వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న ప్రజలు
వనపర్తి టౌన్: ఆస్తి పన్నుపై మార్చి నెలాఖరు వరకు వడ్డీ వసూలు చేసిన మున్సిపాలిటీలు.. ఇప్పుడు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం ముందస్తుగా ఆశించిన దానికంటే మొదటి నెలలోనే అధికంగా సమకూరుతోంది. ఈ నెలాఖరులోపు పన్ను చెల్లిస్తే మొత్తం ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ ఇస్తున్నారు. ఏటా మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూలుకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే లక్ష్యం చేరుకునేందుకు ఉరుకులు, పరుగులు తీసినా నిర్దేశించిన లక్ష్యం మాత్రం చేరుకోవడం లేదు. ఫలితంగాకొన్ని మున్సిపాలిటీల్లో రోజువారీ ఖర్చులకు సైతం నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడేందుకుగాను పన్ను రాయితీని ప్రకటించి యుద్ధప్రతిపాదికన వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అయిజ, బాదేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నుంచి మున్సిపల్ సిబ్బంది ఓటర్ల జాబితా, ఎన్నికల విధులు తదితర పన్నుల్లో నిమగ్నం కావడంతో ఆస్తిపన్ను వసూళ్లు మందగించాయి. గత మార్చి 31 నాటికి (2018–19) నాటికి వంద శాతం లక్ష్యం సాధించాల్సి ఉండగా.. ఒకట్రెండు మున్సిపాలిటీలు 80 శాతం వసూలు చేస్తే మిగతావి 50–70 శాతం లోపు మాత్రమే పురోగతి సాధించాయి.
ముందస్తు పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు
పట్టణ ప్రజలకు వడ్డీ రాయితీ వల్ల ఆర్థికంగా కొంత మేలు కలుగుతోంది. మొండి బకాయిదారులకు ఈ ఆఫర్ ఎంతోగానో ఉపయోగపడుతోంది. ఇంతవరకు ఈ పది మున్సిపాలిటీలకు కలిపి రూ.2.27 కోట్ల ఆదాయం రాగా, ఇందులో వడ్డీ 5శాతం మినహాయిస్తే ముందస్తు పన్ను చెల్లింపుదారులకు రూ.11.36లక్షల లాభం చేకూరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌కు రూ.1.36 కోట్ల ఆదాయం రాగా, రెండో స్థానంలో బాదేపల్లికి రూ.19.84 లక్షలు, మూడోస్థానంలో వనపర్తి మున్సిపాలిటీకి రూ.19.38లక్షలు వచ్చాయి. మిగతా మున్సిపాలిటీల్లో 5 రాయితీకి సంబంధించి ఆస్తిపన్నును మందకొడిగానే చెల్లిస్తున్నారు.
ప్రచారంలో అధికారుల వైఫల్యం
పారిశుద్ధ్య కార్మికులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి, పారిశుద్ధ్యం మెరుగునకు, ఇతర అత్యవసర పనులకు ఖర్చు చేసేందుకు ఆస్తిపన్ను నిధులను వాడతారు. అయితే ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లక్ష్యం చేరుకోలేకపోతున్నామని భావించిన ఉన్నతాధికారులు 2019–20కి ముందస్తు పన్ను చెల్లిస్తే ఏప్రిల్ నెలాఖరులోగా 5 శాతం రాయితీ ప్రకటించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించినా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అధికారుల వైఫల్యం కారణంగా ఉన్నతాధికారుల అంచనాకు అనుగుణంగా ఆదాయం రాలేదు. ఈ వారం రోజుల్లోనైనా అధికారులు మేల్కొంటే మున్సిపాలిటీలకు కాసుల పంట పండనుంది.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రజలు ఆస్తిపన్ను చెల్లించేందుకు ముందుకు రావాలి. ప్రతినెలా విద్యుత్ బిల్లుల తరహాలోనే ఇంటి పన్ను చెల్లించాలి. వారు పన్నులు సకాలంలో చెల్లిస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ నెలాఖరులోగా అవకాశం ఉన్న 5 శాతం రాయితీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – నరేశ్‌రెడ్డి, ఆర్‌ఓ, వనపర్తి మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment