సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను అసెస్‌మెంట్ కోసం ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లవద్దంటూ ఇప్పటికే బిల్‌కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ.. ఆస్తిపన్ను వసూళ్ల కోసం కూడా ఇళ్ల యజమానులకు వెళ్లకుండా చేసే ఆలోచనలో ఉంది. జీహెచ్‌ఎంసీలో పలువురు బిల్ కలెక్టర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతోపాటు ఆస్తిపన్ను వసూళ్ల కోసం ప్రైవేటు అసిస్టెంట్లను నియమించుకోవడం వంటి ఘటనలు గతంలో వెలుగు చూశాయి.
(చదవండి: KBC-13 : కేబీసీలో అనూహ్యంగా కేటీఆర్...ఎలాగంటే!)
ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తి పన్నును సైతం వెంటనే ఖజానాలో జమ చేయకపోవడం తదితరమైనవి బల్దియా వర్గాలకు సుపరిచితమే. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్తిపన్ను వసూళ్ల కోసం కోసం బిల్ కలెక్టర్లు వెళ్లనవసరం లేకుండా ప్రజలే తమ బాధ్యతగా ఆస్తిపన్ను చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
► ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుతో పాటు నిర్ణీత వ్యవధుల్లో పన్ను చెల్లించాల్సిందిగా ఎస్‌ఎంఎస్‌లు పంపించడం.. నిర్ణీత వ్యవధిలో చెల్లించని పక్షంలో పెనాల్టీ పడే అంశాన్ని తెలియజేయడం వంటివి చేయనున్నారు. వీటితోపాటు అధికారులు ర్యాండమ్‌గా తనిఖీలు చేయాలని భావిస్తున్నారు.
► తనిఖీల్లో భవనం వాస్తవ విస్తీర్ణం వంటివి గుర్తించనున్నారు. విస్తీర్ణం ఎక్కువగా ఉండి తక్కువ ఆస్తిపన్ను ఉంటే సరిచేస్తారు. దీర్ఘకాలంగా ఆస్తిపన్ను చెల్లించని వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. తదుపరి దశల్లో విద్యుత్, నీటి కనెక్షన్ వంటివి తాత్కాలికంగా నిలిపివేయాలనే ఆలోచనలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
► ఎటొచ్చీ బిల్ కలెక్టర్లు వెళ్లకుండానే ప్రజలే తమ ఆస్తిపన్ను చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. అందుకు అవసరమైన విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ఆస్తిపన్నును ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటు మాత్రమే కాక, సిటిజెన్ సర్వీస్ సెంటర్లలోనూ చెల్లించే వీలుంది.
డాకెట్ల విధానం ఎత్తివేత..
జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్ల కోసం డాకెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు 20 లక్షల ఇళ్లు 314 డాకెట్లలో ఉన్నాయి. డాకెట్ల వారీగానే బిల్‌కలెక్టర్లు తమకు కేటాయించిన డాకెట్‌లో ఇళ్లపన్ను వసూలు చేస్తారు. బిల్ కలెక్టర్లను ఆస్తిపన్ను వసూళ్ల కోసం వినియోగించనందున డాకెట్ విధానం కూడా అవసరం లేనందున ఆ విధానాన్ని కూడా ఎత్తివేయనున్నారు. ఓవైపు బల్దియాలో అవినీతి ప్రక్షాళన.. మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగానే ఆస్తిపన్ను చెల్లించేలా చేయాలనేది లక్ష్యం.
(చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం)
ప్రక్షాళన దిశగా జీహెచ్‌ఎంసీ.. ఇక బిల్లు కలెక్టర్లు ఉండరా?
Published Sat, Sep 4 2021 10:59 AM | Last Updated on Sat, Sep 4 2021 1:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment