corporations
-
ఇదేమి మిత్ర‘ధర్మం’?
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించగా అందులో జనసేనకు 3, బీజేపీకి కేవలం ఒకటి ఇచ్చారు. ప్రకటించిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు, ఒక వైస్ ఛైర్మన్‌తోపాటు కొన్నింటిలో డైరెక్టర్ పదవులుండడంతో వాటినీ భర్తీ చేశారు. డైరెక్టర్లతో కలిసి మొత్తం 99 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది.కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారు. ఆర్టీసీ, ఏపీఐఐసీ, శాప్, హౌసింగ్ బోర్డు, సీడాప్, మారిటైమ్ బోర్డు, మార్క్‌ఫెడ్, ఏపీటీడీసీ వంటి ప్రధానమైన కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేనకు ఇచ్చిన మూడు కార్పొరేషన్లు కూడా అప్రాధాన్యమైనవేనని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పెద్దగా గుర్తింపు లేని, ఎవరూ పట్టించుకోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టిడ్కో, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. బీజేపీకి 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి ఒకటే దక్కింది. అది కూడా టీడీపీ పాత నాయకుడు లంకా దినకర్‌కు ఇవ్వడంతో అది పేరుకు బీజేపీ ఖాతాయే తప్ప పదవి టీడీపీదేనని చెబుతున్నారు.ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంతో మంది ఉండగా వారెవ్వరినీ పట్టించుకోకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి ఇవ్వడంపై ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ముఖ్య నాయకులందరినీ పక్కన పెట్టి ఆ పార్టీలో ఉన్న తన శిష్యుడైన లంకా దినకర్‌కు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి కంటి తుడుపుగా ఒక పదవి ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లోపించిన సామాజిక సమతూకంమరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజికవర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు. 20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా ఏడు పదవులే ఇచ్చారని వెనుకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు రెండు, ఎస్టీ ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పదవుల పంపకంపై టీడీపీ నేతలు సైతం అసహనంగానే ఉన్నారు. పదవులు ఆశించిన ఆలపాటి రాజా, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ముఖ్యమైన నేతలకు మొండి చేయే చూపారు. దీంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
ఏపీలో కూటమి పార్టీల బరితెగింపు
కూటమి నేతల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లను కూటమి నేతలు కై వసం చేసుకునేందుకు బెదిరింపులు, దౌరన్యాలకు దిగుతున్నారు. ఎక్కడా వైఎస్సార్సీపీ పేరు వినిపించకుండా ఉండేందుకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు,జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ‘మర్యాదగా పచ్చ కండువా కప్పుకోండి. లేదంటే మీ అంతు చూస్తాం. పాతకేసుల ఏవైనా ఉంటే తోడుతాం. లేవంటే ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపుతాం’ అంటూ పోలీసులు, ఇంటలిజెన్స్ అధికారుల ద్వారా కూటమి నేతలు బెదిరింపులకుపాల్పడుతున్నారు. ఆ కోవలోనే చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పుంగనూరు మున్సిపాలిటీని కూటమి నేతలు దౌర్జన్యంగా వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు.ఇంకా మిగిలిన వాటిపై దృష్టి సారించారు.సాక్షి టాస్‌్కఫోర్స్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్‌తో పాటు.. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు మున్సిపాలిటీలన్నింటిలోనూ వైఎస్సార్సీపీ నేతలే విజయం సాధించారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవశం చేసుకున్నారు. అదేవిధంగా అన్ని మండల పరిషత్‌ల్లోనూ వైఎస్సార్సీపీ నేతలే ఎంపీపీలుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు తమ అనుచరులను ఆ కురీ్చల్లో కూర్చోబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. రంగంలోకి ఖాకీలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు రక్షణకల్పించాల్సిన పోలీసులు కొందరు టీడీపీ, జనసేన నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్, ఎంపీపీ, జెడ్పీటీసీ కురీ్చల్లో కూటమి నేతలను కూర్చోబెట్టేందుకు వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన వారిని ప్రత్యేకంగా పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పిలిపించి టీడీపీలో చేరాలంటూ బెదిరింపులకు దిగారు. ఓ పోలీసు, ఇంటిలిజెన్స్‌లోని మరో అధికారి నేరుగా వారి నివాసాలకు, మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి బెదిరించిన విషయం తెల్సిందే. వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లందరినీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పచ్చకండువాలు కప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండల పరిధిలోని ఎంపీటీసీ, సర్పంచ్‌లను సైతం ఇదే స్థాయిలో పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న కౌన్సిలర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లందరినీ అమరావతికి తీసుకెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చేటట్లు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.జనసేన జీరో అంటతిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినా.. తిరుపతిలో జనసేన జీరో.. తామే హీరోలమంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన పార్టీ కార్పొరేటర్లను కూర్చోబెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా అయితే తిరుపతిలోని 50 డివిజన్లలో 49 స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే విజయం సాధించారు. కేవలం ఒకే ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొంత మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు డబ్బులిచ్చి కూటమి ప్రభుత్వంలో చేర్చుకున్నారు. వారిలో ఒకరిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు తహతహలాడుతున్నారు. అందులో భాగంగా ఆదివారం కొందరు కార్పొరేటర్లతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు రహస్య సమావేశాలు నిర్వహించారు. కొంతమందిని బెదిరిచించారు. అలాగే ఇంకొంత మందికి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జనసేన జీరో అని, టీడీపీ నేతలే హీరోలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో అన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. తాము అడిగినంత డబ్బు ఇచి, పార్టీ మారితే మేయర్, చైర్మన్ కుర్చీలో మీరే కొనసాగవచ్చుంటూ ఆఫర్ చెస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా కొందరు ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లగానే ఉంటామని, పార్టీ మారే ఆలోచనే లేదని తేల్చిచెప్పడం విశేషం. -
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్‌గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్‌గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల మార్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ఐఏఎస్‌లను ఎండీలుగా నియమిస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల్లో గుబులు నెలకొంది. మరోవైపు కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సంక్రాంతికి ముందుగానే లేదా ఆ వెంటనే కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తనకు గతంలో తెలిసిన, సమర్థులైన అధికారులను ఆయా పోస్టుల్లో నియమించవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ శాఖలో మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా, వేర్ హౌసింగ్ లాంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత కూడా వీటిల్లో కొన్నింటికి ఐఏఎస్‌లు ఎండీలుగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఐఏఎస్‌లు కానివారు ఎండీలుగా కొనసాగుతున్నారు. గత సర్కారుతో సంబంధాలపై ఆరా ప్రస్తుతం కార్పొరేషన్ల ఎండీలుగా ఉన్నవారి గురించిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంతో వారెలా ఉన్నారు? వృత్తిపరంగా వ్యవహరించారా? లేక అప్పటి అధికార పార్టీ నేతల్లా పనిచేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్లలో ఎండీలు, చైర్మన్లు కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కొందరు ఎండీ స్థాయి లేకున్నా పైరవీలతో ఆయా సీట్లలో కూర్చున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయా పోస్టుల్లో కొనసాగేందుకు కొందరు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఉండేదెవరు? ఊడేదెవరు?: మార్క్‌ఫెడ్‌కు సత్యనారాయణరెడ్డి ఎండీగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆయన ఈ బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వంలోని మంత్రి దయాకర్‌రావు వద్ద పీఎస్‌గా పనిచేశారు. ఇలా గతంలో పీఎస్లుగా పనిచేసిన వారి ని ఇప్పుడు తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సత్యనారాయణరెడ్డి కొనసాగింపుపై చర్చ జరుగుతోంది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఎండీగా ఉన్న జితేందర్‌రెడ్డి ఒక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు. కాబట్టి ఈయన కొనసాగింపుపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇక ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా సంస్థలకు ఎండీలుగా సీనియర్ అధికారులు ఉన్నారు. వీరికి గతంలో బీఆర్ఎస్తో రాజకీయపరమైన సంబంధాలు లేవంటున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సంస్థ (ఇష్టా)కు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతర్జాతీయంగా రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారు. కాబట్టి ఈయన మార్పు ఉండబోదన్న వాదన వినిపిస్తోంది. ఇక ఆయిల్ ఫెడ్, హాకాలకు ఎండీగా ఉన్న సురేందర్, ఆగ్రోస్ ఎండీ రాములు ఇద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందినవారు. కాబట్టి వారిని కూడా మార్చక పోవచ్చని చెబుతున్నారు. వారికి సీఎంతో ఉన్న అనుబంధం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. రఘునందన్‌రావు కొనసాగుతారా? వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు కొనసాగుతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సన్నిహితుడన్న ప్రచారముంది. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోనూ రఘునందన్‌రావుకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ మార్చినా మంచి పోస్టులోకే వెళ్తారని అంటున్నారు. -
కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం!.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. రెండేళ్లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున.. ఆలోపు పెద్ద మున్సిపాలిటీలను కార్పొ రేషన్లుగా అప్‌గ్రేడ్ చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల పాలనా యంత్రాంగాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు.. బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట–జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేటలను ఏర్పాటుచేశారు. ఇవన్నీ హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. మిగతా చోట్ల ఉన్న పెద్ద మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్ చేయలేదు. ఈ క్రమంలో మున్సిపాలిటీలుగానే ఉన్న కొ న్ని జిల్లా కేంద్రాలతోపాటు కొత్త జిల్లా కేంద్రాలుగా మారిన పలు పట్టణాల్లో పెరిగిన జన సాంద్రతకు అనుగుణంగా వాటిని కా ర్పొరేషన్లుగా మార్చాలనే డిమాండ్ వస్తోంది. గ్రేడ్–1, స్పెషల్ గ్రేడ్ స్థాయి మున్సిపాలిటీలలో.. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. కనీసం మూడు లక్షల జనాభా గల పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చుకునే వీలుంది. రాష్ట్రంలో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్ధిపేట, మంచిర్యాల పట్టణాలు స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు, పట్టణాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్లుగా మార్చుకునే అవకాశముంది. - గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్‌ను కార్పొరేషన్ చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పట్టుదలతో ఉన్నారు. ఆయన సూచనల మేరకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేసి కార్పొరేషన్‌గా మార్చాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. - ఇదే తరహాలో జనాభా ప్రాతిపదికన నల్లగొండ, ఆదిలాబాద్ మున్సిపాలిటీలను కూడా విస్తరించి కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయాలన్న చాలా కాలం నుంచీ డిమాండ్లు ఉన్నాయి. ఈసారి ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కార్పొరేషన్లుగా మారితే ఈ రెండు పట్టణాలు సరికొత్తగా మారుతాయని ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. - కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలలో సిద్ధిపేట, మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ గ్రేడ్ స్థాయికి ఎదిగిన ఈ మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను విలీనం చేస్తే కార్పొరేషన్లుగా రూపొందుతాయి. మంచిర్యాలకు నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలతోపాటు కొన్ని గ్రామ పంచాయతీలను కలిపితే కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేటకు మరికొన్ని గ్రామాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్ హోదా పొందే అవకాశం ఉంది. కరీంనగర్లో మరికొన్ని గ్రామాల విలీనం? కరీంనగర్ పట్టణంలో కలసిపోయి/ ఆనుకుని ఉన్న బొమ్మకల్, చింతకుంట, నగునూరు, మల్కాపూర్, తిమ్మాపూర్ గ్రామాలు వివిధ కారణాల వల్ల కార్పొరేషన్లో విలీనం కాలేదు. పట్టణంలోని హౌజింగ్‌బోర్డు, ఖార్కాన గడ్డ, బైపాస్ రోడ్డు, చల్మెడ మెడికల్ కాలేజీ ఉన్న ప్రాంతమంతా బొమ్మకల్ గ్రామం పరిధిలోనే ఉంది. ప్రతిమ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉన్న నగునూరు కూడా పంచాయతీగానే కొనసాగుతోంది. ఈ గ్రామాల కంటే దూరంగా ఉన్న వాటిని కార్పొరేషన్లో విలీనం చేసి.. వీటిని రాజకీయ కారణాలతో కలపలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వీటిని కార్పొరేషన్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు తెలిసింది. పట్టణీకరణతో మెరుగవుతున్న జీవన ప్రమాణాలు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మౌలిక వసతులు సమకూరుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. గతంలో 6 కార్పొరేషన్లు మాత్రమే ఉంటే కొత్తగా మరో ఏడింటిని కొత్త నగరాలుగా తీర్చిదిద్దారు. 69 మున్సిపాలిటీలు 128కి పెరిగాయి. ఇప్పుడు కూడా జనాభాకు అనుగుణంగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. – రాజు వెన్‌రెడ్డి, మున్సిపల్ చాంబర్స్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్. ఇది కూడా చదవండి: ఉప్పల్ సరే.. మరి లష్కర్? -
బిల్లును ఓకే చేయించి.. అవిశ్వాసాలు ఆపేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నెలకొన్న అవిశ్వాసాల గందరగోళానికి తెర దించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొన్న 127 పట్టణ, నగర పాలక మండళ్లలో చాలా చోట్ల లుకలుకలు బహిర్గతమయ్యాయి. పలుచోట్ల ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. కొన్ని పట్టణాల్లో క్యాంపులు, కొనుగోళ్ల పర్వం కూ డా మొదలైంది. అవిశ్వాసాలు ప్రతిపాదించిన పట్ట ణాలు, నగరాల్లో అధికార బీఆర్ఎస్ పాలక మండళ్లే కొలువు తీరి ఉండటం, ప్రస్తుత మేయర్లు, చైర్పర్సన్లను గద్దె దించేందుకు సొంత పార్టీ ప్రతినిధులే అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పట్టణ, నగర పాలక మండళ్లలో అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టేందుకు ఉన్న కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే మరో ఏడాది వర కు సమస్య ఉండదని భావిస్తోంది. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించేలా పావులు కదుపుతోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు విషయమై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ గవర్నర్‌ను కలవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ బిల్లు విషయంలో గవర్నర్‌కు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసి ఆమోదించాల్సిందిగా కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా పెండింగ్‌లో.. తెలంగాణ మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నగర, పురపాలక సంఘాల్లో మేయర్/ డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు.. పాలక మండలి ఏర్పాటైన నాటి నుంచి కనీసం మూడేళ్లు గడువు పూర్తయి ఉండాలి. ఈ నిబంధనకు సవరణ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ మున్సిపల్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదించినా గవర్నర్ వద్ద పెండింగ్‌లో పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఏర్పడిన అగాథం నేపథ్యంలో గవర్నర్ వద్ద ఆగిన ఏడు బిల్లుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పుర/నగర పాలక సంస్థల పాలక మండళ్లకు గత నెల 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. ఇదే అదనుగా అసమ్మతి ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. అవన్నీ కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపే చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే సమస్యకు చెక్‌పడుతుందని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల పరిధిలోని రెండు కార్పొరేషన్లకు నూతన చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ శాఖ పరిధిలోని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల కార్పొరేషన్ (రెడ్కో) చైర్మన్‌గా ఏరువ సతీశ్‌రెడ్డి, సమాచార, ప్రజా సంబంధాల శాఖ పరిధిలోని సినిమా, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్ కూర్మాచలం నియమితులయ్యారు. వీరు ఆ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన సతీశ్‌రెడ్డి 2020 నుంచి టీఆర్ఎస్ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. 2012 నుంచి 2019 వరకు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2018 ప్రగతి నివేదిక సభ డిజిటల్ మీడియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సినిమా, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన అనిల్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూకే శాఖకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే వ్యవస్థాపక సభ్యుడిగా క్రియాశీలకపాత్ర పోషించారు. -
ఉత్సాహంగా మూడోరోజు ‘పట్టణ ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణప్రగతి మూడోరోజు కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై అక్కడికక్కడే స్పందించి పరిష్కరించారు. మున్సిపల్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ, 28 మంది ఎమ్మెల్యేలతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీసహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 10,189 టన్నుల చెత్త, 1,059 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కనున్న పొదలు, 3,129 టన్నుల శిథిలవ్యర్థాలను తొలగించారు. 897 కిలోమీటర్ల మేర మురుగు కాలువల్లో పూడిక తీశారు. మురుగు, వరద నీటికాల్వలు, కల్వర్టుల వద్ద 146 జాలీలను ఏర్పాటు చేశారు. 1,256 ప్రజా మరుగుదొడ్లు, 644 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, 546 మతపరమైన ప్రదేశాలు, పార్కులను శుభ్రంచేశారు. 182 లోతట్టు ప్రాంతాలను పూడ్చారు. 1,32,762 ప్రాంతాల్లో ఫాగింగ్, స్ప్రే చేశారు. 121 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సీజ్ చేసి, బాధ్యులపై రూ.15,303 అపరాధ రుసుం విధించారు. పనిచేయని, ఎండిపోయిన 71 బోర్లను మూసివేశారు. 36 ఇంకుడు గుంతలను పునరుద్ధరించడంతోపాటు కొత్తగా పదింటిని నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న 68 ఇళ్లను తొలగించినట్లు తెలిపారు. విద్యుత్ మరమ్మతులు.. వైకుంఠధామాలు 125 విద్యుత్, నీటిమీటర్లకు మరమ్మతులు చేశారు. 26 మోటార్లకు కెపాసిటర్లు బిగించారు. 113 వంగిన స్తంభాలను సరిచేసి, 56 తుప్పు పట్టిన విద్యుత్‌స్తంభాలను మార్చారు. 2,100 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేశారు. 84 వైకుంఠధామాలు, శ్మశాన వాటికలను శుభ్రంచేశారు. 141 వైకుంఠధామాల పనులు ప్రారంభించారు. 28 వైకుంఠ రథాలను కొనుగోలు చేశారు. 25 మార్కెట్లు, రైతుబజార్లను శుభ్రం చేశారు. 42 క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు. మొక్కల సంరక్షణకు అనువుగా... పట్టణాలు, నగరాల్లో 24,045 మొక్కల మధ్య కలుపు తీసి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా 11,779, రోడ్ల మధ్యన ఉన్న పాదుల్లో 6, 844 మొక్కలను నాటారు. కొత్తగా 36 స్థలాలను ట్రీ పార్కుల కోసం గుర్తించారు. కొత్త ట్రీ పార్కులో 2,252 గుంతలను మొక్కలు నాటడానికి అనువుగా తీశారు. 14,210 మొక్కలను ఇళ్లకు పంపిణీ చేశారు. మొక్కలు పెంచిన 21 మందిని సన్మానించారు. 320 ప్రదేశాల్లో పైపులైన్ లీకేజీలను గుర్తించి నీరు కలుషితం కాకుండా సరిచేశారు. 44 పంపు సెట్లను బ్రేక్‌డౌన్ కాకుండా సరిచేశారు. 321 మందికి ఒక రూపాయికి నల్లా కనెక్షన్‌ను ఇచ్చారు. 148 మందికి రూ.100కు నల్లా నీటి కనెక్షన్ ఇచ్చారు. -
కేంద్రం సంస్కరణలకు అనుగుణంగానే ఆస్తి పన్ను
సాక్షి, అమరావతి: మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల లో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం కూడా పెంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణను నెలకొల్పడం, ప్రభుత్వ నిధుల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు ద్రవ్య లోటును తగ్గించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ‘ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం)’ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీన్ని గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం సంస్కరణలను సైతం అమలు చేయాలని సూచించింది. దీనికనుగుణంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ లెక్కల ప్రకారం.. ఆస్తి మార్కెట్ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం నిర్దేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణతోపాటు మరో 9 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆస్తి విలువ ఆధారంగా పన్ను చట్ట ప్రకారం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి విలువను ప్రతి ఐదేళ్లకు ఒకసారి మదింపు చేపట్టి అందుకనుగుణంగా ఆస్తి పన్ను పెంచాలి. కానీ వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో నివాసయోగ్య ఆస్తులు, 2007లో నివాసేతర ఆస్తుల (కమర్షియల్) పన్నును మదింపు చేశారు. అప్పట్లో ఆస్తుల వార్షిక అద్దె ప్రాతిపదికగా పన్ను విధానం అమలులో ఉండేది. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం.. పన్ను ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. -
కూలుతున్న అక్రమ కట్టడాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీలలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై సర్కారు కన్నెర్ర చేసింది. వాటిని కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరు చెప్పి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నెలక్రితం దుండిగల్‌లో పంచాయతీ అనుమతితో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం విషయం వెలుగుచూడడంతో పురపాలక శాఖ సీరియస్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి గతంలో నిర్మాణ అనుమతి పొందినప్పటికీ, మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లుగా మారాక ఆయా ప్రాంతాల్లో తిరిగి సంబంధిత విభాగాల అనుమతి పొందాలని, లేని పక్షంలో కూల్చివేస్తామని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే పురపాలక శాఖ అధికారులు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు సోమవారం నుంచే భవన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ శివార్లలోని జిల్లాల్లో ముందుగా 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించి ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలకు దిగాయి. కూల్చివేతలను మంగళవారం సైతం కొనసాగించారు. ఇతర జిల్లాల్లో సైతం భారీగా అక్రమ కట్టడాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో రెండేళ్ల కాలంలో నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాల డేటాను అధికారులు సేకరించారు. ఈ మేరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కొత్త మున్సిపాలిటీల్లో కూడా గ్రామ పంచాయతీ అనుమతి పేరిట భారీగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. వ్యక్తిగత నివాస భవనాలతో పాటు కళాశాలలు, హాస్టళ్లు, స్కూళ్లను బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు కనుగొన్నారు. వీటిలో స్థానిక పట్టణ అథారిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా సాగిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
పద్ధతిగా పట్టణాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసే ప్రక్రియ రూపుదిద్దుకుంటోంది. పట్టణాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తోంది. వానలు, వరదలు వచ్చినా నష్టం కలగకుండా పట్టణాల్లో నాలాల అభివృద్ధి, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొదలు పన్ను వసూళ్లకు శాస్త్రీయ విధానాన్ని రూపొందించడం వరకు మాస్టర్ ప్లాన్‌లో పొందుపరుస్తోంది. జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాలతోపాటు వరంగల్ కార్పొరేషన్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ప్రజలు పడుతున్న కష్టాలు పునరావృతం కాకుండా మాస్టర్ప్లాన్లు రెడీ అవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాస్టర్ప్లాన్లను సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రెసిడెన్షియల్, వాణిజ్య, గ్రీన్ జోన్లుగా.. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. బెంగళూరు, చండీగఢ్ నగరాల తరహాలో నివాస, నివాసేతర ప్రాంతాలను జోన్లుగా విభజించనుంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో జోన్ల వారీగా విభజించి రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయనుంది. క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతోపాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి అభివృద్ధి చేపట్టనుంది. ఈ జోన్లను జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)తో అనుసంధానించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలికవసతులు అభివృద్ధి చేయనుంది. ప్రయోగాత్మకంగా 17 మున్సిపా లిటీల్లో ఇప్పటికే జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్లు తయారు చేసి అమలు తీరును పరీక్షించింది. మాస్టర్ ప్లాన్‌లో రోడ్ నెట్వర్క్, జనాభా, భౌగోళిక అంశాల వంటి 40 అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. పట్టణ ప్రగతి కింద ఇప్పటికే.. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే ప్రభుత్వం మున్సిపాలిటీలకు రూ. 2,062 కోట్లు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 858 కోట్ల వ్యయంతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కి.మీ. మేర రహదారుల వెంట మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ మాస్టర్ ప్లాన్ కోసం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది. వరంగల్‌లో వ్యర్థాల బయో మైనింగ్ ప్రాజెక్టుతోపాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్‌ఎస్‌ఏపీలను సిద్ధం చేయనుంది. 38 పట్టణాల్లో రూ. 1,433 కోట్లతో నీటిసరఫరా పథకాలు, రూ. 700 కోట్లతో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లు, రూ. 61 కోట్లతో మెహదీపట్నం, ఉప్పల్‌లో స్కై వాక్ నిర్మాణాలతోపాటు కొత్వాల్‌గూడ దగ్గర్లో 85 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు వంటివన్నీ మాస్టర్ ప్లాన్‌లో భాగమే. 70 పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు రెడీ... రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ తదితర కార్పొరేషన్లలో ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేశారు. మొత్తంగా 70 నగరాలు, పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు సిద్ధమయ్యాయని, మరో 37 మున్సిపాలిటీలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లను నెల రోజుల్లో సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. -
తెలంగాణలో నగరాలు, పట్టణాల అభివృద్ధికి సర్కారు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. వానలకు నగరాలు, పట్టణాలు అతలాకుతలం కాకుండా రూపురేఖలు మార్చాలని సంకల్పించింది. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నిర్మాణాలకు అనుమతి, మునిసిపల్ నిబంధనలు కశ్చితంగా అమలు చేయడంపై దృష్టి పెట్టబోతోంది. జీహెచ్ఎంసీతో పాటు వరంగల్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను మునిసిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆధునిక వసతులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పట్టణాలు, నగరాల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికబద్ధమైన కార్యాచరణ ఉండేలా సిద్ధమయ్యారు. రెసిడెన్షియల్, వాణిజ్య,గ్రీన్ జోన్లుగా విభజించి.. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ భావిస్తోంది. బెంగళూరు, చండీగఢ్ నగరాల తరహాలో ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలనుకుంటోంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రణాళిక పద్ధతిలో రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతో పాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ జోన్లను జీఐఎస్‌తో అనుసంధానించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీల్లో జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ఆధారిత మాస్టర్ ప్లాన్లు తయారు చేసి అమలు చేసే పనుల్లో పురపాలక శాఖ పురోగతిలో ఉంది. తర్వాత మిగతా మున్సిపాలిటీలను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రగతి కింద ఇప్పటికే.. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే రూ. 2,062 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.858 కోట్లతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కిలోమీటర్ల మేర రహదారుల వెంట మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ మాస్టర్ ప్లాన్ కో సం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది. వరంగల్ వ్యర్థాల బయో మైనింగ్ ప్రాజెక్టుతో పాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్‌ఎస్‌ఏపీలను సిద్ధం చేయనుంది. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లలో మాస్టర్ ప్లాన్లు రెడీ అయ్యాయి. 38 పట్టణాల్లో రూ.1,433 కోట్లతో నీటి సరఫరా పథకాలు, రూ.700 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్లు, రూ.61 కోట్లతో మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కై వాక్ నిర్మాణాలు, కొత్వాల్ గూడ దగ్గర ఎకో పార్క్ నిర్మించనున్నారు. -
ఏపీలో ఆర్థికంగా వెనుకబడినవారి కోసం కొత్త సంక్షేమ శాఖ
-
AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ,రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. అలాగే జైన్ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) -
ప్రజాప్రతినిధులకు నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 2న ఇది ప్రారంభం కాగా 12లోగా గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల స్థాయిలో కమిటీలు పూర్తి చేయాల్సి ఉంది. పార్టీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20లోగా మండల, మున్సిపల్, పట్టణ కమిటీలు కూడా పూర్తి కావాలి. 20 తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీలను పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నియమిస్తారు. కేసీఆర్ నిర్ణయం మేరకు గతంలో నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు కాగా, తాజాగా జిల్లా కమిటీలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో అధికారిక పదవులు దక్కని నేతలు పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో చోటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్య నేతలకు ప్రాధాన్యం... 2017, అక్టోబర్‌లో నియమించిన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నాలుగేళ్లుగా స్వల్ప మార్పులతో కొనసాగుతూ వస్తోంది. ఈ కమిటీలో పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావుకు సెక్రటరీ జనరల్ పదవి, 20 మందికి ప్రధాన కార్యదర్శులుగా, 33 మందికి కార్యదర్శులుగా, 12 మందికి సహాయ కార్యదర్శులుగా పదవులు దక్కాయి. వీరిలో ప్రస్తుతం సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి, కొందరికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దక్కగా, మరికొందరు ఇతర నామినేటెడ్ పదవులు పొందారు. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన ముఖ్య నేతలు కొందరికి అటు అధికార పదవులు, ఇటు పార్టీ పదవులు లేకపోవడంతో అసంతృప్తి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో ఇలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ బలోపేతానికి వీరి సేవలు, అనుభవాన్ని వాడుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే అధికార పదవులు అనుభవిస్తున్న నేతలకు పార్టీ కమిటీల్లో చోటు లభించే అవకాశం లేదని సమాచారం. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ? పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లు కావస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తిగా జరగలేదు. 50కి పైగా ప్రభుత్వ కార్పొరేషన్లు, మండళ్లలో చైర్మన్, డైరెక్టర్ స్థానాలు కలుపు కొని సుమారు 500 వరకు పదవులు భర్తీ చేయాల్సి ఉంది. త్వరలో వీటి భర్తీని చేపడతామని మంగళవారం జరిగిన ‘గ్రేటర్’టీఆర్ఎస్ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మరో 18 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే జనవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో అధికార, నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు ఆశిస్తున్న నేతలు కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
ఏపీ: 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారన్నారు. చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే చూశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల అన్నారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన: మంత్రి వేణుగోపాల కృష్ణ బీసీలంటే చంద్రబాబుకు చులకన అని, వారిని ఓటు బ్యాంక్‌గానే చూశారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. సీఎంకు, సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేరన్నారు. మహిళలకు 52 శాతం పదవులు: సుచరిత మహిళలకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని హోంమంత్రి సుచరిత అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరు మీదే ఇచ్చి వారి ప్రాధాన్యం ఏమిటో చెప్పారని సుచరిత అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నిమామకంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. కొంతమంది కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన దాన్ని పదవి అనుకోకుండా బాధ్యతలా పని చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
నామినేటెడ్ పోస్టులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చాలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు కొత్త పాలక మండళ్ల నియామకం జరగలేదు. ఆ నామినేటెడ్ పదవుల కోసం పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందో అనే ఆశతో కీలక నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఏడాదిన్నర గడిస్తే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం ఉండటంతో.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీ జరగాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల్లో దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల పదవులు కూడా ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి ముగిశాకగానీ, అక్టోబర్ తర్వాతగానీ నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పుడప్పుడు ఒకట్రెండు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో మాత్రమే నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన కార్పొరేషన్లలో సుమారు 50కి పైగా పాలకమండళ్లు ఉన్నాయి. వాటిలో గణనీయంగానే ఖాళీలు ఉన్నాయి. మహిళా కమిషన్, టీఎస్పీఎస్సీ వంటి సంస్థలకు కోర్టు విధించిన గడువుకు తలొగ్గి నియమకాలు జరిపినట్టు విమర్శలు వచ్చాయి. రైతుబంధు సమితి, అటవీ అభివృద్ధి సంస్థ, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తదితరాలకు కొత్త పాలకమండళ్లను నియమించారు. టీఎస్ఐఐసీ, స్పోర్ట్స్ అథారిటీ, వికలాంగుల కార్పొరేషన్‌కు గతంలో ఉన్న వారినే కొనసాగించారు. ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మరోమారు నియమించారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగినా సభ్యులను భర్తీ చేయకపోవడంతో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. భారీగానే ఆశావహులు.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ పనిచేస్తున్న వారితోపాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలతో టీఆర్ఎస్లో అన్నిచోట్లా బహుళ నాయకత్వం ఏర్పడింది. సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపక్షాలు బలహీనపడగా.. టీఆర్ఎస్లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. శాసనసభ, శాసనమండలి, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లుగా అవకాశాలు కల్పించినా.. ఇంకా రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తున్న నేతల జాబితా భారీగానే ఉంది. వివిధ సందర్భాల్లో పార్టీ అవసరాలతోపాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేస్తున్నా.. ఖాళీగా ఉన్న పదవులు ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. ఆయా నేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతోపాటు ఇతర కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని.. ఎవరికి ఏ తరహా పదవులు ఇవ్వాలో ఆయనకు తెలుసని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయని పేర్కొంటున్నాయి. ఈ పదవులన్నీ ఖాళీయే.. పలు ప్రభుత్వ శాఖల పరిధిలోని కార్పొరేషన్లకు ఏళ్ల తరబడి పాలకమండళ్లను నియమించలేదు. బేవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీ, పరిశ్రమల శాఖ పరిధిలో పలు సంస్థలకు పాలకమండళ్ల నియామకం జరగలేదు. మిషన్ భగీరథ, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, సాహిత్య అకాడమీ, ఎంబీసీ, స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, టెస్కోవంటి సంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగిసినా పాతవారినే కొనసాగిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదాద్రి తదితర ప్రధాన ఆలయాలు కూడా ఏళ్ల తరబడి పాలక మండళ్లు లేకుండానే ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 30 కమిటీలకు పాలకమండళ్లు లేవు. -
పుణేలో పాక్షిక ఆంక్షల సడలింపు
సాక్షి, ముంబై: పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ల పరిధిలో లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా సడలించింది. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి అజిత్ పవార్ ఆంక్షల సడలింపు ప్రకటన చేశారు. ఆగస్టు 9వ తేదీ నుంచే ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని పవార్ వెల్లడించారు. దీంతో పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ల పరిధిలోని వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఇరు కార్పొరేషన్లలో రికవరీ రేటు గణనీయంగా పెరగడంతో పాటు కరోనా వైరస్ కూడా మెల్లమెల్లగా అదుపులోకి వస్తోంది. దీంతో లాక్డౌన్ ఆంక్షలను పాక్షికంగా సడలించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి అజిత్ పవార్ తెలిపారు. సడలించిన నిబంధనల ప్రకారం ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని రకాల షాపులు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. హోటళ్లు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. మాల్స్ రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని అజిత్ పవార్ వెల్లడించారు. అయితే, కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే మాల్స్‌లోకి అనుమతించాలని పవార్ మాల్స్ యాజమాన్యాలకు సూచించారు. ఒకవేళ ప్రజల నిర్లక్ష్యం వల్ల పాజిటివిటీ రేటు 8 శాతాన్ని దాటితే సడలించిన ఆంక్షలను రద్దు చేస్తామని, మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు వెనుకాడబోమని పవార్ హెచ్చరించారు. ప్రజలు అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని పవార్ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నియమాలను పాటించాలని ఆయన కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజిత్ పవార్ హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దని పౌరులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలోని ఉద్యానవనాలు ప్రస్తుతం అమలులో ఉన్న సమయానుసారంగానే తెరిచి ఉంటాయని వెల్లడించారు. పుణే, పింప్రి–చించ్వడ్ ప్రాంతాల్లో ఈత తప్ప మిగతా అన్ని క్రీడలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇక్కడి ప్రార్థనా మందిరాలు అన్నీ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, తమ వ్యాపారాలు, కార్యకలాపాల వేళలను మార్చాలని పుణేలోని రెస్టారెంట్ల ఓనర్లు, వ్యాపారులు, మాల్ సిబ్బంది అసోసియేషన్లు డిమాండ్లు చేస్తూ గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కరోనా ఆంక్షలు సడలించిన ప్రభుత్వం లెవల్–3 జిల్లాలైన పుణే సహా మరో 9 జిల్లాలకు కరోనా ఆంక్షలను సడలించలేదు. కాగా, ప్రస్తుతం పుణేలో పాజిటివిటీ రేటు 3.3 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్లో కూడా çకరోనా పాజిటివిటీ రేటు 3.7 శాతానికి తగ్గిందని అక్కడి అధికారులు వెల్లడించారు. -
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు తీపికబురు!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు (కార్పొరేషన్లు), గ్రాంట్–ఇన్–ఇన్స్టిట్యూషన్లు, సొసైటీలు, యునివర్సిటీలు (నాన్ టీచింగ్ స్టాఫ్), రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఇతర సంస్థల్లో సైతం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ సంస్థలు తమ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును అడాప్ట్ చేసుకున్నాయని సీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు కోసం తీసుకొచ్చిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ సూపర్‌అన్యూయేషన్) చట్ట సవరణ’గత మార్చి 30 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును సైతం అదే తేదీ నుంచి అమలుపర్చాలని ఆదేశించారు. ఆయా సంస్థల సర్వీసు రూల్స్‌కు ఈ మేరకు సవరణలు చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంపునకు తీసుకున్న చర్యలపై నిర్దేశిత నమూనాలో రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదించాలని సూచించారు. గత నెల 30 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో.. గత నెల 31న పదవీ విరమణ చేసిన పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల సర్వీసు మరో మూడేళ్లు పెరిగింది. మళ్లీ వారు విధుల్లో చేరేందుకు అవకాశం లభించింది. -
బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు?
సాక్షి, అమరావతి: పురపాలక పదవుల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సింహభాగం కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. చట్టం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈ వర్గాలకు పదవులు దక్కేలా కసరత్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని 86 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్లు, నగర మేయర్ల పదవుల్లో ఏ స్థానాన్ని ఏ సామాజికవర్గానికి కేటాయించింది.. వివరాలివీ.. -
మున్సిపాలిటీల్లో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో సంస్కరణలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలంటూ కేంద్రం మార్గనిర్దేశం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దాంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్న ఆస్తి పన్ను విధానాలను వివరించారు. (చదవండి: వైఎస్సార్ ఫొటో ఎందుకు పెట్టకూడదు: హైకోర్టు) ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి, అధికారులతో సమావేశంలో చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
'బలహీన వర్గాలకు బలం సీఎం జగన్'
తాడేపల్లి: బీసీల అభ్యునతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం జగన్ అధ్యయన కమిటీ వేశారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, మహిళల పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం బీసీలకు పెద్ద పీఠ వేసింది. క్యాబినెట్లో కూడా బీసీలకు పెద్ద పీఠ వేశారు. బీసీల కోసం 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీలకు నేడు పండుగ రోజు. అందులో భాగంగా 30వేల జనాభా మించిన కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మెన్ , డైరెక్టర్లను నియమిస్తారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెప్పారు. బీసీలంతా వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శంకర నారాయణ తెలిపారు. బీసీలంటే బిజినెస్ క్యాస్ట్‌గా టీడీపీ చూసింది - ధర్మాన 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి సపోర్ట్ చేస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అయితే వైఎస్ జగన్ తన పాదయత్రలో బీసీల బాధలు తెలుసుకొని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మాటప్రకారం బీసీల కోసం 28 కార్పొరేషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌గా కాకుండా బిజినెస్ క్యాస్ట్‌గా చూసింది. అందుకే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ధర్మాన పేర్కొన్నారు. (బీసీ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష) బలహీన వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డే బలం చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బీసీల కష్టాలు చూశారు. 30వేల జనాభా దాటిన ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీనిచ్చారు. సీఎం అయిన వేంటనే బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారు. మాటలు కాకుండా చెప్పిన ప్రతి హామీని సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమానికి 43వేల కోట్లు ఖర్చు పెడితే అందులో రూ. 22వేల కోట్లు బీసీలకు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. ప్రతి కులం రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలని చెప్పే వ్యక్తి జగన్ అని జంగా కృష్ణమూర్తి అన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసింది. బలహీన వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డే బలమని అన్నారు. (‘వైజాగ్ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా’) -
ఆ పోస్టులు నెలాఖరుకల్లా భర్తీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు శంకర నారాయణ, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, మోపిదేవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (‘జగనన్న పచ్చతోరణం’కు పకడ్బందీ ఏర్పాట్లు) అందరికీ పథకాలు అందే విధంగా ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని సీఎం సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల రూపాయలను నగదు బదిలీ ద్వారా అందించామని సీఎం పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్‌గా గతంలో ఎవరూ, ఎప్పుడూ పని చేయలేదని సీఎం స్పష్టం చేశారు. రూపాయి లంచం, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామన్నారు. కొత్త వాటితో కలుపుకుని మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
79% కేసులు 30 మున్సిపాల్టీల్లోనే..
న్యూఢిల్లీ/తిరువనంతపురం/గువాహటి: భారతదేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 79 శాతం కేసులు కేవలం 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల పరిధిలోనే బయటపడ్డాయని మంత్రుల బృందం(జీవోఎం) వెల్లడించింది. 15వ జీవోఎం సమావేశం శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో జరిగింది. దేశంలో కరోనా తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 6.92 శాతం మంది మరణించగా, భారత్‌లో 3.23 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని జీవోఎం పేర్కొంది. ఉధృతంగానే కరోనా వ్యాప్తి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల ఆగడం లేదు. తాజాగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,976 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా వల్ల 100 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 81,970కి, మరణాలు 2,649కి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులు 51,401. ఇప్పటివరకు 27,919 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 34.06కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. తాజాగా నమోదైన 100 మరణాల్లో 44 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి. గుజరాత్లో 20 మంది, ఢిల్లీలో 9 మంది, పశ్చిమబెంగాల్లో 8 మంది ఉత్తరప్రదేశ్‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు కన్నుమూశారు. కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో 70 శాతానికి పైగా బాధితులకు ఇతర జబ్బులు కూడా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 20 లక్షలకుపైగా కరోనా టెస్టులు: ఐసీఎంఆర్ దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య 20 లక్షలు దాటినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. శుక్రవారం ఉదయం వరకు 20,39,952 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. ఇందులో 92,911 పరీక్షలను గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్వహించినట్లు వెల్లడించింది. కరోనా టెస్టుల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, ప్రస్తుతం రోజుకు దాదాపు లక్ష టెస్టులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రత్యేక రైలులో వచ్చిన వారికి కరోనా వెయ్యి మంది వలస కూలీలతో కూడిన మొదటి ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి కేరళకు చేరుకుంది. వీ రిలో ఏడుగురికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు పరీక్షలో తేలింది. దాంతో వారిని అధికారులు కరోనా కేర్ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలించారు. కాగా,కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని అ స్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ కేంద్రానికి లేఖరాశారు. లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం మిజోరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ముగిసిన పురపోరు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. 129 పురపాలికల్లో మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) బుధవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించింది. మొత్తంగా చూస్తే ఓటేసిన వారిలో మహిళలు 69.94 శాతం, పురుషులు 68.8 శాతం, ఇతరులు 8.36 శాతం మంది ఓటర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 93.31 శాతం నమోదు కాగా, మేడ్చల్ జిల్లా నిజాంపేట కార్పొరేషన్లో అత్యల్పంగా 39.65 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీల్లోని మొత్తం ఓట్లకు 49,75,093గాను 34,95,322 ఓట్లు పోలయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 88.32 శాతం పోలింగ్, అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 50.32 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో గ్రామ పంచాయతీలు, నగరపంచాయతీలుగా ఉన్న కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ బాగా జరగ్గా, నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు కొంతమేర బద్ధకించినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎక్కడా కూడా రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించలేదు. టెండర్ ఓట్లు నమోదు అయినట్లు కూడా ఎస్ఈసీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఘర్షణలు.. వాగ్వాదాలు.. : వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య పలుచోట్ల స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు, డబ్బు పంపిణీ ఆరోపణలు, కొన్నిచోట్ల పోలీసులకు ఫిర్యాదు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు తమ తమ మున్సిపాలిటీల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం 120 మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులకు (80 ఏకగ్రీవాలు మినహాయించి), 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు (ఒక ఏకగ్రీవస్థానం కాకుండా) వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తంగా 7,613 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటి పరిధిలో ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటే.. 24న రీపోలింగ్ నిర్వహించి, 25న ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలు ప్రకటిస్తారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుల్లో పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగించి ఓటేసేందుకు అర్హులైన ఓటర్లను గుర్తించారు. జీహెచ్ఎంసీలోని డబీర్‌పురా డివిజన్‌లోనూ ఉప ఎన్నిక జరిగింది. కాగా, బుధవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. 24న ఈ కార్పొరేషన్‌లోని 58 డివిజన్లకు (రెండు ఏకగ్రీవాలు మినహా) ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాలు ప్రకటిస్తారు. బుధవారం ఓటింగ్ సందర్భంగా మొత్తం 2,072 పోలింగ్ కేంద్రాల్లో వీడియో కవరేజీ, 2,406 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు. భైంసాలో పోలింగ్ ప్రశాంతం భైంసా (ముథోల్): నిర్మల్ జిల్లా భైంసాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 23 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 64.70 శాతం పోలింగ్ నమోదైంది. ఒక్కనిమిషం వ్యవధిలోనే ఓటర్ల గుర్తింపు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విజయవంతం కుత్బుల్లాపూర్: ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో భాగం గా దేశంలోనే తొలిసారిగా కొంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విజయవంతమైంది. దూలపల్లి– కొంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం జరిగిన పురపాలిక ఎన్నికల నేపథ్యంలో 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 బూత్‌లలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని ఒక్క నిమిషం వ్యవధిలోనే యాప్ ద్వారా గుర్తిస్తూ క్లియరెన్స్ ఇవ్వడంతో వేగంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. పోలింగ్ ప్రశాంతం ఫలించిన పోలీస్ వ్యూహాలు రాష్ట్రవ్యాప్తంగా మున్సి పల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిం టదని శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కడా గొడవలు తలెత్తలేదన్నారు. మొత్తం 50 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. ఏఆర్, సివిల్, టీఎస్ఎస్పీ పోలీసులతోపాటు ఫారెస్టు, ఎక్సైజ్, విద్యుత్, విజిలెన్స్‌కు చెందిన ఉద్యోగులు కూడా విధుల్లో పాల్గొన్నారని వివరించారు. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదన్నారు. ఎన్నికల కోసం పోలీసులు వ్యవహరించిన పలు వ్యూహాలు ఫలితాలనిచ్చాయని పలువురు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఓటేసిన మంత్రి కోదాడ / సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు నెహ్రూనగర్‌లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆయన సతీమణి సునిత ఓటు వేశారు. కోదాడలో ఉత్తమ్... సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాల నుంచి.. హుజూరాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు విదేశాల నుంచి స్వస్థలాలకు వచ్చారు. ఖతార్, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్‌ల నుంచి స్వదేశాలకు వచ్చి ఓటేశారు. నరేశ్.. శభాష్ నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని 37 వార్డులో స్థానికుడైన నరేశ్ రెండు చేతులు లేకున్నా.. బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటును వేయడం ఆనందంగా ఉందన్నారు. ఓటు బహిర్గతం మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఓ అభ్యర్థికి వేసిన ఓటు బహిర్గతమైంది. గుర్తుతెలియని ఓటరు ఓటు ను ఫోన్లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఇది వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఓటుకు ముక్కు పుడక కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపాలిటీ అడ్లూర్ పరిధిలోని ఇల్చిపూర్‌లో పంగ లింగం నుంచి ఓటర్లకు పంచుతున్న 33 బంగారు ముక్కు పుడకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.