ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జాతీయ పార్టీల పాత్ర ఏమిటి? అంటే, శూన్యమనే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అవును. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఎన్ని ఉన్నా, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర రాజకీయాలు రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు వైసీపీ–టీడీపీల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో మూడో పార్టీగా పుట్టు కొచ్చిన జనసేన... స్థిరత్వం లేని చిల్లర పార్టీగానే మిగిలిపోయింది.
కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఉనికిని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. రాష్ట్ర విభజన తదనంతరం జరిగిన 2014 ఎన్నిక ల్లోనే హస్తం పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు పుణ్యాన ఒకటో రెండో సీట్లతో ఉనికి చాటుకున్న బీజేపీ 2019 ఎన్ని కలలో ఒంటరిగా బరిలో దిగి కాంగ్రెస్ సరసన చేరింది. నిజానికి కాంగ్రెస్ కంటే, మరో మెట్టు కిందకు చేరింది. చివరకు ‘నోటా’తోనూ పోటీ పడ లేకపోయింది.
వామపక్ష పార్టీలు, సీపీఐ, సీపీఎం పార్టీల సంగతి పక్కన పెడితే... ఏపీలో కాంగ్రెస్, బీజేపీల దీనస్థితికి కారణాలు ఏమిటని చూస్తే, ఇరు పార్టీల జాతీయ నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అని చెప్పవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ చావుకు చాలానే కారణాలు కనిపిస్తాయి. నిజానికి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఒక ప్రధాన కారణంగా కనిపించినా, అంతకు ముందే ఆ పార్టీ అధిష్టానం స్వహస్తాలతోనే స్వీయ మరణ శాసనాన్ని సిద్ధం చేసుకుంది.
రాష్ట్రంలో ఒకటికి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంతోపాటుగా, కేంద్రంలో పదేళ్ళ విరామం తర్వాత, 2004లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో, అలాగే తిరిగి 2009లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరోమారు అధికా రంలోకి తీసుకురావడంలోనూ కీలక పాత్రను పోషించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత, కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న తప్పుడు నిర్ణయం తెలుగు నాట కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసింది.
ఇప్పుడు ఆ వివరాలలోకి వెళ్ళవలసిన అవసరం అంతగా లేకపోయినా, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ల్లోకెల్లా అతి పెద్ద తప్పు, మహానేత వైఎస్ వారసుడిగా ఎదిగివస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్‌ను మొగ్గలోనే తుంచేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన కుట్రపూరిత రాజకీయం ఆ పార్టీని తిరిగి కోలుకోలేని స్థాయిలో దెబ్బ తీసింది.
వైఎస్సార్ మరణ వార్తను జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన అభిమానులను ఓదార్చేందుకు కూడా జగన్‌ని అనుమతించక పోవడం కాంగ్రెస్ అధిష్టానం చేసిన ఇంకో తప్పు. పొమ్మనకుండా పొగబెట్టి, జగన్ వదిలి పోయేలా చేయడం, కాంగ్రెస్ పెద్దలు చేసిన తప్పుల పరంపరలలో మరొకటి. ఇప్పుడు వైఎస్ కుటుంబాన్ని చీల్చి వైఎస్సార్ ఆత్మ క్షోభించేలా చేసింది కాంగ్రెస్.
కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి కూడా అంతే. నిజానికి, ఓట్ల పరంగా చూస్తే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంటే, బీజేపీ మరింత అధ్వాన్న స్థితిలో వుంది. అయితే, కేంద్రంలో అధికా రంలో ఉండడం వల్లనైతే నేమి, బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ ఆధిపత్య ధోరణి కారణంగా అయితేనేమి, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. అందుకే టీడీపీ–జనసేనలు దానితో పొత్తు పెట్టుకున్నాయి.
నిజానికి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి త్రయానికి, మినహా మూడు పార్టీల్లోని నాయ కులు, కార్యకర్తలు ఎవరికీ ఈ పొత్తు అంతగా ఇష్టం లేదు. ఆ యా పార్టీ కార్యకర్తల సోషల్ మీడియా పోస్ట్‌లు, టిక్కెట్ దక్కని నాయకుల వీరంగాలూ ఇందుకు నిదర్శనాలు. చంద్రబాబు మోదీ పట్ల చేసిన విమర్శలు గుర్తుకొచ్చిన బీజేపీ కార్యకర్తలకు పొత్తు మింగుడుపడటం లేదు. ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని, హత్యలు ఉండవు’ అంటారు. ఈ పార్టీలు చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తూ ఉండడంతో అవి ఆత్మ హత్యలవైపు ప్రయాణిస్తున్నాయని చెప్పవచ్చు.
– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 99852 29722
ఆ పార్టీల ఆట ముగిసింది!
Published Tue, Apr 2 2024 12:31 AM | Last Updated on Tue, Apr 2 2024 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment