Property tax collection
-
ప్రక్షాళన దిశగా జీహెచ్ఎంసీ.. ఇక బిల్లు కలెక్టర్లు ఉండరా?
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను అసెస్మెంట్ కోసం ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లవద్దంటూ ఇప్పటికే బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ.. ఆస్తిపన్ను వసూళ్ల కోసం కూడా ఇళ్ల యజమానులకు వెళ్లకుండా చేసే ఆలోచనలో ఉంది. జీహెచ్ఎంసీలో పలువురు బిల్ కలెక్టర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతోపాటు ఆస్తిపన్ను వసూళ్ల కోసం ప్రైవేటు అసిస్టెంట్లను నియమించుకోవడం వంటి ఘటనలు గతంలో వెలుగు చూశాయి. (చదవండి: KBC-13 : కేబీసీలో అనూహ్యంగా కేటీఆర్...ఎలాగంటే!) ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తి పన్నును సైతం వెంటనే ఖజానాలో జమ చేయకపోవడం తదితరమైనవి బల్దియా వర్గాలకు సుపరిచితమే. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్తిపన్ను వసూళ్ల కోసం కోసం బిల్ కలెక్టర్లు వెళ్లనవసరం లేకుండా ప్రజలే తమ బాధ్యతగా ఆస్తిపన్ను చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ► ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుతో పాటు నిర్ణీత వ్యవధుల్లో పన్ను చెల్లించాల్సిందిగా ఎస్ఎంఎస్లు పంపించడం.. నిర్ణీత వ్యవధిలో చెల్లించని పక్షంలో పెనాల్టీ పడే అంశాన్ని తెలియజేయడం వంటివి చేయనున్నారు. వీటితోపాటు అధికారులు ర్యాండమ్‌గా తనిఖీలు చేయాలని భావిస్తున్నారు. ► తనిఖీల్లో భవనం వాస్తవ విస్తీర్ణం వంటివి గుర్తించనున్నారు. విస్తీర్ణం ఎక్కువగా ఉండి తక్కువ ఆస్తిపన్ను ఉంటే సరిచేస్తారు. దీర్ఘకాలంగా ఆస్తిపన్ను చెల్లించని వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. తదుపరి దశల్లో విద్యుత్, నీటి కనెక్షన్ వంటివి తాత్కాలికంగా నిలిపివేయాలనే ఆలోచనలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ► ఎటొచ్చీ బిల్ కలెక్టర్లు వెళ్లకుండానే ప్రజలే తమ ఆస్తిపన్ను చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. అందుకు అవసరమైన విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ఆస్తిపన్నును ఎక్కడినుంచైనా ఆన్లైన్లో చెల్లించే వెసులుబాటు మాత్రమే కాక, సిటిజెన్ సర్వీస్ సెంటర్లలోనూ చెల్లించే వీలుంది. డాకెట్ల విధానం ఎత్తివేత.. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్ల కోసం డాకెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు 20 లక్షల ఇళ్లు 314 డాకెట్లలో ఉన్నాయి. డాకెట్ల వారీగానే బిల్కలెక్టర్లు తమకు కేటాయించిన డాకెట్‌లో ఇళ్లపన్ను వసూలు చేస్తారు. బిల్ కలెక్టర్లను ఆస్తిపన్ను వసూళ్ల కోసం వినియోగించనందున డాకెట్ విధానం కూడా అవసరం లేనందున ఆ విధానాన్ని కూడా ఎత్తివేయనున్నారు. ఓవైపు బల్దియాలో అవినీతి ప్రక్షాళన.. మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగానే ఆస్తిపన్ను చెల్లించేలా చేయాలనేది లక్ష్యం. (చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం) -
రూ.2.27 కోట్లు
వనపర్తి టౌన్: ఆస్తి పన్నుపై మార్చి నెలాఖరు వరకు వడ్డీ వసూలు చేసిన మున్సిపాలిటీలు.. ఇప్పుడు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం ముందస్తుగా ఆశించిన దానికంటే మొదటి నెలలోనే అధికంగా సమకూరుతోంది. ఈ నెలాఖరులోపు పన్ను చెల్లిస్తే మొత్తం ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ ఇస్తున్నారు. ఏటా మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూలుకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే లక్ష్యం చేరుకునేందుకు ఉరుకులు, పరుగులు తీసినా నిర్దేశించిన లక్ష్యం మాత్రం చేరుకోవడం లేదు. ఫలితంగాకొన్ని మున్సిపాలిటీల్లో రోజువారీ ఖర్చులకు సైతం నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడేందుకుగాను పన్ను రాయితీని ప్రకటించి యుద్ధప్రతిపాదికన వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అయిజ, బాదేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నుంచి మున్సిపల్ సిబ్బంది ఓటర్ల జాబితా, ఎన్నికల విధులు తదితర పన్నుల్లో నిమగ్నం కావడంతో ఆస్తిపన్ను వసూళ్లు మందగించాయి. గత మార్చి 31 నాటికి (2018–19) నాటికి వంద శాతం లక్ష్యం సాధించాల్సి ఉండగా.. ఒకట్రెండు మున్సిపాలిటీలు 80 శాతం వసూలు చేస్తే మిగతావి 50–70 శాతం లోపు మాత్రమే పురోగతి సాధించాయి. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు పట్టణ ప్రజలకు వడ్డీ రాయితీ వల్ల ఆర్థికంగా కొంత మేలు కలుగుతోంది. మొండి బకాయిదారులకు ఈ ఆఫర్ ఎంతోగానో ఉపయోగపడుతోంది. ఇంతవరకు ఈ పది మున్సిపాలిటీలకు కలిపి రూ.2.27 కోట్ల ఆదాయం రాగా, ఇందులో వడ్డీ 5శాతం మినహాయిస్తే ముందస్తు పన్ను చెల్లింపుదారులకు రూ.11.36లక్షల లాభం చేకూరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌కు రూ.1.36 కోట్ల ఆదాయం రాగా, రెండో స్థానంలో బాదేపల్లికి రూ.19.84 లక్షలు, మూడోస్థానంలో వనపర్తి మున్సిపాలిటీకి రూ.19.38లక్షలు వచ్చాయి. మిగతా మున్సిపాలిటీల్లో 5 రాయితీకి సంబంధించి ఆస్తిపన్నును మందకొడిగానే చెల్లిస్తున్నారు. ప్రచారంలో అధికారుల వైఫల్యం పారిశుద్ధ్య కార్మికులు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి, పారిశుద్ధ్యం మెరుగునకు, ఇతర అత్యవసర పనులకు ఖర్చు చేసేందుకు ఆస్తిపన్ను నిధులను వాడతారు. అయితే ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లక్ష్యం చేరుకోలేకపోతున్నామని భావించిన ఉన్నతాధికారులు 2019–20కి ముందస్తు పన్ను చెల్లిస్తే ఏప్రిల్ నెలాఖరులోగా 5 శాతం రాయితీ ప్రకటించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించినా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అధికారుల వైఫల్యం కారణంగా ఉన్నతాధికారుల అంచనాకు అనుగుణంగా ఆదాయం రాలేదు. ఈ వారం రోజుల్లోనైనా అధికారులు మేల్కొంటే మున్సిపాలిటీలకు కాసుల పంట పండనుంది. సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు ఆస్తిపన్ను చెల్లించేందుకు ముందుకు రావాలి. ప్రతినెలా విద్యుత్ బిల్లుల తరహాలోనే ఇంటి పన్ను చెల్లించాలి. వారు పన్నులు సకాలంలో చెల్లిస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ నెలాఖరులోగా అవకాశం ఉన్న 5 శాతం రాయితీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – నరేశ్‌రెడ్డి, ఆర్ఓ, వనపర్తి మున్సిపాలిటీ -
ఖజానా కళకళ
ఆదిలాబాద్‌అర్బన్: ఆస్తిపన్ను ఈ సారి రికార్డు స్థాయిలో వసూలైంది. పంచాయతీ ఎన్నికలు జరిపి ప్రశాంత వాతావరణంలో పన్ను వసూలు చేయడంలో పంచాయతీరాజ్ శాఖ సఫలమైంది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఇంటి పన్ను, ఇతర పన్నులు వసూలు చేసింది. గత రెండు, మూడేళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను సైతం వసూలు చేయడంతో పంచాయతీ ఖజానా కళకళలాడుతోంది. ఉమ్మడి నాలుగు జిల్లాల పన్ను లక్ష్యం రూ.16.73 కోట్లు ఉండగా, శుక్రవారం నాటికి రూ.13.70 కోట్లు వసూలయ్యాయి. ఆస్తి పన్ను వసూళ్లలో పంచాయతీరాజ్ శాఖ రికార్డు సాధించే దిశగా ముందుకు వెళ్తోంది. ఓవైపు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా.. నిర్ధేశిత లక్ష్య సాధనకు చేరువలో నిలవడంతోపాటు వసూళ్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.16,73,97,379 మేర పన్నుల రూపేణా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.13,70,99,238 వసూలైంది. అంటే ఆస్తి పన్ను వసూళ్లపై ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ మేరకు సాధ్యమైందని చెప్పవచ్చు. గత రెండు, మూడేళ్లుగా బకాయిదారులు కట్టకుండా పన్ను ఎగవేస్తున్నారు. దీంతో పన్ను వసూలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ అందుకు అనుగుణంగా అధికారులను, సిబ్బందిని నియమించి రావాల్సిన మొత్తాన్ని రాబడుతోంది. మరోవైపు పన్ను వసూళ్లలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహించేది లేదని.. టార్గెట్లను అధిగమించాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులకు హుకుం జారీ చేయడంతో టాక్సు వసూళ్లు భారీగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో రూ.13.70కోట్లు వసూలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రూ.13.70 కోట్ల పన్ను వసూళ్లు చేశారు. మిగతా రూ.3.02 కోట్లను మరో రెండు రోజుల్లో వసూలు చేయాల్సి ఉంది. ఇందులో ఆదిలాబాద్‌లో రూ.4.07 కోట్లు వసూలు కాగా, మిగతా రూ.98.86 లక్షలు, మంచిర్యాలలో రూ.3.95 కోట్లు రాబట్టగా, మిగతా రూ.65.06 లక్షలు, కుమురంభీంలో రూ.3.14 కోట్లు వసూలు చేయగా, ఇంకా రూ.37.80 లక్షలు రాబట్టాల్సి ఉంది. నిర్మల్‌లో రూ.2.53 కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.1.01 కోట్లు మరో రెండు రోజుల్లో రాబట్టాల్సి ఉంది. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి జిల్లాలోని పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి రోజు పన్ను వసూళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీంతో పన్ను వసూళ్లలో వెనుకబడి పంచాయతీని ముందుకు తీసుకెళ్లడంలో పాత్ర పోషిస్తున్నారు. దీంతో 100 శాతం పన్ను వసూలైన పంచాయతీల్లోని సిబ్బందిని ఇతర పంచాయతీల్లో పన్ను వసూళ్లకు పంపిస్తున్నారు. దీంతో సిబ్బంది సైతం ఎక్కువై లక్ష్యం చేరుకునే దిశగా నడుస్తున్నారు. దీంతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల విషయమై ఉదయం, సాయంత్రం రెండుమార్లు జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకుంటున్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడిన పంచాయతీలు ఎవైనా ఉంటే.. యాక్టివ్‌గా ఉన్న సిబ్బందిని అక్కడికి పంపిస్తున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లోనే ఆ పంచాయతీ లక్ష్య సాధన దిశగా అడుగులేస్తోంది. అయితే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ పని చేయకపోవడం, నెట్వర్క్ సమస్య ఉండడంతో రోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన వసూళ్ల సమాచారాన్ని ఒక్కో రోజు ఆలస్యంగా జరుగుతోందని తెలుస్తోంది. గడువు పొడిగిస్తే.. వందశాతం వసూలు ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 178 గ్రామ పంచాయతీల్లో మాత్రమే 100 శాతం పన్ను వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటికల్లా సుమారు 200 పంచాయతీల్లో వందశాతం పన్ను వసూళ్లు సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇప్పటి వరకు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని 80.48 శాతం చేరుకోగా, రెండు రోజుల్లో మరో పదిశాతం సాధించేందుకు కృషి చేస్తున్నారు. గతేడాది మాదిరిగా ప్రభుత్వం ఈ ఏడాది కూడా పన్ను వసూళ్ల గడువును పక్షం రోజుల పాటు పొడిగిస్తే అటుఇటుగా ఖచ్చితంగా శతశాతం చేరుకునేందుకు చర్యలు తీసుకుంటా మని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. లక్ష్యాన్ని చేరుకుంటాం.. పన్ను వసూళ్ల లక్ష్యాన్ని గడువులోగా చేరుకుంటాం. ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది పన్ను వసూలైంది. ఇదే వేగంతో ముందుకు వెళ్తాం. ఇప్పటికే లక్ష్యం 80 శాతం దాటింది. మిగిలిన రెండు రోజుల్లో 90 శాతం చేరుకునేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం గ్రేస్ పీరియడ్ పెంచుతుందని అనుకుంటున్నాం. గడువు పెంచితే మరింత వేగంగా పన్ను వసూలు చేసి వందశాతం సాధిస్తాం. – సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్ -
ఇక ‘మదింపు’లో అక్రమాలకు చెక్
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మున్సిపాలిటీల్లో ఈనెల 20వ తేదీ నుంచి ఇంటింటి సర్వే చేయడానికి మున్సిపల్ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఏఎస్) తో శాటిలైట్ ద్వారా మున్సిపల్ పట్టణాల మ్యాప్ తీస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఆస్తి పన్ను మదింపు చేపడితే ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా ఎంత ఉండాలో అంతే ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూ విభాగం అధికారులు, బిల్ కలెక్టర్లు ఇష్టారాజ్యంగా ఆస్తి పన్ను వసూలు చేసి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు పాల్పడి మున్సిపల్ ఖజానాకు భారీగానే గండి కొట్టారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వార్డుల చొప్పున జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా సర్వే చేపట్టారు. దాంతో అక్కడ దాదాపు 80 శాతం ఆస్తిపన్ను తక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో ప్రభుత్వం రాష్ట్రంలోని పాత మున్సిపాలిటీ పట్టణాల్లో ఈ తరహా సర్వే చేపట్టి అక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 20 వరకు.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, భునగిరి, సూర్యాపేట మున్సిపల్ పట్టణాల్లో కొత్తగా ఆస్తి పన్ను మదింపు చేపట్టనున్నారు. ఈనెల 20 నుంచి ఈ నాలుగు పట్టణాల్లో సర్వే ప్రారంభించడానికి మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 20 వరకు సర్వే చేసి అదే నెల 30వ తేదీన స్పెషల్ నోటీసులు జారీ చేస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. సర్వే ఇలా.. మున్సిపల్ పట్టణాల్లో ఆస్తి పన్ను మదింపులో అక్రమాలను అరికట్టేందుకు సర్వే పకడ్బందీగా నిర్వహించనున్నారు. మదింపు కోసం చేపట్టాల్సిన వివరాలతో పట్టిక పత్రాలను తయారు చేసి ఇళ్లు, వాణిజ్య భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. ఈ సర్వే కో సం విద్యార్థులను పెట్టుకోవాలని నిర్ణయించారు. అధికారులు ఇచ్చిన పత్రాల లో వివరాలు సేకరించిన వాటిని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో పొందుపరుస్తారు. శాటిలైట్ ద్వారా తీసే మ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థుల ద్వారా చేపట్టే ఈ సర్వేకు బిల్ కలెక్టర్లు సూపర్వైజర్లుగా వ్యవహరిస్తారు. ఎంత పన్ను ఉంటే అంతే.. పట్టణాల్లో ఆస్తిపన్ను మదింపులో అనేక అక్రమాలు జరిగాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించి తక్కువ ఆస్తి పన్ను విధించి మున్సిపాలిటీ ఖజానాకు నష్టం జరిగే విధంగా వ్యవహరించారు. ఇక నుంచి ఇలాంటివి జరుగకుండా ఎంత ఆస్తి పన్ను ఉందో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా కచ్చితంగా అంతే రానుంది. ఎక్కడ వాణిజ్య భవనం ఉంటే దానికి తగ్గ పన్ను విధిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ము న్సిపాలిటీలకు ఆదాయం సమగ్రంగా సమకూరనుంది. జిల్లాలో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. -
రోజుకు రూ.10 కోట్లు
* ఇదీ జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను లక్ష్యం * ఇక వసూళ్ల పర్వం * రెడ్ నోటీసులు జారీ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి నుంచి అధికారులు బయటకు వచ్చారు. ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఎన్నికల నేపథ్యంలో చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రెడ్ నోటీసుల జారీకి వెనుకాడటం లేదు. మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో నిర్వహించిన తొలి సమావేశంలోనే మొండి బకాయిల వసూళ్లకు తాము సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ఆస్తిపన్ను వసూళ్లకు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి చెల్లించని వారి నుంచి నయానో, భయానో వసూలు చేయాలని భావిస్తున్నారు. తాజా అంచనాల మేరకు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.450 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఉన్న గడువు దాదాపు 45 రోజులు. రోజుకు కనీసం రూ.10 కోట్లు వసూలు చేయాలని కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అధికారులకు నిర్దేశించారు. అభివృద్ధి పనులకు... మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. జీహెచ్ఎంసీ ప్రకటించిన కార్యక్రమాలు.. ప్రభుత్వం హామీలిచ్చిన పథకాలు ఈలోగా పూర్తి చేయాల్సి ఉంది. నగరంలో చేపట్టే పనులన్నిటికీ జీహెచ్ఎంసీ నిధులనే వినియోగిస్తున్నారు. ఆర్టీసీ వంటి సంస్థకూ దీని నిధులనే బదిలీ చేస్తున్నారు. ఖజానాలో సింహభాగమైన ఆస్తిపన్ను వసూలు చేయకపోతే పనులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భారీగానిధులు అవసరం. ఈ నేపథ్యంలో సర్కిల్‌కు ఒకరు చొప్పున 24 మంది ప్రత్యేక అధికారులను వసూళ్లకు నియమించారు. వీరు సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు, సిబ్బందితో కలసి లక్ష్యసాధనకు కృషి చేస్తారు. భారీ బకాయిలు ఉన్న వారిని వ్యక్తిగతంగా కలవడం, ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు, ఈ మెయిళ్ల ద్వారా గుర్తు చేస్తారు. రెడ్ నోటీసులూ జారీ చేస్తారు. ఇప్పటిదాకా పన్ను పరిధిలోకి రాని భవనాలను గుర్తిస్తారు. ప్రభుత్వ భవనాల నుంచి పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసార సాధనాలను వాడుకోవాలని, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు : 14,11,609 మంది రావాల్సిన మొత్తం : రూ.1630 కోట్లు ఇప్పటి వరకు వసూలై నది : రూ. 545 కోట్లు ఇంకా రావాల్సింది : రూ. 1075 కోట్లు ప్రభుత్వ రాయితీకి అర్హులు : 5,09,187 మంది రాయితీ ద్వారా తగ్గే మొత్తం : రూ. 87 కోట్లు * పై అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 8 లక్షల మంది నుంచి రావాల్సిన ఆస్తిపన్ను: రూ.988 కోట్లు. * ఇది ఒక దశలోని అంచనా. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం వసూలు చేయాల్సింది రూ.1100 కోట్లుగా తాజాగా అంచనా వేశారు. ఇప్పటి వరకూవచ్చినది పోనూ ఇంకా రూ.455 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. 21న సమస్యల పరిష్కారం ఆస్తిపన్ను వివాదాల పరిష్కారానికి ఈనెల 21న ఆదివారం అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం’ పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, అన్ని స్థాయిల అధికారులు పాల్గొని ఆస్తిపన్ను చెల్లింపులో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు, వివాదాలు పరిష్కరిస్తారని తెలిపారు.