సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నెలకొన్న అవిశ్వాసాల గందరగోళానికి తెర దించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొన్న 127 పట్టణ, నగర పాలక మండళ్లలో చాలా చోట్ల లుకలుకలు బహిర్గతమయ్యాయి. పలుచోట్ల ఇప్పటికే మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు.
కొన్ని పట్టణాల్లో క్యాంపులు, కొనుగోళ్ల పర్వం కూ డా మొదలైంది. అవిశ్వాసాలు ప్రతిపాదించిన పట్ట ణాలు, నగరాల్లో అధికార బీఆర్‌ఎస్ పాలక మండళ్లే కొలువు తీరి ఉండటం, ప్రస్తుత మేయర్లు, చైర్‌పర్సన్లను గద్దె దించేందుకు సొంత పార్టీ ప్రతినిధులే అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
పట్టణ, నగర పాలక మండళ్లలో అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టేందుకు ఉన్న కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే మరో ఏడాది వర కు సమస్య ఉండదని భావిస్తోంది. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించేలా పావులు కదుపుతోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు విషయమై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ గవర్నర్‌ను కలవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ బిల్లు విషయంలో గవర్నర్‌కు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసి ఆమోదించాల్సిందిగా కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఇన్నాళ్లుగా పెండింగ్‌లో..
తెలంగాణ మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నగర, పురపాలక సంఘాల్లో మేయర్/ డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్/వైస్ చైర్‌పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు.. పాలక మండలి ఏర్పాటైన నాటి నుంచి కనీసం మూడేళ్లు గడువు పూర్తయి ఉండాలి. ఈ నిబంధనకు సవరణ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ మున్సిపల్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
అసెంబ్లీ ఆమోదించినా గవర్నర్ వద్ద పెండింగ్‌లో పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఏర్పడిన అగాథం నేపథ్యంలో గవర్నర్ వద్ద ఆగిన ఏడు బిల్లుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పుర/నగర పాలక సంస్థల పాలక మండళ్లకు గత నెల 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. ఇదే అదనుగా అసమ్మతి ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. అవన్నీ కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపే చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే సమస్యకు చెక్‌పడుతుందని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment