అభిప్రాయం
ఒకవైపు వైసీపీ అధినేత జగన్ రాష్ట్రం నలుమూలలా ‘సిద్ధం’ సభలు పెట్టి ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తుంటే... ఎట్టకేలకు ప్రతిపక్ష పార్టీలు జనసేన – తెలుగు దేశం కూటమిగా ఏర్పడి తాడేపల్లిగూడెంలో మొదటి సభ పెట్టాయి. అక్కడ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం చర్చనీయాంశం. పవన్ సొంత పార్టీ పెట్టి ఇప్పటికి పదేళ్లు అయ్యింది. ఈ దశాబ్ద కాలంలో 2014లో హిందుత్వ బీజేపీనీ, అవకాశవాద చంద్రబాబు టీడీపీనీ బలపరిచా రాయన. 2019కి వచ్చేటప్పటికి బీజీపీకి పూర్తి వ్యతిరేక వైఖరి అవలంబించే కమ్యూనిస్టు పార్టీలతో, బీఎస్పీతో జత కట్టారు.
ఆ ఎన్నికలు అయిన వెనువెంటనే తిరిగి బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు టీడీపీతో కలిసి బరిలోకి దిగారు. ఈ పదేళ్ల వ్యవహార శైలి అతడి రాజకీయ ఊసరవెల్లితనాన్ని చాటి చెబు తోంది. ఈ విషయంలో తాను చంద్రబాబుకి ఏ మాత్రం తీసి పోనని కించిత్ గర్వపడొచ్చు కూడా! దేశం కాని దేశ ప్రజల కోసం ఆత్మ త్యాగం చేసిన చేగువేరా వంటి అద్వితీయమైన నాయకుడిని స్మరించిన నోటితోనే వెన్నుపోటు పొడిచే కళలో ఆరితేరిన చంద్రబాబు నామజపం చేయడం సిగ్గు చేటు.
‘జెండా’ సభలో ఆయన మాటల్లో అక్కసు కనిపించింది తప్ప ఎన్నికల్లో వారి అజెండా ప్రస్తావనే లేదు. 2019లో జనం తనని రెండు చోట్ల ఓడించారు అనే కోపం ప్రదర్శించారు కానీ ఎందుకు ఆ పరిస్థితి దాపురించిందో సింహావలోకనం చేసు కునే సంయమనం చూపలేదాయన. సినిమా పాటల్లో గెటప్‌లు మార్చినంత తొందరగా రాజకీయాలలో రంగులు మారిస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతాము అనే తర్కాన్నీ మరచారు. తనకు తానే దేశం కోసం, రాష్ట్రం కోసం పరితపిస్తున్నాను అని చెబితే నమ్మేసి మళ్లీ మళ్లీ మోసపోవడానికి ఇవి ఆడియో రిలీజ్ సభలు కాదు అనే విషయం పాపం ‘పవర్’ స్టార్ విస్మరించారు.
అంతగా ఆలోచించి ఈయన దేశం కోసం చేసిన మంచి ఏమిటో మచ్చుకు ఒక్కటైనా చెప్పలేకపోయారు. 2014లో తాను గెలిపించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా? పోనీ ఈసారి గెలిస్తే ఇదీ మా ప్రణాళిక అని చెప్పే సాహసం కూడా చేయలేకపోయారు. ‘నేను ఒక నియోజకవర్గం కూడా పెంపొందించుకోలేదు’ అని అనడం ఎన్నికలు మొదలు కాక మునుపే ఓటమికి సాకులు వెతుక్కుంటున్నట్టు ఉంది.
ఒక దశలో తనను తాను వామనుడిగా, జగన్‌ను బలి చక్రవర్తిగా పోల్చారు. దక్షిణాది ప్రజల చరిత్ర ఈయనకి ఏ మాత్రం అవగతమైనట్లు లేదు. ఎన్నో పుస్తకాలు నెమరు వేశాను అని డాంబికాలు పలికే పవన్ కల్యాణ్ బలి చక్రవర్తి ఔన్నత్యాన్నీ, వామనుడి కుటిలత్వాన్నీ గమనించినట్లు లేరు.
కేరళలో కానీ, ఇతర దక్షి ణాది రాష్ట్రాలలో కానీ బలి చక్రవర్తిని ఒక ఉదార రాజుగా కొలు స్తారు. బహుజనుల నాయకుడైన బలిని అవ హేళన చేస్తూ ఒక రాజ కీయ సభలో ప్రసంగించడం ఆయన అపరిపక్వతకు మచ్చుతునక.
పలుమార్లు కోట్ల సంపాదన వదిలి ప్రజల కోసం తిట్లు తింటున్నాను అని ఈయన చెప్తారు. ఇది చాలా చవకబారు వాదన. తనకు తానే ఒక కారణ జన్ముడిగా, త్యాగశీలిగా చెప్పుకోవడం నిజానికి ప్రజల వివేకాన్ని అవమానించడమే. ఒక రాజకీయ నాయకుడు ప్రజలను మమేకం చేసుకుంటూ తన అజెండాని వారికి తెలియచెప్పాలి. కానీ ‘అంతా నాకు వదిలేయండి. నాకు అన్నీ తెలుస’ని ఏమార్చకూడదు. ఆది గమనించే 2019లో ప్రజలు ఈయన్ని తేలికగా తీసుకున్నారు.
రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసే స్థోమత లేదు అని చెప్పడం మరో హాస్యాస్పదమైన అంశం. చరిత్రలో ఎన్నో కొత్త పార్టీలు అటువంటి ధైర్యాన్నే చేసి ప్రజల మద్దతు కూడకట్టుకో గలిగాయి. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కానీ, జగన్ సారథ్యంలో వచ్చిన వైసీపీ కానీ, ఈయన అన్నయ్య చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం’ కానీ సొంతంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసి తాడో పేడో తేల్చుకున్న కొత్త పార్టీలే.
ఇతర రాష్ట్రాలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి శక్తులు కొత్తగా బరిలోకి దిగి విజయం సాధించిన సందర్భాలు కోకొల్లలు. అంతటి మేధ లేక చీటికి మాటికి తనను గుడ్డిగా నమ్ముకున్న నాయ కులనూ, కార్యకర్తలనూ ‘పోల్ మేనేజ్‌మెంట్’ రాదు అంటూ కించపరుస్తూ మాట్లాడడం ఒక పద్ధతిగా పెట్టుకున్నారు పవన్. ఒకసారి పార్టీ ఎదుగుదలకి 10 ఏళ్ళు కావాలి అన్నారు. పదేళ్లు గడిచాక ఇప్పుడు... కాదు కాదు 20–30 ఏళ్ళు అంటున్నారు. ఎంత కాలం ఇలా వెళ్ళబుచ్చుతారో చూడాలి!
24 సీట్లకి జనసేనను కుదించి చంద్ర బాబు నాయుడు పవన్ కల్యాణ్‌ను భూస్థా పితం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు అనిపిస్తుంది. కూటమి గెలిస్తే ఎందుకూ కొరగాని జూనియర్ పార్టీ అవుతుంది జనసేన. ఓడితే కూటమి వల్లే ఈ పరిస్థితి అని చెప్పడానికి సరిపోతుంది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సందర్బంలో కమ్యూనిస్టు పార్టీల మద్దతు ఇలాగే తీసుకున్న చంద్రబాబు వాళ్ళ విశ్వసనీయతపై ఇలాంటి దెబ్బే కొట్టారు.
1994లో సీపీఐ, సీపీఎంలు కలిపి 34 సీట్లు గెలిచి బలమైన స్థానంలో ఉండేవారు. ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబుతో చేతులు కలిపిన కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్ర ప్రదేశ్‌లో పట్టు పోయి మళ్ళీ కోలుకోలేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపినా ఒకటో ఆరో సీటుకి పరిమితమయ్యి కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి బాబు దెబ్బతో పవన్ కల్యాణ్ కూడా కరి మింగిన వెలగపండు అవుతారేమో!
డా‘‘ జి. నవీన్
వ్యాసకర్త సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment