ఏపీలో కూటమి పార్టీల బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

ఏపీలో కూటమి పార్టీల బరితెగింపు

Published Tue, Jul 23 2024 2:30 AM | Last Updated on Tue, Jul 23 2024 10:08 AM

-

    కార్పొరేషన్, మున్సిపాలిటీలే లక్ష్యంగా కూటమి కుట్రలు 

    తిరుపతి మేయర్‌ పీఠం కోసం టీడీపీ, జనసేన పోటాపోటీ 

    కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు బెదిరింపులు   పార్టీ మారాలంటూ ఒత్తిళ్లు 

    కుప్పం మున్సిపల్‌ కౌన్సిలర్లకు ఓ పోలీసు, ఇంటలిజెన్స్‌ అధికారి వారి్నంగ్‌ 

    తిరుపతిలో జనసేన జీరో.. తామే హీరోలంటూ టీడీపీ నేతల ప్రస్తావన 

   చిత్తూరు, పుంగనూరు తరహాలో కార్పొరేషన్, మున్సిపాలిటీ కోసం బరితెగింపు  

కూటమి నేతల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. వైఎస్సార్‌సీపీ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లను కూటమి నేతలు కై వసం చేసుకునేందుకు బెదిరింపులు, దౌరన్యాలకు దిగుతున్నారు. ఎక్కడా వైఎస్సార్‌సీపీ పేరు వినిపించకుండా ఉండేందుకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు,జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ‘మర్యాదగా పచ్చ కండువా కప్పుకోండి. లేదంటే మీ అంతు చూస్తాం. పాతకేసుల ఏవైనా ఉంటే తోడుతాం. లేవంటే ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపుతాం’ అంటూ పోలీసులు, ఇంటలిజెన్స్‌ అధికారుల ద్వారా కూటమి నేతలు బెదిరింపులకుపాల్పడుతున్నారు. ఆ కోవలోనే చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పుంగనూరు మున్సిపాలిటీని కూటమి నేతలు దౌర్జన్యంగా వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు.ఇంకా మిగిలిన వాటిపై దృష్టి సారించారు.

సాక్షి టాస్‌్కఫోర్స్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్‌తో పాటు.. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు మున్సిపాలిటీలన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ నేతలే విజయం సాధించారు. మేయర్, మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాలను కైవశం చేసుకున్నారు. అదేవిధంగా అన్ని మండల పరిషత్‌ల్లోనూ వైఎస్సార్‌సీపీ నేతలే ఎంపీపీలుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు తమ అనుచరులను ఆ కురీ్చల్లో కూర్చోబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.  

రంగంలోకి ఖాకీలు  
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు రక్షణకల్పించాల్సిన పోలీసులు కొందరు టీడీపీ, జనసేన నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్, ఎంపీపీ, జెడ్పీటీసీ కురీ్చల్లో కూటమి నేతలను కూర్చోబెట్టేందుకు వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన వారిని ప్రత్యేకంగా పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పిలిపించి టీడీపీలో చేరాలంటూ బెదిరింపులకు దిగారు. ఓ పోలీసు, ఇంటిలిజెన్స్‌లోని మరో అధికారి నేరుగా వారి నివాసాలకు, మున్సిపల్‌ కార్యాలయానికి పిలిపించి బెదిరించిన విషయం తెల్సిందే. 

వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన మున్సిపల్‌ కౌన్సిలర్లందరినీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పచ్చకండువాలు కప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండల పరిధిలోని ఎంపీటీసీ, సర్పంచ్‌లను సైతం ఇదే స్థాయిలో పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న కౌన్సిలర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లందరినీ అమరావతికి తీసుకెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చేటట్లు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

జనసేన జీరో అంట
తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినా.. తిరుపతిలో జనసేన జీరో.. తామే హీరోలమంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి మేయర్‌ పీఠంపై టీడీపీ, జనసేన పార్టీ కార్పొరేటర్లను కూర్చోబెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా అయితే తిరుపతిలోని 50 డివిజన్‌లలో 49 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ నేతలే విజయం సాధించారు. కేవలం ఒకే ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొంత మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు డబ్బులిచ్చి కూటమి ప్రభుత్వంలో చేర్చుకున్నారు. 

వారిలో ఒకరిని మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టాలని ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు తహతహలాడుతున్నారు. అందులో భాగంగా ఆదివారం కొందరు కార్పొరేటర్లతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు రహస్య సమావేశాలు నిర్వహించారు. కొంతమందిని బెదిరిచించారు. అలాగే ఇంకొంత మందికి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జనసేన జీరో అని, టీడీపీ నేతలే హీరోలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో అన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. తాము అడిగినంత డబ్బు ఇచి, పార్టీ మారితే మేయర్‌, చైర్మన్‌ కుర్చీలో మీరే కొనసాగవచ్చుంటూ ఆఫర్‌ చెస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా కొందరు ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లగానే ఉంటామని, పార్టీ మారే ఆలోచనే లేదని తేల్చిచెప్పడం విశేషం.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement