తమ వాళ్లకే సీట్లు ఇప్పించాలనుకున్న చంద్రబాబు ప్లాన్‌కు గండి
బాబు చెప్పిన వాళ్లకి సీట్లిస్తూ... సంఖ్యను తగ్గించుకున్న పవన్
24కు ఓకే... 21కీ ఓకే... ఎంపీ సీట్లు రెండే ఇచ్చినా పీకే ఓకే ఓకే
ఇప్పటికే ప్రకటించిన ఆరు సీట్లలో ఒకటి ఇటీవలే చేరిన నేతకు
తాజాగా భీమవరం టీడీపీ మాజీ నేతతోపాటు గంటా నరహరి చేరిక
జనసేనలో అంతా బాబు చెప్పినట్టే జరుగుతోందంటున్న టీడీపీ వర్గాలు
బీజేపీ విషయంలోనూ అదే వ్యూహం.. జీవీఎల్‌కు టికెట్ లేకుండా చేసే యోచన
నరసాపురం బీజేపీ ఖాతాలో వేసి రఘురామకు ఇప్పించే ఎత్తుగడ విఫలం
సుజనా, సీఎం రమేశ్, పురందేశ్వరి ఎంపీలుగానే పోటీ చేయాలని బాబు ప్లాన్.. తాజాగా విజయనగరం అడిగిన బీజేపీ... జీవీఎల్‌కు ఇచ్చే అవకాశం
పురందేశ్వరిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటున్న అధిష్టానం
చర్చల్లో బాబు స్పాన్సర్డ్ నాయకులు లేకుండా కమలనాథుల జాగ్రత్తలు
ఇవన్నీ చూసి కథ అడ్డం తిరిగిందని తలపట్టుకుంటున్న బాబు
సాక్షి, అమరావతి: పొత్తుల పేరుతో చంద్రబాబు పన్నిన వ్యూహాలు బెడిసికొట్టాయి. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఓకే.. 21 ఇచ్చినా ఓకే అన్న పవన్‌కళ్యాణ్‌ను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించిన మాదిరిగానే పొత్తుల పేరుతో ఏపీ బీజేపీలోని తన మనుషులకే టికెట్లు ఇచ్చి కథ నడిపించాలనుకున్న చంద్రబాబు ఎత్తుగడలకు కమలనాథులు చెక్ పెట్టారు.
బీజేపీ సీట్ల సంఖ్య మొదలు కేటాయింపు దాకా అంతా తాను అనుకున్నట్టే చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు యత్నాలను వమ్ము చేసిన ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్రతి వ్యూహాలను రూపొందించి అమలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు చర్చల సందర్భంగా రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా నేరుగా కేంద్ర మంత్రిని రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎక్కడా బాబు స్పాన్సర్డ్ నేతల పాత్ర లేకుండా కమలనాథులు జాగ్రత్త పడ్డారు. జనసేన విషయంలో అంతా తాము ఊహించినట్లే జరగగా కాషాయదళం మాత్రం ముందుచూపుతో వ్యవహరించిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
విజయనగరంపై ఢిల్లీ పెద్దల ఆరా..
గతంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించి ప్రస్తుతం యూపీ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న జీవీఎల్ నరసింహారావుకు పొత్తులో ఎక్కడా సీటు దక్కకుండా చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్న విషయం ఢిల్లీ పెద్దల దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీనిపై వారు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బీజేపీకి కేటాయించే ఆరు లోక్‌సభ స్థానాల్లో కొత్తగా విశాఖపట్నం లేదా విజయనగరం చేర్చేందుకు చర్చలు సాగుతున్నట్లు కమలం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
విజయనగరం సీటును జీవీఎల్‌కు కేటాయించే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచి తాను చెప్పినట్లు నడుచుకుంటున్న రఘురామకృష్ణరాజుకు టీడీపీ టికెట్ ఇవ్వకుండా బీజేపీ తరుఫున పోటీ చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండగా కమలనాథులు ఏమాత్రం సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పురందేశ్వరి సీటుపై సందిగ్ధం.. అసెంబ్లీకే!
ఏలూరు నుంచి బీజేపీ తరపున లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రెండున్నరేళ్లుగా కార్యక్రమాలను నిర్వహించిన గారపాటి సీతారామంజనేయ చౌదరి పార్టీపై అసంతృప్తితో ఈ నెల 15న తన అభిమానులతో సమావేశం నిర్వహిస్తున్నారు. నరసాపురంలో బీజేపీ నాయకుడుగా కొనసాగిన శ్రీనివాసవర్మ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశాలపై బీజేపీ జాతీయ నాయకత్వం పురందేశ్వరి పట్ల తీవ్ర అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పురందేశ్వరి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆమెకు అక్కడ పార్టీ అధిష్టానం సీటు కేటాయించే అవకాశం లేదని అంటున్నారు. పురందేశ్వరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటిదాక స్పష్టత లేకపోగా ఆమెకు ఏదో ఒక ఎమ్మెల్యే సీటును కేటాయించే అవకాశం ఉందనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.
పారని బాబు పాచిక..
ఐదారు రోజుల కిత్రం చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ «ఢిల్లీలో అమిత్‌షాను కలసిన అనంతరం బీజేపీకి కేటాయించే సీట్లపై ఒప్పందం కుదరక ముందే తాము ఆ పార్టీకి ఆరు లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇవ్వనున్నట్లు అనుకూల మీడియాలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. అది కూడా రాష్ట్ర బీజేపీలో తనకు అనుకూలంగా వ్యవహరించే వారికి కేటాయించి తాను చెప్పిన సంఖ్యకు ఒప్పించేలా పథకం వేశారు. అయితే అనూహ్యంగా సీట్ల సర్దుబాటు చర్చలకు బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో పాటు ఒడిషాకు చెందిన బి.పాండాను పంపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సీట్ల సర్దుబాటు చర్చలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాత్రను నామమాత్రం చేశారు. ఢిల్లీ ఆదేశాల మేరకు వచ్చిన ఆ ఇద్దరు నాయకులు మాత్రమే చంద్రబాబుతో చర్చల్లో పాల్గొన్నారు. దీంతో చంద్రబాబు బీజేపీ అడిగినన్ని సీట్లకు తలాడించక తప్పలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో కొనసాగుతూ ఇప్పటికీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేసే సుజనా చౌదరి, సీఎం రమేష్‌కు సీట్లు కట్టబెట్టేందుకు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేసేలా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారనే విమర్శలు కాషాయదళంలో వినిపిస్తున్నాయి.
జనసేనలో బాబు మాటే..
పొత్తుల పేరుతో జనసేనలో మాత్రం అంతా చంద్రబాబే చక్రం తిప్పుతున్నారు. జనసేనకు ఇచ్చే సీట్లకు కోతలపై కోతలు విధించి చివరకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు కుదించిన చంద్రబాబు ఆ సీట్లలో సైతం తన విధేయులే పోటీ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఇప్పటికే టీడీపీని వీడి జనసేన తీర్థం తీసుకున్నారు. గతంలో పవన్‌కళ్యాణ్‌పై పోటీ చేసిన ఆయనకు జనసేన టిక్కెట్ ఇవ్వడం దాదాపుగా ఖరారైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీడీపీకే చెందిన మరో నాయకుడు గంటా నరహరి బుధవారం పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన్ను తిరుపతి లేదా అన్నమయ్య జిల్లాల్లో జనసేనకు కేటాయించే ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు జనసేన ఇప్పటివరకు ఆరుగురు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించగా వీరిలో అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ ఇటీవలే పార్టీలో చేరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment