అభిప్రాయం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వారా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలో ఉన్న సంక్షేమ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలన్న బాబు, పవన్‌ల వ్యూహానికి స్వయంగా మోదీనే చెక్ పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మంచిని ఆయన గుర్తించబట్టే ఆయన పేరును గానీ, ఆయన ప్రభుత్వాన్ని గానీ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ప్రధాని మోదీ ప్రసంగం జరిగిన తీరును నిశితంగా పరి శీలన చేస్తే గతంలో చంద్రబాబు ఆయన పట్ల చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకుని ఆచితూచి ప్రసంగించినట్లు కనిపించింది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ‘విశ్వ గురు’ అంటూ ప్రశంసించి ఆకాశానికి ఎత్తినా ఫలితం దక్కలేదు. సరిగ్గా ఐదేళ్లు వెనక్కు పోతే... ‘నరేంద్ర మోదీ కరుడుగట్టిన ఉగ్రవాది, ఈ దేశంలో ఉండే అర్హత లేదు’ అన్న చంద్రబాబు ఇప్పుడు మోదీ ‘దేశానికి దిక్సూచి’, ‘విశ్వ గురు’ అంటూ ఆకాశాని కెత్తడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
చంద్రబాబు, పవన్ మీ హక్కుల కొరకు, రాష్ట్ర వికాసం కొరకు చాలా కాలం నుండి కృషి చేస్తున్నారు అన్నారే తప్ప... బాబు పాలన దక్షత గురించి గానీ, బాబు రాష్ట్రానికి చేసిన మంచి గురించి గానీ ఒక్కమాట అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు.
చంద్రబాబు ప్రసంగం మొత్తం మోదీని ప్రశంసించడానికి మాట్లాడితే మోదీ మాత్రం తన ప్రభుత్వం చేసిన గొప్పల గురించి చెప్పుకునేందుకు మాత్రమే పరిమితమయ్యారు. అలాగే ఆయన కాంగ్రెస్,‘ఇండియా’ కూటములను మాత్రమే విమర్శించారు. కాంగ్రెస్ పీవీనీ, ఎన్టీ ఆర్‌నూ విస్మరించింది అని ఏపీలో లేని కాంగ్రెస్ గురించి మాట్లాడటం ప్రజలను ఆలోచింప చేస్తోంది.
2019లో చంద్రబాబు నాయుడు మీద చేసిన ఆరోపణలు గుర్తు చేసుకుంటే... ‘పోలవరం కో ఏటీఎం కరే’ అన్నారు. కానీ చంద్రబాబును 2019లో విమర్శించినంత గానీ, 2014లో జగన్‌ను విమర్శించినంతగా కానీ ఈసారి జగన్ మోహన్ రెడ్డిని మోదీ విమర్శించలేదు. దీంతో తెలుగుదేశం, జన సేనలతో ఆయన ఎలాంటి బంధం కోరుకుంటు న్నారో అర్థమవుతోంది.
‘చెల్లికి కూడా అన్యాయం చేసిన వాడు జగన్’ అని చంద్రబాబు అంటే మోదీ మాత్రం ‘జగన్, షర్మిల ఒక్కటే’ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిలకు పోకుండా జాగ్రత్త పడాలి అన్నారు. ఒక రకంగా షర్మిలను, కాంగ్రెస్‌ను గుర్తుకు తెచ్చి మోదీ కాంగ్రెస్‌కూ, షర్మిలకూ క్యాంపెయిన్ చేసి నట్లు ఉంది. తెలంగాణకు చెందిన పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇచ్చామన్న మోదీ... ఎన్టీఆర్‌కు ఎందుకు ఇవ్వలేదో చెప్పలేదు.
మోదీ ఇచ్చిన విద్యా సంస్థల గురించి ఏకరవు పెట్టిన చంద్రబాబు... ఆయన ఇవ్వని పెట్రో కెమి కల్ కారిడార్, కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక రాష్ట్ర హోదా, వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి వాటి ప్రస్తావనే చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవే టీకరించమన్న మాటే ప్రధాని మోదీ నోటి నుండి రాలేదు. ఆంధ్రప్రదేశ్ వికాసం కొరకు ఎన్డీయేకు ఓటేయమన్నారు. అమరావతి గురించి ప్రస్తావనే లేదు. పవన్ ప్రస్తావించారు. దీనికి ప్రధాని సమాధానం లేదు.
బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీ శిబిరంలోకి వెళ్లి కొన్ని సీట్లు తీసుకుని ఏపీలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు అర్థమౌతోంది.అంతెందుకు కనీసం తెలుగుదేశం అన్న పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా మోదీ ఇష్టపడ లేదు. చంద్రబాబు గతంలో మోదీ గురించి, ఆయన భార్య గురించి అన్న మాటలు అన్నీ అయనకు గుర్తున్నట్లు కనిపించింది.
ఇక మోదీ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ చాలా చాలా కవితాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటకీ మోదీ మాత్రం కనీసం స్పందించలేదు. పవన్, చంద్రబాబులకు మోదీ ప్రసంగం ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వలేకపోయింది. రాజకీయంగా బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్‌కు ప్రధాని ప్రసంగం పరాకాష్టగా నిలిచింది. కేవలం తన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చెబుతూ ‘ఇండియా’ కూటమి అనైక్యత, కేరళలో రాజకీయ అనిశ్చితి గురించి ప్రస్తావించారే తప్ప ఏపీ సమస్య లేమీ ఎత్తలేదు. అన్నింటికంటే కీలకమైనది...చంద్రబాబు, పవన్ కోరుకునేది ఏదీ కూడా ప్రధాని ప్రస్తావించలేదు.
కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలి... ఓటు వేయండి అంటూ పదే పదే చెప్పారు. 25కు 25 ఎంపీలు గెలవాలి అన్నారు. తన విమర్శలు తానే దిగమింగి చంద్రబాబు మోదీని పొగిడినప్పటికీ మోదీ మాత్రం స్పందించలేదు. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకీ, పవన్‌కూ ఈ ప్రసంగం చెంపపెట్టు లాంటిదే!
డా‘‘ పి. గౌతమ్ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్: 98481 05455
Comments
Please login to add a commentAdd a comment