60 అసెంబ్లీ సీట్లు ఆశిస్తే 24 కేటాయింపు
ఐదు ఎంపీ సీట్లు అడిగితే మూడింటికే పరిమితం
బీజేపీతో పొత్తు నేపథ్యంలో రెండు ఎంపీ సీట్లేనని ప్రచారం
పవన్ పరిస్థితిని బాబు వాడేసుకున్నారని జనసేన నేతల్లో ఆగ్రహం
సాక్షి, అమరావతి: జనసేనకు ఇచ్చిన ఆ కొన్ని సీట్లకు కూడా చంద్రబాబు ఎసరు పెట్టేశారు. పొత్తులో జనసేనకు చాలా తక్కువ సీట్లు కేటాయించారని రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం ఈ పొత్తు కోసం అవసరమైతే ఆ ఇచ్చిన సీట్లలోనూ కొన్నింటిని వదులుకోవడానికి సిద్దపడినట్టు టీడీపీ ప్రచారం చేస్తోంది. ఫిబ్రవరి 24న పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై పవన్‌కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే తాజాగా బీజేపీతో పొత్తు కుదిరిన తరుణంలో ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్ల కోసం చంద్రబాబు చూపు జనసేన సీట్లపై పడింది. చంద్రబాబు తొలుత బీజేపీకి కేటాయించాలనుకున్న స్థానాల కంటే ఆ పార్టీ పెద్దలు ఎక్కువ స్థానాలు కోరుతుండడంతో ఇప్పుడు బీజేపీకి అదనంగా ఇవ్వాల్సి వచ్చే సీట్ల కోసం జనసేన సీట్లలో కోత పెట్టనున్నట్లు శనివారం టీడీపీ విస్త్రత స్థాయిలో ప్రచారం చేయించింది.
టీడీపీ–జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరినప్పటికీ.. బీజేపీకి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అన్నది పూర్తి స్పష్టత రాలేదు. దీనిపై త్వరలో మూడు పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఈ తరుణంలో బీజేపీ కోరిక మేరకు అదనంగా సీట్లు ఇవ్వాల్సి వస్తే.. ఆ మేరకు జనసేన సీట్లను సర్దుబాటు చేసేలా మైండ్‌గేమ్ మొదలెట్టారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యూహాత్మకంగా ప్రచారం
ఇదివరకు జనసేనతో పొత్తు కుదుర్చుకునే ముందు కూడా బాబు ఇలానే గేమ్ ప్లే చేశారని జనసేన నేతలు ఉదహరిస్తున్నారు. అప్పట్లో జనసేన 60 అసెంబ్లీ సీట్లు, ఐదు పార్లమెంట్ సీట్లు ఆశిస్తుండగా.. 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను కేటాయించబోతున్నట్టు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారని చెబుతున్నారు. ఆ ముందస్తు ప్రచారానికి తగ్గట్లుగానే సరిగ్గా అన్నే సీట్లను జనసేనకు కేటాయించారు.
ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో జనసేనపై దెబ్బ వేసేలా వ్యూహం పన్నారని జనసేన నేతల మధ్య చర్చ నడుస్తోంది. జనసేనకిచ్చే మూడు లోక్‌సభ స్థానాలలో ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని, అలాగే అసెంబ్లీ స్థానాల్లో కూడా ఐదారు స్థానాలు తగ్గించే అవకాశం ఉందని ఓ వర్గం మీడియా చెబుతోంది. ఇలా సీట్ల తగ్గింపునకు పవన్‌కళ్యాణ్ ఒప్పుకున్నారని కూడా ప్రచారం సాగుతోంది.
జనసేన పార్టీ సైతం అధికారికంగా ఈ ప్రచారాన్ని ఖండించక పోవడం జనసేన శ్రేణులు, పవన్‌కళ్యాణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వెంట తిరిగే వాళ్లకు కనీసం భోజనాలు కూడా పెట్టించలేని స్థితిలో ఉన్న జనసేనకు ఈ మాత్రం సీట్లు ఇవ్వడమే గొప్ప అని తాడేపల్లిగూడెం సభ సాక్షిగా పవన్ కళ్యాణే సర్దిచెప్పుకున్నప్పుడు చంద్రబాబు ఇలా వెన్నుపోటు పొడవకుండా ఉంటారా.. అని పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment