
గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం
రెండు ఫైళ్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతకం
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బుధవారం విజయవాడలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన సోదరుడు నాగబాబుతో కలిసి అధికారిక కార్యాలయానికి వచ్చిన ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో సొంత భవనాలు లేని గిరిజన గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై పవన్ సంతకం చేసినట్టు తెలిపింది. అదే విధంగా ఉద్యాన పంటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే మరో ఫైల్ మీద కూడా పవన్ సంతకం చేసినట్టు వివరించింది.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్‌ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి అభినందనలు తెలిపారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్‌కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
శాఖలవారీగా సమీక్ష
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో శాఖాపరమైన విధుల్లో పాల్గొన్నారు. ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష చేశారు. సాయంత్రం అటవీ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పవన్‌ను కలిసిన సీఎస్ నీరభ్‌కుమార్
బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రత్యేకంగా కలిశారు.