పవన్ ఎన్నికల అఫిడవిట్‌లో అడుగుకో అబద్ధం
పవన్ అఫిడవిట్‌లో వివరాలపై విచారణ చేయించాలి
వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేశ్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత ఆస్తులు మాయ అని, ఆయన పెళ్లాల లెక్కలూ మాయే అని వైఎస్సార్‌సీపీ నాయకుడు పోతిన మహేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయం, ఆస్తులపై మాయ చేస్తున్నట్లు పెళ్లాలు, గొళ్లేల విషయంలోనూ మాయచేస్తున్నావే అని దెప్పిపొడిచారు. పవన్ ఏ భార్యతో ఎంతకాలం ఉన్నారు, ఒక భార్యతో సంసారం చేస్తూ మరొకరితో పిల్లలను కన్న విషయం, ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు, వీటన్నింటిపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు. మహేశ్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఎన్నికల అఫిడవిట్‌లో అడుగుకో అబద్ధం చెప్పాడని, అందులో వివరాలపై విచారణ చేయించాలని అన్నారు.
‘ఐదేళ్ల ఆయన సంపాదన రూ.114.76 కోట్లు అని చెప్పారు. అందులో రూ.73 కోట్లు పన్నులు, పార్టీ డొనేషన్ రూ.20 కోట్లు అని చెప్పారు. ఇవన్నీ పోను ఇంకా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడు’ అని నిలదీశారు. ‘పవన్ ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే. రూ.90 కోట్ల ఆస్తులు 2018 – 2024 మధ్యలో కొన్నారు. ఇది రిజిస్టర్ విలువే. వాటి మార్కెట్ విలువ రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఉంటుంది.
ఇదే సమయంలో ఆయన చేసిన సినిమాలు నాలుగే. వాటిలో యావరేజ్‌గా ఆడినవి రెండు. మిగతావి డిజాస్టర్ అయ్యాయి. అయినా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా లేక జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెడితే వచ్చాయా? కరోనా సమయంలో 2021లో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే.. అప్పుడు కూడా ఆయన రూ.33 కోట్ల ఆస్తులు కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు పసుపు కరోనా ఏమైనా కాటేసిందా’ అని ధ్వజమెత్తారు.
ఈ మధ్య ముగ్గురు నలుగురు పెళ్లాలు అంటేనే పవన్ గింజుకుంటున్నారని, మరి వలంటీర్లను ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అంటే వారికి కోపం రాదా అని ప్రశ్నించారు. ‘అన్న చిరంజీవిని పదే పదే అవమానిస్తున్నది పవనే. కానిస్టేబుల్ కొడుకునంటారు గానీ, చిరంజీవి సినిమా భిక్ష పెట్టడం వల్లే పవర్ స్టార్ అయ్యానని ఎక్కడా చెప్పరు. తల్లిని అవమానించిన లోకేశ్, చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ ఈరోజు తల్లిని కూడా అవమానించారు’ అని అన్నారు.
ఓటమి భయంతో ఇష్టానుసారం పేలుతున్న పవన్
ఓటమి భయంతోనే పవన్ సీఎం జగన్‌పై ఇష్టానుసారం పేలుతున్నారన్నారు. కాపుల్ని, కార్యకర్తలను కూడా కించపరుస్తున్నారని చెప్పారు. పోటీ చేసిన రెండుచోట్లా ప్రజలు కాళ్ళు, కీళ్ళు విరగ్గొట్టినా పవన్‌కు బుద్ధి రాలేదన్నారు. తనని ఒక్కడినైనా గెలిపించాలని, ప్లీజ్ అంటూ అడుక్కునే పవన్ ఒక పార్టీకి అధ్యక్షుడేనా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్ని నమ్ముకున్నారని, ప్రజలు కూడా సీఎం జగన్‌ని నమ్మారని తెలిపారు. అందుకే సీఎం జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్నందునే సీఎం జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
కూటమి కాదది.. కుమ్మక్కు రాజకీయం
టీడీపీ, జనసేన, బీజేపీలది కూటమి కాదని, కుమ్మక్కు రాజకీయమని మహేశ్ ధ్వజమెత్తారు. పోటీ చేసేదంతా చంద్రబాబు మనుషులేనని, పార్టీలే మారతాయని చెప్పారు. జనసేన, బీజేపీ అభ్యర్థులు చంద్రబాబు గుంపులో నుంచి వచ్చిన వారేనన్నారు. ఈ గుంపును హైనాలు, గుంటనక్కలు, తోడేళ్లు అనక ఇంకేమనాలని ప్రశ్నించారు. వాళ్లు ప్రజల కోసం కూటమి కట్టలేదని, ప్రజల ఆస్తులను దోచుకునేందుకు, పేదల నోట్లో మట్టికొట్టేందుకు, భూములు కొట్టేసి రూ.లక్షల కోట్లు సంపాదించేందుకేనని అన్నారు.
జనసేన అధ్యక్షుడు పవనే సీఎం అభ్యర్థి అని చాలా కాలం సోషల్ మీడియాలో రాగం తీశారని, తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పారని, ఆ తర్వాత 21 సీట్లతో సరిపెట్టారని, వీటిలోనూ నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లేనని చెప్పారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇలాగే ఉంటాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment