property taxes
-
ఆస్తి పన్ను స్వీయ మదింపు అక్రమాలకు చెక్ ?
సాక్షి, హైదరాబాద్: అనధికార/అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం కొందరు అక్రమార్కులు ఆస్తి పన్నుల స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) ప్రక్రియను దుర్వినియోగపరుస్తుండడాన్ని రాష్ట్ర పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ అక్రమాలను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఆస్తిపన్ను పేరు చెప్పి అక్రమ లేఅవుట్లు/ ప్లాట్లకు చెక్ పెట్టేందుకు కనీసం ఒకసారి రిజిస్టర్ అయిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అనుమతి లేని ప్లాట్లను కొందరు అక్రమార్కులు గృహాలు/భవనాలుగా పేర్కొంటూ, వాటికి ఆస్తి పన్నుల స్వీయ మదింపు నిర్వహిస్తున్నారు. తద్వారా వచ్చిన ఆస్తి పన్ను నంబర్ ఆధారంగా వాటికి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దీనిపై పురపాలక శాఖకు ఫిర్యాదులు కూడా అందాయి. వాస్తవానికి ఆన్లైన్లో ఆస్తి పన్ను స్వీయ మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆటోమెటిక్‌గా ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్‌తో కూడిన ఆస్తి పన్ను డిమాండ్ నోటీసును ప్రింట్ చేసుకోవడానికి పురపాలక శాఖే అవకాశం కల్పించింది. అయితే ఈ డిమాండ్ నోటీసులోని ఆస్తి పన్ను నంబర్ ఆధారంగా అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో పురపాలక శాఖ గుర్తించింది. 15 రోజుల తర్వాతే ప్రింట్ అక్రమాలకు చెక్ పెట్టేలా ఇకపై ఆస్తి పన్నుల స్వీయ మదింపు పూర్తి చేసిన 15 రోజుల తర్వాతే డిమాండ్ నోటీస్ ప్రింట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ 15 రోజుల్లోగా సంబంధిత పురపాలికల అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ స్థితిని నిర్థారించుకోనున్నారు. అలా నిర్ధారించుకున్న తర్వాతే ఆస్తి పన్ను డిమాండ్ నోటీస్‌ను ప్రింట్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నామని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలను త్వరలోనే అన్ని పురపాలికలకు జారీ చేయనున్నామని చెప్పారు. -
దిగ్గజ టెక్ కంపెనీలపై 15 శాతం గ్లోబల్ ప్రాఫిట్ ట్యాక్స్
లండన్: ప్రపంచంలోని దిగ్గజ టెక్నాలజీ కంపెనీలపై మరొక పన్ను భారం పడనుంది. 15 శాతం గ్లోబల్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి జీ–7 దేశాలు అంగీకరించాయి. బహుళ జాతి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో గ్లోబల్ ట్యాక్స్ రేట్ 15 శాతంగా ఉండాలని తీర్మానించాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ జీ–7 దేశాల ఆర్ధిక మంత్రులతో లండన్‌లో సమావేశం జరిగింది. ఈ మేరకు ఆయా దేశాలు ఒప్పందం మీద సంతకాలు చేశాయని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ తెలిపారు. ‘ ఈ ఒప్పందంతో సరైన కంపెనీలు సరైన పన్నులను సరైన ప్రదేశాలలో చెల్లిస్తాయి’ అని రిషి ట్వీట్‌చేశారు. ఒప్పందంలో కార్పొరేట్ పన్ను విధానంలో పోటీ ధరల తగ్గింపు నియంత్రణ ధిక్కరణలు ఉండవని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి, శ్రామిక ప్రజలకు న్యాయం జరిగేలా ఉంటుందన్నారు. జూన్ 11–13 తేదీల్లో కార్న్‌వాల్‌లోని కార్బిస్బేలో జరగాల్సిన జీ–7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా 15 శాతం కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు ఇవ్వడంతో.. ఈ ప్రతిపాదనకు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు చేతులు కలిపాయి. భౌతికంగా ఉనికి లేకపోయినా సరే వ్యాపారం చేసే ఇంటర్నెట్ ఆధారిత సంస్థలకు (ఆన్లైన్ కంపెనీలు) కూడా పన్ను విధానాల సమస్యలను పరిష్కరించేందుకు జీ–7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా వరకు ఆన్లైన్ కంపెనీలు తక్కువ లేదా నో ట్యాక్స్‌లతో కార్యకలాపాలు సాగిస్తుంటాయి. -
డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నం దున రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు, మినహాయింపులను ఇచ్చింది. కరెంటు బిల్లుల్లో ఒక్కో యూనిట్‌కు రూ.2 రాయితీని, ఆస్తి పన్నుల చెల్లింపుల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ, పంచాయతీరాజ్, ఇంధన శాఖలు బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే.. డెయిరీ, పౌల్ట్రీలకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ రాయితీలు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, యూనిట్ విద్యుత్‌కు రూ.2 చొప్పున రాయితీ ఇస్తుందని పేర్కొంటూ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ రాయితీల అందజేతకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని పశుసంవర్థక, డెయిరీ, మత్స్యశాఖ కార్యదర్శిని కోరారు. వీటి ప్రకారం రాయితీలివ్వడానికి ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.100 చెల్లిస్తే చాలు పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను మినహాయింపు కోసం ‘తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల మదింపు నిబంధనలు–2020’కు సవరణ చేశారు. ‘పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లను ఆస్తి పన్నుల చెల్లింపు నుంచి మినహాయించారు. పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డుల నవీకరణ కోసం ఏటా నామమాత్రంగా రూ.100 చెల్లించి ఈ మినహాయింపును పొందవచ్చు’అన్న నిబంధనను కొత్తగా చేర్చారు. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు సైతం ఈ మినహాయింపును జీహెచ్‌సీఎం చట్టంలోని సెక్షన్ 679ఈ కింద అమల్లోకి తెస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
100% వసూలు కావాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, ప్రకటనల పన్ను, షాపుల అద్దెల వసూళ్ల తీరుపై పురపాలక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియబోతుండగా, ఇప్పటివరకు నివాసగృహాల యజమానుల నుంచి కేవలం 62% ఆస్తి పన్నే వసూలు చేశా రని మున్సిపల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల వసూళ్లు 30% కూడా జరగలేదని తెలిపింది. నివాస గృహాల నుంచి రూ.672.30 కోట్ల ఆస్తి పన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.416.85 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, మరో రూ.255.44 కోట్లు రాబట్టాల్సి ఉందని తెలిపింది. ఎట్టి పరిస్థితిలోనైనా మార్చి 31లోగా 100% ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ప్రకటనల పన్ను, దుకాణాల అద్దెలను వసూలు చేయాల్సిందేనని ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణరెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆస్తి పన్నులు, ఇతర పన్నులు, ఫీజుల వసూళ్ల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్లు అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో కోరారు. వెబ్సైట్, నోటీసు బోర్డుల్లో వారి జాబితా.. సకాంలలో ఆస్తి పన్నులు చెల్లించడంలో విఫలమైన వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఒక్కో బిల్ కలెక్టర్ పరిధిలో టాప్ 500 బకాయిదారులను గుర్తించి వారి నుంచి బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. దీర్ఘకాలంగా ఆస్తి పన్నులు చెల్లించక భారీగా బకాయిపడిన వారిని వ్యక్తిగతంగా సంప్రదించి, వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని కోరింది. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తే కొత్త మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం వారికి లీగల్ నోటీసులు పంపాలని తెలిపింది. ఆస్తి పన్ను బకాయిలను ఎగనామం పెట్టిన ప్రభుత్వ, ప్రైవేటు భవనాల యజమానుల జాబితాను మున్సిపాలిటీ వెబ్సైట్, కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రదర్శనకు ఉంచాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన పురపాలికల్లో వివిధ పన్నుల వసూళ్లు.. (రూ.కోట్లలో) వసూళ్ల లక్ష్యాలు.. 85 శాతం ఆస్తి పన్నులను బిల్ కలెక్టర్లు వసూలు చేయాలని, మిగతా 10% బకాయిలను మేనేజర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, ప్లానింగ్ ఆఫీసర్, టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టి వసూలు చేయాలని, మిగతా 5% బకాయిలను మున్సిపల్ కమిషనర్ వ్యక్తిగత చొరవ చూపి వసూలు చేయాలని పురపాలక శాఖ లక్ష్యాలను నిర్దేశించింది. వసూళ్లపై కమిషనర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు తమ స్థాయిల్లో రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. -
రూ.2.27 కోట్లు
వనపర్తి టౌన్: ఆస్తి పన్నుపై మార్చి నెలాఖరు వరకు వడ్డీ వసూలు చేసిన మున్సిపాలిటీలు.. ఇప్పుడు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం ముందస్తుగా ఆశించిన దానికంటే మొదటి నెలలోనే అధికంగా సమకూరుతోంది. ఈ నెలాఖరులోపు పన్ను చెల్లిస్తే మొత్తం ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ ఇస్తున్నారు. ఏటా మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూలుకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే లక్ష్యం చేరుకునేందుకు ఉరుకులు, పరుగులు తీసినా నిర్దేశించిన లక్ష్యం మాత్రం చేరుకోవడం లేదు. ఫలితంగాకొన్ని మున్సిపాలిటీల్లో రోజువారీ ఖర్చులకు సైతం నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడేందుకుగాను పన్ను రాయితీని ప్రకటించి యుద్ధప్రతిపాదికన వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అయిజ, బాదేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నుంచి మున్సిపల్ సిబ్బంది ఓటర్ల జాబితా, ఎన్నికల విధులు తదితర పన్నుల్లో నిమగ్నం కావడంతో ఆస్తిపన్ను వసూళ్లు మందగించాయి. గత మార్చి 31 నాటికి (2018–19) నాటికి వంద శాతం లక్ష్యం సాధించాల్సి ఉండగా.. ఒకట్రెండు మున్సిపాలిటీలు 80 శాతం వసూలు చేస్తే మిగతావి 50–70 శాతం లోపు మాత్రమే పురోగతి సాధించాయి. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు పట్టణ ప్రజలకు వడ్డీ రాయితీ వల్ల ఆర్థికంగా కొంత మేలు కలుగుతోంది. మొండి బకాయిదారులకు ఈ ఆఫర్ ఎంతోగానో ఉపయోగపడుతోంది. ఇంతవరకు ఈ పది మున్సిపాలిటీలకు కలిపి రూ.2.27 కోట్ల ఆదాయం రాగా, ఇందులో వడ్డీ 5శాతం మినహాయిస్తే ముందస్తు పన్ను చెల్లింపుదారులకు రూ.11.36లక్షల లాభం చేకూరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌కు రూ.1.36 కోట్ల ఆదాయం రాగా, రెండో స్థానంలో బాదేపల్లికి రూ.19.84 లక్షలు, మూడోస్థానంలో వనపర్తి మున్సిపాలిటీకి రూ.19.38లక్షలు వచ్చాయి. మిగతా మున్సిపాలిటీల్లో 5 రాయితీకి సంబంధించి ఆస్తిపన్నును మందకొడిగానే చెల్లిస్తున్నారు. ప్రచారంలో అధికారుల వైఫల్యం పారిశుద్ధ్య కార్మికులు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి, పారిశుద్ధ్యం మెరుగునకు, ఇతర అత్యవసర పనులకు ఖర్చు చేసేందుకు ఆస్తిపన్ను నిధులను వాడతారు. అయితే ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లక్ష్యం చేరుకోలేకపోతున్నామని భావించిన ఉన్నతాధికారులు 2019–20కి ముందస్తు పన్ను చెల్లిస్తే ఏప్రిల్ నెలాఖరులోగా 5 శాతం రాయితీ ప్రకటించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించినా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అధికారుల వైఫల్యం కారణంగా ఉన్నతాధికారుల అంచనాకు అనుగుణంగా ఆదాయం రాలేదు. ఈ వారం రోజుల్లోనైనా అధికారులు మేల్కొంటే మున్సిపాలిటీలకు కాసుల పంట పండనుంది. సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు ఆస్తిపన్ను చెల్లించేందుకు ముందుకు రావాలి. ప్రతినెలా విద్యుత్ బిల్లుల తరహాలోనే ఇంటి పన్ను చెల్లించాలి. వారు పన్నులు సకాలంలో చెల్లిస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ నెలాఖరులోగా అవకాశం ఉన్న 5 శాతం రాయితీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – నరేశ్‌రెడ్డి, ఆర్ఓ, వనపర్తి మున్సిపాలిటీ -
ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవనున్న 71 పురపాలికలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదే మిగిలి ఉండటంతో మునిసిపల్ ఎన్నికలు వాయిదా వేయడం ఖాయమని చర్చ జరు గుతోంది. దీంతో ఆ పురపాలికల పాలనను ప్రత్యేకాధికారుల చేతికిచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 173 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 71 చిన్న పట్టణాల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పురపాలక శాఖ చట్టాలకు ప్రభుత్వం గత నెలలో సవరణలు చేసింది. ఆయా పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే ఈ 71 పురపాలికలు అమల్లోకి రానున్నాయి. మే 31తో పంచాయతీల పదవీకాలం ముగియనుండ గా జూన్ 1 నుంచి ఈ పట్టణాలు ఏర్పాటవనున్నాయి. అన్నింటికీ ఒకేసారి.. ఎన్నికల నిబంధనల ప్రకారం పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ముగిసిన 6 నెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే కొత్త పురపాలికల్లో ఎన్నికల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు అందలేదని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 73 పురపాలికల్లో మెజారిటీ పురపాలికల పదవీకాలం 2019 జూన్‌లో ముగియనుంది. దీంతో ఈ పురపాలికలతో కలిపే కొత్త పురపాలికలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటి తర్వాతే మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. పన్ను పెంపు మూడేళ్లుగా.. కొత్తగా ఏర్పాటవనున్న పురపాలికల్లో మూడేళ్ల వరకు ఆస్తి పన్ను పెంచొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. 71 పురపాలికలుగా ఆవిర్భవించనున్న 173 గ్రామ పంచాయతీలతోపాటు 5 మునిసిపల్ కార్పొరేషన్లు, 36 మునిసిపాలిటీల్లో విలీనమవనున్న 136 గ్రామాల ప్రజలకు ఈ నిర్ణయంతో ఊరట లభించనుంది. ఐదేళ్లకోసారి ఆస్తి పన్నుల పెంపు అమలు చేయాల్సి ఉండగా మెజారిటీ పురపాలికల్లో 2002లో నివాస గృహాలు, 2007లో నివాసేతర భవనాలపై ఆస్తి పన్ను పెంచారు. జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన పురపాలికల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నులు పెంచలేదు. ఐదేళ్ల కింద ఏర్పడిన 23 పురపాలికల్లో 2015 ఏప్రిల్ నుంచి పన్నుల పెంపు అమలు చేశారు. ఎన్నికల తర్వాతే వడ్డన! ఆస్తి పన్నుల సవరణ విధానానికి బదులు ఏటా 5 శాతం పన్ను పెంచేలా కొత్త విధానం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే సార్వత్రిక, మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాతే కొత్త విధానం ప్రకటించాలని భావిస్తోంది. ఎన్నికలు ముగిసిన కొంత కాలానికి కొత్తగా ఏర్పడిన 71 పురపాలికలు సహా మొత్తం 120 పురపాలికల్లో ఒకేసారి ఆస్తి పన్ను పెంచే అవకాశముంది. ఐదేళ్ల కింద ఏర్పడిన 23 పురపాలికల్లో 2015లో ఆస్తి పన్నుల పెంపు అమలు చేసినందున అక్కడ 2020 తర్వాతే పన్ను పెంచనున్నారు. -
జగమొండి..!
వరంగల్ అర్బన్: ‘గ్రేటర్’ పరిధిలో ప్రజలందరూ పన్నులు కట్టాలి... మహా నగర అభివృద్ధికి తోడ్పడాలి.. అంటూ అధికారులు జోరుగా సందేశాలు ఇస్తున్నారు. అంతేకాదు.. సామాన్యుడి నుంచి మరీ ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించని పక్షంలో నల్లా కనెక్షన్ కట్..ఆస్తుల జప్తు.. వ్యాపార, వాణిజ్య సంస్థల సీజ్ అంటూ నడి రోడ్డుకు లాగి పరువు తీసిన ఘటనలు గతంలో కోకొల్లలు. ఇదే సమయంలో కొన్నేళ్లుగా రూ.కోట్లల్లో పన్ను బకాయిలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలపై మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్న మహా నగర పాలక సంస్థ.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి కేవలం 11 శాతం పన్నులు వసూలు కావడం గమనార్హం. దీనిపై గ్రేటర్ పాలకవర్గం సైతం స్పందించలేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బకాయిల రాక దేవుడికెరుక.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఆస్తులు 1,545 ఉన్నాయి. వీటి నుంచి జీడబ్ల్యూఎంసీకి ఆస్తి పన్ను కింద 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.99 కోట్లు.. కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు రూ.15.70 కోట్లు సమకూరాల్సి ఉంది. వడ్డీలు మినహాస్తే రూ.18.69 కోట్ల బకాయిలు ఉండగా.. గ్రేటర్ అధికారులు ఇప్పటివరకు రూ.2,15 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇందులో సగానికి పైగా సొమ్ము ఆయా శాఖలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెల్లించినవే. నోటీసులతో సరి.. ఏళ్ల తరబడి బకాయిలు భారీగా పేరుకుపోతున్నా.. బల్దియా అధికారుల్లో కదలిక లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో మొక్కుబడిగా అన్నట్లు.. ఏటా తాఖీదులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఏదైనా సమీక్ష సమావేశాల్లో ఉన్నతాధికారులు అడిగితే.. తాఖీదులు ఇచ్చామని సమాధానమిస్తున్నారే తప్ప.. బకాయిల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన దాఖలాలు లేవు. అయితే.. ఈ ఏడాది బల్దియా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పన్నులు చెల్లించాల్సిందేనంటూ ఏడాది పొడవునా ఒత్తిడి తీసుకొచ్చారు. నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయా ప్రభుత్వ శాఖల్లో చలనం లేకుండా పోయింది. ఇప్పటికైనా దృష్టి సారించాలి.. మరో 23 రోజులు గడిస్తే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికైనా మేయర్, కలెక్టర్, కమిషనర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి శాఖ పన్ను చెల్లించే విధంగా ఒత్తిడి తేవాలి. పేరుకుపోయిన బకాయిలను రాబట్టగలిగితే ‘గ్రేటర్’ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి.. మహా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. బకాయిలు చెల్లించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు.. నిట్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, కేయూ, రైల్వే శాఖ, ప్రభుత్వ కాలేజీలు, రెవెన్యూ శాఖ, ఆర్అండ్బీ, పీడబ్ల్యూడీ, పంచాయతీ రాజ్, ప్రభుత్వ ఆస్పత్రులు, పోస్ట్ ఆఫీస్‌లు, హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ స్కూళ్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, కోర్టు, టెలికాం, ఆల్ ఇండియా రేడియో, ట్రాన్స్‌కో, సీఆర్పీఎఫ్ పోలీస్, ఎఫ్‌సీఐ, ఇతర సర్కారు సంస్థల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. స్పెషల్ నోటీసులు ఇస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. కొన్ని శాఖల అధికారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రత్యేక నోటీసులు జారీ చేసి వసూలు చేస్తాం. – శాంతికుమార్, టీఓ -
బాధ్యతగా పన్నులు చెల్లించండి
విశాఖసిటీ: ఆస్తి పన్ను, నీటి పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని గ్రేటర్ ప్రజలను జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ విజ్ఞప్తి చేశారు. కోట్ల రూపాయల బకాయిలుండటం వల్ల అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ చాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పోలిస్తే జీవీఎంసీలో పన్నుల విలువ తక్కువైనా నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఏడా ది అక్టోబర్ వరకూ మొత్తం నీటి పన్ను బకాయిలు రూ.29 కోట్లుండగా, ఆస్తి పన్ను బకాయిలు రూ.37 కోట్లున్నాయని ఇవన్నీ వసూలైతే.. నగర ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశముంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేషన్లకు నిధులు అవసరమని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి ఇంట్లోనూ తడి పొడి చెత్తను కచ్చితంగా వేరు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 100 కిలోలు, అంతకంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు.. తమ పరిసర ప్రాంతాల్లోనే కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇలా చేయని వారి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. అదే విధంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించాలన్నారు. లేకుంటే ఆ ప్రాంతాలకు చెత్త బండిని పంపించే ది లేదని స్పష్టం చేశారు. చెత్త బండి రాలేదని పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. తడి పొడి చెత్త వేరు చేయడం ప్రతి ఇంటి వద్ద బాధ్యతగా చేపట్టాలనీ, త్వరలోనే ఈ అంశాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వేరు చేస్తున్నారని, అన్ని జోన్లకూ కలిపి రోజుకి 105 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నట్లు తెలిపారు. భీమిలి జోన్‌కు సంబంధించి 279 జీవో టెండర్ పరిశీలనలో ఉందనీ, మిగిలిన జోన్లకు సంబంధించి కోర్టులో స్టే నడుస్తోందని కమిషనర్ హరినారాయణన్ తెలిపారు. నీటి పన్నుల విషయంలో కమర్షియల్ కేటగిరీల్లో కొన్ని తప్పులు దొర్లాయనీ, నోటీసులు వచ్చిన వారు ఆయా జోన్లకు వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. వర్షపునీటిని ఒడిసి పట్టాల్సిందే.. జీవీఎంసీ పరిధిలోని సెమీ బల్క్, బల్క్ వాటర్ కనెక్షన్లు కలిగిన వారంతా విధిగా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని కమిషనర్ సూచించారు. కేవలం ఇంకుడు గుంతల నిర్మాణానికే పరిమితం కాకుండా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలన్నారు. దీన్ని అమలు చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఇస్తామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు జీవీఎంసీ సిద్ధమవుతోందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీడీపీఎంఎస్ ద్వారా ఇప్పటివరకూ జీవీఎంసీ పరిధిలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాల కోసం ఆన్లైన్లో 3,600 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పది ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ జీవీఎంసీ పరిధిలోని 27 హైస్కూల్స్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు. ఏఏ సబ్జెక్టుల్లో పిల్లలు వెనుకబడి ఉన్నారని గుర్తించి, వారికి స్పెషల్ కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారి బలాలు, బలహీనతలు గుర్తించి దానికనుగుణంగా విద్యార్థుల్ని సన్నద్ధులు చేస్తామన్నారు. ఈ పరీక్షల మార్కుల్ని ఆన్లైన్లో పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
పురపాలికల ఖజానా గుల్ల
► పడిపోయిన ఆస్తి పన్నుల వసూళ్లు ► 72 పురపాలికల్లో 53 శాతం పన్నులే వసూలు ► మున్సిపల్ కమిషనర్లపై ప్రభుత్వం సీరియస్ ► నెలాఖరులోగా 100 శాతం వసూళ్లకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రాష్ట్రంలోని పురపాలికల ఖజానా వెలవెలబోతోంది. పురపాలికల ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తి పన్నుల వసూళ్లు తలకిందులయ్యాయి. మరో 20 రోజుల్లో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, 72 పురపాలికల్లో 53 శాతం ఆస్తి పన్నులు మాత్రమే వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర 72 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో గృహ సముదాయాల నుంచి మొత్తం రూ.340.70 కోట్ల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉండగా, రూ.180.74 కోట్లే వసూలయ్యాయి. మరో రూ.159.96 కోట్ల బకాయిలు ఉంది. జీహెచ్ఎంసీలో సైతం 60 శాతమే ఆస్తి పన్నులు వసూలయ్యాయి. రూ.1,500 కోట్లకు గాను రూ.900 కోట్లను మాత్రమే జీహెచ్ఎంసీ వసూలు చేయగలిగింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత నవంబర్ 8న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నగర, పట్టణ ప్రాంతాల్లో వ్యాపారాలు కుదేలై వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి ఆస్తి పన్నుల వసూళ్లు భారీగా పతనమయ్యాయని పురపాలక శాఖ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర వసూళ్లూ అంతంతే... జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజు, అడ్వర్టైజ్మెంట్ పన్నులు, షాపుల అద్దెల వసూళ్లూ అంతంత మాత్రమే. రూ.12.42 కోట్ల ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు గాను రూ.4.25 కోట్లు(34శాతం) మాత్రమే వసూలయ్యాయి. రూ.3.44 కోట్ల ప్రకటనల పన్నులకు గాను రూ.1.18 కోట్లు(34.42శాతం), రూ.143.38 కోట్ల షాపుల అద్దెలకు గాను రూ.105.03 కోట్లు(26.74శాతం) మాత్రమే వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో రూ.91.65 కోట్ల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉండగా, రూ.10.33 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 66 పురపాలికల్లో వసూళ్ల శాతం 30కే పరిమితమైంది. 100 శాతం వసూలు చేయాల్సిందే... ఆస్తి పన్నులు, ఇతర రుసుముల వసూళ్లలో పురపాలికలు వెనకబడిపోవడం పట్ల ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులోగా 100 శాతం వసూళ్లు సాధించాల్సిందేనని మున్సిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్తి పన్నుల వసూళ్లపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. శాతాల వారీగా ఆస్తి పన్నుల వసూళ్లు సాధించిన పురపాలికల (జీహెచ్ఎంసీతో కలిపి) సంఖ్య 80 శాతానికి పైగా వసూళ్లు సాధించిన పురపాలికలు 2 80–50 శాతంలోపు వసూళ్లు సాధించిన పురపాలికలు 39 50–30 శాతంలోపు వసూళ్లు సాధించిన పురపాలికలు 27 30 శాతం లోపు వసూళ్లు సాధించిన పురపాలికలు 5 -
రూ.4 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యం
స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కమిషనర్ ఆదేశాలు నెల్లూరు సిటీ: అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఆస్తి, కుళాయి, వీఎల్టీ, డ్రైనేజీ పన్నులను పాత నోట్లతో చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ వరకు గడువును పొడిగించిన నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలో రూ.నాలుగు కోట్లను వసూలు చేయాల్సిందిగా కమిషనర్ వెంకటేశ్వర్లు టార్గెట్ ఇచ్చారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ విభాగాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నుల వసూళ్లు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు మాట్లాడుతూ.. ఇటీవల బిల్ కలెక్టర్లకు డివిజన్లు మార్పు చేయడంతో కలెక్షన్ పెరిగే అవకాశం లేదని చెప్పారు. దీంతో 24వ తేదీ వరకు బిల్కలెక్టర్లు పాత డివిజన్లలోనే విధులు నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు. స్మార్ట్ సర్వేతో పాటు రెవెన్యూ వసూళ్లు కూడా చేయాలని తెలిపారు. రెవెన్యూ ఆఫీసర్ సమ«ద్, ఆర్ఐలు కృపాకర్, పద్మ, కృష్ణారావు, ప్రవీణ్, చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు. రూ.28 లక్షల వసూలు కార్పొరేషన్ కార్యాలయంలో పాత నోట్లతో రూ.28 లక్షల పన్ను చెల్లింపులు మంగళవారం జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 24వ తేదీ వరకు గడువు ఇవ్వడంతో పన్నుల వసూళ్లు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. -
దోచేశారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 688 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులతోపాటు వాటి పరిధిలో వివిధ రకాల పన్నుల కింద ఆదాయం వస్తుంది. ఈ ఏడాది ఆస్తిపన్నులు, పన్నేతర కేటగిరీల కింద ఏకంగా రూ.159.63 కోట్ల ఆదాయాన్ని ప్రతిపాదించారు. ఇలా వస్తున్న పంచాయతీల ఆదాయం అక్రమార్కుల పాలవుతోంది. వీటిపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపడితే పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో 75 పంచాయతీల్లో అవకతవకలపై చేపట్టిన ప్రాథమిక విచారణలో పలు అంశాలు బయటపడ్డాయి. అక్రమ అనుమతులతో సొమ్ము.. పంచాయతీల్లో ఎక్కువగా జరుగుతున్న అక్రమాల్లో అక్రమ అనుమతులకు సంబంధించినవే ఉన్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు, ఓఆర్సీలు, ఎన్ఓసీల విషయంలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నారు. ముఖ్యంగా లేఅవుట్ల అనుమతులు, లిటిగేషన్ భూములకు అనుమతులివ్వడం లాంటి పనుల్లో భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. నగర శివారు పంచాయతీల్లోనే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, ఘట్కేసర్, శామీర్‌పేట్, శంషాబాద్, మేడ్చల్, రాజేంద్రనగర్ మండలాల్లోని 75 పంచాయతీల్లో అవకతవకలపై విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది. 45 మంది సర్పంచులకు మెమోలు.. అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేల్చినవాటిలో ఎక్కువగా సర్పంచుల ప్రమేయమే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. 45 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల జోక్యంతో పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడింది. అంతేకాకుండా మరో 30 మంది కార్యదర్శులు అక్రమంగా అనుమతులివ్వడంలో పాలకవర్గానికి సహకరించారు. వీరితోపాటు మరో 15 మంది వార్డు సభ్యులు కూడా అక్రమాలకు పాల్పడ్డారు. అధికారుల ప్రాథమిక విచారణలో బయటపడిన అంశాల అధారంగా జిల్లా పంచాయతీ శాఖ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పూర్తిస్థాయి విచారణకు డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల విస్తరణ అధికారులతో విస్తరణకు ఆదేశించింది. రెండు వారాల్లో విచారణ ప్రక్రియ కొలిక్కి రానున్నదని, వెనువెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని పంచాయతీ శాఖలో ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
రూ.2.45 లక్షలు గోల్మాల్
కమిషనర్‌కు నోట్ పెట్టిన మేనేజర్ ఇప్పుడు నీటిపన్ను బాగోతం రామచంద్రపురం : రామచంద్రపురం మున్సిపాలిటీని కుదిపేసిన ఆస్తిపన్నుల అవినీతి బాగోతాన్ని మరువక ముందే.. ఇదే మున్సిపాలిటీలో నీటిపన్నుల రూపేణా వసూలు చేసిన సొమ్ము మాయమైన వ్యవహారం వెలుగుచూసింది. కార్యాలయంలో బిల్లు కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆస్తి, నీటి పన్నుల వసూలు సొమ్మును స్వాహా చేశారని అధికారులే స్పష్టం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మున్సిపాలిటీలోని నీటి పన్నుల వసూళ్లలో జరిగిన అవినీతిపై మున్సిపల్ మేనేజర్ జి.రాధాకృష్ణ మే నెలలో కమిషనర్‌కు నోట్ పెట్టారు. మొత్తం 243 నీటి పన్నుల రసీదులకు సంబంధించి రూ.2.45 లక్షలు గోల్మాల్ అయినట్టు తెలిసింది. సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్, రెవెన్యూ వసూళ్ల విభాగం సిబ్బంది కలిసి ఆన్లైన్లో 243 నీటి పన్నుల రసీదులను రద్దు చేసి, వాటి సొమ్మును కార్యాలయ చిట్టాల నుంచి తొలగించినట్టు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా, ఆన్లైన్లో కంప్యూటర్ పాస్‌వర్డ్‌ను సిబ్బంది దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహా సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు ఈ బాగోతాన్ని నడిపించినట్టు సమాచారం. ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేయాలని మేనేజర్ తన లేఖలో పేర్కొన్నా, చర్యల్లేవు. ఆస్తిపన్ను బాగోతంపై నిర్లక్ష్యం మున్సిపాలిటీలో జరిగిన రూ.48 లక్షల ఆస్తిపన్ను బాగోతం వెలుగులోకి వచ్చి 15 రోజులు గడుస్తున్నా.. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపలేదు. ఈ నెల 15న ‘సాక్షి’లో ‘ఇంటిదొంగల టాలెంట్’ శీర్షికన కథనం వెలువడిన సంగతి విదితమే. దీనిపై కల్టెక్టర్ స్పందించి బాధ్యులపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. 21న ము న్సిపల్ కార్యాలయానికి ఆదేశాలు చేరుకున్నా, ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదు.