారు! అందుకే ఆయన ఎప్పుడూ నిజం చెప్పరు. పైగా తాను చేసిన తప్పులను ఇతరులపై నెట్టేసి మంచిని మాత్రం తన ఖాతాలో వేసుకుంటారు. గత ప్రభుత్వం పురపాలక సంఘాల్లో చెత్త పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టిందని డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీసిన సీఎం చంద్రబాబు అసలు విషయాన్ని దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు యూజర్‌ చార్జీల పేరుతో డబ్బులు వసూలు ప్రారంభించిందే తానేననే విషయాన్ని కప్పిపుచ్చి మభ్యపెడుతున్నారు.

2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమాజాన్ని సమూలంగా మార్చేస్తామని, వీధుల్లో చెత్త అనేది లేకుండా చేస్తానని గొప్పగా ప్రకటించారు. తీరా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి వీధుల్లో చెత్తను తీసుకెళ్లి నగరం నడి»ొడ్డున గుట్టలుగా వేశారు. దాంతో అవి కొండల్లా పెరిగిపోయి ప్రజలకు రోగాలను తెచ్చిపెట్టాయి. ఈ పని చేసినందుకు ప్రతి ఇంటి నుంచి చెత్త పన్ను వసూలును ఆయన ఆనాడే ప్రారంభించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ప్రజల నుంచి చార్జీల వసూలుకు ఆయా పాలక మండళ్లలో తీర్మానాలు చేయించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే చెత్త సేకరణ చార్జీలు చెల్లించాలని నాడు చంద్రబాబే ప్రచారం చేశారు. 2016లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోను చెత్త సేకరణకు ఫీజు (చెత్త పన్ను) విధించి అమలు చేశారు.  

గుంటూరులో దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్‌ హాస్టళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, సూపర్‌ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి చెత్త తరలించేందుకు యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని నాటి టీడీపీ సర్కారు ఉత్తర్వుల మేరకు నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లో తీర్మానించింది. విస్తీర్ణం, జనాభాను బట్టి గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. అదే ఏడాది మే నెలలో చెత్తను రోడ్లపై వేసినా, తగులబెట్టినా భారీగా జరిమానా విధిస్తూ నిర్ణయించారు. ఈమేరకు 2016 జూన్‌ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్టు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ)లో 2018 డిసెంబర్‌ నుంచి మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ రూల్స్‌–2016 ప్రకారం స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు అనుబంధంగా ఘన వ్యర్థాల నిర్వహణను పటిష్టంగా అమలు చేసేందుకు యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని చట్టం చేశారు. ప్రతి ఇంటికీ నెలకు రూ.50 చొప్పున, వాణిజ్య సముదాయాలైన సినిమాహాళ్లు, హోటళ్ల నుంచి రూ.5 వేలు, ఇతర సంస్థల నుంచి రూ.1,500 వసూలు చేశారు.  

‘క్లాప్‌’తో మార్పు తెచ్చిన జగన్‌ ప్రభుత్వం  
పట్టణాలు, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు 2021 అక్టోబర్‌ 2న వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సుమారు 43 లక్షల గృహాల్లో ప్రతి ఇంటికీ రెండు చొప్పున 1.20 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేసింది.

చెత్తను ఇంటివద్దే సేకరించి గార్బేజ్‌ స్టేషన్లకు తరలించేందుకు పీపీపీ విధానంలో 3,097 డీజిల్‌ ఆటో టిప్పర్లను, మరో 1,123 ఎల­క్ట్రిక్‌ ఆటోలను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను శుద్ధి చేసేందుకు మున్సిపాలిటీల్లో 243 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను(జీటీఎస్‌) రూ.227.89 కోట్లతో నిర్మాణం చేపట్టింది. మురుగు శుద్ధికి ఎస్టీపీల నిర్మాణం, ఎప్పటి నుంచో పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త డంపింగ్‌ యార్డ్‌ల్లోని లెగస్సీని తరలించే ప్రక్రియను సైతం చేపట్టింది. ఏడాది కాలంలోనే సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి పట్టణాలు, నగరాలకు కొత్త రూపు తీసుకొచ్చింది.  

బాబు తప్పును సరిదిద్దిన జగన్‌
టీడీపీ హయాంలో పన్ను విధించి మరీ వసూలు చేసిన చెత్తను జనావాసాల మధ్యే డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసి పారేయడంతో 123 మున్సిపాలిటీల్లో దాదాపు 85 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయింది. దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించడంతో గత ప్రభుత్వ హయాంలో తరలింపునకు చర్యలు చేపట్టడంతో పాటు 243 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను(జీటీఎస్‌) ఏర్పాటు చేసింది. వివిధ రకాల చెత్తను వేరుచేసి ఎరువు, విద్యుత్‌ కోసం వినియోగించారు. గుంటూరు, విశాఖపట్నం వద్ద చెత్త నుంచి విద్యుత్‌ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది.    

జగన్‌ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. గతంలో కొండల్లా పేరుకుపోయిన చెత్తలో దాదాపు 50 లక్షల మెట్రిక్‌ టన్నులను వివిధ రూపాల్లో కరిగించారు. పట్టణాల్లో మధ్యలో ఉన్న డంపింగ్‌ యార్డులను పూర్తిగా తొలగించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ తిరుపతి, విశాఖపట్నంతో పాటు పుంగనూరు, నెల్లూరు బెస్ట్‌ అవార్డులు అందుకున్నాయి. 2022లో కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో టాప్‌–10 నగరాల్లో ఆరు రాష్ట్రానికే దక్కాయి. 2023లోనూ రాష్ట్రంలోని పలు నగరాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన ఎన్‌జీటీ బృందం ఉత్తమ పారిశుధ్య విధానాలు, చెత్త నిర్వహణను అభినందించింది. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించని రాష్ట్రాలకు భారీస్థాయిలో జరిమానా విధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement