పురపాలికల ఖజానా గుల్ల | 72 Municipalities, 53 percent of the property taxes | Sakshi
Sakshi News home page

పురపాలికల ఖజానా గుల్ల

Published Fri, Mar 10 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

పురపాలికల ఖజానా గుల్ల

పురపాలికల ఖజానా గుల్ల

పడిపోయిన ఆస్తి పన్నుల వసూళ్లు
72 పురపాలికల్లో 53 శాతం పన్నులే వసూలు
మున్సిపల్‌ కమిషనర్లపై ప్రభుత్వం సీరియస్‌
నెలాఖరులోగా 100 శాతం వసూళ్లకు ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రాష్ట్రంలోని పురపాలికల ఖజానా వెలవెలబోతోంది. పురపాలికల ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తి పన్నుల వసూళ్లు తలకిందులయ్యాయి. మరో 20 రోజుల్లో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, 72 పురపాలికల్లో 53 శాతం ఆస్తి పన్నులు మాత్రమే వసూలయ్యాయి. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర 72 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో గృహ సముదాయాల నుంచి మొత్తం రూ.340.70 కోట్ల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉండగా, రూ.180.74 కోట్లే వసూలయ్యాయి.

మరో రూ.159.96 కోట్ల బకాయిలు ఉంది. జీహెచ్‌ఎంసీలో సైతం 60 శాతమే ఆస్తి పన్నులు వసూలయ్యాయి. రూ.1,500 కోట్లకు గాను రూ.900 కోట్లను మాత్రమే జీహెచ్‌ఎంసీ వసూలు చేయగలిగింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత నవంబర్‌ 8న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నగర, పట్టణ ప్రాంతాల్లో వ్యాపారాలు కుదేలై  వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి ఆస్తి పన్నుల వసూళ్లు భారీగా పతనమయ్యాయని పురపాలక శాఖ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

ఇతర  వసూళ్లూ అంతంతే...
జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు, అడ్వర్టైజ్‌మెంట్‌ పన్నులు, షాపుల అద్దెల వసూళ్లూ అంతంత మాత్రమే. రూ.12.42 కోట్ల ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుకు గాను రూ.4.25 కోట్లు(34శాతం) మాత్రమే వసూలయ్యాయి. రూ.3.44 కోట్ల ప్రకటనల పన్నులకు గాను రూ.1.18 కోట్లు(34.42శాతం), రూ.143.38 కోట్ల షాపుల అద్దెలకు గాను రూ.105.03 కోట్లు(26.74శాతం) మాత్రమే వసూలయ్యాయి. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో రూ.91.65 కోట్ల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉండగా, రూ.10.33  కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 66 పురపాలికల్లో వసూళ్ల శాతం 30కే పరిమితమైంది.

100 శాతం వసూలు చేయాల్సిందే...
ఆస్తి పన్నులు, ఇతర రుసుముల వసూళ్లలో పురపాలికలు వెనకబడిపోవడం పట్ల ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులోగా 100 శాతం వసూళ్లు సాధించాల్సిందేనని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్తి పన్నుల వసూళ్లపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు.

శాతాల వారీగా ఆస్తి పన్నుల వసూళ్లు సాధించిన
పురపాలికల (జీహెచ్‌ఎంసీతో కలిపి) సంఖ్య
80 శాతానికి పైగా వసూళ్లు సాధించిన పురపాలికలు    2
80–50 శాతంలోపు వసూళ్లు సాధించిన పురపాలికలు    39
50–30 శాతంలోపు వసూళ్లు సాధించిన పురపాలికలు     27
30 శాతం లోపు వసూళ్లు సాధించిన పురపాలికలు    5

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement