
రేసులో బుద్ధప్రసాద్, బొలిశెట్టి
ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచన
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్ప టికే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించిన విషయం తెలిసిందే. 21 మంది ఎమ్మెల్యే లున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు అంగీకరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు మూడో వంతు పదవులు వస్తాయని పవన్‌కళ్యాణ్ చెప్పేవారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి జనసేన పార్టీ నుంచి అవనిగడ్డ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. బుద్ధప్రసాద్ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరారు. బొలిశెట్టి తొలినుంచీ జనసేనలోనే ఉన్నారు. నిజంగా అవకాశం వస్తే వీరిద్దరిలో ఒకరు ఆ పదవిలో కూర్చోవడం ఖాయమని చెబుతున్నారు.
మరోవైపు స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరును పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా ఈ నెల 19వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ప్రొటెం స్పీకర్‌తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని సమాచారం.