నామినేటెడ్ పదవులపై బీజేపీ, జనసేన నేతల కినుక
చంద్రబాబు మిత్రపక్షాలకు ద్రోహం చేశారని మండిపాటు
20 కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన చంద్రబాబు
వాటిలో 16 టీడీపీకే.. కీలక పదవులూ ఆ పార్టీకే
జనసేనకు 3 అప్రాధాన్య పోస్టులు
బీజేపీకి ఒక్కటే.. అదీ పాత టీడీపీ నేతకే.. ఒరిజినల్ బీజేపీ నేతలెవ్వరికీ దక్కని అవకాశం
టీడీపీలోని పలువురు సీనియర్లకూ నిరాశ
ఓసీలకే పెద్దపీట.. బీసీ, ఎస్సీలకు తూతూమంత్రం
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించగా అందులో జనసేనకు 3, బీజేపీకి కేవలం ఒకటి ఇచ్చారు. ప్రకటించిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు, ఒక వైస్ ఛైర్మన్‌తోపాటు కొన్నింటిలో డైరెక్టర్ పదవులుండడంతో వాటినీ భర్తీ చేశారు. డైరెక్టర్లతో కలిసి మొత్తం 99 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది.
కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారు. ఆర్టీసీ, ఏపీఐఐసీ, శాప్, హౌసింగ్ బోర్డు, సీడాప్, మారిటైమ్ బోర్డు, మార్క్‌ఫెడ్, ఏపీటీడీసీ వంటి ప్రధానమైన కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేనకు ఇచ్చిన మూడు కార్పొరేషన్లు కూడా అప్రాధాన్యమైనవేనని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పెద్దగా గుర్తింపు లేని, ఎవరూ పట్టించుకోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టిడ్కో, ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. బీజేపీకి 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి ఒకటే దక్కింది. అది కూడా టీడీపీ పాత నాయకుడు లంకా దినకర్‌కు ఇవ్వడంతో అది పేరుకు బీజేపీ ఖాతాయే తప్ప పదవి టీడీపీదేనని చెబుతున్నారు.
ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంతో మంది ఉండగా వారెవ్వరినీ పట్టించుకోకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి ఇవ్వడంపై ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ముఖ్య నాయకులందరినీ పక్కన పెట్టి ఆ పార్టీలో ఉన్న తన శిష్యుడైన లంకా దినకర్‌కు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి కంటి తుడుపుగా ఒక పదవి ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
లోపించిన సామాజిక సమతూకం
మరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజికవర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు. 20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా ఏడు పదవులే ఇచ్చారని వెనుకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు రెండు, ఎస్టీ ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పదవుల పంపకంపై టీడీపీ నేతలు సైతం అసహనంగానే ఉన్నారు. పదవులు ఆశించిన ఆలపాటి రాజా, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ముఖ్యమైన నేతలకు మొండి చేయే చూపారు. దీంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment