ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తనను సమర్ధించుకోలేని దశలోకి వెళుతున్నారు. ప్రత్యేకించి రెండు, మూడు అంశాలలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి రాజధాని భూముల స్కామ్ లో చంద్రబాబు ఏ1 అంటే మొదటి నిందితుడుగా సీఐడి కేసు నమోదు చేసింది. ఇంతకాలం తాను ఎన్ని అక్రమాలు చేసినా ఎక్కడా కేసు రాకుండా జాగ్రత్తపడ్డ నేర్పరిగా పేరొందారు. ఉదాహరణకు ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిపోయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన మేనేజ్ చేసుకోగలిగారు. కానీ ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన పప్పులు ఉడకడం లేదు.
అయినా ఏదో రకంగా ఎల్లో మీడియాను, ఆయా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి, తన తప్పులేవీ లేవన్న ప్రొజెక్షన్ ఇచ్చుకోవాలని తంటాలు పడుతున్నారు. ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టివి 5 వంటి మీడియా సంస్థలు శక్తివంచన లేకుండా జగన్ పై పచ్చ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణంలో ప్రత్యేకించి ఆయనకు, ఆయన కంపెనీ హెరిటేజ్‌కు లబ్ది జరిగిందన్న విషయం సీఐడీ విచారణలో తేటతెల్లమయింది. అందువల్లే కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడం జప్తునకు గురైంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
కోర్టు కూడా మొత్తం స్టడీ చేసి అమరావతి భూ స్కామ్ లో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, రియల్ ఎస్టేట్ యజమాని లింగమనేని రమేష్ తదితరుల పాత్ర ఉందని అభిప్రాయపడి, కొన్ని ఆస్తుల జప్తునకు ఓకే చేసింది. ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. చంద్రబాబు తీరును కోర్టు తప్పుపట్టింది. ఎల్లో మీడియా ఆ విషయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడింది. ఈ తీర్పు తర్వాత దానిని ఎలా సమర్ధించుకోవాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు. కాకపోతే ఈ కేసులో క్విడ్ ప్రోకో జరగలేదని చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాని అందులో అంత పస ఉన్నట్లుఅనిపించదు.
రాజధాని రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లో లింగమనేని రమేష్ భూములు మాత్రం భూ సమీకరణలో ఎలా పోకుండా ఉండగలిగాయన్నదానికి సమాధానం లేదు. అలాగే హెరిటేజ్ సంస్థ రమేష్ నుంచి కొనుగోలు చేసిన భూముల పక్కనుంచే రింగ్ రోడ్డును ప్రతిపాదించడంలో దురుద్దేశం లేదని చెప్పడం టీడీపీకి కష్టంగా మారింది. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని సీఐడీ జప్తు చేయడానికి కోర్టు అనుమతించింది. ఇందులో క్విడ్ ప్రోకో ఉందని ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి కోర్టు వచ్చిందన్నమాట. ఇందుకు వేరే వారి సాక్షాధారాలు అవసరం లేకుండా చంద్రబాబు, రమేష్ ల వీడియోలే రుజువుగా మారాయి.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటీన విజయవాడకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన రమేష్‌కు చెందిన కరకట్ట ఇంటిలో చేరి నివాసం ఉంటున్నారు. అది నిబంధనలను ఉల్లంఘించి కట్టారని ఎందరు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా ఇది ప్రభుత్వ భవనమని, లింగమనేని రమేష్ ప్రభుత్వానికి ఇచ్చేశారని, ఇది తప్ప కృష్ణానది కరకట్టపై ఏ భవనాన్ని ఉండనివ్వబోమని, ఆ ప్రాంతం అంతా టూరిజం కింద అభివృద్ది చేస్తామని చెప్పేవారు. అవేవి ఆయన చేయలేదు. పైగా ప్రజా వేదిక పేరుతో మరో అక్రమ నిర్మాణం నిర్మించారు. అది వేరే సంగతి.
ఈ క్రమంలోనే రమేష్ కూడా తనకు ఆ భవంతితో సంబంధం లేదని దానిని ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పిన వీడియో కూడా ఉంది. 2019లో అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. అసలు విషయాలన్నీ బయటకు వచ్చేశాయి. సీఐడీ పూర్తి స్థాయి విచారణ జరిపి కొన్ని వ్యవస్తల ద్వారా ఎంత ఆటంకం వచ్చినా, అక్రమాలను తవ్వి తీసింది. ఇది క్విడ్ ప్రోకోగా ఉందని సీఐడీ నిర్దారించడంతో చంద్రబాబు, రమేష్‌లు మాట మార్చారు. అసలు ఆ నివాసంతో తనకు సంబంధం ఏముందని చంద్రబాబు వాదించారు. ఆయన కేవలం ఒక అద్దె ఇంటిలో ఉన్నారని తెలుగుదేశం నేతలు చెబుతూ వస్తున్నారు.
రమేష్ కూడా అది తన ఇల్లని, జప్తు ఎలా చేస్తారని కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు తొలుత చెప్పినట్లు ప్రభుత్వ భవనం అయితే, రమేష్ ఆ మేరకు ఎందుకు డాక్యుమెంట్లు ఇవ్వలేదన్న ప్రశ్నకు సమాధానం రాలేదు. పోనీ చంద్రబాబు అద్దెకు తీసుకున్నారని అనుకుందామనుకుంటే అందుకు సంబంధించిన రశీదులుకాని పన్ను చెల్లింపు కాని జరగలేదు. చంద్రబాబు అద్దె చెల్లించినట్లు ఆధారాలు లేవట. తనకు జరిగిన వ్యాపార లబ్ది కి గాను రమేష్ ఈ ఇంటిని చంద్రబాబుకు ఇచ్చేశారన్నది అభియోగంగా మారింది. దీంతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ బల్లి మాదిరి అయింది. అందువల్లే చంద్రబాబు దీనిపై గట్టిగా స్పందించలేకపోతున్నారు. కాకపోతే తన కంపెనీ తరపున ఒక రీజాయిండర్ ఇప్పించి ఊరుకున్నారు.
చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు
ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్‌కు సంబంధించి ఇలాంటి విషయం ఏదైనా ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎంతగా రెచ్చిపోయి రోజువారి కథనాలు ఇచ్చేవి. కాని అవి ఇప్పుడు తేలుకుట్టిన దొంగల మాదిరి ఈ స్కామ్ జోలికి వెళ్లడం లేదు. ఈ కేసులో లింగమనేని రమేష్ అప్పీల్ కు వెళ్లవచ్చు. సీఐడీ తదుపరి చర్య ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరమే. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ బినామీలుగా భావిస్తున్న ఆయన బంధువుల పేరుతో ఉన్న భూములను కూడా జప్తు చేయడానికి సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మొత్తం ప్రక్రియలో వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే గతంలో అమరావతిలో భూదందా జరగలేదన్నట్లుగా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఎంతవరకు హేతుబద్దంగా ఉందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యాయ వ్యవస్థకు చెందిన కొందరు ప్రముఖుల బంధువుల ప్రమేయం కూడా ఈ స్కామ్ లో ఉన్నట్లు ఆరోపణ రావడం ,దానిపై కోర్టు తోసిపుచ్చడం అప్పట్లో సంచలనం అయింది. కాని ఇప్పుడు చంద్రబాబు, లింగమనేని రమేష్, నారాయణ ల ఆస్తుల జప్తునకు ఏసీబి కోర్టు అనుమతించడం ద్వారా అమరావతిలో స్కామ్ జరిగిందన్న విషయాన్ని నిర్దారించినట్లు అవుతుందా?
మరో అంశం గురించి కూడా చెప్పుకోవాలి. చిత్తూరులో మూతపడ్డ సహకార డెయిరీని ముఖ్యమంత్రి జగన్ తిరిగి తెరిపించగలగడంలో కృతకృత్యులవుతున్నారు. ఆయన దానికి సంబంధించిన 180 కోట్ల రూపాయల బకాయిలు తీర్చేసి, సంస్థను అమూల్ కంపెనీకి అప్పగిస్తున్నారు. తద్వారా సుమారు 350 కోట్ల పెట్టుబడులు పెట్టించి రైతులకు మేలు చేయ సంకల్పించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ కోసం ఈ చిత్తూరు డెయిరీ మూతపడేలా చేశారన్న ఆరోపణ ఉండేది.ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణ అప్పట్లో కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆమె హెరిటేజ్ పై తీవ్ర విమర్శలు చేసేవారు.
చదవండి: టైమ్స్ నౌ సర్వే: ఇప్పటివరకు ఒక లెక్క.. వైఎస్ జగన్ వచ్చాక మరో లెక్క!
తన సొంత కంపెనీ కోసం చిత్తూరు డెయిరీని దెబ్బతీస్తున్నారని ఆరోపించేవారు. సరిగ్గా అలాగే చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లోనే ఆ డెయిరీ మూతపడింది. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం అమూల్ ద్వారా దానిని తిరిగి తెరిపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దీనిపై కూడా చంద్రబాబు స్పందించలేని పరిస్థితి. హెరిటేజ్ సంస్థ మాత్రం ఈ విషయంలో కూడా చంద్రబాబు తరపున ఖండన ఇచ్చింది. దీనిని బట్టే చంద్రబాబు ఎంత ఆత్మరక్షణలో పడింది అర్దం చేసుకోవచ్చు. చిత్రం ఏమిటంటే ఒక పక్క చంద్రబాబు టైమ్‌లో మూతపడ్డ పరిశ్రమలను జగన్ తిరిగి తెరిపిస్తుంటే, దానిపై కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి లు దారుణమైన అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు డిఫెన్స్ లో పడినప్పుడల్లా ఏదో ఒక అబద్దపు వార్త వేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో ఈ ఎల్లో మీడియా ఉంటోంది. కాని వాటిని జనం నమ్మే రోజులు పోయాయని వారు తెలుసుకోలేకపోతున్నారు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment