‘అజ్ఞాని పవన్‌.. నీ అభిమానులే ఛీ కొడుతున్నారు’ | Bapatla MP Nandigam Suresh Fire on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘అజ్ఞాని పవన్‌.. నీ అభిమానులే ఛీ కొడుతున్నారు’

Published Thu, Feb 29 2024 7:19 PM | Last Updated on Thu, Feb 29 2024 8:00 PM

Bapatla MP Nandigam Suresh Fire on Pawan Kalyan - Sakshi

చంద్రబాబు పార్టీకి జెండా కూలి పవన్‌ కల్యాణ్‌

జనసేన జెండాను ఎప్పుడో పవన్‌ మడతపెట్టారు

రేపటి ఎన్నికల్లో ఆ ఇద్దరికీ రాజకీయ శాశ్వత సమాధి

నాడు కులరాజధాని.. నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..?

శత్రువులు.. మిత్రువులెవరో తెలుసుకోలేని అజ్ఞాని పవన్‌కళ్యాణ్‌

చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కంటే పవన్ కు ఎవరూ ముఖ్యం కాదు

అమ్మను తిట్టినా, అన్న కుటుంబ పరువును బజారుకీడ్చినోళ్లంతా మంచోళ్లేనంట

అందుకే, తననెవరూ ప్రశ్నించరాదంటూ సొంత పార్టీ కేడర్‌నే బెదిరిస్తున్నాడు

పవన్‌ను అభిమానించే జనసేన కేడర్‌ ఇప్పటికైనా కళ్లుతెరవాలి

బాబు, పవన్‌లను రాష్ట్రం నుంచి తరిమేందుకు ప్రజలు సిద్ధం

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ బాబు సంచలన వ్యాఖ్యలు  

గుంటూరు, సాక్షి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతున్న అశేష ప్రజాదరణ చూసి చంద్రబాబు, పవన్‌లో అసహనం తారాస్థాయికి చేరుకుందని.. తాడేపల్లిగూడెం సభలో వాళ్ల ప్రసంగాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించిందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ బాబు అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘జెండా సభ అంటూ తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఏదో వీరంగం వేసి మమ అనిపించారు. ఆ మీటింగ్‌లో మాట్లాడిన ప్రతీ మాటలో జగన్నామస్మరణ చేశారు. వాస్తవానికి వారిద్దరూ  ‘జగన్‌’ అనే బ్రాండ్‌ పేరు వింటేనే భయపడుతోన్నారు. చంద్రబాబు సొంత కొడుకు ఎక్కడికెళ్లాడో గానీ.. పెంచుకున్న కుమారుడు పవన్‌ కల్యాణ్‌ మాత్రం నిన్న పరిగెత్తుకుంటూ పోయి మైకు పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడాడు. మా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై నోరుపారేసుకున్నాడు. పావలా బిళ్లను నేలమీద పడేస్తే పెద్ద గోల చేస్తుంది కదా..? మరి, అదే రూ. వందనోటో.. రూ. ఐదొందల నోటునో కిందపడేస్తే శబ్ధం చేస్తాయా..? అంటే, చేయవని అందరూ చెబుతారు. దీన్నిబట్టి అందరికీ నిన్నటి పవన్‌ కల్యాణ్‌ ప్రవర్తన తీరును చూస్తే.. అల్లరి చిల్లర పావలాబిళ్ల పవన్‌ కల్యాణ్‌ అని తెలిసిపోయింది. 

పవన్‌ ఫ్రస్టేషన్‌కు కారణం అది
 జగన్‌గారి మీద పవన్‌ కల్యాణ్‌కు అంత ఫ్రస్టేషన్‌ ఎందుకు..? ఆయనకు మా నాయకుడు జగన్ గారు చేసిన ద్రోహమేంటి..? అని పవన్‌ అభిమానుల్లో చర్చ మొదలైంది. రేపోమాపో 60 ఏళ్ల వయస్సు నిండి.. ముసలోడయ్యి..  చంద్రబాబు సహవాసిగా మిగిలిపోయే సందర్భంలో.. తాను పార్టీ పెట్టి 12 ఏళ్లయినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాయనే ఆవేదన పవన్‌ కల్యాణ్‌లో ఉంది. తనను నాయకుడిగా ఎవరూ గుర్తించలేకపోవడం.. మరోవైపు తమకన్నా చిన్నవయసున్న జగన్‌మోహన్‌రెడ్డి గారికి ప్రజాదరణ వెల్లువెత్తడంతో వారికి ఫ్రస్టేషన్‌ పీక్‌కు వెళ్తుందని ప్రజలు కూడా గమనించారు. నీ మాటలు, చేష్టలకు భీతిల్లిన నీ అభిమానులు, జనసేన కార్యకర్తలే రేపటి ఎన్నికల్లో మరోమారు నిన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు.

 అతనో సన్నాసి
 అభిమానుల్ని పట్టించుకోకుండా.. చంద్రబాబు కాళ్లు ఎందుకు వత్తుకుంటూ కూర్చొన్నావని అతన్నెవరూ ప్రశ్నించకూడదంట. ఎవరి సలహాలు అతనికి అవసరం లేదంట. తాను మాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా తనను నమ్ముకున్నోళ్లు ఏమైనా పర్వాలేదనే తత్వంతో .. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంటాడంట. నిజానికి, ఎవరి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఎవరి సలహాలు స్వీకరించకుండా ఉన్నందునే పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి జనసేన పార్టీని పెట్టి 12 ఏళ్లయినా.. ఏమాత్రం ఎదుగూబొదుగు లేకుండా ఒంటరిగా సన్నాసిగా మిగిలిపోయాడు. 

నీ అభిమానులే నిన్ను నమ్మడం లేదు
ఈ నిమిషాన కూడా నిన్ను నాయకుడిగా గుర్తించే స్థితిలో నీ అభిమానులే లేరు. అలాంటి సందర్భంలో నువ్వు మా నాయకుడి మీద కోతలు కోస్తావా..? రాష్ట్రంలో 175 స్థానాలకూ 175 స్థానాలూ మేము గెలుచుకుంటున్నామని ఈరోజు మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు దమ్ముగా చెబుతున్నారు. తాను నిల్చోబెట్టిన ఇద్దరు అభ్యర్థులపై ఓడిన వ్యక్తివి నువ్వు.  గతంలో నువ్వు ఎవరిమీదనైతే ఓడావో.. వారిద్దరూ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో ఉన్నారంటే.. ఎవరి బలం ఎంత ఉందో బేరీజు వేసుకుని మాట్లాడితే మంచిది. చంద్రబాబు ప్యాకేజీతో పొత్తుకు సిద్ధమైనప్పుడే నువ్వు జనసేన పార్టీ జెండాను మడతపెట్టేశావని నీ అభిమానులకూ తెలిసిపోయింది. 

ముసలోళ్లతో సహవాసి కనుకే బీపీ పెరుగుతోంది
 చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ సొమ్మే నీకు ముఖ్యం కాబట్టి.. నిన్నెవరూ ప్రశ్నించకూడదు.. సలహాలివ్వకూడదంటు న్నావ్‌..? 75 ఏళ్ల ముసలినక్కతో సహవాసం చేసే నీకూ అవే ముసలి లక్షణాలు అబ్బుతాయనే చెప్పాలి. చేతులూ, కాళ్లు ఊపుకుంటూ రంకెలేస్తే బీపీ పెరిగి జరగరానిదేదో జరిగిందంటే నిన్ను కాపాడేవారెవ్వరూ ఉండరని తెలుసుకో..

హరిరామ జోగయ్య, ముద్రగడ నీకు శత్రువులా?
వంగవీటి రంగా గారిని చంపిన, ముద్రగడను అవమానించిన చంద్రబాబుతో అంటకాగొద్దని సలహానిచ్చే హరిరామ జోగయ్య, ముద్రగడలు నీకు శత్రువులా..? వారి పేర్లను ఉదహరించక పోయినా.. వారు పంపే లేఖల్ని.. వాటిల్లో నిన్ను నిలదీసే అంశాల్ని ప్రస్తావిస్తూ తెగ ఊగిపోయావెందుకు..? నిన్న ఆ సభలో నీ ప్రవర్తన అత్యంత జుగుప్సాకరంగా ఉందని నీ అభిమానులే నిన్ను ఛీ కొడుతున్నారని తెలుసుకుంటే మంచిది. 

బాబు పార్టీకి నువ్వొక జెండా కూలీవి!
జెండా కూలీలుగా ఇన్నాళ్లూ నిన్ను అభిమానించే నాయకుల్ని ఏమార్చావు. కార్యకర్తల్ని కూడా ఏమార్చావు. నిన్న చంద్రబాబు పార్టీ జెండా పట్టుకుని నువ్వు కూడా పెద్ద జెండా కూలీగా మారావు. దీన్నిబట్టి నువ్వు, చంద్రబాబు ఎంత అవమానకర పరిస్థితిలో ఉన్నారో తెలుసా..? మీ పార్టీల జెండాల్ని పక్కనబెట్టి పక్క పార్టీల జెండాల్ని పట్టి ఊపడం వంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాజకీయాల్లో మీ ఇద్దరికీ మాత్రమే సాధ్యం. వేరే ఇతర ఏ రాజకీయ పార్టీకీ అలాంటి దుస్థితి రానుగాక రానేరాదు. 

అవమానించినోళ్లే నీకు మంచోళ్లుగా కనిపిస్తారా..?
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని, మీ అన్న చిరంజీవి గారిని, వారి కుమార్తెను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మీడియా వాళ్లు చేసిన రోత ప్రచారం నీకు గుర్తుందా పవన్‌..? అదే సందర్భంలో ఆనాడు చంద్రబాబు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా..?. నీ వాళ్లను తిట్టి అవమానించిన వాళ్లనూ మంచోళ్లుగా చిత్రీకరించుకుంటావ్‌.. నీకు ఏమాత్రం సంబంధంలేనోళ్లనూ నీకు శత్రువులుగా చిత్రీకరించుకుంటావ్‌.. ఎదుటి వ్యక్తి ఎవరైనా నీకు తప్పుడోళ్లుగానే కనిపించడమనేది నీచంగా ఉందని గ్రహించుకో..  

మగాళ్లతో నీకు సంసారమేంటి..?
ఇన్నాళ్లూ నీ పెళ్లిళ్లు.. విడాకుల మీద చాలా వార్తలు వచ్చాయి. నీ మోసంతో కొందరు మహిళలు మోసపోయారని విన్నాం. ఇప్పుడేమో, ఆడవాళ్లను కాకుండా మగవాళ్లతోనూ సంసారం అంటున్నావు. అసలు, నీ మానసిక స్థితేంటో.. ఎవరికీ అర్ధం కావట్లేదు. అంటే, నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావో ఆలోచించుకుంటే మంచిది. 

బాబు, పవన్‌లను తరిమికొట్టే రోజులొచ్చాయి
పావలా వాటాకూ సరిపోని నువ్వు .. పూటకో మాటతో రాజకీయాల్లో గందరగోళం సృష్టించే నువ్వు.. ఏ రకమైన రాజకీయంతో జనసేనను నడుపుతున్నావో ఆలోచించుకోవాలి పవన్‌. చంద్రబాబు చంకలో వ్యక్తిగా ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలుగా మారవు.. అబద్ధాలు నిజాలవ్వవు. మహిళలు సిగ్గు పడే విధంగా మాట్లాడటానికి నీకు సిగ్గుండాలి.

నాడు కుల రాజధాని.. నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..?

 నాడు కులరాజధానిగా కనిపించిన అమరావతి నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? ఇప్పటికైనా నీ నోరు కంట్రోల్‌ పెట్టుకుని మాట్లాడకపోతే జీవితంలో మరిచిపోలేని పరాభవాన్ని రుచి చూస్తావని హెచ్చరిస్తున్నాను. రేపటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ పార్టీలకు శాశ్వత సమాధికట్టి.. నీకు, చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement