ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాను,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కాని, మానిఫెస్టోలోని ఇతర వాగ్దానాలను కాని అమలు చేయలేని పరిస్థితిలో మొత్తం నెపాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైన నెట్టి తప్పించుకోవడానికి తగట్లుగా పావులు కదుపుతున్నారు. దానికి ఈనాడు మీడియా, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎటూ బాండ్ బాజా వాయిస్తాయి కనుక సూపర్ సిక్స్ గురించి జనం మర్చిపోయి జగన్ ప్రభుత్వంలో ఏదో జరగకూడనిది జరిగిపోయిందన్న చర్చ ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందుకు ఢిల్లీ పర్యటనను కొంతమేర వాడుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించండి. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్దిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఏపీని ఆదుకోవాలని చంద్రబాబు ప్రధాని మోడీని కోరారని ఈనాడు ప్రచారం చేసింది. అప్పట్లో ఆర్ధిక వనరులు అన్ని ఆవిరి అయిపోయాయట. వచ్చే ఆదాయం జీతాలు, పెన్షన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని ముఖ్యమంత్రి చెప్పారట. అందువల్ల కేంద్రం చేయూత ఇవ్వాలని ఆయన కోరారట. చంద్రబాబు ఢిల్లీ పర్యటించి రాష్ట్రానికి సాయం చేయాలని ప్రధాని, కేంద్ర మంత్రులను కోరడం తప్పు కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా తన వంతు ప్రయత్నం చేస్తారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ అంతకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేసి తన బాధ్యతను తప్పించుకోవాలని చూడలేదు.
ఖజానాలో వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉంచి, వేలాది కోట్ల రూపాయల బకాయిలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినా, జగన్ మాత్రం డబ్బులు లేవని, హామీలు అమలు కష్టమని చెప్పలేదు. తనకు ఉన్న అవకాశాలను వాడుకుని, కేంద్రం నుంచి ఆయా స్కీముల కింద ఆర్దిక సాయం వచ్చేలా చూసుకుని పధకాలు అమలు చేసి చూపించారు. ఇది ఏ రకంగా దుష్పరిపాలన అవుతుందో చంద్రబాబుకాని, ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు తదితర టీడీపీ మీడియా వివరించలేదు. విశేషం ఏమిటంటే జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఐదువేల కోట్ల రూపాయలు నిల్వ ఉంది. వంద కోట్లే మిగిల్చి వెళ్లిన చంద్రబాబుదేమో ఉత్తమ పాలన అట. ఐదువేల కోట్లు నిధులు ఉంచితే అది దష్పరిపాలన అట. జగన్ టైమ్ లో నిత్యం అప్పులు అంటూ గగ్గోలు పెట్టారు. తాము వస్తే సంపద సృష్టిస్తాం కాని, అప్పులు చేయబోం అన్నట్లుగాటీడీపీ, జనసేన,బిజెపిలు ప్రచారం చేశాయి.
ఆ సంపద ఏమైపోయిందో కాని, అప్పుడే దాదాపు పదిహేనువేల కోట్ల రూపాయల అప్పులు చేసేస్తున్నారు. అది చాలా సత్పరిపాలన అట. స్కూళ్లు బాగుచేస్తే, ఆస్పత్రులను మెరుగుపరిస్తే, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రజల ఇళ్ల వద్దకు పాలనను తీసుకు వెళితే అది దుష్పరిపాలనగా ఈనాడు మీడియా దుర్మార్గంగా ప్రచారం చేసింది. జన్మభూమి కమిటీలతోటీడీపీ హయాంలో అరాచకంగా అవినీతికి పాల్పడితే అది గొప్పపాలన అట. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి అరకొరగా చేసి ఎగవేసిన టీడీపీ దేమో మంచి పాలన. చెప్పిన స్కీములు చెప్పినట్లు అమలు చేస్తే అది దుష్టపాలనట. ఒక్క బిడ్డకు అమ్మ ఒడి స్కీము కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని జగన్ చెప్పి, దానిని చేసి చూపించితే ఆర్దిక సుడిగుండంలోకి ఏపీని నెట్టినట.
ఇప్పుడుటీడీపీ మొత్తం విద్యార్దులందరికి, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరికి తల్లికి వందనం పేరుతో పదిహేనువేల రూపాయల చొప్పున అందదచేస్తామని హామీ ఇస్తే అది సుడిగుండం కాదట.కాకపోతే ఆ ఊసే ఎత్తకుండా కధ నడుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం కాదట. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం జీతాలు, పెన్షన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని చంద్రబాబు కేంద్ర పెద్దలకు చెప్పారు. బాగానే ఉంది.అయినా అధికారం కోసం అడ్డగోలు హామీలు ఎలా ఇచ్చారో వివరించరు. వారివి రాజకీయ తెలివితేటలు అని అనుకోవాలా! జగన్ ప్రభుత్వ హయాంలో అప్పును పదమూడు లక్షల కోట్లకు తీసుకు వెళ్లిందని ఎన్నికల ముందు ఆరోపించిన వీరిద్దరూ ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చయ్యే హామీలను ఎలా ఇచ్చారో చెప్పరు.
జగన్ తన స్కీముల అమలుకు ఏభైవేల కోట్ల రూపాయలు వ్యయం అవుతున్నాయని,టీడీపీ, జనసేన లు కలిసి ఇచ్చిన వాగ్దానాలకు లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ,అవి ఆచరణ సాధ్యం కాదని జగన్ చెబితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈనాడు వారు ఏమన్నారు?చంద్రబాబు సంపద సృష్టించి అన్ని చేసి చూపిస్తారని చెప్పారా?లేదా?ఇప్పుడేమో బీద అరుపులు ఎందుకు మొదలుపెట్టారో జనం అర్ధం చేసుకోరా?అనుత్పాదక వ్యయం ,వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడీ మొదలైనవి గత ప్రభుత్వ హయాంలో జరిగాయని చంద్రబాబు అంటున్నారు. అది నిజమా?కాదా?అన్నది చర్చించవలసిన అవసరం ఉంది. ఏది అనుత్పాదక వ్యయం అని ఆయన చెప్పదలిచారు. జగన్ చేసిన స్కీములా?ఇంకేమైా ఉన్నాయా?అవి అనుత్పాదక ఖర్చు అయితే జగన్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి స్కీమ్ ను ఎందుకు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ల ప్రభుత్వం అనుసరిస్తామని తెలిపింది?సహజవనరుల దోపిడీ అంటున్నారు.
అంటే ఇసుక సహజ వనరు కింద వస్తుందా?రాదా? దానికి ఒక విధానం తీసుకువచ్చి ప్రభుత్వనికి వేల కోట్ల ఆదాయం వచ్చేలా చేస్తే అది దోపిడీ అట. జగన్ హయాంలో పెట్టిన ఇసుక స్టాక్ లన్నిటినిటీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు దోచుకువెళితే అది సహజ వనరును రక్షించినట్లా! ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.అది విజన్. అయినా ఏదో రూపంలో డబ్బు వసూలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తే గొప్ప సంగతి.కేంద్రం ఆర్ధిక సాయం చేయూత ఇవ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారట. అంటే చంద్రబాబు ముందుగానే తన సూపర సిక్స్ పై చేతులు ఎత్తివేసినట్లు అనుకోవాలా? సామాజిక పెన్షన్లు ఒకేసారి నాలుగువేల రూపాయలు చేసి, బకాయిలు మూడువేల రూపాయల చొప్పున ఇవ్వడానికి వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే అదే గొప్ప ఆర్ధిక నిర్వహణ,సమర్ధత అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడ , ఢిల్లీ వెళ్లి సర్వం దివాళా తీసినట్లు చెప్పుకోవడం ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజీని కూడా దెబ్బతీస్తున్నట్లు అనిపిస్తుంది.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రత్యేక హోదా గురించి అడగకుండా, కేవలం నిధులు అడగడం ద్వారా తన అసలు ఉద్దేశం బయటపెట్టినట్లనిపిస్తుంది. గతంలో కూడా ప్రత్యేక హోదాపై పలుమార్లుటీడీపీ మాట మార్చిన అనుభవం ఉంది.బీహారు లో ముఖ్యమంత్రి నితీష్ కమార్ కూడా మోడీకి మద్దతు ఇస్తున్నా,తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ధైర్యంగా అసెంబ్లీలో తీర్మానం చేయించారు. చంద్రబాబు ఆ పని చేయకపోగా,అసలు ఆ ప్రస్తావనే చేయడం లేదు. స్వల్పకాలికంగా రాష్ట్రానికి ఆర్ధికంగా చేయూత నివ్వాలని చంద్రబాబు కోరారు. సుమారు లక్ష కోట్ల మేర ఆర్థిక సాయం అడిగారని కదనాలు వచ్చాయి. అది నిజమే అయితే కేంద్రం ఆ మేర సాయం చేస్తే గొప్ప విషయమే అవుతుంది.
కాని అదంత తేలిక కాదని అందరికి తెలుసు. పోలవరం ప్రాజెక్టు , అమరావతి, పారిశ్రామికాభివృద్ది ప్రోత్సాహకాలు,బుండేల్ ఖండ్ ప్యాకేజీ మొదలైనవాటిపై చంద్రబాబు కేంద్రానికి వినతులు అందించారు. ప్రత్యేక హోదా గురించి అడగలేదు. దానికి కవరింగ్ ఇవ్వడానికి అంతకన్నా ఎక్కువే కోరినట్లు మీడియాకు వెల్లడించారు. కోరడానికి ఎంతైనా కోరవచ్చు. కాని ఆచరణ సాధ్యంగా, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అడిగితే మంచిది. అలాకాకుండా ప్రజలను మభ్య పెట్టాలనో, రాజకీయాల కోసం వినతిపత్రాలు ఇస్తే మాత్రం రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. కొసమెరుపు ఏమిటంటే పవన్ కళ్యాణ్‌ను ఢిల్లీ టూర్‌కు తీసుకుని వెళ్లకపోవడం ద్వారా ఆయన ప్రాధాన్యతను తెలివిగా చంద్రబాబు తగ్గించారని గుసగుసలు రావడం..
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment