సాక్షి, అమరావతి: సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏడాది ముందు ప్రతిసారి సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ‘నాకు ప్రాణహాని ఉంది’ అంటూ వ్యాఖ్యానించడం అలవాటుగా మారింది. తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశంలోనూ అదే డైలాగ్ వల్లె వేశారు. ‘నాకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది’ అని ప్రకటించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న వ్యూహం దాగి ఉందని ఇట్టే తెలుస్తోంది.
గత (2019) అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2018 జూలై 7న విశాఖపట్నం జిల్లా పర్యటనలో ‘నా కారు యాక్సిడెంట్ చేసి చంపేస్తామని, బాంబులు పెట్టి పేల్చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పలు చోట్ల ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఇలానే మాట్లాడుతూ రాజకీయ ప్రచారం కొనసాగించారు.
ఆ డైలాగ్ వర్క్‌అవుట్ కాకపోయినా...
పవన్ కళ్యాణ్ ఏం చేసినా... అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకే అనే విషయం రాష్ట్రంలో జన సైనికులతో సహా అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం నుంచి మరింత సానుభూతి పొందడం ద్వారా వీలైనంత మేర ఆ సామాజిక వర్గం ఓట్లను అధికార వైఎస్సార్‌సీపీకి దూరం చేయాలన్న ఎత్తుగడతోనే గతంలో వర్క్ అవుట్ కాని డైలాగ్‌ను పవన్ మళ్లీ వల్లె వేశారు.
2019 ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం పట్ల అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆ సామాజికవర్గం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారింది. ఆ కారణంగా ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీకి పడకుండా ఉండేందుకు పవన్‌కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2014 ఎన్నికల ముందే జనసేన పార్టీని స్థాపించినప్పటికీ.. ఆ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా పోటీ చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి పవన్ సహకరించిన విషయం బహిరంగ రహస్యం.
తప్పులో కాలేయడమే!
ఆ తర్వాత నాలుగేళ్లపాటు ప్రతి అంశంలో చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. తీరా ఎన్నికలకు ఏడాది ముందు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా చంద్రబాబుపై కోపంగా ఉన్న వారి ఓట్లు అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి పడకుండా చూసేందుకు విఫలయత్నం చేశారు. ఆ సమయంలో ‘నాకు ప్రాణ హాని ఉంది’ అనే డైలాగ్ పుట్టుకొచ్చింది. ‘టీడీపీ ప్రభుత్వ దోపిడీని బయట పెడుతున్నానని నా కారుకు యాక్సిడెంట్ చేసి చంపేస్తామని, బాంబులు పెట్టి పేల్చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు’ అంటూ చిలక పలుకులు పలికారు.
ఆ సానుభూతి డ్రామా ఆ ఎన్నికల్లో ఏ మాత్రం పనిచేయలేదు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లక్ష్యంగా మళ్లీ అదే డైలాగ్‌ను వదలడం పట్ల జన సైనికులే పెదవి విరుస్తున్నారు. తమ అధినేత స్క్రిప్టు, మాటలు, చేతలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదని వాపోతున్నారు. ‘అయినా పవన్ కళ్యాణ్‌కు ఏదైనా జరిగితే ఎవరికి ఉపయోగం? చంద్రబాబుకే కదా.. ఆ విషయాన్ని పదే పదే ఎల్లో మీడియాలో చూపించి లబ్ధి పొందడంలో చంద్రబాబును మించిన వారెవరూ ఉండరు కదా.. ఈ మాత్రం రాజకీయం అర్థం కాని వారెవరు? మా అధినేత మళ్లీ తప్పులో కాలేస్తున్నారు’ అని జనసేన అభిమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment